| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| క. |
ధూర్తులు సమస్త కిల్బిష, మూర్తులు వర ధర్మ కర్మ మోచిత మార్గా వర్తులు దుర్ణయ నిర్మిత, కీర్తులు దానవులు సనిరి గీర్వాణులపై. |
271 |
| స్రగ్ధర. |
దండిం గోదండ కాండోద్ధత రథ హయ వేదండ తండంబుతోడన్ దండెత్తెన్ మెండుగా న ద్దనుజనికరముల్ దైవవర్గంబు మీఁదం జండ బ్రహ్మాండభే ద్యోచ్ఛ్రయ జయరవముల్ సర్వదిక్ క్షోభగా ను ద్దండ ప్రఖ్యాతలీలన్ దలపడిరి సురల్ దర్పులై వారి తోడన్. |
272 |
| చ. |
మదమున దేవదానవులు మచ్చరముల్ గడుఁ బిచ్చలింప సం పదలను గోరి పోరునెడ భార్గవ మంత్రకళా విశేషులై యెదురులు వాలి యస్త్రమున నేయ మహాసురు లేచియేచి పెం గుదులుగఁ గ్రువ్వ దేవతలు కోల్తల కోర్వక పాఱి రయ్యెడన్. |
273 |
| ఆ. |
దనుజవీరు లేయు దారుణ దివ్యాస్త్ర, దళితదేహు లగుచుఁ దలలు వీడ నోడి పాఱి రద్భుతోపేత బలులైన, త్రిదశవరులు బిట్టు దిట్టినట్లు. |
274 |
| క. |
ఒక మొగము గాక దివిజులు, తికమక గొని వైరులెల్ల దీకొనఁ దమ్ముం బకపకలై నకనక లై, లుకలుకఁ బరువెత్తి రోడి లోఁగొను భీతిన్. |
275 |
| చ. |
దనుజుల గర్వరేఖయును దానవవీరుల యంపజోకయున్ మనుజవిశేష భోజనుల మచ్చరికంబు నిశాటకోటి యే చిన బల శౌర్యముం దమకు సిగ్గును హాని మహాభయంబు ని ర్గుణతను జేయు నుమ్మలికఁ గోల్తల కోపక పాఱి రార్తులై. |
276 |
| క. |
అమరులు విసృష్ట దానవ, సమరులు శరభిన్న దేహ సంతాపగుణ భ్రమరులు దైత్య కిరాతక, చమరులు కమలజుని కడకుఁ జనిరి భయార్తిన్. |
277 |
| ఉ. |
ధాతకు దేవతా విభవదాతకుఁ బుణ్యజనానురాగ సం ధాతకు సర్వలోక హితదాతకు వైదిక ధర్మమార్గ ని ర్ణేతకు నుల్లస ద్విభవ నేతకు సర్వజగ జ్జయాంగజ భ్రాతకుఁ బుణ్య యోగిజన భావవిజేతకు మ్రొక్కి రయ్యెడన్. |
278 |
| క. |
ఆఖండలుండు మొదలుగ, లేఖానీకముల బ్రహ్మ లేనగవున ని త్యాఖండ సత్కృపారస, శేఖర వాక్యముల వారి సేదలు దేర్చెన్. |
279 |
| వ. | ఇట్లు బ్రహ్మదేవుండు దేవేంద్రప్రముఖులైన దేవతల కనుకంపాతివిభవంబున నభయం బొసంగి యిట్లనియె. | 280 |
| ఉ. |
నెట్టనఁ బాపకర్మమున నేరమిఁ జేసితి రేమి చెప్ప! మీ పుట్టిన నాఁటనుండియును బుద్ధులు సెప్పి జగంబు లేలఁగాఁ బట్టముఁ గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళా విధిజ్ఞుఁ జే పట్టక గుట్టు జాఱి సిరిపట్టునఁ దొట్టిన పొట్ట క్రొవ్వునన్. |
281 |
| వ. | బ్రహ్మిష్ఠుఁడైన బ్రాహ్మణు నాచార్యుం గైకొనక గురు ద్రోహంబుఁ జేసితిరి. తద్దోషం బిపుడు మీకుఁ జేసేఁత శత్రుకృతం బై యనుభవింపం జేసె. అతి బలవంతులైన మిమ్ము నతిక్షీణులైన రాక్షసులు జయించుట, తమ యాచార్యుండైన శుక్రు నారాధించి తన్మంత్ర ప్రభావంబునఁ బునర్లబ్ధవీర్యు లగుటచేతనే ఇప్పుడు మదీయం బైన నిలయంబు నాక్రమింపం గలవారై మదోద్రేకంబున నెదురులేక వర్తిల్లుచున్న రక్షోనాయకులకుఁ ద్రిదివంబుఁ గొనుట తృణప్రాయంబు. అభేద్య మంత్రబలంబు గల భార్గవునకు వారు శిష్యులగుటం జేసి విప్రగోవింద గవేశ్వరానుగ్రహంబు గలవారలకుఁ దక్కం దక్కిన రాజుల కరిష్టం బగు. కావున మీరిప్పుడు త్వష్ట యను మను పుత్రుం డగు విశ్వరూపుండను ముని నిశ్చల తపో మహత్త్వ సత్త్వస్వభావుం డగు నతని నారాధించిన, మీకు నభీష్టార్థంబు నతండు సంఘటిల్లఁజేయు. ఎట్టి దుర్దశల నైన నతం డడంచు అని చెప్పిన దిక్పాలకాదులు డెందంబులు డిందుపడి, కమలగర్భుని వీడ్కొని, విశ్వరూపు కడకుం జని యిట్లనిరి. | 282 |
| తే. |
అన్న! మేలగు నీకు ని న్నడుగఁ గోరి, వచ్చినారము భవదీయ వనమునకునుఁ దండ్రులకు నేఁడు సమయోచితంబు లైన, కోర్కు లొనఁగూడఁజేసి చేకొనుము యశము. |
283 |
| క. |
సుతులకుఁ బితృశుశ్రూషణ, మతిపుణ్యము సేయుచుండు నాత్మజులు గుణో న్నతి బ్రహ్మచారు లైనను, మతితో గురుసేవకన్న మఱియుం గలదే? |
284 |
| వ. | అదియునుం గాక. | 285 |
| సీ. |
అరయ నాచార్యుండు పరతత్త్వరూపంబు, దండ్రి తలంపంగ ధాతరూపు, రూపింప భ్రాత మరుత్పతి రూపంబు, దెలియంగఁ దల్లి భూదేవిరూపు భగిని కరుణరూపు, భావంబు ధర్మ స్వరూపంబు దా నర్థిరూపు మొదల నభ్యాగతుఁడు మున్న యగ్ని దేవుని రూపు సర్వభూతములుఁ గేశవుని రూపు |
|
| తే. |
గానఁ దండ్రి! వేగఁ గడు నార్తులగు పితృ, జనుల మైన మమ్ముఁ జల్లఁ జూచి పరభయంబు వాపి నిరుపమం బగు తపో, మహిమచేత మెఱసి మనుపవయ్య! |
286 |
| వ. | ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండ వైన నిన్ను నా చార్యునిఁగా వరించి, భవదీయ తేజో విశేషంబుచేత వైరివీరులం బరిమార్చెదము. ఆత్మీయార్థంబైన యవిష్ఠ పాదాభివందనంబు నిందితంబు గాదని వేదవాక్యంబు గలదు. కావున నీవు నమస్కరించుచున్న దేవతలం గైకొని పౌరోహిత్యంబు సేయుము అనినఁ బ్రహసిత వదనుండై య మ్మునీశ్వరుం డిట్ల్లనియె. | 287 |
| ఆ. |
బ్రహ్మతేజంబు వోయెడి ప్రార్థనంబు, ధర్మగుణ గర్హితం బని తా నెఱింగి సొరిది ననుబోఁటి తపసి యీ సురల చేతఁ, బ్రకట మధురోక్తి నేటికిఁ బలుకఁబడియె? |
288 |
| వ. | విశేషించి. | 289 |
| క. |
గురుధనముఁ గూర్పనేటికి, గురుశిక్షం దగిలి మంత్రకోవిదులై స ద్గురుధర్మ నిరతు లేనియు, గురువులకును శిష్యవరులె కూర్చిన ధనముల్. |
290 |
| సీ. |
అరయ నకించను లై నట్టివారికిఁ దగు శిలోంఛనవృత్తి ధనము సుమ్ము, దానిచే నిర్వర్తిత ప్రియసాధు సత్క్రియ గలవారలై ప్రీతినొందె దరు గాన సద్గర్హితాచారమైన యాచార్యత్వ మిపుడు మీ శాసనమునఁ గైకొంటి, గురువుల కామంబు బ్రాణార్థ వంచనములు లేక వడి నొనర్తు |
|
| ఆ. |
ననుచు విశ్వరూపుఁ డనియెడి ముని ప్రతి జ్ఞోక్తిఁ బలికె వారి నూఱడించి మహిత మైన తత్సమాధిచే గురుభావ, మమరఁ జేసె దేవసమితి కపుడు. |
291 |
| క. |
భార్గవవిద్యా గుప్త, స్వర్గశ్రీ ద్విగుణ దనుజ సమధిక సంప ద్వర్గముల విష్ణుమాయా, నర్గళగతిఁ దెచ్చి యింద్రునకు నిచ్చె నృపా! |
292 |
| క. |
ఏ విద్యచేత రక్షితుఁ, డై వజ్రి దురంబులోన నసురులఁ ద్రుంచెన్ భావింప నట్టి విద్యను, శ్రీవరమాయామతంబుఁ జెప్పెను హరికిన్. |
293 |
| ఉ. |
నావుడుఁ బాండవాన్వయుఁడు నమ్మినభక్తి జగన్నివాసు రా జీవదళాక్షుఁ గృష్ణుఁ దన చిత్తమునన్ భజియించి పల్కె నో దేవగణార్చితాంఘ్రియుగ! దివ్య మునీశ్వర! విశ్వరూపుఁ డ ప్పావనమైన విద్య సురపాలున కే క్రియ నిచ్చెఁ? జెప్పవే! |
294 |
| ఉ. |
ఎందును రక్షితుం డగుచు నింద్రుఁడు లీలయ పోలె వైరి సే నం దునుమాడి దేవతలు నమ్మి సుఖింపఁగ నిష్టసంపదం జెంది సమస్తలోకములఁ జేకొని యేలె మునీంద్ర! దాని నే విందు సుఖంబుఁ గందు నిఁక వీనులు సంతస మందఁ బల్కవే? |
295 |