| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| తే. |
పరమునికి వందనము సేతుఁ బరిఢవించి ము న్నవితథానుభూతికి మ్రొక్కికొందు, మెఱయు గుణములఁ దేలు నిమిత్తమాత్రబంధుఁడైనట్టివానికిఁ బ్రణుతి సేతు. |
213 |
| ఆ. |
తవిలి గుణముచేతఁ దత్త్వబుద్ధులచేత నిగిడి కానరాని నెలవువాని మొదలఁ దాన కలిగి ముక్తిమానావధిరూపమైనవాని ప్రాపుఁ గందు. |
214 |
| తే. |
ఎల్ల తనువులందు నిరవొంది తనతోడఁ బొందు సేసినట్టి పొందుకాని పొందు వొందలేఁడు పురుషుండు గుణముఁ దా గుణినిఁబోలె నట్టి గుణి భజింతు. |
215 |
| ఉ. |
పూని మనంబులుం దనువు భూతములున్ మఱి యింద్రియంబులున్ బ్రాణములున్ వివేకగతిఁ బాయక యన్యముఁ దమ్ము నెమ్మెయిం గానఁగ నేర వా గుణనికాయములం బరికించునట్టి స ర్వానుగతు న్సమస్తహితు నాదిమపూరుషు నాశ్రయించెదన్. |
216 |
| వ. | మఱియు బహువిధ నామ రూప నిరూప్యంబగు మనంబునకు దృష్టస్మృతుల నాశంబువలన గలిగెడు నుపరామంబగు సమాధియందుఁ గేవల జ్ఞానస్వరూపంబునఁ దోఁచు నిర్మల ప్రతీతిస్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు; దారువందు నతిగూఢంబైన వీతిహోత్రుని బుద్ధిచేతం బ్రకాశంబు నొందించు భంగి బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుండైన పరమపురుషుని నాత్మశక్తిత్రయంబులచేతం దేజరిల్లం జేయుదురు; అట్టి దేవుండు సకల మాయావిచ్ఛేదకం బైన నిర్వాణసుఖానుభవంబులం గూడి యుచ్చరింపం గొలఁదిగాని శక్తిగల విశ్వరూపి నాకుం బ్రసన్నుండగుం గాక; వాగ్బుద్ధీంద్రియమానసంబులచేతం జెప్పను, నిట్టి దని నిరూపింపను, నలవిగాక ఎవ్వని గుణరూపంబులు వర్తించు, నెవ్వఁడు నిర్గుణుండు, సర్వంబు నెవ్వనివలన నుత్పన్నంబగు, నెవ్వనివలన స్థితిం బొందు, నెవ్వనివలన లయంబగు, నట్టి పరాపరంబులకుఁ బరమంబై, యనన్యంబై సర్వవ్యాపకంబై, యదియ బ్రహ్మంబై, యాదికారణంబై యున్న తత్త్వంబు నాశ్రయింతు; ఎవ్వని ప్రభావంబుమాటలాడెడు వారలకు, వాదంబు సేయువారలకు వివాదస్థలం బగుచు, నప్పటప్పటికి మోహంబు నొందింపుచుండు, నట్టి యనంతగుణంబులు గల మహాత్మునకుం బ్రణామంబు సేయుచు నస్తి నాస్తి యను వస్తుద్వయనిష్ఠలం గలిగి, యొక్కటనఁ గలిగియుండి, విరుద్ధధర్మంబులుగ నుపాసనాశాస్త్ర సాంఖ్యశాస్త్రంబులకు సమంబై, వీక్షింపఁదగిన పరమంబు నాకు ననుకూలంబగుం గాక; ఎవ్వఁడు నామరూపంబులు లేకుండియు, జగదనుగ్రహంబుకొఱకు జన్మకర్మంబులచేత నామరూపంబులు గల్గి తేజరిల్లు, నట్టి యనంతుండైన భగవంతుండు సుప్రసన్నుం డగుఁగాక. ఎవ్వఁడు జనుల పురాకృత జ్ఞానపదంబుచేత నంతర్గతుండై, మేదినింగలుగు గంధాదిగుణంబుల నాశ్రయించిన వాయువుభంగి మెలంగుచుండు నా పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు సేయుంగాక అనుచు భక్తి పరవశుండై యుక్తివిశేషంబున స్తుతియింపుచున్న దక్షునికి భక్తవత్సలుం డైన శ్రీవత్సలాంఛనుండు ప్రాదుర్భావంబు నొంది ప్రత్యక్షంబయ్యె నంత. | 217 |
| సీ. |
భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబునఁ గలిగిన నీలంపుఁగను లనంగ మొనసి తార్క్ష్యుని యిరుమూఁపుపై నిడినట్టి పదముల కాంతులు పరిఢవింపఁ జండ దిఙ్మండల శుండాల కరముల కైవడి నెనిమిదికరము లమరఁ జక్ర కోదండాసి శంఖ నందక పాశ చర్మ గదాదుల సరవిఁ బూని |
|
| ఆ. |
నల్లమేను మెఱయ నగుమొగం బలరంగఁ, జల్లచూపు విబుధసమితిఁ బ్రోవ బసిఁడికాసెఁ బూని బహు భూషణ కిరీట కుండలముల కాంతి మెండుకొనఁగ. |
218 |
| సీ. |
కుండల మణి దీప్తి గండస్థలంబులఁ బూర్ణేందురాగంబుఁ బొందుపఱుప దివ్యకిరీట ప్రదీప్తు లంబరరమాసతికిఁ గౌసుంభవస్త్రంబు గాఁగ వక్షస్స్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ నీలాద్రిఁ బెనఁగొని నిలిచిన విద్యుల్లతలభాతిఁ గనకాంగదములు మెఱయ |
|
| ఆ. |
నఖిలలోక మోహనాకారయుక్తుఁడై, నారదాదిమునులు చేరి పొగడఁ గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర, సిద్ధ గానరవము సెవుల నలర. |
219 |
| క. |
సర్వేశుఁడు సర్వాత్ముఁడు సర్వగతుం డచ్యుతుండు సర్వమయుండై సర్వంబు చేరి గొలువఁగ సర్వదుఁడై దక్షునకుఁ బ్రసన్నుం డయ్యెన్. |
220 |
| వ. | ఇట్లు ప్రసన్నుండైన సర్వేశ్వరుని సర్వంకషంబై మహదాశ్చర్యధుర్యంబై తేజరిల్లు దివ్యరూపంబుం గాంచి, భయంబును, హర్షంబును, విస్మయంబును జిత్తంబున ముప్పిరిగొని చొప్పు దప్పింపం దెప్పిఱి, కప్పరపాటునఁ బుడమిపై నిడుసాగిలంబడి, దండప్రణామంబు లాచరించి, కరకమలంబులు మొగిడ్చి సెలయేఱులతోఁ గొట్టువడి, యిట్టట్టు పట్టుచాలక నిట్టవొడిచి, మున్నీరు దన్ని నిలిచిన పెన్నీరునుంబోలె, సర్వాంగంబులుం దొంగలింపఁ, జిత్తంబు నాత్మాయత్తంబు సేసి, పిక్కటిల్లిన సంతోషంబుచేత భగవంతుం బలుకను, నత్యంత మంగళసందోహాపాదకంబు లైన తన్నామంబు లుగ్గడింపను, నతి నిర్మలంబులైన తదీయ కర్మంబులు దడవను, విబుధ హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడను, నాత్మీయ మనోరథంబు వాక్రువ్వను నోపక ప్రజాకాముండై యూరకున్న ప్రజాపతిం జూచి, సర్వజీవ దయాపరుండును, సర్వసత్త్వ హృదంతరస్థుండును, సర్వజ్ఞుండునుం గావున నతని భావంబు దెలిసి, జగన్నాథుం డార్త షోషణంబుల భాషణంబుల నిట్లనియె. | 221 |
| క. |
మెచ్చితి ప్రాచేతస! తప మిచ్చట ఫలసిద్ధి యయ్యె నిట్లతిభక్తిన్ హెచ్చగు మద్వరవిభవము నచ్చుపడం బొంద నెవ్వఁ డర్హుఁడు? జగతిన్. |
222 |
| ఆ. |
తపము చాలు నింకఁ దగ భూతతతికి విభూతు లొనరుఁ గాక పొందుపడఁగ, నిదియ సుమ్ము మాకు నిచ్చలోఁ గల కోర్కి పొసఁగ నీదువలనఁ బొందుపడియె. |
223 |
| వ. | వినుము; బ్రహ్మయు, భర్గుండును, బ్రజాపతులును, మనువులును, నింద్రులును, వీరలు నిఖిల భూతంబులకు భూతిహేతువులైన మద్భూతివిభవంబులు. మఱియు నాకు యమ నియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు; సాంగ జపవద్ధ్యానరూపంబగు విద్య శరీరంబు. ధ్యానాది విషయ పుంవ్యాపారంబుగా నుండు భావనాది శబ్దవాచ్యంబగు క్రియ యాకృతి; క్రతు జాతంబు లంగంబులు; ధర్మం బాత్మ; దేవతలు ప్రాణంబులు; నిగమంబు మత్స్వరూపంబు; జగదుత్పత్తికి నాదియందు నే నొక్కండన తేజరిల్లుచుంటి; బహిరంతరంబుల వేఱొక్కటియు లేదు; సుషుప్త్యవస్థయందు సర్వంబు లీనం బగుటం జేసి సంజ్ఞామాత్రుండును, నవ్యక్తుఁడునుఁగా నుండు జీవునిభంగి నొక్కఁడన యుండుదు; అనంతుండ నయి యనంత గుణంబువలన గుణవిగ్రహం బగు బ్రహ్మాండంబును, నయోనిజుఁడు స్వయంభవుండగు బ్రహ్మయును నుదయించిరి; మదీయ వీర్యోపబృంహితుండై మహాదేవుండగు నా బ్రహ్మ యసమర్థునిఁబోలె నకృతార్థమ్మన్యమాన మనస్కుఁడై, సృజింప నుద్యమించు తఱి తపం బాచరించుమని నాచేత బోధితుండై, యఘోరంబైన తపం బాచరించి తొలుత సృష్టికర్తృత్వము వహించిన మిమ్ము సృజించె; అంతఁ బంచజనుండను ప్రజాపతి తనూజ యగు నసిక్ని యను పేరిట వినుఱి నొందియున్న యిక్కన్యకను నీ కిచ్చితి. దీనిం బత్నిగాఁ గైకొని మిథునవ్యవాయధర్మంబు గలవాఁడవై, మిథునవ్యవాయ ధర్మంబుగల యీ నాతియందుఁ బ్రజాసర్గంబు నతి విపులంబుగ గావింపం గలవాఁడవు; మఱియు నీకుఁ బిదప నిదే క్రమంబున నిఖిల ప్రజలును మన్మాయా మోహితులయి, మిథునవ్యవాయ ధర్మంబునఁ బ్రజావృద్ధి నొందించి మదారాధనపరులై యుండఁ గలవారు అని పల్కి, విశ్వభావనుండైన హరి స్వప్నోపలబ్దార్థంబునుం బోలె నంతర్ధానంబు నొందె. అప్పుడు దక్షుండు విష్ణుమాయోపబృంహితుండై పాంచజనియగు నసిక్నియందు హర్యశ్వ సంజ్ఞల వినుతిఁ జెందియున్న యయుత సంఖ్యా పరిగణితులైన పుత్త్రులం గాంచె; అప్పు డా ధర్మశీలురైన దాక్షాయణులు పితృనిర్దేశంబునం బ్రజాసర్గంబు కొఱకుఁ దపంబు సేయువారై పశ్చిమదిశకుం జని, యచ్చట సింధు సముద్ర సంగమంబున సమస్త దేవ ముని సిద్ధగణ సేవితంబై, దర్శనమాత్రంబున నిర్ధూత కల్మషులను, నిర్మల చిత్తులం జేయుచున్న నారాయణ సర స్సనం బరఁగు తీర్థరాజంబున నవగాహనంబుఁ జేసి, నిర్మలాంతరంగులై పరమహంసధర్మంబు నందు నుత్పన్నమతులై ప్రజాసర్గంబుకొఱకుఁ దండ్రి యనుమతంబున నుగ్రతపంబు సేయుచుండ వారికడకు నారదుండు వచ్చి యిట్లనియె. | 224 |
| సీ. |
మీ రతిమూఢులు మీఁదటిగతి గాన రెన్నంగఁ బసిబిడ్డ లన్నలార! పుడమిఁ దా నింతని కడ పరికింపరు ప్రజలఁ బుట్టించ నే ప్రతిభ కలదు? అట్లైన నొక్క మహాత్ముఁడు పురుషుండు బహురూపములు గల భామ యొకతె పుంశ్చలీ భర్తయుఁ బురణింప నుభయప్రవాహంబు గల నది వఱలఁ గదల |
|
| ఆ. |
నంచ యొకటి యిరువదైదింటి మహిమలఁ, గలిగియుండు తెరువు గానరాక వజ్రనిబిడ మగుచు వరుసఁ దనంతన, తిరుగు, రాష్ట్రబిలము దేటపడఁగ. |
225 |
| క. |
వినుఁ డందుల యనురూపము నను వొందఁగ నెఱుఁగ కాత్మ నాత్మగురూక్తిం గొనసాగించెద మను మిమ్మన నేమియు లేదు మూఢు లని తెలిసి తగన్. |
226 |
| వ. | అని నారదుండు బోధించిన హర్యశ్వులు సహజబుద్ధిచేత నారదవాక్యంబులను దమలో నిట్లని వితర్కించిరి. | 227 |
| తే. |
సొరిది క్షేత్రజ్ఞుఁడన నతిసూక్ష్మబుద్ధి నరయ నజ్ఞానబంధనం బగుచు లింగ దేహమున నెద్ది గల దది దెలియకున్నఁ గలదె? మోక్షంబు దుష్కర్మగతులచేత. |
228 |
| తే. |
కలఁడు జగదేకసన్నుతకారణుండు స్వామి భగవంతుఁ డభవుండు స్వాశ్రయుండు పరముఁ డాతనిఁ జూడక బ్రహ్మకైనఁ గలుగునే? ముక్తిపదము దుష్కర్మగతుల. |
229 |
| ఆ. |
పురుషుఁ డెట్టులేని పూని బిలస్వర్గగతుఁడు వోలె వర్తకంబు మాను నట్టి బ్రహ్మ మెఱుఁగు నయ్యకు స్వర్భోగకర్మగతుల నేమి కానఁబడును? |
230 |
| శా. |
తన్నిష్ఠాగతి లేనివారికి నసత్కర్మ ప్రచారంబుచే మున్నేమయ్యెడి నాత్మబుద్ధి గుణసమ్మోహంబునం దోఁచుచున్ వన్నెల్ వెట్టుక వింతబాగుల తఱిన్ వర్తించు దౌర్గుణ్య సం పన్న స్త్రీయునుబోలె నెల్లగతులం బ్రఖ్యాతమై యుండఁగన్ |
231 |
| సీ. |
అనువొంద సృష్టి నవ్యయముగఁ జేయుచుఁ బ్రచురప్రవాహసంపతితమైన నెఱయఁ గూలం బను నిర్గమస్థానంబు నందు వేగముగల క్రందు మాయఁ గదలి యహంకారగతివశంబునఁ జాల వివశుఁ డై బోధకు విపరి యైన వానికి నీరీతి వలవంత కర్మప్రచారంబులను మీఁదఁ జక్కనైన |
|
| ఆ. |
జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతోఁ బాసి, యఖిలసౌఖ్యపదవి నరసి కర్మ మార్గ మైన యట్టి మహనీయధామంబు, చిత్త మార నెట్లు చేరఁగలఁడు! |
232 |
| తే. |
దాని సంసర్గగుణములు దప్పి నడచు కుచ్చితపు భార్యఁ జేకొన్న కుమతివోలె తివిరి సుఖదుఃఖములఁగూడి తిరుగు జీవరూప మెఱుఁగనివారికిఁ బ్రాపు గలదె? |
233 |
| మత్తకోకిల. |
పంచవింశతితత్త్వరాశి కపారదర్పణ మయ్యుఁ దాఁ గొంచెమై పురుషుండు తత్త్వముఁగోరి పట్టఁగ నేర కే మంచుఁ గించుఁ దలంచువార లమార్గకర్మము సేయఁగా మంచిలోకము వారి కేటికి మానుగా సమకూరెడిన్? |
234 |
| క. |
బంధానుమోక్షణక్రమసంధానైశ్వర్యధుర్యశాస్త్రసమగ్ర గ్రంథంబు మాను చిద్రూపాంధునకు నకర్మగతుల నగునే శుభముల్. |
235 |
| మత్తకోకిల. |
చూడ నీ జగమంతయున్ వెసఁ జుట్టి పుట్టుక లీల నే జోడులేక రయంబునం గుడి చుట్టినట్టి స్వతంత్రముం గూడి యుండిన కాలచక్రముఁ గోరిచూడని వారి కే జాడఁ గల్గు నకర్మసంగతిఁ జారుమోక్షపదం బిలన్? |
236 |
| ఆ. |
జన్మహేతువైన జనకునిర్దేశంబు తనకుఁ జేయ రాని దనుచుఁ దెలిసి గుణమయప్రవృత్తి ఘోరాధ్వనిశ్వాసనిరతుఁ డగుచుఁ జేయ నేరఁ డతఁడు. |
237 |
| వ. | అని తనలో వితర్కించి యా కుమారు లప్పుడు- | 238 |
| సీ. |
వినవయ్య! భూపాల! మునివరేణ్యునిమాట లనువొందఁ దలపోసి వినయ మలర వలగొని యతనికి వందనం బొనరించి తిరిగి యెన్నఁడు రాని తెరువు వట్టి చయ్యన నేగిరి సహజస్వరబ్రహ్మ మయమైన పంకజనయను పాద పద్మమరందంబు పానంబు సేయుచు మత్తిల్లి నిలిచిన మానసాళి |
|
| తే. |
పరిణమింప విష్ణుఁ బాడుచుఁ దత్కీర్తి, సరణిమ్రోయు మహతి సంఘటించి నారదుండు గుణవిశారదుం డెందేనిఁ జనియె జగము దన్ను సన్నుతింప. |
239 |
| క. |
అప్పుడు దక్షుఁడు తనయులు దప్పి మహాపథము గనుట తగ నారదుఁడే చెప్పినఁ గప్పిన శోకము ముప్పిరిగొని చిత్తవృత్తి మూరింబోవన్. |
240 |
| చ. |
అడలుచు నున్న వచ్చి కమలాసనుఁ డూఱడిలంగఁబల్కె మున్ పడసిన లీలఁ బుత్రుల నపారగుణాఢ్యులఁ గాంచుమన్న నా పడఁతుక వల్లఁగ్రమ్మఱను బల్వురఁ దా శబళాశ్వసంజ్ఞలం బెడఁగగు వారి పుణ్యములఁ బేర్చినవారి సహస్రసంఖ్యులన్. |
241 |
| క. |
పుట్టించిన జనకుని మదిఁ బుట్టిన తలఁపెఱిఁగి వారు పూనిక ప్రజలం బుట్టించు వ్రతము గై కొని గట్టిగఁ దప మాచరింపఁగాఁ జనిరి వెసన్. |
242 |
| వ. | ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబు కొరకుఁ దండ్రి పంపునం దపంబు సేయువారై యే తీర్థంబు తీర్థరాజంబై సకలతీర్థఫలంబులు నాలోకనమాత్రంబున ననుగ్రహించుచు సకలపాపంబుల నిగ్రహించు, నే తీర్థప్రభావంబున నగ్రజన్ములు ఫలసిద్ధిం బొందుదు, రట్టి నారాయణ సరస్సను పుణ్యతీర్థంబునకుం జని, తదుపస్పర్శమాత్రంబున నిర్ధూతమలాశయులై, | 243 |
| శా. |
బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబుఁ జింతింపుచున్ బ్రహ్మానందముఁబొంది జిహ్వికలపై బ్రహ్మణ్యమంత్రంబు స ద్బ్రహ్మాలోకనవాంఛతో నిలుపుచున్ బ్రహ్మం బితం డంచు మున్ బ్రహ్మజ్ఞానగురున్ హరిం దపమునం బాటించి ర బ్బాలకుల్. |
244 |
| సీ. |
ఏకపాదాంగుష్ఠ మిలమీఁద సవరించి నిశ్చలకాయులై నిక్కి నిలిచి కరములు గీలించి సరవి మీఁదికి నెత్తి గుఱుతుగాఁ బెనుబయల్ గుట్టి పట్టి నిడివిగాఁ గ్రూరమై నిగిడిన చూడ్కులఁ గడు తీవ్రభానునిఁ బొదివిపట్టి వడిఁ గొంతకాలంబు వాయువు భక్షించి యంతనుండియు నిరాహారు లగుచు |
|
| తే. |
సకలలోకములకు సంహారకరమును బేర్చి దేవతలకు భీతికరముఁ గాఁగ ఘోరతపముఁ గావింపఁ దొడఁగిరి, మహితచిత్తు లక్కుమారవరులు, |
245 |