| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| క. |
వర నారాయణ కవచము, నరిభీకర వజ్రకవచ మాశ్రిత సంప త్పరిణామ కర్మసువచము, పురుహూతున కెట్లు మౌని బోధించెఁ? దగన్. |
296 |
| వ. | అనినం బరీక్షి జ్జనపాలునకు మునినాథుం డిట్లనియె. | 297 |
| సీ. |
వినవయ్య! నరనాథ! మునినాథుఁ డింద్రున కనువొంద నారాయణాఖ్య మైన కవచంబు విజయ సంకల్పంబు నప్రమేయ స్వరూపంబు మహాఫలంబు మంత్రగోప్యము హరిమాయావిశేషంబు సాంగంబుతోడ నెఱుంగఁజేసె! దాని నే వినిపింతుఁ బూని తదేకాగ్ర చిత్తంబుతోడుతఁ జిత్తగింపు, |
|
| తే. |
మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు, ముఖముగా నుత్తమాసనమున వసించి కృత నిజాంగ కరన్యాస మతిశయిల్ల, మహిత నారాయణాఖ్య వర్మము నొనర్చె. |
298 |
| వ. | ఇట్లు నారాయణకవచంబు ఘటియించి పాదంబులను, జానువులను, ఊరువులను, ఉదరంబునను, హృదయంబునను, ఉరంబునను, ముఖంబునను, శిరంబునను నిట్లష్టాంగంబులం బ్రణవపూర్వకం బైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుఁ జేసి, ద్వాదశాక్షర విద్యచేత కరన్యాసంబు చేసి, మంత్రమూర్తియై భగవచ్ఛబ్ద వాచ్యంబైన ప్రణవాది యకారాంతమగు మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ సర్వసంధులయందు న్యసించి, మఱియు హృదయంబున ఓంకారము, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబునందు, ణకారంబు శిఖయందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వసంధులయందు, మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించెనేని మంత్రమూర్తియగు. మఱియును అస్త్రాయ ఫట్ అను మంత్రంబున దిగ్బంధనంబుచేసి, పరమేశ్వరునిఁ దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్ఛక్తి సంయుతంబైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠించె. | 299 |
| చ. |
గరుడుని మూఁపుపై పదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ ర్మ రుచిర శార్‌ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో త్కర నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం భరిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్. |
300 |
| ఆ. |
ప్రకట మకర వరుణ పాశంబులందుల, జలములందు నెందుఁ బొలయ కుండఁ గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డైనట్టి, మత్స్యమూర్తి విద్యమానకీర్తి. |
301 |
| క. |
వటుఁడు సమాశ్రిత మాయా, నటుఁడు బలి ప్రబల శోభన ప్రతిఘటనో ద్భటుఁడు త్రివిక్రమదేవుఁడు, చటుల స్థలమందు నన్ను సంరక్షించున్. |
302 |
| చ. |
అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం హుఁడు సురశత్రుయూధపవధోగ్రుఁడు విస్ఫురితాట్టహాస వ క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై. |
303 |
| చ. |
అరయఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో నొరగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో హరుఁడు కృపావిధేయుఁడు సదాధ్వముల న్ననుఁ గాచుఁగావుతన్ |
304 |
| క. |
రాముఁడు రాజకులైక వి, రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ స్తోముఁడు నను రక్షించును, శ్రీమహితోన్నతుఁడు నద్రిశిఖరములందున్. |
305 |
| సీ. |
తాటక మర్దించి తపసిజన్నముఁ గాచి, హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి ప్రబలు లైనట్టి విరాధకబంధోగ్ర ఖరదూషణాదిరాక్షసులఁ దునిమి వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి జలరాశిగర్వంబుఁ జక్కఁజేసి సేతువు బంధించి చేరి రావణకుంభకర్ణాది వీరులఁ గడిమిఁ ద్రుంచి |
|
| తే. |
యలవిభీషణు లంకకు నధిపుఁ జేసి, భూమిసుతఁ గూడి సాకేతపురము నందు రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు, వరుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల. |
306 |
| వ. | మఱియు నఖిల ప్రమాదంబులైన యభిచారకర్మంబువలన నారాయణుండును, గర్వంబువలన నరుండును, యోగభ్రంశంబు వలన యోగనాథుం డైన దత్తాత్రేయుండును, గర్వబంధమువలన గణేశుం డైన కపిలుండును, గామదేవుని వలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబుఁ జేయుటవలన శ్రీహయగ్రీవమూర్తియును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబుల వలన నారదుండును, నశేష నిరయంబుల వలనఁ గూర్మంబును, నపథ్యంబువలన భగవంతుండైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముండైన ఋషభుండును. జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబుల వలన శేషుండును, అప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషండ సమూహంబు వలన బుద్ధ దేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణ పరుండైన మహావతారుండు నన్ను రక్షించుఁగాత! ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నా పరాహ్ణ సాయంకాలంబులను ప్రదో షార్ధరాత్రాపర రాత్ర ప్రత్యూ షానుసంధ్య ప్రభాతంబు గదాద్యాయుధంబుల ధరియించి కేశవ, గోవింద, నారాయణ, విష్ణు, మధుసంహర, త్రివిక్రమ, వామన, హృషీకేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తులను నామరూపంబులు గల దేవుండు నన్ను రక్షించుఁగాక. ప్రళయకాలాన లాతితీక్ష్ణసంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రంబైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు సేయు భంగి భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము. జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటి సంస్పర్శస్ఫుర ద్విస్ఫులింగ నిర్గ మానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణ కరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయ వైరితండోపతండంబుల భండనంబులం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక యక్ష రక్షోభూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదము సలుపుము. దరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణుని నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్వా సాధర వేణు పరిపూతంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్రగ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మత్పరవీర మండలంబుల గుండియలతో దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భ స్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబైన భూరి నాదంబున మోదింపుము. అతి తీవ్రధారా దళిత నిశాటకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవైన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబులు బెండువడ మెండు గడికండలుగ ఖండించి చెండాడుము. నిష్కళంక నిరాతంక నిశ్శంక సాంద్ర చంద్ర మండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మ నిర్మితంబవైన చర్మంబ! దుర్మద మద్వైరిలోక భీకరాలోకంబులను సమాకుల నిబిడ నీరంధ్ర నిష్ఠుర తమఃపటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము. నిఖిల పాపగ్రహంబుల వలనను, సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు భగవ న్నామ రూప యాన దివ్యాస్త్రంబుల వలనం బొందకుండుఁ గాక! బృహ ద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయంబడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుంగాక. శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనః ప్రాణంబుల సంరక్షించు భగవంతుండైన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు సేయు. జగదైక్యభావంబైన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయచేత ధరియించి తేజరిల్లుచుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁ గాక. లోకభయంకరాట్టహాస భాసురవదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుండగు నప్పరమేశ్వరుండు, సర్వ దిగ్భాగంబులవలన, సమస్త బహిరంతరంబులవలన నన్ను రక్షింపుచుండుఁ గాక అని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాసరూపంబున నింద్రుండు దెలిసి కొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించె. కావున, నెవ్వరేని నిర్మలాత్ములగు వార లేతద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన, నతిఘోరరణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వగ్రహ నిగ్రహకర్మ మారణకర్మాది దుష్కర్మజన్య క్లేశంబులను వదలి, అవ్యాకులమనస్కులై విజయంబు నొందుదురు. మఱియును, సర్వరోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదురు. అదియునుంగాక. | 307 |
| సీ. |
అతిభక్తిఁ గౌశికుం డను బ్రాహ్మణుఁడు దొల్లి యీ విద్య ధరియించి యెలమి మించి మరుభూమియందు నిర్మలచిత్తుఁడై యోగ ధారణంబున బిట్టు తనువు విడిచె దానిపై నొకఁడు గంధర్వవరేణ్యుండు చిత్రరథాఖ్యుఁ డఁజేయుఁ డొంటిఁ జదలఁ జనంగఁ దచ్ఛాయ తదస్థిపైఁ గదిసిన నాతఁడు గళవళించి |
|
| ఆ. |
యువిదపిండుతోడ నవ విమానముతోడఁ దనదు విద్యతోడ ధరణిఁ ద్రెళ్లి తిరిగి లేవలేక తికమక గుడువంగ, వాలఖిల్యమౌని వానిఁ జూచి. |
308 |
| క. |
నారాయణకవచ సమా, ధారణ పుణ్యాస్థి దీని దగ్గఱ నీకుం గూరెడినె? విష్ణుభక్తుల, వారక చేరంగ నెట్టివారికిఁ దరమే? |
309 |
| ఇంద్రవజ్రము. |
సంధించి నీ యంగక సంధు లెల్లన్, బంధించి తన్మంత్రబలంబు పేర్మి న్నందంబు మాన్పింపఁ ద దన్య మేదీ? సింధుప్రవా హోన్నతి చేతఁ దీరున్. |
310 |
| వ. | కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండవై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు సేసి కృతస్నానుండ వై యాచమనంబు చేసిన, నీ సర్వాంగ బంధనంబు లుడుగు ననిన నతం డట్లుచేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెం గావున. | 311 |
| క. |
అనుదినము దీని నెవ్వరు, వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్ ఘన భూతజాల మెల్లను, మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్. |
312 |
| ఆ. |
విశ్వరూపువలన నైశ్వర్యకరమైన, యిట్టి విద్యఁ దాల్చి యింద్రుఁడపుడు మూఁడు లోకములకు ముఖ్యమైనట్టి శ్రీ, ననుభవించి మించె నధికమహిమ. |
313 |
| సీ. |
భూపాల! యా విశ్వరూపున కరుదైన తలలు మూఁ డనువొందఁ దగిలియుండు సొరిది సురాపాన సోమపానంబులు నన్నాద మనఁగను నమరవరుల తోఁగూడి భుజియించి తూకొని వారితో యజ్ఞభాగంబు ప్రత్యక్ష మొంది కై కొనుచుండి దుష్కర్ముఁడై యా యజ్ఞ భాగంబు రాక్షస ప్రవరులకును |
|
| ఆ. |
దల్లి మీఁదఁ గలుగు తాత్పర్యవశమున, దివిజవరుల మొఱఁగి తెచ్చి యిచ్చె నది యెఱింగి యింద్రుఁ డతిభీతచిత్తుఁడై, తనకుఁగాని యతని తలలు ద్రుంచె. |
314 |
| క. |
భూసురుఁ డనక మహాత్మా, గ్రేసరుఁడన కతఁడు పూర్వకృత కర్మగతిన్ వేసరఁ డనక మహేంద్రుఁడు, భూసురు తల లపుడు రోషమునఁ దెగ నడిచెన్. |
315 |
| వ. | ఇట్లయ్యింద్రుండు క్రోధంబు సహింపంజాలక విశ్వరూపుతలలు ఖడ్గంబునం దెగనడిచిన సోమపానంబు చేయు శిరంబు కపింజలం బయ్యె. సురాపానంబు చేయు శిరంబు గలవింకం బయ్యె. అన్నంబు భక్షించు శిరంబు తిత్తిరి యయ్యె. ఇట్లు త్రివిధ పక్షి స్వరూపంబు దాల్చి, బ్రహ్మహత్య యేతెంచి, యింద్రునిఁ జుట్టుకొని తమ్ముఁ బరిగ్రహింపు మని నిర్బంధింప నపు డింద్రుం డతి భీతచిత్తుండై త్రిలోకనాయకుండైనం దానిం దప్పించుకొనఁజాలక యంజలి యొగ్గి, య మ్మహా దోషంబుఁ గైకొని, తద్దోషం బొక్క సంవత్సరం బనుభవించి, యంతం బాపుకొనువాఁడై భూ జల వృక్ష స్త్రీలం బ్రార్థించి, మద్దురితంబు చతుర్విధంబులం బుచ్చుకొనుం డనిన, భూమి తనయందుఁ జేయంబడిన ఖాతంబు తనంతన పూడునట్టి వరంబును, జలంబు సర్వంబు దనయందుఁ బ్రక్షాళితం బైనం బావనం బగు నట్టి వరంబును, వృక్షంబులు ఛేదింపంబడి పునఃప్రరోహంబు గలుగునను వరంబును, స్త్రీ లెల్లప్పుడుం దమకుఁ గామసుఖంబు గలుగు నను వరంబును గోరిన, నతం డట్లుగాక యని యొసంగిన, నతని దుష్కృతంబు ధరణి యిరిణ విధంబునను, నుదకంబు బుద్బుదఫేన రూపంబునను, మహీరుహంబులు నిర్యాసభావంబునను, నింతులు రజోవికారంబునను నిట్లు చతుర్భాగంబులం బంచికొనిరి. అంత. | 316 |