| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| వ. | అని పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రు నడిగె నని సూతుండు శౌనకాది మునులకుం జెప్పి, మఱియు నిట్లనియె. అట్లు గజపురవల్లభుండు సంప్రశ్నంబు సేసిన బాదరాయణి హరిస్మరణ శ్రద్ధాపరుండై యిట్లనియె. తొల్లి కృష్ణద్వైపాయన నారద దేవల మహర్షులు నా కెఱింగించిన యితిహాసంబు గలదు దాని నెఱింగించెద. సావధానుండ వై యాకర్ణింపుము అని యిట్లనియె. | 443 |
| చ. |
అమితవిభూతిఁ జాల నమరాధిపుఁ బోలుచు శూరసేన దే శములకు భర్త యై ప్రజలు సంతస మందఁగ సార్వభౌముఁడై క్షమ దన కెల్లకాలమును గామదుహంబుగఁ జిత్రకేతు నా మమునఁ బ్రసిద్ధి కెక్కె గుణమండనుఁ డంచిత కీర్తికాముఁడై. |
444 |
| సీ. |
మానిత తారుణ్య మదనతురంగులు కందర్ప విజయైక ఖడ్గలతలు మదనసమ్మోహన మంత్రాధిదేవతల్ పంచశిలీముఖు బందెకత్తె లసమాస్త్రుఁ డఖిలంబు నడకించు బొమ్మలు నాత్మసంభవుని కట్టాయితములు పుండ్రేక్షుకోదండు భూరితేజంబులు శంబర విద్వేషి సాయకములు |
|
| తే. |
నాఁగఁ బొలుపారు నొకకోటి నళినముఖులు, దనకుఁ బత్నులు గాఁగ నత్యంత విమల కీర్తివైభవ సన్మార్గవర్తి యగుచు, జగతిఁ బాలింపుచుండె నా జనవిభుండు. |
445 |
| తే. |
కలిమి వేవేలు భార్యలు గలిగియుండఁ, బరఁగ సంతతి యొకరునిఁ బడయ లేక చిత్తమునఁ జాల బాయని చింత వొడమి, బడలఁ జొచ్చెను వేసవి మడువువోలె. |
446 |
| ఉ. |
రూపము సత్ప్రతాపము మరుత్పతిభోగము యౌవనంబు సం దీపితచారువర్తనము దిగ్విజయంబును సత్యముం జగ ద్వ్యాపితకీర్తియున్ సతులు వైభవముఖ్యము లెల్ల మాన్పఁగా నోపకయుండె నా నృపతి నొందిన సంతతిలేని దుఃఖమున్. |
447 |
| వ. | ఇట్లు సంతతి లేక యతిదుఃఖ మానసుండైన యా నరేంద్రుని మందిరంబున కంగిరసుం డను మహాముని వచ్చి, యతని చేత నతిథిసత్కారంబులు వడసి, కుశలం బడిగి, రాజ్యంబు భవదధీనంబు కదా! పృథివ్యప్తేజో వాయ్వాకాశ మహదహంకారంబు లనియెడి యేడింటిచేత రక్షింపఁబడిన జీవుండునుం బోలె, నమాత్య జనపద దుర్గ ద్రవిణ సంచయ దండ మిత్రంబు లనెడి సప్తప్రకృతులచేత రక్షితుండవై, ప్రకృతి పురుషులయందు భారంబు వెట్టి, రాజసుఖంబు లనుభవింతువు కదా! మఱియు దార ప్రజామాత్య భృత్య మంత్రి పౌర జానపద భూపాలురు నీకు వశవర్తులు గదా! సర్వంబునుం గలిగి సార్వభౌముండ వైన నీ వదనంబు విన్నఁదనంబు గలిగి యున్నయది; కతంబేమి? అనిన నా మునిప్రవరునకు నతండు, మీ తపోబలంబున మీకు నెఱుంగరాని యదియుం గలదే? అని తలవంచి యూరకున్న నతని యభిప్రాయం బెఱింగి, యా భగవంతుండైన యంగిరసుండు దయాళుండై, పుత్రకామేష్టి వేల్చి యజ్ఞశేష మతని యగ్ర మహిషి యైన కృతద్యుతి కిచ్చి నీకుం బుత్రుండు గలిగెడి; అతనివలన సుఖదుఃఖంబు లనుభవింపంగలవు అని చెప్పి చనియె; ఆ కృతద్యుతి యనుదేవి గర్భంబు ధరియించి, నవమాసంబులు నిండినం గుమారునిం గనియె; ఆ కాలంబున రాజును, సమస్త భృత్యామాత్య జనంబులును బరమానందంబునుం బొందిరి; అపుడు చిత్రకేతుండు కృతస్నానుండై, సకల భూషణ భూషితుండై, సుతునకు జాతకర్మంబు నిర్వర్తించి, బ్రాహ్మణులకు నపరిమిత హిరణ్య రజత దానంబులును, వస్త్రా భరణంబులును, గ్రామంబులును, గజంబులును, వాహనంబులును, ధేనువులును, నాఱేసి యర్బుదంబుల ద్రవ్యంబును దానంబుసేసి, ప్రాణి సముదాయంబునకుం బర్జన్యుండునుం బోలెఁ దక్కినవారలకు నిష్టకామంబులు వర్షించి, పరమానంద హృదయుండై యుండె; అంతం బుత్రమోహంబునం గృతద్యుతి యందు బద్ధానురాగుం డై మహీధవుండు వర్తింపుచుండం, దక్కిన భార్యలు సంతాన సంతోష వికలలై, యీ మోహంబునకుం గారణంబు పుత్త్రుండ యని యీర్ష్యం జేసి దారుణచిత్తలై కుమారునకు విషం బిడిన, సుఖనిద్రితుండునుం బోలె బాలుఁడు మృతిఁ బొందె; అప్పుడు వేఁగుటయు దాది బోధింపం జని, యా కుమారుని వికృతాకారంబుఁ జూచి, విస్మయ శోక భయార్తయై పుడమిం బడి యాక్రందించె; నప్పుడు. | 448 |
| తరల. |
పుడమి నిట్టక నిల్వునం బడి పొక్కుచుం గడుదీనయై యడఁకు వేమియు లేని వాక్కుల నావు రంచు విలాపమం దెడరు తోఁప భృశాతురోన్నతి నేడ్చినన్ విని భీతితోఁ గడుపు బిట్టవియంగ భూపతి కాంత గ్రక్కున నేగుచున్. |
449 |
| ఆ. |
బాలుఁ డొక్కరుండు పరిణామశీలుండు, వంశకర్త తపసివరమువలనఁ బుట్టి మిన్న కట్లు పొలిసియున్నట్టి యా, కొడుకుఁ జూచి తల్లి యడలఁ జొచ్చె. |
450 |
| ఉ. |
కుంకుమరాగ రమ్య కుచకుంభములన్ గడు కజ్జలంబుతోఁ బంకిలమైన బాష్పములఁ బాల్పడ మజ్జన మాచరింపుచున్ కంకణపాణి పల్లవయుగంబున వక్షము మోఁదికొంచు నా పంకరుహాక్షి యేడ్చెఁ బరిభావిత పంచమ సుస్వరంబునన్. |
451 |
| క. |
ఆ యార్తరవమునకు భూ, నాయకుఁడు భయంబు నొంది నయ ముడిగి సుతున్ డాయఁగ వేగంబునఁ జని, పాయని మోహంబు తోడ బాలుని మీఁదన్. |
452 |
| స్రగ్విణి. |
వ్రాలి యో పుత్ర! నీ వార్త దంభోళియై, కూలఁగా వ్రేయ కీ కొద్ది న న్నేటికిన్ జాలి నొందించె? నా జాడ యిం కెట్టిదో?, తూలి మీ తల్లికిన్ దుఃఖ మె ట్లాఱునో? |
453 |
| వ. | అని తల మొల యెఱుంగక పలవించుచు, భృత్యామాత్య బంధుజనంబులం గూడి యడలుచు నున్న యా రాజు దుఃఖం బెఱింగి, యంగిరసుండు నారదునితోడం గూడి చనుదెంచి, మృతుండైన పుత్రుని పదతలంబున మృతుండునుం బోలె పడియున్న యా రాజునుం గనుంగొని యిట్లనియె. | 454 |
| సీ. |
నీకు వీఁ డెవ్వఁడు? నీ వెవ్వనికి శోక సంతాప మందెదు సార్వభౌమ? పుత్త్ర మిత్త్రాదులు పూర్వజన్మంబున నెవ్వని వారలో యెఱుఁగఁ గలరె? మొదలు నదీవేగమున నాడ కాడకు సికతంబు గూడుచుఁ జెదరుచుండు, నారీతిఁ బ్రాణుల కతికాల గతిచేతఁ బుట్టుట సచ్చుట పొసఁగుచుండుఁ |
|
| ఆ. |
గాన భూతములకుఁ గలుగు భూతంబులు, మమత తోడ విష్ణుమాయఁ జేసి దీని కడల నేల? ధృతిఁ దూలఁగా నేల? బుద్ధిఁ దలఁప వలదె? భూత సృష్టి. |
455 |
| వ. | మఱియు నేము, నీవును, దక్కిన వారలును బ్రవర్తమాన కాలంబునం గలిగిన జన్మంబు నొంది, మృత్యువు వలన విరామంబు నొందంగలవారమై యిపుడ లేకపోవుదుము; చావు పుట్టువులకు నిక్కువంబు లేదు. ఈశ్వరుండు దన మాయచేత భూతజాలంబులవలనం భూతంబులం బుట్టించు; వాని నా భూతంబుల చేతనేరక్షించు; వాని నా భూతంబులచేతన హరించు; స్వతంత్రంబు లేని తన సృష్టిచేత బాలుండునుంబోలె నపేక్ష లేకయుండు; దేహియైన పితృదేహంబు చేత దేహియైన పుత్త్రదేహంబు మాతృదేహంబు వలనం గలుగుచుండు; ఆ ప్రకారంబున బీజంబు వలన బీజంబులు పుట్టుచు నుండు; దేహికి నివి శాశ్వతంబై జరుగుచునుండు; పూర్వకాలంబున సామాన్య విశేషంబులు సన్మాత్రంబైన వస్తువులం దేవిధంబునం గల్పింపంబడియె, నా ప్రకారంబున దేహంబునకు జీవునకు నన్యోన్య విభాగంబు పూర్వకాలంబున నజ్ఞాన కల్పితం బయ్యె; జన్మఫలంబులను జూచుచున్న వారికి దహనక్రియల నగ్ని పెక్కు రూపంబులం గానంబడు భంగి, నొకండైన జీవుండు పెక్కుభంగుల వెలుంగుచుండు; ఇవి యన్నియు నాత్మజ్ఞానంబు చాలక దేహి దేహసంయోగంబున స్వప్నంబునందు భయావహంబైన ప్రయోజనంబు నడపుచుండి, మేలుకాంచి, యా స్వప్నార్థంబైన ప్రయోజనంబు తనది గాదని యెఱుంగుభంగి, జీవుండే తా నని జ్ఞానగోచరుండైన వాఁడెఱుంగు; కావున నన్నియును మనోమాత్రంబని తెలిసి, మోహతమంబు వాసి, భగవంతుండైన వాసుదేవుని యందుఁ జిత్తంబు వెట్టి, నిర్మలాత్మకుండ వగుము అని బోధించినం జిత్రకేతుండు లేచి వారల కిట్లనియె. | 456 |
| సీ. |
యతివేషములు పూని యతి గూఢగతి నిందు నేతెంచినట్టి మీ రెవ్వరయ్య? కడఁగి నన్ బోలిన గ్రామ్యబుద్ధులనెల్ల బోధింప వచ్చిన పుణ్యమతులొ? రమణఁ గుమార నారద ఋషభాదులొ దేవలాసితు లను ధీరమణులొ? వ్యాస వసిష్ఠ దుర్వాస మార్కండేయ గౌతమ శుక రామ కపిల మునులొ? |
|
| తే. |
యాజ్ఞవల్క్యుండుఁ దరణియు నారుణియును, చ్యవన రోమశు లాసురి జాతుకర్ణ దత్తమైత్రేయ వర భరద్వాజ బోధ్య, పంచశిఖులొ? పరాశర ప్రభృతి మునులొ? |
457 |
| క. |
వీరలలో నెవ్వరు సుర, చారణ గంధర్వ సిద్ధ సంఘంబులలో వారలొ? యీ సుజ్ఞానము, కారణమై యెవరియందుఁ గలదు తలంపన్? |
458 |
| క. |
పొందుగ గ్రామ్య పశుత్వముఁ, బొంది మహాశోకతమముఁ బొందిన నాకున్ ముందఱ దివ్యజ్ఞానముఁ, జెందించిన వారి మిమ్ముఁ జెప్పుడు తెలియన్. |
459 |
| వ. | అనిన నంగిరసుం డిట్లనియె. నేను పుత్త్రకాంక్షివైన నీకుం బుత్త్రుం బ్రసాదించిన యంగిరసుండ; ఇతండు బ్రహ్మపుత్త్రుండైన నారదభగవంతుండు; దుస్తరంబైన పుత్త్రశోకంబున మగ్నుండ వైన నిను ననుగ్రహించి, పరమజ్ఞానం బుపదేశింప వచ్చితిమి; నీ దుఃఖం బెఱింగి, బుత్త్రు నిచ్చితి మేనిఁ బుత్త్రవంతులైన వారి తాపంబు నీచేత ననుభవింపంబడు; ఈ ప్రకారంబున లోకంబున సతులును, గృహంబులును, సంపదలును, శబ్దాదులయిన విషయంబులును, రాజ్యవైభవంబును జంచలంబులు; మఱియు రాజ్యంబును, భూమియును, బలంబును, ధనంబును, భృత్యామాత్య సుహృజ్జనంబులును మొదలయినవి శోక మోహభయ పీడలం జేయుచుండుం గాని సుఖంబుల నీ నేరవు; గంధర్వనగరంబునుం బోలె స్వప్న లబ్ధ మనోరథంబునుంబోని యర్థంబుఁ బాసి కానంబడుచు మనోభవంబులయిన యర్థంబులం గూడి స్వార్థంబులై కానంబడనేరవు; కర్మంబులచేత ధ్యానంబులు సేయుచుండు మనంబులు నానాకర్మంబు లగుచు నుండు; నీ దేహిదేహంబు ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబై దేహికి వివిధ క్లేశసంతాపంబులం జేయుచుండుఁ గావున నీవు నిర్మలంబయిన మనంబుచేత నాత్మగతి వెదకి ధ్రువం బయిన పదవి నొందు మనియె; అప్పుడు నారదుం డిట్లనియె; నుపనిషద్గోప్యంబగు నే నిచ్చు మంత్రం బెవ్వండేని సప్తరాత్రంబులు పఠియించు, నతండు సంకర్షణుండైన భగవంతునిం జూచు; నెవ్వని పాదమూలంబు సర్వాశ్రయంబై యుండు నట్టి శ్రీమన్నారాయణుని పాదంబులు సేవించి యీ మోహంబు వదలి యతి శీఘ్రంబున నుత్తమపదంబు నొందు; మిప్పు డిక్కుమారునకును నీకును బ్రయోజనంబు గలదేనిం జూడు మని నారదుండు మృతబాలకుని కళేబరంబుఁ జూచి యోజీవుండ! నీకు శుభం బయ్యెడు; మీ తల్లిదండ్రుల బంధుజనులం జూచి వీరల దుఃఖంబు లార్చి యీ కళేబరంబునందుఁ బ్రవేశించి యాయుశ్శేషంబు ననుభవించి పిత్రధీనంబైన రాజ్యాసనంబునం గూర్చుండు మనిన న బ్బాలుం డిట్లనియె. | 460 |
| తే. |
కర్మవశమున నెందు సుఖంబు లేక, దేవ తిర్యఙ్నృ యోనులఁ దిరుగు నాకు వెలయ నే జన్మమందునొ వీరు తల్లి, దండ్రు లయినారు చెప్పవే తాపసేంద్ర! |
461 |
| తే. |
బాంధవజ్ఞాతిసుతులును బగతు రాత్మ, వరు లుదాసీన మధ్యస్థవర్గములును సరవిఁ గనుచుందు రొక్కొక్క జన్మమునను, నెఱయఁ బ్రాణికి నొక వావి నిజము గలదె? |
462 |
| తే. |
రత్నములు హేమములు ననురాగలీల, నమ్మకంబుల నీవల నావల నగు భంగి నరులందు జీవుండు ప్రాప్తుఁ డగుచు, నెలమిఁ దిరుగుచునుండుఁ, దా నెందుఁ జెడఁడు. |
463 |
| సీ. |
ఒక్కఁడై నిత్యుఁడై యెక్కడఁ గడలేక సొరిది జన్మాదుల శూన్యుఁడగుచు సర్వంబునందుండి సర్వంబుఁ దనయందు నుండంగ సర్వాశ్రయుం డనంగ సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు సామ్యమై స్వప్రకాశమునఁ వెలిఁగి యఖిలంబుఁ జూచుచు నఖిల ప్రభావుఁడై యఖిలంబు దనయందు నడఁచి కొనుచు |
|
| తే. |
నాత్మమాయాగుణంబుల నాత్మమయము, గాఁగ విశ్వంబుఁ దనసృష్టి ఘనతఁ జెందఁ జేయుచుండును సర్వసంజీవనుండు, రమణ విశ్వాత్ముఁ డయిన నారాయణుండు. |
464 |
| క. |
సతు లెవ్వరు? సుతు లెవ్వరు?, పతు లెవ్వరు? మిత్ర శత్రు బంధు ప్రియ సం గతు లెవ్వరు? సర్వాత్మక, గతుఁడై గుణసాక్షి యైన ఘనుఁ డొక్కనికిన్. |
465 |