| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| వ. |
అది యెట్లంటేని, దేవర్షి పితృ ఋణంబులు దీర్చక అమీమాంసిత కర్మంబులు గల బాలురకు బుద్ధిఁ జెఱిచి వారలకు నుభయ లోకంబుల శ్రేయోహాని నొనర్చితివి. ఇట్లీ పాతకంబున భాగవతోత్తములలో లజ్జాహీనుండవై యశోహానిం బొంది చరింపుదువు గాక! నిరపరాధులై వైరంబులేని నా పుత్త్రుల పట్ల ద్రోహకృత్యం బొనర్చిన నీవు తప్పఁ దక్కిన భాగవతోత్తములు సకల భూతానుగ్రహ పరవశులు. అతి కుతూహలంబున నీ చేత స్నేహపాశ నికృంతనం బైన మిత్రభేదంబె కాని తదుపశమనంబు గాకుండెడు. ఇంతనుండియుఁ బురుషుండు విషయ తీక్ష్ణత్వంబు లనుభవింపక కాని తెలియ కుండెడు. జ్ఞానంబు తనంతనె కాని యొరులచే బోధింపఁబడి తెలియరాకుండెడి. నిరంతరంబును లోకసంచారియైన నీకు నే లోకంబున నునికిపట్టు లేకుండుఁ గాక అని నిర్దయుండై శాపం బిచ్చె. అంత నారదుండు త త్క్రోధవాక్యంబుల కలుగక యట్ల కానిమ్మని సమ్మతించి చనియె. ఇట్టి శాంతభావం బెవ్వనివలనం గలుగు, నతండు సర్వాతీతుండై సర్వేశ్వరుం డనంబడు. మఱియు, దక్షుండు తన మనోరథంబు విఫలం బగుటం జేసి యతి దుఃఖిత మనస్కుండై పొగులుచున్న పితామహుండు చనుదెంచి, మఱియుఁ బ్రజాసర్గోపాయం బుపదేశించిన, నా ప్రజాపతి ప్రియభామ యైన యసిక్నియందుఁ బితృ వత్సల లైన పుత్రికల నఱువదుండ్రం బుట్టించి వారిలో ధర్మునకుం బదువురను, గశ్యపునకుం బదుముగ్గురను, జంద్రునకు నిరువదేడ్గురను; భూతునకు, నాంగిరసునకుఁ, గృశాశ్వునకు నిద్దరేసి చొప్పున నార్గురును, తార్క్ష్యుఁడను నామాంతరము దాల్చిన కశ్యపునకు మరలఁ గడమ నల్గుర న్నీ క్రమంబున నిచ్చె. వారి నామంబు లాకర్ణింపుము. |
252 |
| ఆ. |
ఎట్టి పుణ్యవతులొ? యీ చేడియలు సెప్ప, సవతు లేనియట్టి సవతులయ్యుఁ గడుపు వడసి రెట్టి కడుపునఁ బుట్టిరో, కడిఁది త్రిజగ మెల్లఁ గడుపు గాఁగ. |
253 |
| వ. | వార లెవ్వరనిన భానువును, లంబయుఁ, గకుప్పును, జామియు, విశ్వయు, సాధ్యయు, మరుత్వతియు, వసువును, ముహూర్తయు, సంకల్పయు ననంబదుగురు ధర్మునకుఁ బత్నులై కొడుకులం బడసిరి. వారెవ్వ రంటేని భానువునకు వేదఋషభుండు వుట్టె. ఆతనికి నింద్రసేనుండు నుదయించె. లంబకు విద్యోతుండు గలిగె. అతనికి స్తనయిత్నువు లనువారు పుట్టిరి. కకుబ్దేవికి సంకుటుండు వుట్టె, సంకుటునకుం కీకటుండు వుట్టె. కీకటునకు దుర్గాభిమానినులైన దేవతలు జన్మించిరి. జామిదేవికి దుర్గభూముల కధిష్ఠానదేవతలు జనియించిరి. వారికి స్వర్గుండును, నందియు జన్మించిరి. విశ్వ యనుదానికి విశ్వేదేవతలు జన్మించిరి. వార లపుత్త్రకు లనం బరఁగిరి. సాధ్యయను దానికి సాధ్యగణంబులు వుట్టె. వానికి నర్థసిద్ధి యను వాఁడు వుట్టె. మరుత్వతి యనుదానికి మరుత్వతుండు, జయంతుం డనువార లుదయించిరి. అందు జయంతుండు వాసుదేవాంశజుండైన యుపేంద్రుం డనంబడి, వినుతి నొందె. ముహూర్త యనుదానికి సకల భూతంబులకు నా యా కాలంబులఁ గలిగెడు నా యా ఫలంబుల నిచ్చు మౌహూర్తికు లనియెడు దేవగణంబులు పుట్టిరి. సంకల్పయను దానికి సంకల్పుం డుదయించె. ఆ సంకల్పునకు కాముండు జనించె. వసు వను దానికి ద్రోణుండును, బ్రాణుండును, ధ్రువుండును, నర్కుండును, నగ్నియును, దోషుండును, వస్తువును, విభావసు వను నెనమండ్రు వసువు లుదయంబు నొందిరి. అందు ద్రోణునకు నభిమతి యను భార్యయందు హర్ష శోక భయాదులు పుట్టిరి. ప్రాణునకు భార్యయైన యూర్జస్వతియందు సహుండును, నాయువును, బురోజవుఁడను వారును గలిగిరి. ధ్రువుని భార్యయగు ధరణియందు వివిధంబులగు పురంబులు వుట్టె. అర్కునికి భార్యయగు వాసనయందు తర్షాదు లుదయించిరి. అగ్నికి భార్యయైన వసోర్ధారయందు ద్రవిణకాదులు వుట్టిరి. మఱియుఁ గృత్తికలకు స్కందుండు గలిగె. ఆ స్కందునకు విశాఖాదు లుదయించిరి. దోషునకు శర్వరి యను భార్యయందు హరికళయగు శింశుమారుం డుదయించె. వస్తువునకు నాంగిరసయందు విశ్వకర్మ యనుశిల్పాచార్యుం డుదయంబందె. ఆ విశ్వకర్మకు నా కృతి యను సతియందు చాక్షుషుం డను మనువు జనించె. ఆ మనువువలన విశ్వులు, సాధ్యులు ననువారలు వుట్టిరి. విభావసునకు నుష యను భార్యయందు వ్యుష్టియు, రోచిస్సును, నాతపుండును జనించిరి. అందు నాతపునికిఁ బంచయాముండను దివసాభిమానదేవత జనించె. శంకరాంశజుండైన భూతునకు సురూప యను భార్యయందుఁ గోట్ల సంఖ్యలైన రుద్రగణంబు లుదయించిరి. మఱియు రైవతుండు, నజుండు, భవుండు, భీముండు, వాముండు, నుగ్రుండు, వృషాకపియు, నజైకపాత్తును, నహిర్బుధ్న్యుండును, బహురూపుండును. మహాంతుండును ననువారలును, రుద్రపారిషదులును నతిభయంకరులైన ప్రేతలును, వినాయకులును బుట్టిరి. అంగిరసుండను ప్రజాపతికి స్వధ యను భార్యయందుఁ బితృగణంబులు వుట్టిరి. సతియను భార్యకు నథర్వవేదాభిమాన దేవతలు వుట్టిరి. కృతాశ్వునకు అర్చిస్సను భార్యయందు ధూమ్రకేశుం డను పుత్రుం డుదయించె. వేదశిరస్సుకు ధిషణ యను భార్యయందు దేవలుండును, వయునుండును. మనువునుం బుట్టిరి. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని యను నలువురు భార్యలు. అందుఁ బతంగికిఁ బక్షులు వుట్టె, యామినికి శలభంబులు వుట్టె. వినతకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనం బైన గరుడుండును, సూర్యునకు సారథియైన యనూరుండును జనియించిరి. కద్రువకుఁ బెక్కు తెఱంగుల భుజంగమంబులు వుట్టె. చంద్రునకుఁ గృత్తికాది నక్షత్రంబులు భార్యలు. వారలయందుఁ జంద్రుఁడు రోహిణియందు మాత్రము మోహితుం డగుటంజేసి దక్షశాపంబున క్షయ రోగగ్రస్తుండై సంతానంబు వడయనేరఁడయ్యె. అంత దక్షప్రసాదంబున క్షయపీడితంబు లగు కళల మరలం బొందె. మఱియును. | 254 |
| సీ. |
కామిత ప్రదుఁడైన కశ్యపు కౌఁగిట ముచ్చట దీర్తురే ముద్దరాండ్రు, అఖిలలోకములకు నవ్వలై జగమెల్లఁ బూజింప నుందురే పూవుఁబోండ్లు, బలియురై పుత్త్రులుఁ బౌత్త్రులుఁ ద్రిజగంబు లేలంగఁ జూతురే యిందుముఖులు, ముంగొంగు పసిఁడియై మూల్గుపుణ్యంబుల విఱ్ఱవీఁగుదు రెట్టి వింతరాండ్రు, |
|
| తే. |
వారి కలగంప కడుపుల నేరుపఱుప, నరిది బిడ్డలఁ బడసిన బిరుదుసతుల నామములు నన్వయంబులు నీ మనంబు, పూనఁజెప్పుదు వినవయ్య! మానవేంద్ర! |
255 |
| తరల. |
అదితియుం దితి కాష్ఠయుం దను వ య్యరిష్టయుఁ దామ్రయు న్నదనఁ గ్రోధవశాఖ్యయున్ సురసాఖ్యయున్ సురభిన్ మునిన్ మొదలుగాఁ దిమియు న్నిళప్రియముఖ్య యా సరమాదిగా ముదిత లెన్నఁగఁ గన్నసంతతి ముజ్జగంబుల భూవరా! |
256 |
| సీ. |
చాలంగఁ దిమికిని జలచరంబులు వుట్టె శ్వాపదంబులు వుట్టె సరమయందు, సురభికి మహిషాది సురభులు జనియించెఁ, దామ్రకు శ్యేన గృధ్రములుఁ గలిగె మునికి నప్సరసల మూఁకలు జనియించె, నిళ గనె భూరుహములను, గ్రోధ వశ కుద్భవిల్లె దుర్వార సర్పంబులు, సరి యాతుధానులు సురస కరయ |
|
| తే. |
నుప్పతిల్లిరి గంధర్వు లొక్క మొగి న, రిష్టకు సుతుల్, దనువునకుఁద్రిదశ రిపులు పదియు నెనమండ్రునై నట్టి విదితబలులు, వారి నామాన్వయంబులఁ గోరి వినుము. |
257 |
| వ. | ద్విమూర్ధుండును, శంబరుండును, అరిష్టుండును, హయగ్రీవుండును, విభావసుండును, అయోముఖుండును, శంకుశిరుండును, స్వర్భానుండును, కపిలుండును, అరుణియును, పులోముండును, వృషపర్వుండును, ఏకచక్రుండును, అనుతాపకుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, విప్రచిత్తియు, దుర్జయుండు నను వారలు. వీరలలోన స్వర్భానునకు సుప్రభయను కన్యక వుట్టె. దాని నముచి వివాహం బయ్యె. వృషపర్వునకు శర్మిష్ఠ యను కూఁతురు వుట్టె. దాని నహుష పుత్త్రుండైన యయాతి పెండ్లియయ్యె. వైశ్వానరునకు నుపదానవి, హయశిర, పులోమ, కాలక యను నలువురు పుత్రిక లుదయించిరి. అందు నుపదానవి హిరణ్యాక్షునకుం బత్ని యయ్యె. హయశిరను గ్రతువు వివాహం బయ్యె. పులోమ, కాలక లను నిరువురకును గశ్యప ప్రజాపతి చతుర్ముఖుని వాక్యంబునం గైకొనియె. ఆ యిరువురకును సమరకోవిదు లైన దానవులు పౌలోమ కాలకేయులనం బుట్టిరి. మఱియు నా యిరువురకు నఱువదివేల రాక్షసులు జన్మించిరి. వారు యజ్ఞకర్మంబులకు విఘాతుకులై వర్తింప, వారి నింద్రునకుం బ్రియంబుగా నీ పితామహుం డగు నర్జునుండు వధించె. మఱియు విప్రచిత్తి సింహిక యను దానియందు రాహుప్రముఖంబుగాఁ గల కేతు శతంబును బడసె. వారలు గ్రహత్వంబుఁ గైకొనిరి. మఱియుం బురాణపురుషుండైన శ్రీమన్నారాయణుండు దన యంశంబునఁ బరమ భాగ్యవతియైన యదితి గర్భంబున నుదయించె. ఆ యదితి వంశంబును విదితంబుగా వినిపించెద. సావధానుండవై వినుము. వివస్వంతుండును, అర్యముండును, పూషుఁడును, త్వష్టయు, సవితయు, భగుండును, ధాతయు, విధాతయు, వరుణుండును, మిత్రుండును, శక్రుండును, ఉరుక్రముండును నను ద్వాదశాదిత్యులు జన్మించిరి. అందు వివస్వంతునకు శ్రాద్ధదేవుం డను మనువు సంజ్ఞాదేవియందు నుదయించె. మఱియు యముండు, యమియు నను నిరువురు మిథునంబుగా నుదయంబు నొందిరి. మఱియు నా సంజ్ఞాదేవి బడబాస్వరూపంబు నొంది యశ్వినీ దేవతలం గనె. ఛాయాదేవి యందు శనైశ్చరుండును, సావర్ణి యను మనువును, దపతియను కన్యకయుం బుట్టిరి. ఆ తపతిని సంవరణుండు వరియించె. అర్యమునకు మాతృక యను పత్నియందు చర్షణు లుదయించిరి. వారి మూలంబున మనుష్యజాతి యీ లోకంబున స్థిరంబుగా నుండునట్లు బ్రహ్మదేవునిచేఁ గల్పింపంబడె. పూషుండు భర్గునిం జూచి దంతంబులు వివృతంబులుగా నగిన, నతండు క్రోధించి దంతంబు లూడనడిచిన, నాఁటినుండియు భగ్నదంతుండై, యనపత్యుండై పిష్టాదులు భక్షింపుచుండె. త్వష్టకు దైత్యానుజ యైన రచన యను కన్యకకు నధిక బలాఢ్యుండగు విశ్వరూపుండు వుట్టె. అంత నా దేవతలు బృహస్పతిం గోపింప, నతఁడు తలఁగిపోయినం దమకు నా విశ్వరూపుని నాచార్యునింగా వరియించిరి అని చెప్పిన విని శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. | 258 |
| సీ. |
అరయంగ యోగీంద్ర! యద్భుతం బయ్యెడు సురలపై నేటికి సురగురుండు కోపించె? నీతండు గురుభావమున దేవతల కేమి యాపదఁ దలఁగఁ జేసె? నెఱిఁగింపు మనవుడు నింద్రుండు త్రిభువ నైశ్వర్య మదంబున సత్పథంబు గానక వసు రుద్ర గణములు నాదిత్య మరు దశ్విదేవాది మండలములు |
|
| తే. |
సిద్ధ చారణ గంధర్వ జిహ్మగాది, సురలు మునులును రంభాది సుందరాంగు లాడఁ బాడంగ వినుతి సేయంగఁ గొలువ, నొక్క భద్రాసనంబున నుక్కుమీఱి. |
259 |
| సీ. |
నిండు పున్నమనాఁడు గండరించిన చంద్ర మండల శ్రీలతో మాఱుమలయ భద్రవిద్యోతాతపత్రంబు గ్రాలంగ మిన్నేటి తరఁగల మేలుకొలుపఁ గలిత దివ్యాంగనా కరతల చాతుర్య చామర శ్రేణులు జాడపడఁగఁ జింతామణి స్ఫుట కాంత రత్నానేక ఘటిత సింహాస నాగ్రంబునందు |
|
| తే. |
నూరుపీఠంబుపై శచి యుండ నుండి, వరుస దిక్పాలకాది దేవతలు గొలువ సాటి చెప్పంగరాని రాజసముతోడ, నింద్రుఁ డొప్పారె వైభవసాంద్రుఁ డగుచు. |
260 |
| వ. | అ య్యవసరంబున. | 261 |
| క. |
గురుతర ధర్మక్రియ నయ, గురుఁడు మరున్మంత్ర విషయ గురుఁడు వచశ్శ్రీ గురుఁడు సమస్తామరగణ, గురుఁడు గురుం డరుగుదెంచెఁ గొల్వునకు నృపా! |
262 |
| చ. |
అమిత తపః ప్రభావుఁ గరుణాత్ముని గీష్పతిఁ జూచి రాజ్య దు ర్దమ మదరేఖ నింద్రుఁడు వృథా తనగద్దియ లేవకుండె నె య్యమున నెదుర్కొనం జనక యాసన మీయక గౌరవోప చా రములఁ బ్రసన్నుఁ జేయక తిరంబుగ దివ్యసభాంతరంబునన్. |
263 |
| క. |
అప్పుడు సురపతి కన్నులఁ, గప్పిన సురరాజ్య మదవికారంబునకుం జప్పుడు సేయక గృహమున, క ప్పుణ్యుఁడు దిరిగిపోయె నతిఖిన్నుండై |
264 |
| చ. |
ఎఱుఁగమిఁ జేసినట్టి గురుహేళన మంత నెఱింగి యింద్రుఁ డ చ్చెరుపడి భీతినొంది యతిచింతితుఁడై తలపోసి పల్కె న ప్పరమపవిత్రు లోకనుతభవ్యచరిత్రు విశేష పాద పం క రుహముఁ బూజసేయక యకర్మముఁ జేసితి నల్పబుద్ధి నై. |
265 |
| క. |
త్రిభువన విభవ మదంబున, సభలో మద్గురువునకుఁ బ్రసన్నునకు లస త్ప్రభువునకు నెగ్గు సేసితి, శుభములు దొలఁగంగ నే నసురభావమునన్. |
266 |
| ఆ. |
పారమేష్ఠ్య మయిన పదవి నొందిన భూపు లెట్టివారి కైన లేవవలదు, విబుధులిట్లు సెప్పు విధమెన్న వారలు, ధర్మవేత్త లనుచుఁ దలఁపఁబడరు. |
267 |
| తే. |
కుపథవర్తు లగుచుఁ గుత్సిత దుర్వచో, నిపుణు లైనవారు నిడివి దెలిసి తొలఁగలేక తా రధోగతిఁ బడుదురు, తప్పులేక రాతితెప్ప భంగి. |
268 |
| ఉ. |
కావున లోకవందితుని కార్యవిచారుని యింటి కేగి త త్పావన పాదపద్మములపై మకుటంబు ఘటిల్ల మ్రొక్కి త త్సేవ యొనర్చి చిత్తము వశించి ప్రసన్నునిఁ జేతు నంచు న ద్దేవవిభుండు వోయె నతితీవ్రగతిం గురుధామ సీమకున్. |
269 |
| సీ. |
ఈ రీతిఁ దనయింటి కేతెంచు దేవతా పతి రాక యా బృహస్పతి యెఱింగి యధ్యాత్మమాయచే నడఁగి యదృశ్యుఁడై పోయె నప్పుడు దేవపుంగవుండు సకలంబుఁ బరికించి జాడ గానక గురుఁ జింతించి తలపోసి చిన్న వోయెఁ బోయిన విధమెల్ల దాయలు రాక్షస వీరులు వేగులవారివలనఁ |
|
| తే. |
దెలిసి మిక్కిలి తమలోనఁ దెలివి నొంది, యందఱును గూడి భార్గవు నాశ్రయించి తత్కృపాదృష్టిఁ దమశక్తి దట్టమైన, దేవతలమీఁది దాడికిఁ దెరువు వెట్టి. |
270 |