ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుడు వాసుకి భోగవతీపురంబును జయించుట
రావణుడు వాసుకి భోగవతీపురంబును జయించుట
చం.చని చని చూచె ముందట నిశాచరచంద్రుఁడు తోయబాలికా
జనఘనడోలికాయిత విశాలవిలోలతరంగకేళికా
కనదహి చూళికామణి శిఖాసఖవిద్రుమ పాళికావినూ
తన రుచిమాలికాపిహితతాపనసారథి క్షారనీరధిన్‌
366
కం.కని గాంభీర్యము సంశో
ధన సేయఁగఁ బోవునటుల తద్గర్భముఁ జొ
చ్చి నిశాటమౌళి యాలోఁ
జనియెన్‌ నిజయానకాంతి సరణి గణింపన్‌
367
వ.ఇవ్విధంబునం జని చని368
మ.దివిషద్ద్వేషణ చక్రవర్తి గనియెన్‌ దేవేంద్రలోకాగ్ర భో
గవతిన్‌ గైరవ పద్మ సద్మ పరిఖాకారాధికాగాధ భో
గవతిన్‌ రాజితసాలభోగివరశృంగప్రోజ్జ్వలాభోగ భో
గవతిన్‌ వాసుకి యేలు భోగవతి నాగస్త్రైణలీలావతిన్‌
379
కం.కనుఁగొని యప్పురి చుట్టును
దన బలములు విడియఁబంచి దారుణభేరీ
ధ్వను లడరఁ దాను ద్వారం
బున నెలకొని యనికి భుజగముఖ్యులఁ బిలువన్‌
370
ఉ.వారది విన్నవింప విని వాసుకి బంధులఁగూడి వచ్చి బల్‌
వారణముల్‌ రథాశ్వము లవారణఁ గానుక లిచ్చి మేము మీ
వారము మా పయిం జనదు వైర మటంచు హితోక్తులాడ దే
వారియు వారి వీడుకొని యప్పురిఁ బాసి చమూసమేతుఁడై
371
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju