| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుడు నివాతకవచులతోఁ బోరాడుట |
| చం. | మణిమయసాలసౌధ గృహమండప శిల్పములన్ యథార్థ మౌ మణిమతి యన్పురంబున కమర్త్యవిరోధి జయస్పృహాపరా యణతఁ జనన్ నివాతకవచాభిధు లక్కడివారు, రాక్షసా గ్రణులు, పయోజగర్భవరగర్వితు లాతనిరాక కుబ్బుచున్ | 372 |
| చం. | రణమున కేఁగుదెంచె బళిరా! దశకంఠుఁడటంచు శత్రు భీ షణ పురుషోపలోచ్చకవచప్రభలున్ శితదంష్ట్రికాప్రభల్ ఫణినిభహస్తనిస్తుల కృపాణ మహాప్రభలుం జెలంగ రా వణుని యమాత్యులం దొడరి వా రొనరించిరి పోరు క్రూరతన్ | 373 |
| వ. | ఇవ్విధంబున | 374 |
| శా. | ఖడ్గాఖడ్గి భుజాభుజిం దొడరి రక్షస్సైనికుల్ వాహినీ రాడ్గంభీరరవం బడంచు ఘనగర్జల్ మీఱఁ గాలానల త్విడ్గాఢప్రకట ప్రతాపములు వర్ధిల్లన్ మరుత్వత్సరో రుడ్గర్భాదిమనోభయంకరముగా రోషించి పోరాడఁగన్ | 375 |
| ఉ. | ఆలమునన్ నివాత కవచాసురవీరులవీఁక కోర్వఁగాఁ జాలని మంత్రి పుంగవుల సైన్యములన్ గని పంక్తికంఠుఁడా ఖీల భుజాప్రతాపమును బెంపును మీఱఁగఁ బోరె వారితో రేలు పగళ్ళు నాక నలిరేఁగి మొగిన్ బదిరెండు మాసముల్ | 376 |
| శా. | బద్ధస్పర్ధలతో నివాతకవచుల్ పౌలస్త్యుఁడున్ గాఢ స న్నద్ధత్వంబున నిట్లు వోరఁగఁ శతానందుండు వేంచేసి యీ యుద్ధం బేటికి? మీఱలిందఱు నజయ్యుల్ పంక్తికంఠుండతి క్రుద్ధుండెవ్వనిచే నసాధ్యుఁడిఁక మీకున్ సంధి సేయందగున్ | 377 |
| చం. | సమబలుతోడఁ జేయఁదగు సంధి బలాఢ్యునితోడ సంధియున్ సమరముగాదు హీనునెడ సంధికి నియ్యకొనంగఁ జెల్ల దీ యమరవిరోధి మీఁకు సముఁడౌట సఖిత్వము మే లటంచుఁ గ్రౌ ర్య మడఁచి పద్మజుం డరిగె నట్ల యొనర్చిరి వార లయ్యెడన్ | 378 |
| ఆ.వె. | ఆ నివాతకవచు లధిక సఖ్యంబుతోఁ దను బహూకరింప దశముఖుండు గొంతకాలమచటఁ గూర్మిమైవసియించి వలయు మాయ లెఱిఁగి వారివలన | 389 |