| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుండు కాలకేయులతో యుద్ధము సేయుట |
| కం. | వారల వీడ్కొని వరుణజ యారంభముతోడఁ గదలి యప్పథమున దే వారివరుఁ డశ్మపుర మను పేరిటి దొకపురము సూచి పృథుశౌర్యమునన్ | 390 |
| ఉ. | అప్పురి వాకిటన్ నిలిచి యార్పులొనర్పఁగఁ గాలకేయు లా చప్పుడు లాలకించి రభసంబున వెల్వడి పంక్తికంఠుపై నప్పుడు దారసిల్లి తమ యగ్గలికల్ గనిపింప మీకుఁగా నిప్పతి గత్తివట్టునె? హిహీ యిటురండని మంత్రులాఁగినన్ | 381 |
| శా. | కల్పాంతాంబుద గర్జితంబు లెసఁగంగాఁ గాలకేయాసురుల్ కల్పాగ్ని ప్రథమాన తేజములతోఁగల్పక్షయాక్షయ్యసం కల్పప్రోద్భవవిద్విషద్భయద వీక్షా కీలికీలచ్ఛటా కల్పానల్పశరాళి వృష్టి కురియన్ గంపించి రా సైనికుల్ | 382 |
| మ. | తన సేనాధిపు లొందు దీనదశయున్ దత్కాలకేయుల్ వహిం చిన బీరంబునుఁ జూచి పంక్తిముఖుఁ డాక్షేపించి రోషాగ్ని క న్గొనలన్ జ్వాలలు మించ నద్దనుజులన్ గ్రూరాస్త్ర జాలంబులన్ దునుమున్ సేనలు విచ్చి పోవఁగని విద్యుజ్జిహ్వుఁ డత్యుగ్రుఁడై | 383 |
| ఉ. | ఏఁ గలుగంగ మీకుఁ దగునే బెగడొందఁగనంచు సంగరో ద్యోగనిరూఢి నందఱను నొక్కటఁగోల్తలఁజేసి యొండు ది క్కేఁగక వారిలోఁ గలసి యేడ్తెఱ సూపఁగఁ బంక్తికంఠు బి ట్టాఁగిరి నీలశైలము ఘనావళి యొక్కటఁ గప్పుచాడ్పునన్ | 384 |
| కం. | ఆ సందడి జగడంబున నాసురపతి మఱంది యనుచు నరయక తనపై డాసిన నీసునఁ గత్తిన్ వ్రేసె నడుము రెండుగాఁగ విద్యుజ్జిహ్వున్ | 385 |
| ఉ. | ఉద్ధతి రావణుండు దన యోధులు మెచ్చఁ జతుశ్శతాసురుల్ బద్ధ విరోధులై కదియఁ బట్టిసముంగొని బెట్టు ద్రుంచినన్ యుద్ధధరాతలంబు చరణోదరబాహుగళాదియుక్త మై బుద్ధికిఁ జూడ్కికిన్ వెఱఁగుఁ బూన్చెఁ గృతాంతుని వంటయిల్లనన్ | 386 |
| కం. | శరనిధి తరఁగల తెఱఁగున గిఱికొని పఱతెంచు కాలకేయుల నెల్లన్ గరచంద్రహాసధారా స్ఫురణన్ బరిమార్చి యార్చి భుజబల మలరన్ | 387 |
| చం. | తన విజయంబుఁ బేర్కొని ముదంబున నెంచు ప్రహస్తముఖ్యులం గని యిది యేటిమెప్పు? గడఁకన్ జలధీశుని గెల్చినన్ గదా ననుఁ గొనియాడఁజెల్లు? నని నవ్యవిమానవరాధిరూఢుఁడై చనియెఁ దదీయ పట్టణము చక్కటి కుత్కటగర్వ సంపదన్ | 388 |