పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
విష్ణుదూత యమదూతల సంవాదము
వ. ఇట్లు విష్ణుదూతలవలన నిర్ధూతప్రయత్నులై యమదూత లిట్లనిరి. 75
క. ఎవ్వనివారలు? మాతోఁ జివ్వకుఁ గత మేమి? యిట్లు చిక్కినవానిం
గ్రొవ్వున విడిపించితి; రిఁక నవ్వులకో? జమునిశాసనంబులు జగతిన్‌.
76
వ. అదియునుంగాక. 77
సీ. ఎవ్వరు మీ రయ్య! యీ భవ్యరూపముల్‌ కన్నుల కద్భుతక్రమ మొనర్చె;
దివిజులో? భువిజులో? దేవతాప్రవరులో? సిద్ధులో? సాధ్యులో? చెప్పరయ్య!
దళితపాండురపద్మదళదీర్ఘనేత్రులు వరపీతకౌశేయవాసు లరయ
గండమండలనటత్కుండలద్వయులును బటుకిరీటప్రభాభాసితులును
 
తే. భూరిపుష్కరమాలికాచారువక్షు, లమితకోమలనవయౌవనాధికులును
బాహుకేయూరమణిగణభ్రాజమాన, ఘనచతుర్భుజు లభ్రసంకాశరుచులు.
78
క. ధనువులు నిషంగచయములు కనదంబుజశంఖచక్రఖడ్గగదా సా
ధనములు ధరియించిన మీ తనువులు లోకముల కద్భుతం బొనరించెన్‌.
79
క. శాంతంబులైన మీ తనుకాంతులు జగములను దిశలఁ గలిగిన బహుళ
ధ్వాంతములఁ బాఱఁదోలుచు సంతస మొనరించె నిపుడు సర్వంకషమై.
80
వ. ఇట్లఖిలలోకానందకరకమ్రాకారులు, నఖిలవిభ్రాజమానతేజోదుర్నిరీక్ష్యమాణులును, నిఖిలధర్మ పాలురునగు మీరు ధర్మపరిపాలుర మమ్ము నడ్డపెట్టం గతం బేమి? యనిన మందస్మిత కందళిత ముఖారవిందులై గోవిందుని కందువ మందిరంబు కావలి వారలువారివాహగంభీరనిర్ఘోష పరిపోషణంబులైన విశేషభాషణంబుల నిట్లనిరి. 81
ఉ. మీరు పరేతనాయకుని మేలిమి దూత లటేనిఁ బల్కుఁ డా
తోరపుఁబుణ్యలక్షణము, దుష్కృతభావము, దండకృత్యమున్‌
బీరముతోడ నీతని కభీష్టనివాసము, పూని దండ్యు లె
వ్వారలు? సర్వభూతములొ? వారక కొందఱు పాపకర్ములో?
82
వ. అనిన యమభటు లి ట్లనిరి 83
క. వేదప్రణిహితమే యనుమోదంబుగ ధర్మ మయ్యె మున్ను, త దన్యం
బేది యగు నది యధర్మం బాదియు హరిరూపు వేద మన వినుకతనన్‌.
84
సీ. ఎవ్వనిచేఁ దన యిరవొందు త్రిగుణస్వభావమైనట్టి యీ ప్రాణిచయము
లనుగుణనామక్రియారూపములచేత నెంతయుఁ దమయంత నెఱుఁగఁబడును
నర్యముం డనలంబు నాకాశమును ప్రభంజనుఁడు గోచయమును శశధరుండు
సంధ్యలు దినములు శర్వరీచయములు కాలంబు వసుమతీజాలములును
 
తే. దేహధారికి సాక్షులై తెలుపుచుండ, దండనస్థానవిధము సద్ధర్మగతియుఁ
దగుల మీ ఱీ క్రమానురోధనము చేసి, యఖిలకర్ములు దండార్హు లరయ నెపుడు.
85
తే. కోరి కర్మంబు నడపెడువారి కెల్లఁ, గలితశుభములు నశుభముల్‌ గలుగుచుండు!
నరయఁగా దేహి గుణసంగి యైనయపుడె, పూని కర్మంబు సేయక మానరాదు.
86
క. ప్రకృతమునఁ దా నొనర్చిన, సుకృతము దుష్కృతము నెంత చూడఁగ నంతే
వికృతిఁ గతి ననుభవించును, నకృతమతిన్‌ దత్ఫలంబు నతినిపుణుండై.
87
వ. మఱియు వినుండు, జన్మంబు శాంత ఘోర మూఢగుణంబులచేత నైనను, సుఖదుఃఖ గుణంబులచేత నయినను, ధార్మికాది గుణంబులచేత నైనను, సకల భూతంబులు త్రైవిధ్యంబు నే ప్రకారంబునం బొందు, నా ప్రకారంబున జన్మాంతరంబునం బొందుచుండు, దేవుండైన యముండు సర్వజీవాంతర్యామియై ధర్మాధర్మయుక్తంబైన పూర్వరూపంబులను మనస్సుచే విశేషంబుగఁ జూచుచుండి, వాని కనురూపంబులఁ జింతింపుచుండు. అవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుండై ప్రాచీనకర్మంబుల నేర్పడ్డ వర్తమాన దేహంబు, నే నని తలంపుచుండి, నష్టజన్మస్మృతి గలవాఁడై పూర్వాపరంబు లెఱుంగం జాలకుండు. మఱియుఁ గర్మేంద్రియములచేతఁ గర్మంబులఁ జేయుచుండి, జ్ఞానేంద్రియంబులచేతఁ దమోవిషయంబు లయిన శబ్దస్పర్శ రూప రసగంధంబుల నెఱుంగుచుండి, పదియాఱవది యైన మనంబుతోఁ గూడి, పదియేడవవాఁ డగుచుండి, షోడశోపాధ్యంతర్గతుండై యొక్కరుండైన జీవుండు, సర్వేంద్రియవిషయప్రతిసంధానంబు కొఱకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయంబులం బొందుచుండి, షోడశకళలం గలిగి, లింగశరీరం బనం బరఁగి, గుణత్రయకార్యంబను నిమిత్తంబున హర్షశోకభయంబుల నిచ్చుచున్న సంసారంబు ధరియింపుచుండు. అజితషడ్వర్గుండైన దేహి కర్మంబు లొల్లని బుద్ధి నెఱింగియు, వినియుఁ, గర్మంబులు సేయుచుండి, తన సంచార కర్మంబునం జుట్టుకొన్న పసిరికాయపురువునుంబోలె నిర్గమోపాయం బెఱుంగక నాశంబు నొందుచుండు. వర్తమానవసంతాదికాలంబు, భూతభావివసంతకాల యోగ్యం బైన పుష్ప ఫలాదులు తత్కాలజ్ఞాపకంబు నెట్లు సేయు, నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు సేయుచుండు. ఒక్క నరుండు నొక క్షణంబును గర్మంబుఁ జేయకుండువాఁడు లేఁడు. పూర్వసంస్కారంబులం గల గుణంబులచేతఁ బురుషుం డవశుండు గావునఁ బలిమిఁ గర్మంబులు సేయింపబడుచుండు. అవ్యక్తనిమిత్తంబు నొంది తదనురూపంబు లైన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితృ సదృశంబు లగుచుండు. ఇట్టి విపర్యయంబు పురుషునికిఁ బ్రకృతిసంగమంబునం గలుగుచుండు. ఆ ప్రకృతి పురాణపురుషుం డైన య ప్పరమేశ్వరుని సేవించినఁ దలంగుచుండు. 88
సీ. కావున నితఁడు సత్కర్మవర్తనమున భూదేవకులమునఁ బుట్టినాఁడు
దాంతుఁడై శాంతుఁడై ధర్మసంశీలుఁడై సకలవేదంబులఁ జదివినాఁడు
అనయంబు గురువుల నతిథులఁ బెద్దలఁ జేరి శుశ్రూషలు చేసినాఁడు
సర్వభూతములకు సమబుద్ధియై చాల బహుమంత్రసిద్ధులుఁ బడసినాఁడు
 
తే. సత్యభాషణనియమంబు జరపినాఁడు, నిత్యనైమిత్తికాదుల నెఱపినాఁడు
దండి లోభాదిగుణములఁ దరపినాఁడు, మంచిగుణములు దనయందు మరపినాఁడు.
89
క. సతతాచారసమంచితమతియై సుజ్ఞానములకు మరగెడితఱి నా
యతగతి నాతని కంగజమతమై నవయౌవనాగమం బెడ సొచ్చెన్‌.
90
సీ. కడకంట యౌవనగర్వంబు వొడగట్టె మదిలోన నుద్రేకమదము దొట్టెఁ
గడు మేనఁ గామవికారంబు దలసూపె ముఖమునఁ జిఱునవ్వు మొలకలెత్తె
నతిపుష్టి నిష్ఠురంబయ్యె దేహంబెల్లఁ గచభారమున నెఱికప్పు మెఱసె
కటిభారమున నూరుకాండముల్‌ జిగి మీఱె బాహుశాఖలు దీర్ఘభంగిఁ దోఁచె
 
తే. నురము విపులమయ్యె నుల్లసద్వరకాంతి, పూర మంగకమునఁ బొందుపడియె
భూరితేజుఁడైన భూసురాన్వయునకు నభినవైకయౌవనాగమమున.
91
క. హృదయమునఁ బొడము యౌవన మదము వెలిందోఁచుభంగి మానితరుచిఁ ద
ద్వదనమున నూఁగుమీసలు పొదలుచుఁ గప్పడరి చూడఁ బొంకం బయ్యెన్‌.
92
వ. మఱియును. 93
క. తమ్మివిరిమీఁద వ్రాలిన తుమ్మెదపంక్తియునుబోలెఁ దోరపులీలం
గ్రమ్ముకొని విప్రతనయుని నెమ్మొగమునఁ గానఁబడియె నెఱిమీసంబుల్‌.
94
వ. అంత ననంగబ్రహ్మతంత్రంబునకు వసంతుం డొనర్చు నంకురార్పణారంభంబునుం బోలె లలిత కిసలయ విసర ప్రసారభాసురబహుపాదపాదిపురోపవనపవనజవనప్రభావపరికంపితవిటవిటీజన హృదయప్రఫుల్లపల్లవభల్లంబును, ననూనప్రసూననిర్భరగర్భావిర్భూతసురభిపరాగపటలపటఘటిత నభోమండలంబును. నమందనిష్యందమరందబిందుసందోహకందళితచిత్తమత్తమధుపసంకులఝంకార ముఖరితసకలదిశావలయంబును, నిరంతరధారాళరసభరితపరిపక్వఫలానుభవప్రభవసమ్మోదవాద శుకప్రముఖపతంగకోలాహలంబు నైన మధుమాసంబు సర్వజనమనోహరంబునై నిఖిలవనపాదపంబుల నలంకరించె. అయ్యవసరంబున నజామిళుండు పితృనిర్దేశంబునం గుశసమిత్పుష్పఫలార్థంబు వనంబున కరిగి, తిరిగి వచ్చు సమయంబున నొక్క లతాభవనంబున. 95
క. బద్ధానురాగయై స్మరయుద్ధంబున కలరు బుద్ధి నురుకామకళా
సిద్ధ యగు వృషలితోఁ బ్రియవృద్ధిం దగఁ గూడియున్న విటు నొరుఁ గాంచెన్‌.
96
క. భటునిన్‌ రతిశాస్త్రకళార్భటునిన్‌ వరయౌవనానుభవమదవిభవో
ద్భటునిన్‌ సురతేచ్ఛాసంఘటునిన్‌ విగతాంబరోరుకటునిన్‌ విటునిన్‌.
97
శా. హాలాఘూర్ణితనేత్రతో మదనతంత్రారంభసంరంభతో
ఖేలాపాలనయోగ్యభ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగనభంగి వేషవతితో నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిందేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూతరోమాంచుఁడై
98
క. కలికి వగ మదనకదనపుఁ బలుకుల కలకలము బెడఁగువడు మేఖల ము
వ్వల రవళిఁ దగిలి గతిగొనఁ గలకంఠి రతంబు సలుపు గమకముఁ గనియెన్‌.
99
క. కవకవనై పదనూపుర రవరవ లాగుబ్బుకొన్న రతిపతిగతులం
జివచివనై విటు చెవులకు రవళిన్‌ రతిసల్పు రతుల రవరవఁ గనియెన్‌.
100
చ. కురు లళికంబుపై నెగయఁ గ్రొమ్ముడి వీఁడగ గుబ్బదోయిపై
సరములు చౌకళింపఁ గటిసంగతి మేఖల తాళగింప స
త్కర వరకంకణావళులు గర్జిలఁ గౌ నసియాడ మీఁదుగా
మరుని వినోదముల్‌ సలిపె మానిని యౌవనగర్వరేఖతోన్‌.
101
క. మవ్వపు సుకుమారాంగిని జవ్వని నుపగూహనాదిసముచితరతులన్‌
నివ్వటిలుదానిఁ గని మది నువ్విళ్ళూరంగ మన్మథోద్దీపనుఁడై
102
తరల. బహుళదృక్పరిపాక మోహనిబద్ధుఁ డౌచు మనంబులో
సహజకర్మము వేదశాస్త్రము సాత్త్వికంబుఁ దలంచి త
న్నిహితచిత్తము వట్టి పట్టఁగనేరఁ డయ్యె సదా మనో
గహనమందు మరుండు పావకుకైవడిన్‌ జరియింపఁగాన్‌.
103
శా. ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబు పై
నాలోలాలకపంక్తిపై నొసలిపై నాకర్ణదృగ్భూతిపై
హేలాపాదికుచద్వయోరుకటిపై నిచ్చల్‌ పిసాళింపఁగా
జాలిం బొందుచు నాత్మఁ గుందుచు మనోజాతానలోపేతుఁడై
104
గీ. మఱి కులాచారవర్తన మాటు చేసి పరగు పిత్రర్థములు దానిపాలు చేసి
సాధులక్షణగుణవృత్తిఁ జాలు చేసి లోలలోచన పసఁ జెంది లోలుఁ డయ్యె.
105
క. శ్యామఁ గుసుమాస్త్రఖేలనకామఁ గులస్త్రీలలామఁ గమనీయగుణ
స్తోమ నిజభామ నొల్లక ధామంబున డించి క్రించుఁదనమునఁబొడవై.
106
ఉ. బంధులఁ దిట్టి సజ్జనుల బాధలఁ బెట్టి యనాథకోటిఁ బెన్‌
బందెలు సుట్టి యీరములు పట్టి పథంబులు గొట్టి దిట్టయై
నిందల కోర్చి సాధులకు నిందితుఁడై గడియించు విత్త మా
సుందరి కిచ్చి మచ్చికలు సొంపెదఁ గూర్చి వసించెఁ దత్కృపన్‌.
107
సీ. సముచితశ్రుతిచర్చ చర్చింప నొల్లక సతికుచద్వయచర్చఁ జర్చసేయుఁ
దర్కకర్కశపాఠతర్కంబు గాదని కలికితోఁ బ్రణయతర్కంబు సేయు
స్మృతిపదవాక్యసంగతిఁ గాక తత్సతిపదవాక్యసంగతిఁ బరఁగఁజేయు
నాటకాలంకారనైపుణం బుడిగి తన్నాటకాలంకారపాటిఁ దిరుగుఁ
 
గీ. బరఁగఁ జిరకాల మీ రీతిఁ బాపనియతి, రమణ దాసీకుటుంబభారము వహించి
యది కుటుంబిని గాఁగఁ బాపాత్ముఁ డగుచు, నశుచియును దుష్టవర్తనుఁడై మెలంగె.
108
క. అటు గానఁ బాపకర్మునిఁ గుటిలుని సుజనార్తు ధూర్తుఁ గ్రూరుని నే మా
రటమునఁ గొని యేగెద మంతట దండమువలన నితఁడు ధన్యత నొందున్‌.
109
వ. ఇట్లు పలుకుచున్న యమదూతల వారించి, నయకోవిదులైన భగవద్దూత లిట్టనిరి. 110
క. అవురా! ధర్మవివేకప్రవరుల పస గానఁబడియెఁ బాపము పుణ్యో
ద్భవుల నదండ్యుల దండన వివరం బొనరింపఁబడియె విధి యెఱుఁగమిచేన్‌.
111
చ. సములును సాధులున్‌ విహితశాసనులున్‌ సుదయాళురున్‌ శుభో
త్తమగుణులైన యట్టి తలిదండ్రులు బిడ్డల కెగ్గు సేయుచోఁ
గ్రమమున వార లెవ్వరికిఁ గైకొని కుయ్యిడఁ జాలువారు సం
భ్రమమున మీ మనంబులఁ దిరంబుగఁ జర్చ యొనర్చి చూడుఁడా!
112
గీ. ఎఱుక గలుగు నాతఁ డేది యొనర్చిన నదియ చేతు రితరు లైన వార
లతఁడు సత్య మిట్టి దనెనేని లోకంబు తత్ప్రవర్తనమునఁ దగిలి యుండు.
113
గీ. నెమ్మిఁ దొడలమీఁద నిద్రించు చెలికాని నమ్మఁ దగినవాఁడు నయము విడిచి
ద్రోహబుద్ధిఁ జంపఁ దొడరునే? యెందైనఁ బ్రీతి లేక ధర్మదూతలార!
114
గీ. చిత్తమెల్ల నిచ్చి చెలితనంబున వచ్చి నచ్చి కలయ మెచ్చి నమ్మువానిఁ
గరుణ గలుగువాఁడుఁ గడు సౌమ్యుఁ డగువాఁడుఁ జింతసేయ కెట్లు సెఱుప నేర్చు?
115
వ. అదియునుం గాక. 116
ఉ. ఈతఁడు కోటిసంఖ్యలకు నెక్కుడు పుట్టువులందుఁ జెంది యా
యాతములైన పాపనివహంబుల నన్నిటిఁ బాఱఁదోలెఁ బ్ర
ఖ్యాతమతిన్‌ మహామరణకాలమునన్‌ హరిపుణ్యనామ సం
భూత సుధామయాద్భుత విభూతికరాక్షరసంగ్రహంబునన్‌.
117
సీ. బ్రహ్మహత్యానేకపాపాటవుల కగ్నికీలలు హరినామకీర్తనములు
గురుతల్పకల్మషక్రూరసర్పములకుఁ గేకులు హరినామకీర్తనములు
తపనీయచౌర్యసంతమసంబునకు సూర్యకిరణముల్‌ హరినామకీర్తనములు
మధుపానకిల్బిషమదనాగసమితికిఁ గేసరుల్‌ హరినామకీర్తనములు
 
గీ. మహితయోగోగ్రనిత్యసమాధివిధుల, నలరు బ్రహ్మాదిసురులకు నందరాని
భూరినిర్వాణసామ్రాజ్యభోగభాగ్య, ఖేలనంబులు హరినామకీర్తనములు.
118
సీ. ముక్తికాంతైకాంతమోహనకృత్యముల్‌ కేలిమై హరినామకీర్తనములు
సత్యలోకానందసౌభాగ్యయుక్తముల్‌ కేలిమై హరినామకీర్తనములు
మహితనిర్వాణసామ్రాజ్యాభిషిక్తముల్‌ కేలిమై హరినామకీర్తనములు
బహుకాలజనితతపఃఫలసారముల్‌ కేలిమై హరినామకీర్తనములు
 
గీ. పుణ్యమూలంబు లనపాయపోషకంబు, లభిమతార్థంబు లజ్ఞానహరణకరము
లాగమాంతోపలబ్ధంబు లమృతసేవ, లార్తశుభములు హరినామకీర్తనములు.
119
క. కామంబు పుణ్యమార్గస్థేమంబు మునీంద్రసాంద్రచేతస్సరసీ
ధామంబు జిష్ణునిర్మలనామంబుఁ దలంచువాఁడు నాథుఁడు గాఁడే?
120
క. డెందంబు పుత్రువలనన్‌ జెందిన దని తలఁపవలదు శ్రీపతి పే రే
చందముననైనఁ బలికిన నందకధరుఁ డందె కలఁడు నాథుం డగుచున్‌.
121
గీ. బిడ్డపేరుఁ బెట్టి పిలుచుట విశ్రామకేళినైన మిగుల గేలినైన
పద్య గద్య గీత భావార్థముల నైనఁ గమలనయనుఁ దలఁపఁ గలుషహరము.
122
ఉ. కూలినచోటఁ గొట్టుపడి కుందినచోట మహాజ్వరాదులం
బ్రేలినచోట సర్పముఖపీడల నందినచోట నార్తులై
తూలినచోట విష్ణు భవదూరునిఁ బేర్కొనిరేని మీఁద న
క్కాలుని యాతనావితతిఁ గానరు పూనరు దుఃఖభావముల్‌.
123
సీ. అతిపాపములకుఁ బ్రయత్నపూర్వకముగఁ దనుపాపములకు మితంబుగాఁగ
సన్మునివరులచే సంప్రోక్తమై యుండు నిర్మలంబగు పాపనిష్కృతములు
క్రమరూపమున నుపశమనంబులగుఁ గాని తత్‌క్షణంబున నవి దరువలేవు
సర్వకర్మంబుల సంహార మొనరించి చిత్తంబునకుఁ దత్త్వసిద్ధి నొసఁగు
 
గీ. నొనర నీశుసేవ యోగిమానస సరో, వాసుసేవ హేమవాసు సేవ
వేదవేద్యుసేవ వేదాంతవిభుసేవ, పరమపురుష పాదపద్మసేవ.
124
క. హరి నెఱుఁగని యా బాలుఁడు హరిభక్తులతోడఁ గూడి హరియను వాఁడున్‌
సరియై దోషము లడఁచును గరువలితో నగ్ని తృణముఁ గాల్చినభంగిన్‌.
125
ఉ. ఆరయ వీర్యవంతమగు నౌషధ మెట్లు యదృచ్ఛఁ గొన్నఁ ద
చ్చారుగుణంబు రోగములఁ జయ్యనఁ బాపినమాడ్కిఁ బుణ్య వి
స్ఫారుని నంబుజోదరునిఁ బామరుఁ డజ్ఞుఁ డవజ్ఞఁ బల్కినన్‌
వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే!
126
క. ధృతి దప్పిన తఱినిఁ బురాకృతమునఁగా కెట్లు దోఁచుఁ గేశవుఁడు మదిన్‌
మితిలేని జగముఁ దాల్చిన యతఁ డొక్కని మనములోన నణఁగెఁడువాఁడే?
127
మ. నిరతంబై నిరవద్యమై నిఖిలచిన్నిర్మాణమై నిత్యమై
నిరహంకారగుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీ
హరినామస్మరణామృతం బితఁడు ప్రత్యక్షంబు సేవించెఁ దా
మరణాంతంబున నిట్టి సజ్జనునిధర్మం బేల వ్యర్థం బగున్‌?
128
వ. అని యిట్లు భగవద్దూతలు భాగవతధర్మంబు నిర్ణయించి, యీ యర్థంబున మీకు సంశయంబు గలదేని మీ రాజు నడుగుఁడు పొండు అని పలికి బ్రాహ్మణుని నతిఘోరం బైన యామ్యపాశబంధ నిర్ముక్తునిం గావించి, మృత్యువువలని యెడరు వాపిరి. అంత నా యమదూతలు చేయునది లేక యమలోకంబునకుం జని, పితృపతికి సర్వంబును నెఱింగించిరి. అంత. 129
క. అతఁడును బాశచ్యుతుఁడై గతభయుఁడై ప్రకృతి నొంది కడు నుత్సవ సం
గతిఁ జూచి మ్రొక్కి మదిలో నతులితముద మొదవి పొదలి హరిదాసులకున్‌.
130
తే. నిలిచి కేలు మొగిచి పలుక నుద్యోగించి చెలఁగుచున్న లోనితలఁపుఁ దెలిసి
చక్రధరునికూర్మిసహచరు లరిగి రదృశ్యు లగుచు దేవదేవుకడకు.
131
క. వేదత్రయసంపాద్యము మోదంబు గుణాశ్రయంబు మును భగవద్ధ
ర్మాదేశంబగు తద్భటవాదంబు నజామిళుండు వదలక వినుచున్‌.
132
క. శ్రీమన్నారాయణపదతామరసధ్యానసలిలధౌతమహాఘ
స్తోముండై సద్భక్తికి ధామం బగుచుండెఁ దెలిసి తత్క్షణమాత్రన్‌.
133
క. బరవసమున నరికట్టిన దురితంబులఁ దలఁచి తలఁచి తుదిఁ దాపమునన్‌
హరి నీశు నాశ్రయింపుచుఁ బరితాపము నొంది పలికె బ్రాహ్మణుఁ డాత్మన్‌.
134
సీ. వృషలియం దనురాగవృద్ధి బిడ్డలఁ గని కులము గోదావరిఁ గూలఁద్రోచి
రచ్చల కెక్కి పెన్‌ రజ్జుసేతల సరివారిలోపలఁ దలవంపు చేసి
కట్టిఁడిముదుకనై కర్మబంధంబుల పుట్టనై నిందల ప్రోవ నగుచుఁ
దరుణుల రోఁతల దవిలి భోగించిన కడిఁది నా జన్మంబు గాలిపోయెఁ
 
ఆ. జదువు చట్టువడియె శాస్త్రంబు మన్నయ్యె, బుద్ధి పురువు మేసెఁ బుణ్య మణఁగె
నీతి మట్టుపడియె నిర్మలజ్ఞానంబు, మొదలి కుడిగె బోధ మూరిఁబోయె.
135
క. చిక్కని చక్కని చన్నుల మక్కువ యిల్లాలి విడిచి మాయలు గల యీ
వెక్కసపుమద్యపానపు డొక్కపసం దగిలి దుర్విటుఁడనై చెడితిన్‌.
136
ఉ. అక్కట! ఘోరదుష్కృతమహానలకీలలు నన్ను ముట్టి పే
రుక్కణఁగింప కిట్లు ధృతి నుండఁగ నిచ్చె నహో! దురాత్మునిం
గ్రక్కునఁ దల్లిదండ్రుల నకల్మషచిత్తులఁ బెద్దలన్‌ మఱే
దిక్కును లేనివారిఁ బెనుతీపులఁబెట్టుచుఁ బాఱఁదోలితిన్‌.
137
క. అకృతజ్ఞుఁడ నై విడిచితిఁ బ్రకృతిం గల బంధువులను బాల్యమున ననున్‌
వికృతిఁ జనకుండఁ బెంచిన సుకృతుల మజ్జనకవరుల శోభనకరులన్‌.
138
వ. అప్పుడు 139
తే. పెక్కు పాతకముల భృశదారుణం బైన దొడ్డ నరకమందుఁ బడ్డ నన్ను
నాపదలకుఁ బాపి యరికట్టి రక్షించి రిట్టి ధర్మపురుషు లెందువారొ?
140
శా. చోద్యంబై కలవోలె నీ క్షణమునం జూడంగఁ బ్రత్యక్షమై
వేద్యం బయ్యెను నన్ను నీడ్చిన మహావీరుల్‌ భృశోదగ్రు లా
యుద్యోగంబులవారు పాశధరు లీ యుత్సాహముల్‌ మాని సం
పాద్యానేకవికారరూపకుటిలప్రఖ్యాతు లెం దేఁగిరో?
141
ఉ. దారుణపాశబంధనవిధానములన్‌ నరకార్ణవంబులోఁ
గూరినవాని నన్నుఁ జెడకుండ నొనర్చిన పుణ్యవంతు లం
భోరుహనేత్రు లుజ్జ్వలనభోమణితేజులు లోచనోత్సవుల్‌
చారుదయాసమంచితవిచారులు నల్వురు నెందుఁ బోయిరో?
142
మ. నను రక్షించినపుణ్యవంతులు కనన్నాళీకపత్రాక్షు లం
జనసంకాశులు శంఖచక్రధరు లాజానూరుబాహుల్‌ స్మితా
నను లాలంబితకర్ణవేష్టనసువర్ణచ్ఛాయదివ్యాంబరుల్‌
ఘనకారుణ్యరసైకపూర్ణులు సమగ్రస్ఫూర్తి నెం దేఁగిరో?
143
వ. పాతకుండ నగు నాకు ని వ్విబుధోత్తమదర్శనంబు పురాకృతమదీయపుణ్యవిశేషంబునం గాని పొంద శక్యంబు గాదు. త త్సందర్శనం బాత్మకు నతిసుప్రసన్నంబై యొప్పు. అట్లు గాకుండె నేనిఁ గలుషవర్తనంబుల వృషలీభర్తనై యుండి మృతిం బొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణనామగ్రహణంబు సంభవింపనేరదు. మఱియును. 144
ఆ. పాతకుఁడను జడుఁడ బ్రహ్మఘాతుకుఁడను మానలోభమోహమత్సరుండ
నాకు నెట్లు దొరకు? నారాయణునిదివ్యనామవిమలకీర్తనంబు మదికి.
145
సీ. దారుణమోహాంధకారపూరితుఁడను హరివిస్మయస్మరణార్హమతినె?
పంచమహాతీవ్రపాతకోపేతుఁడ హరివిస్మయస్మరణార్హమతినె?
కౌటిల్యకితవవికారపారీణుండ హరివిస్మయస్మరణార్హమతినె?
అఖిలదుఃఖైకఘోరార్ణవమగ్నుండ హరివిస్మయస్మరణార్హమతినె?
 
తే. నిందలకు నెల్ల నెలవైన నిర్గుణుండ, మందభాగ్యుండ నే నేడ? మధువిదారి
దివ్యగుణనామకీర్తన తెఱఁగదేడ?, పూర్వసుకృతంబు లే కెట్లు పొందఁగలుగు?
146
వ. అని వితర్కించి. 147
మ. యతచిత్తేంద్రియమారుతుండ నగుచున్‌ యత్నం బొనర్తున్‌ హరి
వ్రతసంపత్తికిఁ బుణ్యవృత్తికిఁ జిదావాసోన్ముఖాసక్తికిన్‌
యుతనిర్వాణపదానురక్తికి సుఖోద్యోగక్రియాశక్తికిన్‌
ధృతిలబ్ధోత్తమముక్తికిన్‌ సకలధాత్రీధుర్యసద్భక్తికిన్‌.
148
క. విడిచితి భవబంధంబుల నడఁచితి మాయావిమోహమయిన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ గడచితి నా జన్మదుఃఖకర్మార్ణవమున్‌.
149
క. యోషిద్రూపంబున నను నేషణ ముఖగహ్వరమున నెగమ్రింగి కడున్‌
ద్వేషమునఁ గోఁతిఁజేసిన దోషద యగు నాత్మమాయఁ దొలఁగంగంటిన్‌.
150
వ. అని యిట్లు వైష్ణవజ్ఞానదీపం బాత్మస్నేహంబునం దోఁచిన బ్రాహ్మణుండు. 151
మ. భగవద్ధర్మపరాయణోత్తముల సంభాషైకమంత్రంబులన్‌
మిగులన్‌ జ్ఞానము పుట్ట మోహభవసమ్మిశ్రాత్మబంధంబులన్‌
దెగ ఖండించి సబంధుమిత్రసుతపత్నీమోహవిశ్రాంతుఁడై
జగతీనాథు రమేశుఁ గృష్ణుని దయైశ్వర్యంబులం గోరుచున్‌.
152
క. హరిభక్తులతో మాటలు ధర నెన్నఁడుఁ జెడనిపుణ్యధనములమూటల్‌
వరముక్తికాంతతేటలు నరిషడ్వర్గంబు చొరని యరుదగుకోటల్‌.
153
సీ. అనుచు నా బ్రాహ్మణుం డతితత్త్వవేదియై భవబంధములనెల్లఁ బాఱఁదోలి
మొనసి గంగాద్వారమున కేగి యచ్చటఁ బ్రబ్బిన దేవతాభవనమందు
నాసీనుఁడై యోగ మాశ్రయించి చెలంగు దేహేంద్రియాదుల తెరువువలన
దనుఁబాపుకొని పరతత్త్వంబుతోఁ గూర్చి మానుగా యోగసమాధిచేత
 
ఆ. గుణగణంబుఁ బాసి కొమ రొప్పిన భగవ, దనుభవాత్మయందు నాత్మఁ గలిపి
రమణఁ దన్ను మొదల రక్షించినట్టి యా, పురుషవరులఁ గాంచి పొసఁగ మ్రొక్కె.
154
వ. అ ట్లజామిళుండు యోగమార్గంబున దేహంబు విడిచి పుణ్యశరీరుండై యగ్రభాగంబునం బ్రాగుపలబ్ధులైన మహాపురుషకింకరులం గాంచి, సమంచిత రోమాంచిత చలచ్ఛటా పింజరిత స్వేదబిందుసందోహ మిష నిష్యంద మహానందవల్లికా మతల్లికాంకుర సంకుల పరిశోభిత తనుండును, హర్షనికర్షమాణ మానసోద్యోగ యోగప్రభావోత్సాహ విస్మయ మందస్మిత ముఖారవింద కందళితుండును, నిఖిల జగజ్జేగీయమానాఖండ శుభప్రద శుభాకార సందర్శన సమాసాదిత కుతూహల మానసుండును నై, ప్రణామంబు లాచరించుచు భాగీరథీ తీరంబునఁ గళేబరంబు విడిచి, తత్‌క్షణంబున హరిపార్శ్వవర్తనులైన దాసవరుల స్వరూపంబుఁ దాల్చి, యా విష్ణుసేవకులతోఁ గూడి దివ్య మణి గణ ఖచితంబగు సువర్ణమయం బయిన యసమాన విమానం బెక్కి, నిఖిలానంద భోగభాగ్యానుభవాకుంఠితంబైన వైకుంఠంబున శ్రీమన్నారాయణ పాదారవింద సేవాచరణ పరిణామ స్థితికిం జనియె. ఇట్లు విప్లావిత సర్వధర్ముండైన దాసీపతి, గర్హిత కర్మంబులచేతఁ బతితుండును, హతవ్రతుండును నై నరకంబునం గూలుచుండి, భగవన్నామ గ్రహణంబున సద్యోముక్తుం డయ్యెఁ గావున. 155
క. కర్మంబు లెల్లఁ బాయను, మర్మము దలఁపంగ లేదు మధురిపుపేరే
పేర్మిని నొడువుటకంటెను, దుర్మదమునఁ జిత్త మెన్ని త్రోవలఁ జన్నన్‌.
156
ఉ. పాండవవంశపావన నృపాలక! యీ యితిహాస మెవ్వఁ డే
నొండొక భక్తి లేక విను నొప్పుమెయిం బఠియించు నాతఁ డు
ద్దండత ముక్తికామినికిఁ దానకమై దనుజారిలోకమం
దుండు మహావిభూతి యమదూతలచూడ్కి కగోచరాకృతిన్‌
157
తే. అరయ పుత్త్రోపచారిత మైన విష్ణునామ మవసానకాలంబునను భజించి
శార్‌ఙ్గినిలయంబుఁ జేరె నజామిళుండు నిట్లు సద్భక్తిఁ దలఁచిన నేమి చెప్ప?
158
క. కోరినవారల కెల్లను జేరువ కైవల్యపదము సిరివరుని మదిం
గోరనివారల కెల్లను దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్‌.
159
వ. అనినం బరీక్షిన్న రేంద్రుం డిట్లనియె. మునీంద్రా! ఆజ్ఞా భ్రష్టుండై యమధర్మరాజు శ్రీవిష్ణు నిర్దేశకులచేత నిహతులైన భటులచేత వర్ణింపంబడ్డ నారాయణుని నామప్రభావం బాకర్ణించి, వారల కే మనియె? మఱియు, నెన్నఁడేనియు యమదండంబు విఫలంబై పోయిన తెఱంగు గలదేని వినవలయు; ఈ సందేహంబుఁ బాప మహాత్మా! నీవు దక్కఁ దక్కినవారలు సమర్థులు గా రని తలంచుచున్నవాఁడ; చిత్తంబును బ్రసాదాయత్తంబుగా భవదీయ వచనసుధాధారలఁ బ్రసాదింపవలయు అనిన శుకుం డిట్లనియె. 160
క. శ్రీకృష్ణభటులచేత నిరాకృతులయి యామ్యభటులు యమునకు నాత్మ
స్వీకృతవిప్రకథాక్రమ మీ క్రియ మున్‌ దెలిపి రదియు నెఱిఁగింతుఁ దగన్‌.
161
తే. చేరి త్రివిధకర్మలఁ జేయు జీవతతికిఁ గర్మఫలములఁ దెలిపెడు కారణంబు
నగుచు శిక్షించువార లీ యవనిమీఁద దేవ! యెందఱు గలరయ్య? తెలియవలయు.
162
క. దక్షిణదిశాధినాయక! శిక్షం దగఁ జేయువారు క్షితిఁ బెక్కం డ్రే
నీ క్షయమున్నక్షయమును సాక్షాత్తుగ రెండు నెందు సంపన్న మగున్‌?
163
తే. దట్టమైనట్టి కర్మబంధముల నెల్ల నాజ్ఞ పెట్టెడువారు పెక్కైనచోట
నకట! శాస్తృత్వ ముపచార మయ్యెఁ గాదె! శూరులైనట్టి మండలేశులకుఁబోలె.
164
ఉ. కావున నీవ యొక్కఁడవ కర్తవు మూఁడు జగంబులందు సం
భావిత భూతకోటిఁ బరిపాకవశంబున శిక్ష సేయఁగా
నీ వర శాసనం బఖిలనిర్ణయమై తనరారుచుండ నేఁ
డీవలఁ గ్రమ్మఱింప మఱి యెవ్వఁడు శక్తుఁడు ? ధర్మపాలకా!
165
క. చండకరతనయ! యొరులకు దండధరత్వంబు గలదె! తన జగమున ను
ద్దండధరవృత్తి నొత్తిలి దండింతువు నిన్ను దండధరుఁడని పొగడన్‌.
166
సీ. ఇట్టి నీ దండంబ యీ మూఁడు జగములఁ దెగువమై నేఁడు వర్తిల్లుచుండ
మనుజలోకంబుల మహితాద్భుతాకారసిద్ధుల మిగులఁ బ్రసిద్ధు లైన
వారు నల్వురు వేగ వచ్చి నిర్దేశంబు భంగించి మ మ్మంతఁ బాఱఁదోలి
మీ శాసనంబున మే మీడ్చికొని వచ్చు క్రూరచిత్తునిఁ బుచ్చికొని యదల్చి
 
తే. పాశబంధంబు లీసునఁ బట్టి త్రెంచి, బలిమి మిగులంగ మమ్మునుఁ బాఱఁదోలి
యిచ్చఁ జనినారు వారు దా మెచటివార, లాదరమ్మున నేఁడు మా కానతిమ్ము.
167
వ. అనిరి. అని మఱియు శుకుం డిట్లనియె. అట్లు దూతలు పరితాపసమేతులై పలికిన, దండధరుండు పుండరీకాక్షునిచరణకమలంబుల మానసంబున సన్నిహితంబులుగఁ జేసి, వందనం బాచరించి, పరమ భక్తిపరుండై వారల కిట్లనియె. 168
సీ. కలఁడు మదన్యుండు ఘనుఁ డొక్కఁ డతఁ డెందు వెలికిఁ గానఁగరాక విశ్వమెల్ల
నతిలీనమై మహాద్భుత సమగ్రస్ఫూర్తి నుండును గోక నూలున్నభంగి
దామెనఁ బశువులు దగిలి యుండెడుమాడ్కి నామసంకీర్తనస్థేమగతుల
విహరించు నెవ్వఁడు విలసితమత్పూజ లెవ్వనిపదముల నివ్వటిల్లుఁ
 
ఆ. గనుట మనుట చనుట గల్గు నెవ్వనిలీల, లందు లోక మెవనియందుఁ బొందు
నెన్నఁబడుచుఁ బుడమి నెవ్వనినామముల్‌, కర్మబంధనముల పేర్మి నడఁచు.
169
తరల. వినుఁడు నేను మహేంద్రుఁ డప్పతి వీతిహోత్రుఁడు రాక్షసుం
డనిలుఁ డర్కుఁడు చంద్రుఁడుం గమలాసనుండు మరుద్గణం
బును మహేశుఁడు రుద్రవర్గము భూరిసంయమిసిద్ధులున్‌
మొనసి కన్గొనఁజాల రెవ్వనిమూర్తి విశ్రుతకీర్తిమై.
170
క. సత్వేతరగుణపాశవశత్వంబునఁ బొంద వీరు జలజాక్షుసదై
కత్వంబు గాన నోపరు సత్త్వప్రాధాన్యు లితరజనులకుఁదరమే?
171
చ. అభవు నమేయు నవ్యయు ననంతు ననారతుఁ బూని మేనిలో
నుభయము నై వెలుంగు పురుషోత్తముఁ గానరు చిత్తకర్మ వా
గ్విభవగరిష్ఠులై వెదకి వీఱిఁడి ప్రాణులు; సర్వవస్తువుల్‌
శుభగతిఁ జూడనేర్చి తనుఁ జూడఁగ నేరని కంటిపోలికన్‌.
172
చ. పరముని భక్తలోకపరిపాలనశీలుని దుష్టలోక సం
హరుని పతంగపుంగవవిహారుని కూరిమిదూతలా మనో
హరులు సురేంద్రవందితులు నా హరిరూపగుణస్వభావులై
తిరుగుచునుందు రెల్లెడల దిక్కులఁ దేజము పిక్కటిల్లఁగన్‌
173
ఉ. లెక్కకు నెక్కువై కసటు లేని మహాద్భుతతేజ మెల్లెడం
బిక్కటిలం జరింతు రతిభీమబలాఢ్యులు విష్ణుదూత లా
చక్కని ధర్మశాంతు లతిసాహసవంతులు దేవపూజితుల్‌
గ్రిక్కిఱి సీ జగంబునను గేశవసేవకరక్షణార్థమై.
174
క. నావలనను మీవలనను దేవాసురగణమువలనఁ ద్రిజగంబులలో
నే వగలఁ బొందకుండఁగఁ గావంగలవారు పుడమిఁగల వైష్ణవులన్‌.
175
క. భగవత్ప్రణిహితధర్మం బగపడ దెవ్వారిమతికి ననిమిష గరుడో
రగ సిద్ధ సాధ్య నర సుర ఖగ తాపస యక్ష దివిజ ఖచరులకైనన్‌.
176
క. ఎన్నఁడుఁ దెలియఁగ నేరరు పన్నగపతిశాయితత్త్వభావము మేనం
గన్నులవేల్పును డాపలఁ జన్నమరినవేల్పు ముదుకచదువులవేల్పున్‌.
177
సీ. వరమహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు తిరముగా నెవ్వరు తెలియఁగలరు?
దేవాదిదేవుండు త్రిపురసంహరుఁ డొండెఁ గమలసంభవుఁడొండెఁ గార్తికేయ
కపిలనారదు లొండె గంగాత్మజుం డొండె మను వొండె బలి యొండె జనకుఁ డొండెఁ
బ్రహ్లాదుఁ డొండె నేర్పాటుగా శుకుఁ డొండె భాసురతరమతి వ్యాసుఁ డొండెఁ
 
తే. గాక యన్యుల తరమె? యీ లోకమందు, నీ సుబోధంబు సద్బోధ మీ పదార్థ
మీ సదానందచిన్మయ మీ యగమ్య, మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు.
178
క. ఈ పన్నిద్దఱు దక్కఁగ నోపరు తక్కొరులు తెలియ నుపనిషదుచిత
శ్రీపతినామమహాద్భుతదీపితభాగవతధర్మదివ్యక్రమమున్‌.
179
తే. ఏది జపియింప నమృతమై యెసఁగుచుండు నేది సద్ధర్మపథమని యెఱుఁగఁదగిన
దదియె సద్భక్తియోగంబు నలవరించు మూర్తిమంతంబు దా హరికీర్తనంబు.
180
తే. కంటిరే మీరు సుతులార! కమలనేత్రుభవ్యమగు నామకీర్తనఫలము నేఁడు
తవిలి మృత్యువుపాశబంధములవలన జాణతనమున వీడె నజామిళుండు.
181
ఉ. ఏటికి జాలిఁ బొంద? నరు లీ క్రియఁ, గృష్ణునికీర్తనంబు పా
పాటవులం దహింపఁ గల దౌటకు సందియ మేల? యిప్పు డీ
తూఁటరి దోసకారి పెనుదోషి యజామిళుఁ డంత మొందుచుం
బాటిగ విష్ణునామమును బల్కుచుఁ గేవలముక్తి కేగఁడే?
182
క. ఇంతయును దథ్య మని మది నెంతయుఁ దెలియంగలేరు హీనాత్ములు దు
ర్దాంతతరఘటితమాయాక్రాంతాత్యంతప్రకాశగౌరవజడులై.
183
మంగళమహాశ్రీ ఈ విధమునన్‌ విబుధు లేకతమచిత్తముల నేకతము లేక హరి నీశున్‌
భావమున నిల్పి తగు భాగవతయోగపరిపాకమున నొందుదురు వారిన్‌
దేవలదు దండనగతిన్‌ జనదు మాకు గుఱుతింప నఘముల్‌ దలఁగు మీఁదన్‌
శ్రీవరుని చక్రము విశేషగతిఁగాఁచు సురసేవితులు ముక్తిఁ గడుఁ బెద్దల్‌.
184
ఉ. ఎవ్వరు సిద్ధసాధ్యఖచరేశలసత్పరిగీతగాథలం
దెవ్వరు ముక్తిభోగతలహేమమనోహరచంద్రశాలలం
దెవ్వరు శంఖచక్ర గురుహేతి గదా రుచిరోగ్రపాణు లా
మవ్వపురూపవంతు లసమానులు వో ధరలోని వైష్ణవుల్‌.
185
సీ. శ్రుత్యంతవిశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతుల్‌ భాగవతులు
సనకాదిమునియోగిజనసదానందైకపరమభాగ్యోదయుల్‌ భాగవతులు
కృష్ణపదధ్యానకేవలామృతపానపరిణామయుతులు శ్రీభాగవతులు
బహుపాతకానీకపరిభవప్రక్రియాపరుషోగ్రమూర్తులు భాగవతులు
 
తే. భావతత్త్వార్థవేదులు భాగవతులు, బ్రహ్మవాదానువాదులు భాగవతులు
సిరులు దనరంగ నెన్నఁడుఁ జేటు లేని, పదవి నొప్పారువారు వో భాగవతులు.
186
క. అదిగాన విష్ణుభక్తులఁ గదియఁగఁ జనవలదు మీరు కరివరదులస
త్పదపద్మవినతివిముఖులఁ దుది నంటఁగఁ గట్టి తెండు ధూర్తులు వారల్‌.
187
సీ. ఎకసక్కెమున కైన నిందిరా రమణునిఁ బలుకంగలేని దుర్భాషితులను
గలలోన నైన శ్రీకాంతునిసత్పాదకమలముల్‌ సూడని కర్మరతుల
నవ్వుచు నైనఁ గృష్ణప్రశంసకుఁ జెవిఁ దార్పనేరని దుష్కథాప్రవణుల
యాత్రోత్సవంబుల నైన నీశునిగుడిత్రోవఁ ద్రొక్కఁగలేని దుష్పదులను
 
ఆ. బరమభాగవతుల పాదధూళి సమస్త, తీర్థసార మనుచుఁ దెలియలేని
వారి వారివారి వారిఁ జేరినవారిఁ, దొలుతఁ గట్టి తెండు దూతలార!
188
ఆ. ఎల్లపాపములకు నిల్లైనయింటిలో బద్ధతృష్ణు లగుచు బుద్ధిఁ దలఁగి
పరమహంసకులము గుఱితప్పి వర్తించు ధూర్తజనులఁ దెండు దూతలార!
189
ఆ. అరయఁ దనదు జిహ్వ హరిపేరు నుడువదు చిత్త మతని పాదచింతఁ జనదు,
తలఁపఁ దమకు ముక్తి తంగేటి జున్నొకో? సకలవిష్ణుభక్తులకునుబోలె.
190
ఆ. పద్మనయనుమీఁది భక్తియోగం బెల్ల ముక్తియోగ మనుచు మొద లెఱుంగు
వారి వారివారి వారిఁ జేరినవారి త్రోవఁ బోవవలదు దూతలార!
191
వ. అని పలికెనని చెప్పి మఱియు శుకుం డిట్లనియె. శ్రీకృష్ణనామసంకీర్తనంబు జగన్మంగళం బనియును, జగన్మోహనం బనియును, జగజ్జేగీయమానం బనియును, నిఖిలమాయాగుణవిచ్ఛేదకం బనియును, ఉద్దామంబులగు హరివీర్యంబుల నాకర్ణించు వారలచిత్తంబు లతినిర్మలంబులగు భంగిం దక్కిన వ్రతాచరణంబులుం గావనియు, శ్రీకృష్ణపదపద్మంబులు హృత్పద్మంబుల నిలుపువార లన్యపాపకర్మంబు లగు నవిద్యావ్యసనంబులం బొరయనేర రనియును, నిజస్వామి యైన యమధర్మరాజుచేత గీర్తింపఁబడ్డ భగవన్మహత్త్వంబు నాకర్ణించి, విస్మితులై కాలకింకరులు నాఁటనుండియు వైష్ణవజనంబులం దేఱిచూడ వెఱతురు. నరేంద్రా! పరమగుహ్యంబగు నీ యితిహాసంబును బూర్వకాలంబున సకల విజ్ఞాన గోచరుండైన కుంభసంభవుండు సకలదుఃఖవిలయంబును, సకలపుణ్యనిలయంబును నైన మలయంబునఁ బురాణ పురుషుండైన పురుషోత్తము నారాధనంబు సేయుచుండి నా కెఱింగించెనని చెప్పిన విని విస్మయానంద హృదయుండై పరీక్షిజ్జనపాలుం డిట్లనియె. 192
క. స్వాయంభువమనువేళల నో యయ్య! సురాసురాండజోరగనర వ
ర్గాయతసర్గముఁ దెలిపితి పాయక యది విస్తరించి పలుకంగదవే.
193
క. ఉత్తరకొడు కిట్లడిగిన యుత్తరమును నమ్మునీంద్రుఁ డుత్తమచేతో
వృత్తి ముదమంది పలికెను దత్తరపా టుడిగి వినుఁడు తాపసులారా!
194
సీ. పూని ప్రచేతసుపుత్రులు పదుగురు ప్రాచీనబర్హిష ప్రాఖ్య గలుగు
వారు మహాంభోధివలన వెల్వడి వచ్చి తగ వృక్షవృతమైన ధరణిఁ జూచి
మేదినీజములపై మిక్కిలి కోపించి మదిలోన దీపితమన్యు లగుచు
వక్త్రంబులను మహావాయుసంయుతమైన యనలంబుఁ గల్పించి యవనిజములఁ
 
తే. బెల్లువడఁ గాల్పఁ దొడఁగినఁ దల్లడిల్లి, వారికోపంబు వారించువాఁడపోలెఁ
బలికెఁ జందురుఁ డో మహాభాగులార!, దీనములు వృక్షములమీఁదఁ దెగుట తగునె?
195
తే. మొదల వర్ధిష్ణు లగుమిమ్ము సదయహృదయు లగుప్రజాపతు లనుచు సర్వాత్ముఁ డనియె,
నట్టి మీరు ప్రజాసృష్టికైనవార లీ వనస్పతితతుల దహింపఁ దగునె?
196
సీ. ఆదికాలంబున నా ప్రజాపతిపతి యయిన లోకేశ్వరుం డచ్యుతుండు
పద్మనేత్రుఁడు వనస్పతుల నోషధిముఖ్యజాతంబు నిషము నూర్జంబుఁ గోరి
కల్పించె; నందు ముఖ్యంబైన యన్నంబు నచరంబు లైనట్టి యపదమెల్ల
బాదచారులకును బాల్వెట్టి యిరుగాళ్ళు చేతులు గలిగిన జీవతతికి
 
తే. హస్తములు లేని యా చతుష్పాదు లెల్ల, నన్నముగఁ బూని కావించె నదియుఁగాక
యా మహాభాగుఁ డచ్యుతుఁ డాదరమున, మీకు ననఘాఖ్యవిఖ్యాతి జోకపఱిచె.
197
క. నిజముగ దేవాధీశ్వరుఁ డజుఁడు ప్రజాసర్గమునకు ననఘుల మిమ్మున్‌
సృజియించె నిట్టివారికిఁ గుజదహనము సేయ నెట్లు కోరిక వొడమెన్‌?
198
చ. సతతమహత్త్వసత్త్వగుణసత్పురుషస్మృతిఁ బొందరయ్య! మీ
పితరులునుం బితామహులుఁ బెద్దలు నెన్నఁడుఁ బొందనట్టి దు
ష్కృతమతమైన కోపమునఁ గిల్బిషభావము మానరయ్య! సం
భృతకరుణావలోకమున భీతతరుప్రకరంబుఁ జూచుచున్‌.
199
ఉ. తప్పక యర్భకావళికిఁ దల్లియుఁ దండ్రియు నేత్రపంక్తికిన్‌
ఱెప్పలు నాతికిం బతి నరేంద్రుఁడు లోకుల కెల్ల నర్థికి
న్నొప్ప గృహస్థు మూఢులకు నుత్తము లెన్నఁగ వీరు బంధువుల్‌
ముప్పునఁ గావలేని కడుమూర్ఖులు గారు నిజాల బంధువుల్‌.
200
సీ. అఖిలభూతముల దేహాంతస్స్థమగు నాత్మ యీశుఁ డచ్యుతుఁ డని యెఱుఁగవలయు,
నెఱిఁగి సర్వంబైన యిందిరారమణు లో చూపునఁ దనివిగాఁ జూడవలయుఁ,
జూచిన చిద్రూపశుద్ధాత్ములగు మిమ్ము నెనసిన వేడ్కతో నిచ్చ మెచ్చు,
మెచ్చిన సర్వాత్ము మీ రెఱింగినచోటఁ గోపగుణంబులఁ బాపవలయుఁ;
 
ఆ. బాపి దగ్ధశేషపాదపజాలంబుఁ, దియ్య మెసఁగ బ్రతుకనియ్యవలయు;
ననఘులార! మీర లస్మదీయప్రార్థ, నంబు పరఁగఁ జేకొనంగవలయు.
201
క. ఇదె వృక్షసముద్భవయగు మదిరేక్షణ నాప్సరసిఁ గుమారిక నిత్తున్‌
వదలక బత్నిఁగఁ జేకొని ముదమందుఁడు పాదపముల మోసము వాయన్‌.
202
వ. అని యి ట్లామంత్రణంబు సేసి, మారిష యను కన్యకను వారల కిచ్చి చంద్రుండు సనియె. నప్పుడు 203
క. వారలు పర్యాయంబున నీరేజముఖిన్‌ వరించి నెఱి రమియింపన్‌
ధీరుఁడు ప్రాచేతసుఁడై వారక దక్షుండు పుట్టె వనజజసముఁడై.
204
క. ఎవ్వని సంతానంబులు నివ్వటిలెన్‌ వసుధ నెల్ల నెఱి నా దక్షుం
డి వ్వలన జగము లన్నిటఁ బ్రవ్వ జలము నిలిపినట్లు ప్రజఁ బుట్టించెన్‌.
205
ఉ. వారని వేడ్కతో దుహితృవత్సలదక్షుఁడుఁ దక్షుఁ డాత్మచేఁ
గోరి సృజించెఁ గొన్నిటి నకుంఠిత వీర్యముచేతఁ గొన్నిటిం
బోరన ఖేచరంబులను భూచరముఖ్యవనేచరంబుల
న్నీరచరవ్రజంబు రజనీచరజాలదివాచరంబులన్‌.
206
క. నర సుర గరు డోరగ కిన్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములం
దరమిడి సృష్టి యొనర్చెను దిరముగ దక్షప్రజాపతి వితతకీర్తిన్‌.
207
క. బహువిధముల బహుముఖముల బహురూపము లైన ప్రజల బహులోకములన్‌
బహుళముగఁ జేసి మదిలో బహుమానము నొందఁ డయ్యెఁ బ్రఖ్యాతముగన్‌.
208
తే. ఆ ప్రజాసర్గబృంహితంబైన జగము దక్షుఁ డీక్షించి మదిలోనఁ దాప మొంది
మఱియు జననంబు నొందించు మతము రోసి పరమపురుషుని నాశ్రయింపంగఁ దలఁచె.
209
వ. ఇట్లు దక్షప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టుం జేయువాఁడై 210
క. మోదంబై పరిదూషితఖేదంబై శాబరీద్ధ కిలికించిత దృ
గ్భేదంబై బహుసౌఖ్యాపాదం బై యొప్పు వింధ్యపాదంబునకున్‌.
211
వ. అరిగి, యం దఘమర్షణం బను తీర్థంబు సర్వ దురితహరం బై యొప్పుదాని ననుసవనంబు సేవించి, యతిఘోరం బైన తపంబు సేయుచు హరిం బ్రసన్నుంజేసి, హంసగుహ్యం బను స్తవరాజంబున నిట్లని స్తుతించె. 212
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )