పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట
వ. మఱియు సుఖదుఃఖంబులఁ బొందక సర్వోదాసీనుండై పరమాత్మయై యుండు న ప్పరమేశ్వరరూపుండ నయిన నాకును మీకు నెక్కడి సంబంధంబు? మీకు దుఃఖంబునకుం బని లేదని పలికి యా జీవుండు వోయినం జిత్రకేతుండును బంధువులు నతి విస్మితచిత్తులై శోకంబులు విడిచి మోహంబులం బాసి యమునానదియందు నక్కుమారునకు నుత్తరకర్మంబులు నిర్వర్తించిరి; చిత్రకేతుండు గాఢపంకంబునంబడి వెడలిన యేనుంగునుంబోలె గృహాంధకూపంబునందుండి వెడలి కాళిందీనదికిం బోయి యందు విధిపూర్వకంబుగఁ గృతస్నానుండై మౌనంబుతోడ నారదునకు నమస్కరించిన నతండు ప్రసన్నుండై భగవన్మంత్రంబు విధిపూర్వకంబుగా నతనికి నుపదేశించి యంగిరసుతోడం గూడి బ్రహ్మలోకంబునకుం జనియె; చిత్రకేతుండును నారదోపదేశమార్గంబున నిరాహారుండై సమాధినియతుండై నారాయణరూపంబయిన యా విద్య నారాధించి సప్తరాత్రాంతంబున నప్రతిహతంబయిన విద్యాధరాధిపత్యంబున భాస్వద్రత్నదివ్యవిమానంబునుం బడసి నారాయణునను గ్రహంబునుం బొంది మనోగమనంబునం ద్రిజగంబులం జరియించుచుండఁ గొన్ని దినంబులకు నొక్కచోట. 466
సీ. తారహారపటీర ధవళదేహమువాని రమణీయనీలాంబరంబువాని
మణికిరీటస్ఫురన్మస్తకంబులవానిఁ గంగణకేయూరకరమువానిఁ
గర్బురమయదీప్తకటిసూత్రములవానిఁ దరళయజ్ఞోపవీతములవాని
నతిసుప్రసన్నవక్త్రాంబుజంబులవానిఁ దరుణవివృత్తనేత్రములవాని
 
ఆ. సిద్ధమండలంబు సేవింపఁ బుణ్యప్ర, సిద్ధి వెలసినట్టి యిద్ధచరితుఁ
బద్మలోచనునకుఁ బాదపీఠంబైన, ఘనునిఁ బన్నగేంద్రుఁ గాంచె నతఁడు.
467
ఆ. కన్నమాత్ర నతఁడు కల్మషంబులఁ బాసి, విమలచిత్తుఁ డగుచు విశదభక్తి
నిట్టరోమములకుఁ బట్టగు చానంద, బాష్పనేత్రుఁ డగుచుఁ బ్రణుతి సేసె.
468
క. సంతోషాశ్రులచేత న, నంతునిఁ బరిషిక్తుఁజేసి యతఁడు ప్రమోదం
బెంతయు నరికట్టిన నొక, కొంతయుఁ బలుకంగలేక కొండొక వడికిన్‌.
469
చ. మది నొకయింతమాత్రన సమంబుగఁ జేయుచు బాహ్యవర్తనం
గదిసిన యింద్రియంబుల నొకంతకుఁ దెచ్చి మనంబు వాక్కునుం
గుదురుగఁ ద్రోచి తత్త్వమునఁ గూర్చుచు శాశ్వత విగ్రహంబునా
సదయుఁ బ్రశాంతు లోకగురు సన్నుతి సేయఁదొడంగె నిమ్ములన్‌.
470
క. అజితుఁడవై భక్తులచే, విజితుఁడ వైనాఁడ విపుడు వేడుక వారున్‌
విజితులు నీచేఁ గోర్కులు, భజియింపనివారు నిన్నుఁ బడయుదురె హరీ!
471
ఉ. నీ విభవంబు లీ జగము నిండుట యుండుట నాశమొందుటల్‌
నీ విమలాంశజాతములు నెమ్మి జగంబు సృజించువార లో
దేవ! భగవద్గుణాంబుధుల తీరముఁ గానక యీశ! బుద్ధితో
వావిరిఁ జర్చచేయుదురు వారికి వారలు దొడ్డవారలై.
472
క. పరమాణువు మొదలుగఁ గొని, పరమము దుదిగాఁగ మధ్యపరికీర్తనచే
స్థిరుఁడవు త్రయీవిదుఁడవై, సరి సత్త్వాద్యంత మధ్య సదృశగతుఁడవై.
473
తే. ఉర్వి మొదలైన యేడు నొండొకటికంటె, దశగుణాధికమై యుండు, దానినండ
కోశమందు, రజాండంబు కోటి యెవని, యందు నణుమాత్రమగు ననంతాఖ్యుఁ డతఁడు.
474
వ. మఱియు నొక్కచోట విషయతృష్ణాపరులైన నరపశువులు పరతత్త్వంబవైన నిన్ను మాని యైశ్వర్యకాములై తక్కిన దేవతల భజియింపుదురు; వారిచ్చు సంపదలు రాజకులంబునుంబోలె వారలం గూడి నాశంబునం బొందుచుండు; విషయకాములేని నిన్ను సేవించినవారు వేఁచిన విత్తనంబునుం బోలె దేహాంతరోత్పత్తి నొందకుండుదురు; నిర్గుణుండవై జ్ఞానవిజ్ఞానరూపంబు నొందియున్న నిన్ను గుణసమేతునింగా జ్ఞానులు భావింతురు; నీ భజనం బేరూపున నయిన మోక్షంబు ప్రసాదించు; జితమతివైన నీవు భాగవతధర్మం బే ప్రకారంబున నిర్ణయించితి, వా ప్రకారంబున సర్వోత్కృష్టుండ వయిన నిన్ను సనత్కుమారాదులు మోక్షంబు కొఱకు సేవించుచున్నారు; ఈ భాగవతధర్మంబునందు జ్ఞానహీనుం డొక్కండును లేఁ డన్యకామ్యధర్మంబునందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు నని వచియించు చున్నవాఁ డధర్మనిరతుండై క్షయించుచుండు; స్థావర జంగమప్రాణిసమూహంబునందు సమంబైన భాగవతధర్మంబుల వర్తించుచున్న మనుజునికి భవద్దర్శనంబువలనఁ బాపంబు క్షయించుట యేమి చిత్రం? బిపుడు భవత్పాదావలోకనంబున నిరస్తాశయమ లుండనైతి; మూఢుండ నయిన నాకుఁ బూర్వకాలంబున నారదుం డనుగ్రహించి భగవద్ధర్మంబు దయసేసె; నది నేఁడు నాకు వరదుండవైన నీకతంబున దృష్టంబయ్యె; ఖద్యోతంబులచేత సూర్యుండు గోచరుండు గానిమాడ్కి జగదాత్మకుండవైన నీ మహత్త్వంబు మనుజులచేత నాచరింపంబడి ప్రసిద్ధంబైనదిగా, దం దుత్పత్తిస్థితి లయకారణుండవై భగవంతుండవైన నీకు నమస్కరించెద నని మఱియును. 475
తే. అరయ బ్రహ్మాదు లెవ్వని ననునయించి, భక్తియుక్తుల మనమునఁ బ్రస్తుతింతు
రవని యెవ్వని తలమీఁద నావగింజఁ, బోలు నా వేయిశిరముల భోగిఁ గొల్తు.
476
క. ఈ విధమున వినుతింపఁగ, నా విద్యాధరులభర్త కనియె ననంతుం
డో విమలబుద్ధి! నీ దగు, ధీ విభవంబునకు మెచ్చితిం బ్రియమారన్‌.
477
ఆ. అరయ నారదుండు నంగిరసుండును, దత్త్వ మొసంగినారు, దాని కతన
నన్నుఁ జూడఁగల్గె నా భక్తి మదిఁ గల్గె, నా పథంబు నీకు నమ్మఁ గలిగె.
478
సీ. పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైనతనువులు దగిలె నాకు
నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నాయందు జోకఁ జెందు,
నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు
 
తే. వెలయ నిద్రించువాఁ డాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ
గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు.
479
ఆ. నిద్ర వోవువేళ నిరతుఁడై దేహి దా, నెట్టి గుణముచేత నింద్రియములఁ
గడచినట్టి సుఖముఁ గను, నట్టి బ్రహ్మంబుఁ, గడిమి మెఱయ నన్నుఁగా నెఱుంగు.
480
ఆ. స్వప్నమందు నెట్లు సంచార మొనరించు, మేలుకాంచి దృష్ట మోలి నెఱుఁగు
నుభయ మెఱుఁగునట్టి యుత్తమజ్ఞానంబు, తత్త్వ, మట్టిదైన తలఁపు నేను.
481
సీ. అరయంగ నెవ్వని కలవిగానట్టి యీ సలలిత మానుషజాతిఁ బుట్టి
యాత్మతత్త్వ జ్ఞానహతుఁడైన వానికిఁ గలుగునె యెందు సుఖం బొకింత?
వెలయఁ బ్రవృత్తినివృత్తిమార్గంబుల సుఖదుఃఖచయముల సొరిదిఁ దెలిసి
పనిచెడి సంకల్పఫల మూలమునఁ బాఱి కడు సుఖదుఃఖమోక్షములకొఱకు
 
ఆ. దంపతి క్రియామతంబు వర్తింతురు, దాన మోక్ష మేల దక్కి యుండు?
నఖిల దుఃఖహేతు వయిన యీ కర్మంబు, నెఱిఁగి నన్నుఁ దలఁప రిచ్చలోన.
482
వ. మఱియు విజ్ఞానాభిమానులయిన మనుష్యులకు నతిసూక్ష్మంబయిన యాత్మగతి నిజస్థానత్రయ లక్షణంబునఁ జతుర్థాంశంబు నెఱింగి యైహికాముష్మికవిషయంబులచేతను వివేకబలంబుచేతను నియుక్తుండై జ్ఞానవిజ్ఞానసంతృప్తుండైన పురుషుండు నాకు భక్తుండగు; నీ విధంబులు గలవారలు యోగనైపుణ్యబుద్ధి గలవారలునై స్వార్థంబయిన యాత్మచేతం బరమాత్మను దెలియుచుందురు; నీవు నీ క్రమంబున మద్భక్తి శ్రద్ధాపరుండవై విజ్ఞానసంపన్నంబులైన వాక్కులచేత స్తోత్రంబుసేసి ముక్తుండవైతి వని యా శేషభగవంతుండు విద్యాధరపతియైన చిత్రకేతుం బలికి యతని కదృశ్యుండై పోయె; ఏ దిక్కున సర్వాత్మకుండైన యనంతుం డంతర్ధానంబు నొందె, నా దిక్కునకు విద్యాధర భర్త నమస్కరించి గగనచరుండై చని లక్షల సంఖ్యలైన దివ్య వర్షంబు లవ్యాహత బలేంద్రియుండై పరమయోగిపురుషులును దివ్యమునీంద్రులును సిద్ధచారణగంధర్వులును వినుతి సేయం గులద్రోణాది శైలంబులను రమ్యప్రదేశంబులను సంకల్పసిద్ధ ప్రదేశంబులను వినోదించుచు శ్రీనారాయణదత్తంబగు దివ్యవిమానంబునందుఁ జరియించుచు నుండి. 483
శా. ఆడించున్‌ హరిదివ్యనాటక గుణవ్యాపార నృత్యంబులం,
బాడించున్‌ జలజాతనేత్రబిరుద ప్రఖ్యాతగీతంబులం,
గూడించున్‌ సతతంబు జిహ్వలతుదిన్‌ గోవిందనామావళుల్‌
క్రీడం గిన్నరయక్షకామినులచేఁ గృష్ణార్పితస్వాంతుఁడై.
484
సీ. వాసించు నాత్మలో వైష్ణవజ్ఞానంబు, నాశించు భాగవతార్చనంబు,
భూషించు నే ప్రొద్దుఁ బుండరీకాక్షుని, భాషించు హరికథాప్రౌఢి మెఱసి,
ఘోషించు హరినామగుణనికాయంబులు, పోషించుఁ బరతత్త్వబోధ మరసి,
సేవించు శ్రీకృష్ణసేవకనికరంబు, సుఖమునఁ జేయు నీశునకు బలులు,
 
తే. పాడుఁ బాడించు వైకుంఠభర్త నటన, రూపవర్తన గుణనామ దీపితోరు
గీతజాతప్రబంధ సంగీత విధులఁ, గేశవప్రీతిగాఁ జిత్రకేతుఁ డెపుడు.
485
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )