ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు వరుణపురిమీఁది కేఁగుట
రావణుఁడు వరుణపురిమీఁది కేఁగుట
మ.చని కైలాసనగాధిరాజ తులిత స్వచ్ఛప్రభాదీప్రమై
ఘన వప్రంబు వెలుంగఁ జూచి యిదియే కాఁబోలుఁ గాండాధినా
ధుని ప్రోలంచుఁ దదీయగోపురమునందుం జేరి తద్రక్షకుల్‌
విన లంకాపురనాయకుం డనియెఁ బ్రావృట్కాలమేఘార్భటిన్‌
389
ఉ.ఏ దశకంఠనామదనుజేంద్రుఁడ సంగరకాంక్ష వచ్చితిన్‌
మీ దొరతో గదింపుఁడిది మీరయి మమ్మెదిరింప నోపినన్‌
గాదన నేఁగుదెం డనుచు గ్రక్కున లోపలికేఁగి యందు క్షీ
రోదధిఁబోలు వెల్ల మొద వొక్కటి గన్పడఁజూచి మ్రొక్కుచున్‌
390
సీ.కల్పకసురరత్న కమలాసుధాకరా - దికులతోఁ బొడమిన దివ్యమూర్తి
వాఁకలి గొన్న దేవాళికిఁ దృప్తిగా - నమృతంబు గురియు స్నేహార్ద్రమతివి
స్తనవిస్రవత్పయోధారఁ బుట్టినయిల్లు - పాలవెల్లిగఁజేయు భాగ్యవతివి
కోరిన వారికిఁ గోర్కు లవ్వారిగా - దయ నిచ్చునసమాన దానవతివి
 
గీ.ఇన్నిట జనించు కీర్తిపైకొన్న లీల
ధవళరుచి మించు మొదవుల తల్లి విట్టి
నిన్నుఁ గనుఁగొంటి శుభములు నేను గంటి
ననుచు సురభికి వలగొని యసురవిభుఁడు
391
ఉ.అచ్చటి ద్వారపాలకుల నందఱ మ్రందఁగఁ జేసి వీటిలోఁ
జొచ్చి రణేచ్ఛరా వరుణసూను లెఱింగి యభంగురక్రుధన్‌
వచ్చి విరోధిసైనికుల వాలికతూపుల ఖడ్గధారలన్‌
వ్రచ్చి రథాశ్వదంతి భటవర్గముతో వెసఁబేర్చి యార్చినన్‌
392
శా.ఆ ధూమ్రాక్ష మహోదరప్రముఖదైత్యామాత్యు లత్యుగ్ర బా
హాధిన్యస్త కృపాణ ముద్గర కుఠారాద్యాయుధశ్రేణిఁ బా
ధోధీశాత్మజ దంతి వాహభటులం దున్మాడి కాలాభ్రగ
ర్జాధిక్కారిఘనాట్టహాసముల దిక్చక్రంబు భేదించినన్‌
393
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju