పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట
వ. ఇట్లతిభయంకరంబైన తపంబు సేయుచు, నెడతెగక భగవన్మంత్రంబుల నొడువుచుఁ, బ్రజాసర్గ కాములై యున్న యచ్చిన్ని బాలుర కడకు నారదుండు సనుదెంచి, పూర్వవిధంబునం బలుకుచు నిట్లనియె; భ్రాతృవత్సలులై యున్న మీరలు వేదాంతసారంబు వలుకుచున్న నా వచనంబు లాదరించి తోఁబుట్టువులు సనిన మార్గంబునఁ జనుండు; ఎవ్వఁడేనియుఁ దన యగ్రజులు గన్న మార్గంబునం దానునుం దప్పక వర్తించు, నట్టివానిని విశేషధర్మం బెఱింగిన వాఁడండ్రు; సతతంబును బుణ్యబంధువులైన దేవతలంగూడి సుఖం బుండుండని పల్కి నారదుండు సనియె. వారలు సర్వకర్మంబులయందు నిర్మోహితులై పరమ పదంబునకు నాస్పదంబులైన దేవర్షివాక్యంబుల నాశ్రయించి. 246
ఉ. అప్పుడు లజ్జతోడ శబళాశ్వులు పూర్వజు లేగినట్టి యా
చొప్పున నెన్నఁడుం దిరిగి చూడని త్రోవ విశేషపద్ధతిం
దప్పక పోయిరయ్య! గుణధాములు, నేఁడును మళ్ళరేమి నేఁ
జెప్పెదఁ గాక రాక కడఁజేరిన రాత్రులఁబోలి భూవరా.
247
క. దక్షున కా కాలంబున లక్షిత మై యుండెఁ బెక్కు లాగుల నుత్పా
త క్షోభంబులు వానికి రూక్షవ్యథ నొంది యా పురుషనాశమునున్‌.
248
క. నారదకృత మని యెఱిఁగి మహా రోషముతోడ నేగి యాతనిఁ గని దుః
ఖారూఢచిత్తుఁడై మది నూఱడిలం దెరువు లేక యుగ్రుం డగుచున్‌.
249
తే. మోము జేవుఱింప ముడివడ బొమదోయి చూపువెంట మంట సుడిగొనంగఁ
బెదవు లదరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు దక్షుఁ డాగ్రహించి తపసిఁ బలికె.
250
చ. నెరయఁగ సాధురూపమున నీ వతిబాలుర కాత్మజాళికిం
గఱకున భిక్షుమార్గ మగు కందువ సెప్పితి వేల? ధూర్తవై
మఱుఁగక యుండవచ్చునె? కుమారుల నీ దురితంబు వొంద, ని
న్నొఱలఁగఁ ద్రోతు నాదు సమదోగ్రమహాగ్రహశాపవహ్నులన్‌.
251
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )