పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
వృత్రాసుర వృత్తాంతము
మ. హతపుత్రుం డగు విశ్వరూపజనకుం డా త్వష్ట దుఃఖాయతో
ద్ధత రోషానల దహ్యమానుఁ డగుచుం దా నింద్రుపై మారణ
క్రతు హోమంబు నొనర్ప నందుఁ బొడమెం గల్పాంతకాకార వి
శ్రుత కీలానల నిష్ఠు రేక్షణ గుణ క్షుభ్య త్త్రిలోకోగ్రుఁడై.
317
సీ. యుగము గ్రుంగెడునాఁడు జగములు వొలియించు నంతకు మూర్తిపై నింత యగుచుఁ
బఱపును నిడుపును బ్రతిదినంబును నొక్క శరపాత మంగంబు విరివిఁగొనుచుఁ
గడుదగ్ధశైలసంకాశ దేహమునందుఁ గరము సంధ్యారాగకాంతిఁ బెరయ
మును గాఁక రాగిచేఁ గను మించు మించులఁ గఱకు మీసలు కచాగ్రములు మెఱయఁ
 
తే. జండ మధ్యాహ్న మార్తాండ మండలోగ్ర, చటుల నిష్ఠుర లోచనాంచల విధూత
దశ దిశాభాగుఁ డుజ్జ్వలతర కరాళ, భిదుర సునిశిత దంష్ట్రోరు వదనగుహుఁడు.
318
ఉ. నింగికి నేలకుం బొడవు నిట్టలమై శిఖలందుఁ బర్వు ను
త్తుంగ త రాగ్నిజాలములఁ దొట్రిలుచుం గ్రహపంక్తి జాఱ ని
స్సంగ కరాళశాత ఘన సద్ఘృణి మండల చండ శూల ము
ప్పొంగుచుఁ గేల లీలఁగొని భూమిచలింపఁగ సోలియాడుచున్‌.
319
సీ. వదలక విరివిగా వదనంబు దెఱచుచు నాకాశమంతయు నప్పళించుఁ,
గడునాల్క నిగుడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజాఱ నాకి విడుచు,
నలవోకయును బోలె నట్టహాసము చేసి మెఱసి లోకములెల్ల మ్రింగఁ జూచుఁ,
దనదు దిగ్దంతి దంతములు చెక్కలువాఱ నుగ్రదంష్ట్రలు ద్రిప్పు నుక్కుమిగిలి,
 
తే. త్వష్ట బలితంపుఁ దపమునఁ బుష్టినొంది, యఖిల లోకంబు లెల్లఁ దా నాక్రమించి
వృత్రనామాఖ్య దేవతాశత్రుఁ డగుచు, దారుణాకారుఁ డఖిల దుర్దముఁడు మెఱసె.
320
మత్తకోకిల. అట్టి వృత్రునిమీఁద దేవత లల్కతోఁ బెనుమూఁక లై
చుట్టుముట్టి, మహాస్త్రవిద్యలు సూపి, యేపున నేయ నా
గొట్టువీరుఁడు వార లేసిన క్రూరశస్త్రము లన్నియుం
జుట్టి పట్టుక మ్రింగి, శూరత జోక నార్చె మహోగ్రుఁడై.
321
క. భక్షిత దివ్యాస్త్రుం డగు, రక్షోనాయకుని నమరరాజ ప్రముఖుల్‌
వీక్షింప వెఱచి పఱచిరి, రక్షకుఁ జింతించి కొనుచు రయ మొప్పారన్‌.
322
వ. ఇట్లు సర్వసాధనంబులతోడ సాధుజనంబుల వృత్రాసురుండు మ్రింగిన, నచ్చెరువడి చేయునది నేరక త త్తేజోవిశేష విభవంబునకు భయంబు నొంది. కందిన డెందంబునం గుందుచుఁ, బురందర ప్రముఖు లార్తరక్షకుండగు పుండరీకాక్షునకుం గుయ్యిడు వారలై. 323
లయగ్రాహి. వీఁడు కడు దుర్దముఁడు వాఁడి మన కైదువులు, పోఁడి సెడఁగా మెసఁవి యీడు గనకున్నాఁ
డేడ బ్రతుకింకఁ? బెనుకీడు వొడమెన్‌ మనకుఁ, దోడుపడ నొక్కరుఁడు లేఁడు హరి దక్కన్‌
వేఁడుదము శ్రీధరునిఁ, గూడుదము సద్భటులఁ, బాడుదము గీతములఁ జూడఁబడు నంతన్‌
వీఁడు చెడుత్రోవ దయతోడ నెఱిఁగించు ఘనుఁ డోడక సురాలయము పాడువడ దింకన్‌.
324
క. అని తలపోయుచుఁ దమలో, మునుకుచుఁ దికమకలు గొనుచు మురరిపు కడకున్‌
గునుకుచుఁ గునుకుచు నేగిరి, ఘనరాక్షసుఁ గన్న కన్నుఁగవ బెగ్గిలఁగన్‌.
325
వ. ఇట్లు భయార్తులైన యమర్త్యవ్రాతంబు సనిచని, ముందట నభంగ భంగ రంగ దుత్తుంగ డిండీర మండల సముద్దం డాడంబర విడంబిత నారాయణ నిరంతర కీర్తి లతా కుసుమగుచ్ఛ స్వచ్ఛంబును, అనవరత గోవింద చరణారవింద సేవా సమాకుల కలితఫలిత మహాపుణ్య ఫలాయమాన సముద్దీపి తావర్తవర్తిత దక్షిణావర్త రుచిర శంఖమండల మండితంబును, నతి నిష్ఠుర కఠిన పాఠీన పృథురోమ రాజీవ శకుల తిమి తిమింగిల కర్కట కమఠ కచ్ఛప మకర నక్ర వక్రగ్రహ గ్రహణ ఘుమ ఘుమారావ దారుణగమన విషమిత విషమ తరంగఘట్టన ఘట్టిత సముద్ధూత శీకర నికర నీరంధ్ర తారకిత తారాపథంబును,మహోచ్ఛ్రయ శిలోచ్చయ శిఖరాగ్ర ప్రవహిత దుగ్ధనిర్ఝర సమ్మార్జిత పురాణపురుష విశుద్ధ శుద్ధాంత విహరణధురీణ నవసుధాధౌత ధావళ్య ధగద్ధగాయమాన రమ్య హర్మ్య నిర్మాణ కర్మంబును, అతిపవిత్రగుణ విచిత్ర నిజకళత్ర ప్రేమానంద సందర్శిత ముకుంద పరిస్రవ దంతరంగ కరుణారస పరిమిళిత భావబంధుర విద్రుమవల్లీమతల్లి కాంకురశోభితంబును, ప్రసిద్ధ సిద్థరసాంబువాహ సంగమ సముత్థిత గంభీరఘోష పరిపూరిత సకల రోదోఽంతరాళంబును, సముద్రమేఖ లాఖిలప్రదేశ విలసిత నవీన దుకూలాయమానంబును, హరిహర ప్రముఖ దేవతానిచయ పరిలబ్ధామృత మహైశ్వర్య దానధౌరేయ మహానిధానంబును, వైకుంఠపుర పౌరవార మనోహర కామ్యఫలఫలిత మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందన ఘన వనానుకూల కూలంబునునై యొప్పుచుఁ గుబేరు భాండాగారంబునుంబోలె బద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్ఛప, ముకుంద, కుంద, నీల, వర సమగ్రంబై, విష్ణుకరకమలంబునుంబోలె సుదర్శనావర్త ప్రగల్భంబై, కైలాస మహీధరంబునుంబోలె నమృతకళాస్థాన శేఖరపదార్పణంబై, యింద్రవైభవంబునుంబోలె కల్పవృక్ష కామధేను చింతామణి జనిత విశేషంబై, సుగ్రీవసైన్యంబునుంబోలె నపరిమితనిబిడ హరిసంచారంబై, నారాయ ణోదరంబునుంబోలె నిఖిల భువన భారభరణ సమర్థంబై, శంకరు జటాజూటంబునుంబోలె గంగాతరంగిణీ సమాశ్రయం బై, బ్రహ్మలోకంబునుంబోలెఁ బరమహంసకులసేవ్యంబై, పాతాళ లోకంబునుంబోలె ననంత భోగి భోగ్యయోగ్యంబై, నందనవనంబునుం బోలె నైరావత మాధవీరంభాది సంజననకారణంబై, సౌదామినీ నికరంబునుంబోలె నభ్రంకషంబై, విష్ణునామకీర్తనంబునుంబోలె నిర్మల స్వభావంబై, క్రతుశతగతుండునుంబోలె హరిపదభాజనంబై, యొప్పుచున్న దుగ్థవారాశి డాసి, శ్వేతద్వీపంబున వసియించి, యందు సకల దిక్పాలకాది దేవతలు దేవదేవు నాశ్రయించి యిట్లని స్తుతియించి రంత. 326
సీ. పంచమహాభూత పరినిర్మితంబైన ముజ్జగంబుల కెల్ల నొజ్జ యైన
బ్రహ్మయు నేమును బరఁగ నందఱుఁ గూడి యెవ్వనికై పూజలిత్తు మెపుడు
నట్టి సర్వేశ్వరుం డాగమ వినుతుండు సర్వాత్మకుఁడు మాకు శరణ మగును
అతిపూర్ణకాము నహంకారదూరుని సముని శాంతునిఁ గృపాస్పదుని గురుని
 
తే. మాని యన్యుని సేవింపఁ బూనునట్టి, కపట శీలుని నతి పాపకర్మబుద్ధి
శునక వాలంబు వట్టుక ఘనతరాబ్ధిఁ, దరియఁ జూచుట గాదె! తాఁ దామసమున.
327
చ. ఉదకమయంబునన్‌ వసుధ నోడఁగఁ జేసి తనర్చు కొమ్మునన్‌
వదలక యంటఁగట్టి మనువల్లభుఁ గాచిన మత్స్యమూర్తి స
మ్మదమున మమ్ముఁబ్రోచు ననుమానము మానఁగ వృత్రుచేతి యా
పదఁ దొలఁగించి నేఁడు సురపాలుర పాలిటి భాగ్యదైవమై.
328
మత్తకోకిల. రంతు సేయుచు వాతధూత కరాళ భంగుర భంగ దు
ర్దాంత సంతత సాగరోదక తల్ప మొంది వసించు బ్ర
హ్మంతవానిని బొడ్డుఁదమ్మిని నాఁచి కాచిన నేర్ప రిం
తంతవాఁ డనరాని యొంటరి యాదరించు మముం గృపన్‌.
329
తే. దేవతల మైన మే మిట్టి దేవదేవు, సర్వలోక శరణ్యుని శరణు చొచ్చి
బలిత మైనట్టి వీని యాపదలఁబాసి, మీఱి శుభములఁ జే కొనువార మిపుడు.
330
వ. ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుండయ్యె. అప్పుడు. 331
సీ. తగు శంఖ చక్ర గదా ధరుం డగు వాని శ్రీవత్స కౌస్తుభ శ్రీల వాని
గమనీయ మాణిక్య ఘన కిరీటమువాని దివ్యవిభూషణ దీప్తివాని
మండిత కోటీర కుండలంబులవాని, సిరి యురస్స్థలమునఁ జెలఁగు వానిఁ
దనుఁబోలు సేవకతండంబు గలవాని, జిలుఁగైన పచ్చని వలువవానిఁ
 
ఆ. దెల్లఁ దమ్మివిరులఁ దెగడు కన్నులవాని, నవసుధా ద్రవంపు నవ్వువానిఁ
గనియె వేల్పుపిండు కప్పరపాటుతోఁ, గన్నులందు నున్న కఱవు దీఱ.
332
సీ. తన సేవకులలోనఁ దడబడు రూపంబు శ్రీవత్స కౌస్తుభశ్రీలు దెలుప
వికచాబ్జములతోడ వీడ్వడు కన్నుల కడల దై వాఱెడు కరుణ దెలుప
నెల్ల లోకములకు నిల్లైన భాగ్యంబుఁ గాఁపురం బుండెడు కమల దెలుప
మూఁడు మూర్తులకును మొదలైన తేజంబు ధాతఁ బుట్టించిన తమ్మి దెలుప
 
ఆ. బుద్ధిఁ బోల్పరాని పుణ్యంబుఁ దత్పాద, కమల జనిత యైన గంగ దెలుప
నప్రమేయుఁ డభవుఁ డవ్యక్తుఁ డవ్యయుఁ, డాదిపురుషుఁ డఖిలమోది యొప్పె.
333
వ. ఇట్లు జగన్మోహనాకారుండైన నారాయణుని కృపావలోకనాహ్లాద చకిత స్వభావ చరితులై సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, ఫాలభాగాన పరికీలిత కరకమలులై యిట్లనిరి. 334
ఆ. దుర్గమంబు లైన స్వర్గాది ఫలములఁ, బుట్టఁ జేయఁ జాలునట్టి గుణము
గలిగి మెలఁగుచున్న ఘనుఁడ వైనట్టి నీ, కరయ మ్రొక్కువార మాదిపురుష!
335
సీ. దండంబు యోగీంద్రమండల నుతునకు దండంబు శార్‌ఙ్గకోదండునకును,
దండంబు మండితకుండలద్వయునకు దండంబు నిష్ఠురభండనునకు,
దండంబు మత్తవేదండరక్షకునకు దండంబు రాక్షసఖండనునకు,
దండంబు పూర్ణేందుమండలముఖునకు, దండంబు తేజఃప్రచండునకును,
 
తే. దండ మద్భుతపుణ్యప్రధానునకును, దండ ముత్తమవైకుంఠధామునకును
దండ మాశ్రితరక్షణతత్పరునకు, దండ మురుభోగినాయకతల్పునకును.
336
ఉ. చిక్కిరి దేవతావరులు చిందఱ వందఱలైరి ఖేచరుల్‌,
స్రుక్కిరి సాధ్యసంఘములు, సోలిరి పన్నగు లాజిభూమిలో,
మ్రక్కిరి దివ్యకోటి, కడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ
చిక్కినవారి నైన దయసేయుము నొవ్వకయుండ నో హరీ!
337
క. మొదలాఱిన రక్కసులకు, మొదలై మా కాపదలకు మూలం బగుచుం
దుద మొదలు లేని రక్కసు, తుదిఁ జూపఁగదయ్య! తుదకుఁ దుదియైన హరీ!
338
తే. అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు, నొక్క దిక్కును లేదు కా లూన నైన,
దిక్కుగావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి, దిక్కు లేకున్నవారల దిక్కు నీవ.
339
క. నీ దిక్కు గానివారికి, నే దిక్కును వెదక నుండ దిహపరములకున్‌
మోదింపఁ దలఁచువారికి, నీ దిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా!
340
తే. అరయ మా తేజములతోడ నాయుధములు, మ్రింగి భువన త్రయంబును మ్రింగుచున్న
భీకరాకారు వృత్రునిఁ బీఁచ మణఁచి, యెల్ల భంగుల మా భంగ మీఁగు మభవ!
341
ఆ. పరమపురుష! దుఃఖభంజన! పరమేశ!, భక్తవరద! కృష్ణ! భవవిదూర!
జలరుహాక్ష! నిన్ను శరణంబు వేఁడెద, మభయ మిచ్చి కావు మయ్య! మమ్ము.
342
వ. నమస్తే భగవన్నారాయణ! వాసుదేవ! ఆదిపురుష! మహానుభావ! పరమమంగళ! పరమకళ్యాణ! దేవ! పరమ కారుణికు లైన పరమహంసలగు పరివ్రాజకులచేత నాచరితంబు లగు పరమసమాధి భేదంబులం బరిభావిత పరిస్ఫుటం బైన పరమహంస ధర్మంబుచేత నుద్ఘాటితం బగు తమః కవాటద్వారంబున నపావృతం బైన యాత్మలోకంబున నుపలబ్ధిమాత్రుండవై, నిజసుఖానుభవుండవై యున్న నీ వాత్మసమవేతంబులై యుపేక్షింపంబడని యీ శరీరంబులకు నుత్పత్తి స్థితి లయ కారణుండ వై యుండుదువు. గుణసర్గ పతితుండవై యపరిమిత గుణగణంబులున్న నీవు, దేవదత్తుని మాడ్కిఁ బారతంత్ర్యంబున స్వకృతంబులైన కుశలా కుశల ఫలంబుల ననుభవింతువు. షడ్గుణైశ్వర్య సంపన్నుండ వైన నీ వాత్మారామ స్వభావుండవై, యపరిమిత గుణగణంబులు గలిగి, యీశ్వరాహ్వయానవగాహ్య మాహాత్మ్యంబందు నర్వాచీన వికల్ప వితర్క విచార ప్రమాణాభాసంబులగు కుతర్కశాస్త్రంబులఁ గర్కశంబులైన ప్రజ్ఞలు గలిగి, దురవగ్రహవాదు లయిన విద్వాంసుల వివాదావసరంబులయందు నుపరతంబులగు అస్తి నా స్తీత్యాది వాక్యంబుల సమస్త మాయామయుండవై నిజమాయచేతఁ గానంబడని యుక్తిగోచరుండవై, సమ విషమ రూపంబులఁ బ్రవర్తింతువు. దేవా! రజ్జువునందు సర్పభ్రాంతి గలుగునట్లు, ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మంబైన నీ యందుఁ బ్రపంచ భ్రాంతి గలుగుచుండు. సర్వేశ్వరా! సర్వ జగత్కారణ రూపంబవైన నీవు సర్వభూత ప్రత్యగాత్మ వగుటం జేసి సర్వగుణావభాసోపలక్షితుండవై కానంబడుచుందువు. లోకేశ్వరా! భవ న్మహిమమహామృత సముద్ర విప్రు ట్సకృత్పానమాత్రంబున సంతుష్టచిత్తులై, నిరంతర సుఖంబున విస్మారిత దృష్ట శ్రుత విషయసుఖ లేశాభాసులైన పరమభాగవతులు, భవచ్చరణకమలసేవాధర్మంబు విడువరు. త్రిభువనాత్మభవన! త్రివిక్రమ! త్రిణయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నర మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు. భక్తవత్సలా! భవన్ముఖ కమల నిర్గత మధుర వచనామృత కళావిశేషంబుల, నిజదాసులమైన మా హృదయతాపం బడంగింపుము. జగదుత్పత్తి స్థితి లయ కారణ ప్రధాన దివ్య మాయా వినోదవర్తివై సర్వ జీవనికాయంబులకు బాహ్యాభ్యంతరంబులయందు బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూప ప్రధాన రూపంబుల దేశకాల దేహావస్థాన విశేషంబులఁ, దదుపాదానానుభవంబులు గలిగి, సర్వప్రత్యయ సాక్షివై, సాక్షాత్పరబ్రహ్మ స్వరూపుండవై యుండెడి నీకు నేమని విన్నవించువారము? జగదాశ్రయంబై, వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనంబైన భవదీయ దివ్యచరణ శతపలాశచ్ఛాయ నాశ్రయించెదము అని పెక్కువిధంబుల వినుతించి యిట్లనిరి. 343
క. తేజంబు నాయువును వి, భ్రాజిత దివ్యాయుధములఁ బరువడి వృత్రుం
డాజిముఖంబున మ్రింగెను, మా జయ మిం కెందుఁ? జెప్పుమా! జగదీశా!
344
వ. అని యిట్లతిమనోహర చతుర వచనంబుల భక్తిపరవశులై వినుతి సేయుచున్న దేవతలం జూచి, యప్పరమేశ్వరుం డమృత ప్రాయంబు లగు గంభీరభాషణంబుల నిట్లనియె. 345
క. మ దుపస్థానం బగు మీ, సదమల సుజ్ఞానమునకు సంతోషమునం
బొదలె మది ప్రీతి నొందితి, వదలక నా భక్తి వొడమి వ్యర్థం బగునే!
346
వ. మఱియు, నతిప్రీతుండనైన నాయందు భక్తులకుం బొంద రాని యర్థంబు లేదు; విశేషించి నాయందు నేకాంతమతి యైన తత్త్వవిదుం డన్యంబులం గోరకుండు; గుణంబులయందుఁ దత్త్వ జ్ఞానగోచరుం డైనవాఁడు విషయ నివృత్త చిత్తుండై సంసార మార్గంబు నిచ్ఛయింపఁడు; కావున మీకు శుభం బయ్యెడు; దధీచియను ఋషిసత్తముండు గలండు; అతని శరీరంబు మద్విద్యాతిశయ మహత్త్త్వంబునం దేజో విశేషంబున సారం బై యున్నయది; అతని నడిగి, తచ్చరీరంబుఁ బుచ్చికొనుండు; అతండు పూర్వకాలంబున నశ్వినీ దేవతలకు నశ్వశిరోనామంబను బ్రహ్మ స్వరూపంబగు నిష్కళంకంబైన విద్య నుపదేశించిన, వారలు జీవన్ముక్తిత్వంబు నొందిరి; మఱియుఁ ద్వష్టృ పుత్త్రుండైన విశ్వ రూపునకు మదాత్మకంబైన యభేద్య కవచంబు నిచ్చె. కావున నతం డతివదాన్యుండు; అశ్వినీదేవతలచేత యాచింపంబడి, దేహంబు వంచింపక మీ కిచ్చు; అతని శల్యంబులు విశ్వకర్మ నిర్మితంబు లై, శతధారలు గల యాయుధ శ్రేష్ఠంబై, మత్తేజోపబృంహితంబై వృత్రాసుర శిరోహరణ కారణంబై యుండు; దానంజేసి మీరు పునర్లబ్ధ తేజో0000స్త్రాయుధ సంపదలు గలిగి వెలింగెదరు; విశేషించియు మద్భక్తవరులైనవార లే లోకంబుల నెవ్వరికి నజేయులు; కావున మీకు భద్రంబయ్యెడు అని భూతభావనుండైన భగవంతుం డదృశ్యుం డయ్యె; అప్పుడు దేవతలు దధీచిమునికడకుం జనిన నత్తఱి యింద్రుం డిట్లనియె. 347
ఆ. దేహి సుఖముఁ గోరు దేహంబు ఘటియించి, దేహి విడువలేఁడు దేహ మెపుడు,
దేహి! యస్మదీయ దేహంబుకొఱకునై, దేహ మీఁగదయ్య! దేవతలకు.
348
ఉ. ఎక్కడ నెల్లలోకముల నెవ్వరుఁ గోరని కోర్కి నేఁడు మా
తెక్కలిపాటుకై తివిరి దేహము వేఁడఁగఁ వచ్చినార, మే
మెక్కడ! తీవ్ర కర్మగతి యెక్కడ! దైవకృతంబుగాక! యీ
త్రొక్కుడుదాన మీ వరుస రోయక వేఁడుదురే జగంబులన్‌?
349
క. నీచగతి యెల్లభంగుల, యాచన యని తెలిసి తగని దడుగుదు రేనిన్‌
యాచక వర్గము లోపల, నీచకు లనఁబడరె? యెంత నేర్పరులైనన్‌.
350
క. అడుగంగరాని వస్తువు, లడుగరు బతిమాలి యెట్టి యర్థులు నిను నే
మడిగితిమి దేహ మెల్లను, గడు నడిగెడు వారి కేడ కరుణ? మహాత్మా!
351
ఉ. నావుడు నా దధీచియు మనంబున సంతసమంది నవ్వి సం
భావిత వాక్య పద్ధతులఁ బల్కుచు నిట్లనెఁ బేర్మితోడ నో
దేవతలార! ప్రాణులకుఁ దెక్కలి మృత్యు భయంబు పూనుటే
భావములం దలంపరు కృపామతి నెన్నఁడు మీ మనంబులన్‌.
352
ఆ. ఎలమి బ్రతుక నిచ్చయించిన వారికి, దేహ మెల్లభంగి దీపు గాదె?
యచ్యుతుండు వచ్చి యర్థించె నేనియు, తన్ను నిచ్చునట్టి దాత గలఁడె?
353
వ. అదియునుం గాక. 354
సీ. అర్థంబు వేఁడెడు నర్థులు గలరు గా కంగంబు వేఁడెడి యర్థి గలఁడె?
తగఁ గోరికల నిచ్చు దానశీలుఁడు గల్గుఁ దన దేహ మీ నేర్చు దాత గలఁడె?
యీ నేర్చువాఁడు దన్నిచ్చిన రోయక చంపెడునట్టి యాచకుఁడు గలఁడె?
చంపియుఁ బోవక శల్యంబు లన్నియు నేఱి పంచుక పోవువారు గలరె?
 
ఆ. రమణ లోకమెల్ల రక్షించు వారికి, హింస సేయుబుద్ధి యెట్టు వొడమె?
బ్రాఁతి యైనయట్టి ప్రాణంబుపైఁ దీపు, తమకుఁ బోలె నెదిరిఁ దలఁప వలదె?
355
వ. అనిన దేవత లిట్లనిరి. 356
తే. సర్వ భూతదయాపర స్వాంతులకును, బుణ్యవర్తను లగు మిమ్ముబోఁటి వారి
కమిత సత్కీర్తి కాముల కలఘుమతుల, కియ్యరాని పదార్థంబు లెవ్వి గలవు?
357
ఆ. అడుగరాని సొమ్ము లడుగ రాదని మానఁ, డడుగువాని మాట లడుగ నేల?
భ్రాంతి నడుగుచోటఁ బ్రాణంబు లేనియు, నిచ్చువాఁడు దాపఁ డిచ్చుఁగాని.
358
వ. అని పరసంకటంబు దలంపక నిలింపులు కార్యపరత సవినయ వాక్యపరంపరలం బ్రార్థించిన, నతండు దరహసితవదనుండై, యఖిల లోకధర్మం బెఱింగియు నొక్కింత కాలంబు ప్రతివాక్యం బిచ్చితి, దీని సహింపందగుదురు; మీ యట్టి వారలకుం బ్రియంబగునేని నెప్పుడైన న్విడువందగిన శరీరంబు విడుచుట యేమి దుర్లభంబు? అధ్రువంబైన యీ దేహంబుచేతం గీర్తి సుకృతంబుల నెవ్వం డార్జింపకుండు నతండు పాషాణాదులకంటె నతి కఠినుండు; మీ యట్టి పుణ్యశ్లోకులచేత నాకాంక్షింపబడిన యీ శరీరం బప్రమేయ ధర్మార్జితంబు; ఏ దేహంబుచేతనైనను సకలభూతంబులు శోకానుభవంబున శోకించు, హర్షానుభవంబున హర్షించునట్టి మహాకష్టదైన్యాకరంబైన యీ శరీరంబు కాక శునక సృగాలాదులపాలు గాకుండ మే లయ్యె’ అని నిశ్చితాత్ముండై దధీచి, తత్త్వావలోకనంబుచేత నిరసితబంధనుండై, బుద్ధీంద్రియ మానసంబులతోఁగూడిన క్షేత్రజ్ఞుని పరబ్రహ్మ స్వరూపంబైన భగవంతునందు నేకీభూతంబుఁ జేసి, యోగజ్ఞానంబున శరీరంబు విడిచె; అప్పుడింద్రుఁ డతని శల్యంబుల విశ్వకర్మ నిర్మితంబై, నిశిత శతధారా సమావృతంబై వెలుంగు వజ్రాయుధంబు గైకొని, భగవత్తేజోపబృంహితుండై, యైరావతారూఢుండై, సకలదేవోత్తమ గరుడ గంధర్వ ఖచర కిన్నర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర పరిసేవితుండై, సకల మునిజనంబులు వినుతింపఁ ద్రిలోకహర్షకారియై, భగవదనుగ్రహ సంప్రాప్త మహోత్సాహ వికసిత వదనారవిందుండై వృత్రాసురుపై నడచె; అప్పుడు. 359
ఉ. వృత్రుఁడు దానవాన్వయ పవిత్రుఁడు లోక జిఘాంసకక్రియా
సూత్రుఁడు నిగ్రహాగ్రహణ సుస్థిరవాక్య వివేకమాన చా
రిత్రుఁడు దేవతోరగదరీకృతవక్త్రుఁడు రోషదూషితా
మిత్రుఁడు శత్రురాకఁ గని మిక్కిలియైన యుగాంతకాకృతిన్‌.
360
క. మెండు గల దనుజ నాయక, మండలములు గొల్వ నడచె మహిమోద్ధతి వే
దండముల నడుమఁ జను నడ, గొండయునుం బోలె నిబిడ కోపోద్ధతుఁడై.
361
క. కాలగళుఁ డడరి కడువడిఁ, గాలుని పైఁ గవయు మాడ్కి ఖరతర రవ సం
చాలిత పూర్వ దిగంతరుఁ, డై లీల మహేంద్రుమీఁద నతఁ డరిగె నృపా!
362
వ. ఇట్లు రుద్రగణంబులు, మరుద్గణంబులు, నాదిత్యగణంబులు, నశ్వినీదేవతలు, పితృదేవతలు, విశ్వేదేవులు, వహ్నియు; యమ, నైరృతి, వరుణ, వాయు, కుబే, రేశానాదులు; సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, ఖేచర, ప్రముఖంబులగు నింద్ర సైన్యంబులతోడ నముచియు, శంబరుండును, ననర్వుండును, ద్విమూర్ధుండును, వృషభుండును, నంబరుండును, హయగ్రీవుండును, శంకుశిరుండును, విప్రచిత్తియు, నయోముఖుండును, పులోముండును, వృషపర్వుండును, హేతియు, ప్రహేతియు, నుత్కటుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, కపిలుండును, విభావసుండును, నిల్వలుండును, పల్వలుండును, దందశూకుండును, వృషధ్వజుండును, గాలనాభుండును, మహానాభుండును, భూత సంతాపనుండును, వృకుండును, సుమాలియు, మాలియు మున్నగు దైతేయ దానవ యక్షరాక్షసా ద్యసంఖ్యంబులగు వృత్రాసురుబలంబులు దలపడి సమరంబుం జేసిరి. అప్పుడు. 363
చ. అసురులకున్‌ సురావలికి నయ్యె మహారణ మప్పు డొండొరుల్‌
ముసల గదాసి కుంత శర ముద్గర తోమర భిండివాల ప
ట్టస పటుశూల చక్రముల డంబము చూపి యదల్చి యార్చుచున్‌
మసలక కప్పి రస్త్రముల మార్కొని మంటలు మింట నంటఁగన్‌.
364
క. ఒండొరులఁ గడవ నేసిన, కాండము లాకాశపథముఁ గప్పి మహోల్కా
దండములఁ బోలి నిష్ఠుర, భండన ముఖ మొప్పెఁ జూడఁ బ్రళయోచితమై.
365
చ. సురవరు లేయు బాణములు సూడ్కి కగోచరమై నభస్స్థలం
బరిమురిఁ గప్పి రేసి దివసాంతముఁ జేసిన లీల నాసురే
శ్వర బలయూధ వీరు లురుసాయకపంక్తులచేత వాని రూ
పఱ శతధూళి సేసి పఱపైన తమం బొనరించి రార్చుచున్‌.
366
చ. సమరమదాంధులై సురనిశాచరవీరులు సైనికాంఘ్రి సం
క్రమిత మహీపరాగములు గ్రమ్మిన నుమ్మలికంపుఁ జీఁకటుల్‌
దమ కనుదోయి కడ్డముగఁ దార్కొనినం జలమూఁది పోరి రా
క్రమిత నిజాంతరంగ పరిఘట్టిత రోషమహాగ్ని పెంవునన్‌.
367
క. అతిగళిత రక్తధారా, క్షతములతోఁ గానఁబడిరి సైనికులు మహో
ద్ధత రోషవహ్నికీలలు, వితతంబై పిక్కటిల్లి వెడలెడు భంగిన్‌.
368
సీ. ఠవణించు శింజినీటంకారరవములు భటసింహనాదంబుఁ బరిఢవింప
భీషణోత్తమ హయహేషావిఘోషంబు కరి బృంహిత స్ఫూర్తిఁ గ్రందుకొలుప
సమర నిశ్శంకాంక శంఖనినాదంబు నేమిస్వనంబుల నిహ్నవింపఁ
దుములమై చెలఁగెడు దుందుభిధ్వానంబు లట్టహాసంబుల నాక్రమింప
 
తే. ఘటిత శస్త్రాస్త్ర నిష్ఠుర ఘట్టనోత్థ, ఖర కఠో రోరు విస్ఫులింగంబు లడరి
దివ్య కోటీర మణిఘృణి ధిక్కరింప, సమర మొనరించి రసురులు నమరవరులు.
369
వ. ఇట్లు ప్రళయసంరంభ విజృంభిత సముత్తుంగ రంగత్తరంగిత భైరవారావ నిష్ఠ్యూత నిష్ఠుర మహార్ణవంబునుం బోలె, యుగాంతర సంక్రాంత ఝంఝాపవన పరికంపిత దీర్ఘ నిర్ఘాత నిబిడ నిష్ఠుర నీరదంబులుం బోలె, నుభయసైన్యంబులుం గలసి సంకులసమరంబు సలుపు సమయంబున, యుగాంత కృతాంత సకలప్రాణి సంహార కారణలీలయుంబోలెఁ, బదాతి రాహుత్త గజారోహక రథిక మహారథిక వీరు లొండొరులు చండగతిం గాండంబులుఁ బఱపుచుఁ గదలం జదుపుచుఁ, గత్తులఁ గత్తళంబులఁ జినుఁగం బొడుచుచు, నడిదంబుల నడఁచుచుఁ, గుంతంబులం గ్రుచ్చుచుఁ, గుఠారంబుల వ్రచ్చుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులం బాఁదుచుఁ, జక్రంబులం ద్రుంచుచు, సబళంబుల నొంచుచు, సురియల మెఱముచుఁ, శూలంబులఁ దుఱుముచు, వాజుల కుఱికియు, వాలంబుల నఱికియుఁ, దొడలు తుండించియుఁ, దొండంబుల ఖండించియు, మెడ లెడయించియు, మొదళ్ళు గెడయించియు, నడుములు ద్రుంచియు, నాసికలుఁ ద్రెంచియుఁ, బదంబులు విఱిచియుఁ, బార్శ్వంబులం జెఱిచియు, గజంబులఁ బఱిపియు, గాత్రంబుల నుఱిపియుఁ, గుంభంబులఁ బగిలించియుఁ, గొమ్ముల నగిలించియు, హస్తంబులఁ ద్రెంచియు, నంగంబులఁ జించియు, రథంబుల నలియించియు, రథికులం బొలియించియు, సారథులం జంపియు, సైంధవులం దంపియు, శిరంబులు నొగిలించియు, సీసకంబు లగిలించియు, ఛత్రములం దుఱుమాడియుఁ, జామరంబులం దునుమాడియు, సైన్యంబులఁ జదిపియు, సాహసుల మెదిపియు, నడుములు ద్రుంచియు మఱియును బరస్పర గుణవిచ్ఛేదనంబును, నన్యోన్య కోదండ ఖండన పటుత్వంబులు, నుభయ సైంధవ ధ్వజ సారథి రథిక రథ వికలనంబును, నొండొరుల పాద జాను జంఘా హస్త మస్తక నిర్దళనంబును, రక్తమాంసమేదః పంకసంకలిత సమరాంగణంబునై యతిఘోర భంగిం బెనంగిరి, అప్పుడు. 370
చ. సమజయమున్‌ సమాపజయ సామ్య పరిశ్రమమున్‌ సమోరు వి
క్రమము సమాస్త్రశస్త్రబల గర్వమునై కడుఘోరభంగి నా
నముచివిరోధి సైన్య గణనాథులతోడ నిశాచరేశ్వ రో
త్తములు దురంబు సేసి రొగిఁ దార్కొని వృత్రుబలంబు ప్రాపునన్‌.
371
వ. అప్పుడు. 372
లయగ్రాహి. మొత్తముగఁ బాఱు పెనునెత్తురు మహానదులఁ, దత్తఱముతో నుఱికి కుత్తుకలు మోవన్‌
జిత్తముల నుబ్బి వెస నెత్తుకొను భూతముల, నత్తుకొని శాకినులు జొత్తిలెడి మాంసం
బుత్తలముతో మెసఁగి నృత్తములు సేయు మద, మత్తఘన డాకినులు నృత్తగతిఁ బ్రేవుల్‌
బిత్తరములం దిగిచి మెత్తమెదడుల్‌ మొనసి, గుత్తగొనుచుండ భయవృత్తిఁ గల నొప్పెన్‌.
373
వ. ఇట్లు దేవదానవులు నర్మదాతీరంబునఁ గృతయుగంబునం దలపడి, త్రేతాయుగంబుఁ జొచ్చునంత కాలంబుఁ బోరు దారుణంబుగాఁ జేయుచుండ, నంత వృత్రాసురు భుజబలంబు పెంపునఁ దెంపుఁజేసి కంపింపక నిలింపులపై రక్కసులు గుంపులై సొంపుపెంపు చూపి, మహావృక్ష పాషాణ గిరిశిఖరంబులు వర్షించిన. 374
మ. గిరి పాషాణ మహీజముల్‌ గురియఁగా గీర్వాణు లన్నింటి ని
ష్ఠుర నారాచపరంపరల్‌ పఱపుచున్‌ జూర్ణంబుఁ గావింప ని
ర్భరలీలం దమచేయు సత్త్వములు దోర్భంగంబులై పోవఁగాఁ
దెరలెన్‌ రాక్షస యోధవీరుల మదోద్రేకంబు సంఛిన్నమై.
375
క. ప్రచురముగ రాక్షసావళి, ఖచరులపై నేయు నిబిడకాండావళి దు
ర్వచనుఁ డెడ నాడు మాటలు, సుచరిత్రుని యందుఁ బోలెఁ జొరవయ్యె నృపా!
376
వ. అప్పుడు. 377
వనమయూరము. అంత సురలేయు నిబిడాస్త్రములపాలై, పంతములు దక్కి హతపౌరుషముతో ని
శ్చింతగతి రక్కసులు సిగ్గుడిగి భూమిం, గంతుగొని పాఱి రపకారపరు లార్వన్‌.
378
క. కొండలఁ బోలెడు రక్కసు, లొండొరులం గడవఁ బాఱి రుక్కఱి పటు కో
దండముఖ సాధనంబులు, భండనమున వైచి దివిజపతు లార్వంగన్‌.
379
వ. ఇట్లు సమరతలంబు వాసి తన ప్రాపు మాసి, తీసి పఱచుచుండు దండనాయకులం జూచి, యకుటిలమతిం బకబక నగి, వృత్రాసురుం డిట్లనియె. 380
ఉ. క్షుల్లకవృత్తి మీ కగునె? శూరుల కిమ్మెయి కీర్తి భోగముల్‌
గిల్లగఁ జేయు చావు మదిఁ గోరినవారల కైనఁ గల్గునే?
తల్లడ మంది యీ సమరధర్మము మాని తలంగఁ బాడియే?
మల్లుఁడు దుర్దమ ప్రథనమత్తుని వృత్రుని ప్రాపెఱుంగరే?
381
క. చావు ధ్రువమైన ప్రాణికిఁ, జావులు రెం డరసికొనుఁడు సమరమునందున్‌
భావింప యోగమందును, జావంగా లేని చెడుగుచావుం జావే?
382
వ. అని వాసుదేవ తేజోవిశేషవిశేషితులై దావానలకీలలంబోలె వెలుంగుచు వెఱచి వెన్నిచ్చి పాఱెడు నసురుల వెనుకొని తఱుము సురవీరులం జూచి హుంకరించి, స్వర్గానుభవంబున నిచ్ఛలేకుండె నేని మదవలోకన స్పర్శనమాత్రంబు ముందర నిలుతురుగాక అని యేచి కల్పాంతానల్ప ఘనఘనాటోపంబునుం బోలెఁ గఠోర కంఠ హుంకార తర్జనంబులం గర్జిల్లుచుఁ, బ్రళయకాల పవనపరిభాసిత మహాశిఖి శిఖావళులం దృణీకరించు కుటిలావలోకనంబుల నాలోకించుచుం, గాల పరిపక్వ లీలాలోలుండైన శూలిపోలిక నాభీలమూర్తియై సకల జీవభార భరణ దుర్భర భగ్న బ్రహ్మాండ భాండ మహాధ్వానంబు భంగి నాస్ఫోటించిన. 383
ఉ. కూడె జగంబు లన్నియును గ్రుంకిరి సూర్య సుధాంశు; లద్రు లూ
టాడె, నభస్స్థలం బగిలె, నంబుధు లింకె, నుడుగ్రహాళి ప
ట్టూడె, వడిం దిశల్వగిలె, నుర్వర గ్రుంగె, నజాండభాండ మ
ల్లాడె, విధాత బెగ్గడిలె నార్చుచు వృత్రుఁడు బొబ్బవెట్టినన్‌.
384
లయగ్రాహి. కూలిరి వియచ్చరులు, సోలిరి దిశాధిపులు, వ్రాలి రమరవ్రజము, దూలి రురగేంద్రుల్‌,
ప్రేలిరి మరుద్గణము, జాలిగొని రశ్వినులు, కాలుడిగి రుద్రు లవలీలఁ బడి రార్తిన్‌
వ్రేలిరి దినేశ్వరులు, కీ లెడలి నట్లు సుర, జాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలిధనువు ల్విడిచి, నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!
385
వ. ఇట్లు కఠోర కంఠనాదం బొనర్చిన నశనిపాతంబునం గూలు ప్రాణిచయంబు భంగి నంగంబు లెఱుంగక రణరంగంబునం బడి మూర్ఛిల్లిన, దివిజరాజసైన్యంబుల వృత్రాసురుండు సంగరరంగ దుర్దముండై మహీవలయంబు పదాహతంబుల గజగజ వడంక, నిశితశూలంబు కేల నంకింపుచు, మదించిన భద్రమాతంగంబు కమలవనంబు సొచ్చి, మట్టిమల్లాడు విధంబున నిమీలితాక్షుండగుచుఁ, బదతలంబుల రూపంబులు మాయం జమురుచు, వెక్కసంబుగఁ గ్రీడించు వానింగని వజ్రి వజ్రశతోపమ నిష్ఠురగదాదండం బాభీలభంగిఁ బ్రళయకాలమార్తాండ చండపరివేషఘోరంబుగాఁ ద్రిప్పి వైచిన. 386
మ. అది మింటం బెనుమంట లంటఁ బఱపై యాభీల వేగంబునన్‌
గదియన్‌ వచ్చిన లీల వామకరసంక్రాంతంబు గావించె బె
ట్టిదుఁడై చేరి సురారి దానిఁ గొని కాఠిన్యోరుపాతంబులం
జదియన్‌ మోఁదె గజేంద్రమస్తకము నుత్సాహైకసాహాయ్యుఁడై.
387
ఆ. అగ్గజంబు కులిశహతిఁ గూలు కులమహీ, ధ్రంబు వోలె రక్తధార లురల
మస్తకంబు పగిలి మదమఱి జిర జిర, తిరిగి విఱుగు సూపి తెరలి పఱచె.
388
ఉత్సాహవృత్తము. గజము దెరలి దాని కొఱలి గర్జ లిడుచుఁ బాఱఁగా
భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్‌
నిజసుధారసైకపాన నిర్ణయార్ద్ర కరమునన్‌
ఋజుత మీఱ నిమిరె నపుడు రీతి మెఱసి క్రమ్మఱన్‌.
389
వ. ఇ వ్విధంబున నైరావతంబును సేదదేర్చుచు, నెదుర నిలుచున్న భిదుర పాణింగని, తోఁబుట్టువుం జంపిన తెంపు దలంచి, మోహశోకంబున విపర్యాసంబుగా నవ్వుచు నాహవకామ్యార్థియై వృత్రుం డిట్లనియె. 390
శా. నాకుం బెద్దయు నీకు సద్గురువు దీనవ్రాతరక్షున్‌ శుభా
లోకుం జంపితి విట్లు పాపమతివై లోభంబుతో ని య్యెడన్‌
లోకుల్‌ నవ్వఁగ మద్భుజాపటిమకున్‌ లోనైతి వీ శూలమం
దాకంపింపఁగ నిన్నుఁగ్రుచ్చి ఋణముక్తాత్ముండనై పేర్చెదన్‌.
391
క. ఎట్టి తులు వైనఁ గానీ, నెట్టనఁ దన బ్రతుకు కొఱకు నీవలె గురువుం
జుట్టమునుఁ బుణ్యు బ్రాహ్మణుఁ, బట్టి వధింపంగఁ గలఁడె? పశువుంబోలెన్‌.
392
చ. దయయును సత్యమున్‌ విడిచి ధర్మము మాని యశంబుఁ బాసి శ్రీ
జయములఁ బాఱఁదోలి పురుషత్వము గానక లోకనిందితా
హ్వయుఁ డగువాని చావునకు నార్యులు గుందుదురే? సృగాలముల్‌
ప్రియమున నంటునే శవముఁ? బ్రేలక చేరునె? కంక గృధ్రముల్‌.
393
క. నిక్కమగు పాపములచేఁ, జిక్కితివి నిశాత శూల శిఖరాగ్రమునన్‌
మ్రక్కించి నీదు మాంసము, నక్కలుఁ గుక్కలును జేరి నమలఁగఁ జేతున్‌.
394
ఉ. దీకొని నీకు నేఁ డిచట దిక్కని వచ్చిన వారు గల్గిరే
నేకమతిం బిశాచముల కెల్లను దృప్తిగ మన్నిశాత శూ
లైక మహాగ్నికీలల ననేకవిధంబుల సోమయాజి నై
మేకలఁ జేసి వేల్చెద నమేయమదోద్ధతి వ్రాలి యియ్యనిన్‌.
395
క. కాక ననుఁ గులిశధారల, దీకొని నిర్జింపఁ గలిగి తేనియు భూతో
ద్రేకంబు సేసి శూరుల, ప్రాకట పదపద్మధూళి భాగం బగుదున్‌.
396
సీ. సందేహ మేటికి జంభారి! వేవేగ భిదురంబు వ్రేయు మాభీలభంగి
నతిలోభి నడిగిన యర్థరాశియుఁబోలెఁ గడపకు మిది వృథ గాదు సుమ్ము,
మురమర్దనుని తేజమున నా దధీచి వీర్యాతిశయంబుల నధికమైన
యదిగాన హరిచే నియంత్రితోన్నతుఁడ వై గెలువుము శత్రుల గీ టడంచి
 
ఆ. యెందు గలఁడు విష్ణుఁ డందు జయశ్రీలు, పొందు గాఁగ వచ్చి పొందుచుండుఁ,
గాన భక్తవరదుఁ గమలాక్షు సర్వేశు పదములందు మనము పదిలపఱుతు.
397
వ. ఇట్లు వజ్రధారలం ద్రెంపఁబడిన విషయ భోగంబులు గల వాఁడనై శరీరంబు విడిచి, భగవ ద్ధామంబునుం బొందెద; నారాయణుని దాసుండ నైన నాకు స్వర్గమర్త్య పాతాళంబులం గల సంపద్భోగంబులు నిచ్ఛయింపఁబడవు; త్రైవర్గికాయాసరహితంబైన మహైశ్వర్యంబు ప్రసాదించుం గావున ననుపమేయం బైన భగవత్ప్రసాదం బన్యుల కగోచరంబు; అ ద్దేవుని పాదైకమూలంబుగా నుండు దాసులకు దాసానుదాసుండనై యున్నవాఁడ అని యప్పరమేశు నుద్దేశించి. 398
చ. అరయఁగ భక్తపాలనము లైన భవచ్చరితంబు లాత్మసం
స్మరణము సేయ వాక్కు నిను సన్నుతి సేయ శరీర మెల్లఁ గిం
కరపరివృత్తి సేయ మదిఁ గాంక్ష యొనర్చెదఁ గాని యొల్ల నే
నరిది ధ్రువోన్నతస్థలము నబ్జజుపట్టము నింద్రభోగమున్‌.
399
ఉ. ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీఁకలు రాని పక్షులుం
దీకొని తల్లికిన్‌ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో
శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే!
400
క. నాకును సఖ్యము పుణ్య, శ్లోకులతోఁగాని తత్త్వశూన్యులు సంసా
రైక విమోహులతోడం, గాకుండ నొనర్పు మయ్య! కంజదళాక్షా!
401
మహాస్రగ్ధర. హరి పై సర్వాత్ముపై నత్యగణితగుణుపై నంతరంగంబు పర్వన్‌
సరిమే నుప్పొంగఁ జావుం జయమును సరిగా సంతసం బందుచుం భీ
కరుఁడై కాలాగ్నివోలెన్‌ గనలుచుఁ గవిసెన్‌ గర్వదుర్వారుఁడై దు
ర్భరలీలం భూమి గంపింపఁగ దిశ లద్రువన్‌ భండనోద్దండవృత్తిన్‌.
402
క. దొరకొని ప్రళయోదకమున, హరిపైఁ గైటభుఁడు గవియు హంకారమునన్‌
సురనాథు మీఁద వృత్రా, సురుఁడు మదోద్వృత్తి నడచె శూలాయుధుఁడై.
403
శా. కల్పాంతాగ్నియుఁబోలె నుల్క లెగయంగా ద్రిప్పుచున్‌ దీన నో
యల్పా! చావు మటంచు శూలము రయంబారంగఁ బై వైచినం
బోల్పం గోటిరవిప్రకాశత దివిం బోవంగ వీక్షించి యా
వేల్పుల్పొంగఁగ వజ్రధారఁ దునిమెన్‌ విన్నాణ మొప్పారఁగన్‌.
404
ఆ. శూల మప్పు డతఁడు స్రుక్కఁగ ఖండించి, పూని తోన కదిసి భుజముఁ ద్రుంచె,
నసుర గనలి యేకహస్తుఁడై పరిఘంబు, గొని మహేంద్రుఁ గిట్టి హనువు లడిచె.
405
వ. ఇట్లు ప్రళయకాల భీషణ పరివేష పోషంబుగా రోషంబునం బరిఘంబు ద్రిప్పి, కుప్పించి, గజ కుంభస్థలంబు భగ్నంబు సేసి యింద్రు హనుప్రదేశంబును నిష్ఠురాహతి నొప్పించిన. 406
క. గజము మద ముడిగి తిరుగుచు, గుజగుజనై గీఁకవెట్టఁ గులిశము నేలన్‌
భజన చెడి విడిచె నింద్రుఁడు, గజిబిజితో బెగడె నసురకడిమి జగంబుల్‌.
407
క. గరుడుఁడు వొదివిన నాగము, కరణిన్‌ వృత్రాసురేంద్రు కడిమికి లోనై
తిరుగుడు వడ్డ హరిం గని, పురపుర నాహా! యటంచుఁ బొగిలె జగంబుల్‌.
408
వ. అప్పుడు. 409
తే. గజముపాటుఁ జూచి కడుదీనగతిఁ జూచి, పవి కరంబుజాఱిపడుటఁ జూచి
యుద్ధధర్మ మెఱిఁగి యున్న శత్రునిఁ జూచి, సిగ్గుతోడ వజ్రి శిరము వంచె.
410
వ. ఇట్లు యుద్ధంబున శత్రుసన్నిధిం గరంబు జాఱిపడిన వజ్రంబుఁ బుచ్చికొనక నివ్వెఱపడి, లజ్జించి యున్న పాకశాసనుంజూచి వృత్రుం డిట్లనియె. 411
క. దురమునఁ గైదువు వదలిన, శరణన్నను వైరిజనులఁ జంపము మది ని
వ్వెఱఁగొందనేల? కులిశము, కర మరుదుగఁ బుచ్చికొనుము కాచితి నింద్రా!
412
సీ. వజ్రంబు గైకొని వైరి నిర్జింపు, మి ట్లడలంగ వేళగా దమరనాథ!
యరయ దేహాధీనులైన మూర్తుల కెల్ల నీశు లక్ష్మీశు సర్వేశుఁ బాసి
కడతేఱ జయములు గల్గునె యెందైనఁ దలపోసి చూడుమా! తత్త్వదృష్టి
నీ లోకపాలురు నెవ్వని వశగతి వలఁ బడ్డ పక్షుల వర్తనమునఁ
 
తే. జిక్కి చేష్టలు సేయుచుఁ జింతసేతు, రట్టి మృత్యు బలంబుల నాత్మజయము
తమదిగాఁ గోరి యజ్ఞానతంత్రు లగుచుఁ, గమలలోచను లీలావికారములను.
413
తే. మెఱయ యంత్రమయం బైన మృగముభంగి, దారునిర్మిత మైనట్టి తరుణిపోల్కి
శక్ర! యెఱుఁగుమ యీ భూతజాల మెల్ల, దళిత పంకేరుహాక్షు తంత్రంబు గాఁగ.
414
వ. మఱియు భూతంబులచేతను, నింద్రియంబుల చేతను నవశుండైన పురుషుండు ప్రకృతిచేత వేఱుచేయబడిన యాత్మం బరమేశ్వరానుగ్రహంబు వాసి సుఖియించుచుండు. అవిద్వాంసుండైన వాఁ డనవరతంబుఁ దన్ను స్వతంత్రునిఁగాఁ దలంపుచుండు; భూతంబుల వలన భూతంబులుం బుట్టుచుండు; ఆ భూతంబులు భూతంబులచేత భక్షింపఁ బడుచుండు; పురుషున కాయువు, శ్రీయును, గీర్తియు, నైశ్వర్యంబును మొదలయినవి యనుభవింప నెంతకాలంబు ప్రాప్తం బంతకాలంబు నివసించు. ఆ ప్రాప్తంబు దీఱినఁ బురుషుండు జాలిం బొందిన నవి యుండక పోవుచుండు; కావున గుణంబును, నవగుణంబును, గీర్త్యపకీర్తులును, జయాపజయంబులును, సుఖదుఃఖంబులును, జావు బ్రతుకులును సమంబులై కలుగుచుండు; అజ్ఞానియైన వానికి సత్త్వరజస్తమో గుణంబులు గలిగియుండు. అట్టివానికి గుణమయంబులైన యింద్రియాదులే యాత్మయని తోఁచుచునుండు; కావున వాఁ డా గుణంబులచేత బద్ధుండగు; ఆ గుణంబులకు సాక్షిమాత్రం బైన శరీరంబు వేరని యెవ్వం డెఱుంగనోపు, వాఁ డా గుణంబులచేత బద్ధుండు కాఁడు; కావున గుణంబులును; గుణియును; భోక్తయును, భోగ్యంబును; జయంబు నపజయంబును, హర్తయును హన్యంబును; నుత్పత్తిస్థితి లయకర్తయై, సర్వోత్కృష్టుండైన యప్పరమేశ్వరుండే కాని యన్యంబు లేదు; ఇప్పుడొక్క హస్తంబు నాయుధంబును బోయినను భవత్ప్రా ణాపహరణంబునకు సమర్థుండ నగుచున్న నన్నుం జూడుము అని వృత్రాసురుండు మఱియు నిట్లనియె. 415
తే. వాహనంబులు సారెలు వాఁడిశరము, లూర్జి తాక్షము లసువులు నొడ్డణములు
గాఁగఁ బోరెడు నీ ద్యూతకర్మమందు, నెసఁగ జయమును నపజయ మెవ్వఁ డెఱుఁగు?
416
చ. అనవుడు వృత్రుమాటలకు నద్భుత మంది సురేంద్రుఁ డెంతయుం
దనమదిఁ గుత్సితం బుడిగి దైవముగా నతనిన్‌ తలంచి కై
కొనియెఁ గరంబునం దిగువఁ గూలిన వజ్రము, నప్పుడాత్మలోఁ
దనరె జగంబు లన్నియు, ముదంబును బొందిరి ఖేచరావళుల్‌.
417
క. రాహుగ్రహ వక్త్ర మహా, గేహాంతము వాసి వచ్చి కిరణావళి స
ద్బాహుళ్య మొప్ప వెలిగెఁడు, నా హరిదశ్వుండు వోలె హరి యొప్పె నృపా!
418
వ. ఇట్లు కరకలిత వజ్రాయుధ రుఙ్మండల మండిత దిఙ్మండలుండై జంభారి గంభీర వాక్యంబుల విస్మయ మందస్మిత ముఖారవిందుండై వృత్రున కిట్లనియె. 419
క. ఓ దానవేంద్ర! నీ మతి, వేదాంతము వోలె తత్త్వ విజ్ఞాన కళా
మోదము, నీ వతిభక్తుఁడ, వాదిమ పురుషునకు హరికి నబ్జాక్షునకున్‌.
420
ఉ. లోకములెల్ల నిండి తన లోనుగ సర్వముఁజేసి ప్రాణులన్‌
దీకులఁ బెట్టి యెల్లెడలఁ దీపులు సూపెడి విష్ణుమాయ నేఁ
డేకమతిం దలంచి తిది యేల? మహాసురురూపుమాని సు
శ్లోకు పురాణపూరుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్‌.
421
ఉ. ఏ నియమంబు సల్పితివొ! యెట్టి మహాతప మాచరించితో
పూని రజోగుణాభిరతిఁ బొందిన నీ మతి శాంత దాంత స
న్మానస మానసానుభవ మత్తమరాళు నరోష భావ స
న్మాను నమేయు నా దనుజమర్దను భక్తి పొసంగె నెంతయున్‌.
422
క. నారాయణ రూపామృత, పారావారమునఁ దేలు భక్తుఁడు దా భూ
దారకృత ఖాత కోదక, పూరంబుల నేల తృప్తిఁ బొందు? మహాత్మా!
423
వ. ఇట్లు పలుకుచున్న యింద్రు నుపలక్షించి, వృత్రాసురుం డాయోధన దుర్మర్షణ సంఘర్షమాణ మానసుండై వైరిం బురికొల్పుకొని, వామహస్తంబునఁ బరిఘంబు ద్రిప్పుచు, మత్సరంబునం గుప్పించుచు, బ్రహ్మాండకర్పరంబు నిష్ఠుర భైరవారావంబునం బగిలించుచు, సముత్తుంగమత్తమాతంగపుంగవంబు వృషభంబుపైఁ గదియు భంగి సురవృషభు పేరుర ముపలక్షించి, భీషణాశనినిపాతవేగంబునఁ గొట్టిన, నింద్రుండు కులిశధార నప్పరిఘంబుఁ దునిమి, తోడనే శేషఫణావిశేషభాసురం బైన బాహు దండంబు ఖండించె; అప్పుడు వృత్రుండు భిన్న బాహుద్వయుండై, రక్తధారలం దోఁగుచు వజ్రిచేతఁ బక్షహతంబై దివంబుననుండి జాఱుచున్న కులపర్వతంబునుంబోలెఁ జూపట్టి, ప్రళయకాల సంహార నిటలచ్ఛటచ్ఛ టార్భట కఠోర కీలాభీలాగ్ని సమాన క్రూర కుటిల నిరీక్షణ దుర్నిరీక్షుండై భూనభోమండలంబులఁ గ్రింది మీఁది దౌడల హత్తించి, నభోమండలంబునుం బోలెఁ దుది మొద లెఱుంగరాక, వికృతంబుగా వక్త్రంబు దెఱచి, మందర మథన మథ్యమాన విషధరజనిత విష విషమ జిహ్వాభీలం బగు నాలుక నభంబు నాకుచుఁ గాలసంహారకారణుండైన కాలుని భుజదండమండితంబగు దండంబునుం బోని దంష్ట్రలచేత జగత్త్రయంబును మ్రింగెడు వానింబోలె నతిమాత్ర మహాకాయుండై, పర్వతంబులం దలంగ మీటుచు, నడగొండయుంబోలె నభోభాగ భూభాగంబుల నాక్రమించి యప్పుడు. 424
ఉ. కాలమునాఁటి మృత్యువుముఖంబునఁ బోలెను విస్ఫులింగముల్‌
గ్రాలఁగ దేవసంఘములు కంపమునొంద జగంబులెల్ల నా
హా లులి తారవం బెసఁగ నభ్రగజంబును నాయుధంబుతో
నాలుకఁ జుట్టి పట్టి సురనాథుని మ్రింగె మహాద్భుతాకృతిన్‌.
425
ఆ. లోకమెల్ల నపుడు చీకాకు పడెఁ దమం, బడరె నుడుగణంబు లవనిఁ బడియె,
సోనవానఁ గురిసె సూర్యచంద్రాగ్నుల, రశ్ము లుడిగె దిశలు రభస మయ్యె.
426
వ. అప్పుడు. 427
ఉ. కందఁడు భీతిఁ గుందఁడు ప్రకంపన మొందఁడు పెద్దనిద్దురం
జెందఁడు దత్తఱింపఁడు విశేషము చెప్పఁడు వైష్ణవీ జయా
నందపరైక విద్యను మనంబునఁ దాల్పుచు నుండెఁగాని సం
క్రందనుఁ డానిశాచరుని గర్భములో హరిరక్షితాంగుఁడై.
428
వ. ఇట్లు కవచరూప శ్రీమన్నారాయణ కృపాపాలితుండై యోగబలంబున బలభేది యతని యుదరంబు వజ్రాయుధంబున భేదించి, యైరావణసహితుం డై వెడలి, యతని కంధరంబు తెగనడువ వజ్రంబు ప్రయోగించిన, నతి నిష్ఠురవేగంబున వృత్రహరణార్థంబుగం దిరుగుచు సూర్యాది గ్రహ నక్షత్రంబులకు దక్షిణోత్తర గతిరూపంబైన సంవత్సర సంధియందు నహోరాత్రమధ్యంబున వృత్రుశిరంబు పర్వత శిఖరంబునుంబోలెఁ ద్రుంచి కూలం ద్రోచె. నప్పుడు. 429
మ. మొరసెం దుందుభు లంబరంబునఁ గడున్‌ మోదించి గంధర్వులున్‌
సురలున్‌ సాధ్యులు సిద్ధులున్‌ మునివరుల్‌ సొంపార వృత్రఘ్ను భీ
కర తేజోవిభవ ప్రకాశకర విఖ్యాతైక మంత్రంబులం
దిర మొప్పం బఠియించుచుం గురిసి రెంతేఁ గ్రొత్త పూ సోనలన్‌.
430
ఆ. ఏమి చెప్ప నప్పు డింద్రారి తనువున, నొక్క దివ్యతేజ ముబ్బి వెడలి
లోకమెల్లఁ జూడ లోకంబు చూడని, లోక మరిగి విష్ణులోను సొచ్చె.
431
వ. ఇట్లు లోకభీకరుం డైన వృత్రాసురుండు గూలిన, నఖిల లోకంబులుఁ బరితాపంబు లుడిగి సుస్థితిం బొందె, దేవ ఋషి పితృగణంబులు దానవులతోడం గూడి, యింద్రునకుం జెప్పక తమ తమ స్థానంబులకుం జనిరి అనిన విని, పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. 432
తే. ఏమి కారణమున నింద్రుతోఁ బలుకక, సురలు వోయి? రట్టి సురగణంబు
లెందుచేత సుఖముఁ జెందిరి? వజ్రికిఁ జేటు గలుగు టెట్లు? చెప్పు మయ్య!
433
వ. అనిన శుకుం డిట్లనియె. వృత్రపరాక్రమ చకితులైన నిఖిలదేవతలును మహర్షిగణంబులును, మున్ను వృత్రవధార్థం బింద్రునిం బ్రార్థించిన, నతండు బ్రహ్మహత్య చేయఁజాలక, తొల్లియు విశ్వరూపునిం జంపిన పాపంబు స్త్రీలయందును, భూమియందును, జలంబులందును, ద్రుమంబులందును విభజించి పెట్టితి, ఇపు డీ హత్య యేరీతిం బాపుకొనువాఁడ? నా కశక్యంబు అనిన మహర్షు లశ్వమేధయజ్ఞంబు సేయించి, యజ్ఞపురుషుండైన శ్రీ నారాయణదేవుని సంతుష్టునిం జేసి, యీ హత్యఁ బాపం గలవారము. స్వభావంబున బ్రాహ్మణ పితృ గో మాతృ సజ్జన హంతలైనవార లే దేవునిం గీర్తించి శుద్ధాత్ము లగుదురు, అద్దేవుని నశ్వమేధ మహామఖంబున శ్రద్ధాన్వితుండవై సేవించిన నీకు ఖలుండైన యి ద్దురాత్ముని హింసించిన హత్య యేమి సేయంగలదు? అని యొడంబఱచిన, నింద్రుండు వల్లెయని యీ విధంబున శత్రునిం బరిమార్చి, బ్రహ్మహత్యం బొంది, యప్పాపంబు భరియింప నోపక దుర్దశం బొందె. నప్పుడు. 434
సీ. పాపంబుఁ జండాలరూపంబు గలదాని ముదిమిచే నొడలెల్లఁ గదలు దానిఁ
క్షయకుష్ఠరోగ సంచయకృతం బగు దాని నురురక్త పూరంబుఁ దొరఁగు దాని
నెరసిన వెండ్రుకల్‌ బెరసిన తలదాని నటఁ బోకుపో కుండు మనెడు దానిఁ
గదురు కంపునఁ బ్రేవు లదరఁ జేసెడుదానిఁ దా నెందుఁ బాఱినఁ దఱుము దాని
 
ఆ. నాగుణంబు లెల్ల భోగింప కేరీతి, నరుగ నెంతవాఁడ వనెడు దాని
బిట్టు దిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో, దేవనాయకుండు దెఱలి పఱచె.
435
వ. ఇ ట్లతి వికృతరూపంబుతో బ్రహ్మహత్య వెనుతగుల నింద్రుండు నభోభాగ భూభాగ దిగ్భాగంబు లెల్లం దిరిగి, చొరం దెరువులేక దీర్ఘ నిర్ఘాతాటోప నిశ్వ్వాస దూషితుండై, యీశాన్య భాగంబునకుం బఱచి, యద్దెస నమేయ పుణ్యగణ్యంబైన మానససరస్సుం బ్రవేశించి, యందు నొక్క కమలనాళంబు సొచ్చి, యందుఁ దంతువులం గలసి, రూపంబు లేక యలబ్ధభోగుండై, బ్రహ్మహత్యావిమోచనంబుఁ జింతించికొనుచు సహస్రవర్షంబు లుండె; ఆ చండాలియు నది పరమేశ్వర దిగ్భాగం బగుటం జేసి యందుం జొరరాక కాచియుండె; అంతకాలంబుఁ ద్రిదివంబున నహుషుండు విద్యాబల తపోబల యోగబలంబులం బాలించుచుండి, సంపదైశ్వర్యమదాంధుండై, యింద్రపత్నిం గోరి, యింద్రుండు వచ్చునందాఁక నాకుం బత్నివి గమ్మనిన, నా శచీదేవియును బృహస్పతి ప్రేరితయై, బ్రహ్మర్షి వాహ్యశిబికంబు నెక్కివచ్చి, నన్ను భోగింపు మనిన, నతం డట్లు చేసి, కుంభసంభవ శాపహతుండై, యజగరయోనియందుఁ బుట్టె. నంత నింద్రుండు బ్రహ్మర్షి గణోపహూతుండై, త్రిదివంబునకు వచ్చె; అంతకాలంబు నారాయణ చరణారవింద ధ్యానపరుండై యుండుటం జేసియు, దిశాధినాయకుండైన శంకరుచేత రక్షింపఁబడ్డవాఁడై యుండుటం జేసియుఁ, ద ద్దోషబలంబు దఱిగి, సహస్రాక్షుం బీడింపలే దయ్యె; నప్పు డింద్రుండు నిజైశ్వర్యంబునుం బొంది, బ్రహ్మర్షి పరివృతుండై, మహిపురుషారాధనంబు చేసి, హయామేధాధ్వరంబునకుం దీక్ష గైకొని, బ్రహ్మర్షులచేత యజనంబు సేయింపఁ బడుచున్న వాఁడై, సర్వదేవతామయుండైన నారాయణుం బరితృప్తుం జేసి, మంచు విరియించు మార్తాండుని చందంబునఁ ద్వాష్ట్ర వధరూప పాపంబును నాశంబు నొందించి, సకల దివిజ యక్ష గంధర్వ సిద్ధ మునిజన సంస్తూయమానుండయి త్రిభువనైశ్వర్య భోగభాగ్యంబులం గైకొనియె; అప్పుడు. 436
చ. సతత మరీచి ముఖ్య మునిసంఘముచేత యథోచితంబుగాఁ
గృత ఘన వాజిమేధమునఁ గేశవు నీశుఁ బురాణ పూరుషున్‌
హితు జగదీశు యజ్ఞపతి నిష్టఫలప్రదు నంతరంగ సం
గతు భజియించి వజ్రి గతకల్మషుఁడై నెగడెన్‌ మహీశ్వరా!
437
సీ. మఱియుఁ బుట్టింపంగ మనసు వెట్టినయట్టి క్రూరకర్మాంభోధి కుంభజుండు
అంగారములు సేయ నాహుతిఁ గన నోపు బహు పాపకానన పావకుండు
కందక దిగమ్రింగి గఱ్ఱునఁ ద్రేపంగఁ గల్మషగరళ గంగాధరుండు
ఘనగుహాంతరములఁ గాలూన నియ్యని కలుష దుస్తర తమోగ్రహవిభుండు
 
ఆ. సకల ముక్తిలోక సామ్రాజ్య సమధిక, సహజ భోగ భాగ్య సంగ్రహైక
కారణాప్రమేయ కంజాక్ష సర్వేశ, కేశవాది నామ కీర్తనంబు.
438
సీ. అఖిల దుఃఖైక సంహారాది కారణం బఖిలార్థ సంచ యాహ్లాదకరము
విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం బనుపమభక్త వర్ణనరతంబు
విబుధహర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు
బ్రహ్మహత్యానేక పాప నిస్తరణంబు గమనీయ సజ్జన కాంక్షితంబు
 
తే. నైన యీ యితిహాసంబు నధికభక్తి, వినఁ జదివిన వ్రాసిన ననుదినంబు
నాయు రారోగ్య విజయభాగ్యాభివృద్ధి, కర్మనాశము సుగతియుఁ గలుగు ననఘ!
439
సీ. నావుడు యోగీంద్ర! నా మనం బీ వృత్రు వివరంబు నీచేత విన్న మొదలు
కడు నద్భుతంబునఁ గళవళం బందెడుఁ, గోరి రజస్తమోగుణములందు
వర్తించు నీ పాపవర్తికి నేరీతి మాధవ పదభక్తి మది వసించె?
సత్త్వ స్వభావులై సమబుద్ధు లై తపో నియమ ప్రయత్నులై నిష్ఠచేత
 
తే. నిర్మలాత్మకు లై నట్టి ధర్మపరుల, కమరులకుఁ బుణ్యమునులకు నంబుజాక్షు
భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన, భక్తి వీనికిఁ బోలె నేర్పాటు గాదు.
440
సీ. భూస్థలిఁ గల రేణువులకన్న దట్టమై కడు నొప్పు జీవసంఘములు గలవు,
ఆ జీవములలోన నరయ ధర్మాయతమతి వసించినవారు మనుజజాతి
యీ మనుష్యులలోనఁ గామంబు లెడఁబాసి మోక్షార్థు లగువారు మొదల నరిది,
మోక్షమార్గం బాత్మమూలంబుగా నుండు వారిలో ముక్తులు లేరు తఱచు
 
తే. ముక్తు లై నట్టి వారిలో యుక్తిఁ దలఁపఁ, జాల దుర్లభుఁ డమిత ప్రశాంతిపరుఁడు
పరమ సుజ్ఞాననిరతుండు భద్రగుణుఁడు, రమణ శ్రీవాసుదేవపరాయణుండు.
441
తే. సకలలోకాపకారి దుస్సంగతుండు, వృత్రుఁ డేక్రియ సుజ్ఞాన నిరతుఁ డయ్యె?
సమరమునఁ బౌరుషంబుచే నమరవిభుని, నెట్టు మెప్పించె? దీని నా కెఱుఁగఁ జెపుమ.
442
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )