పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
యుధిష్ఠిరాదులును గాంధారీధృతరాష్ట్రులును నొండొరులయెడల నడచికొనిన ప్రవర్తనము: (సం. 15-1-1)
వ. దేవా! జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె; నట్లు పితృపితామహక్రమప్రాప్తం బయిన సామ్రాజ్యంబు జగత్పూజ్యప్రకారంబునం గైకొని మహాధ్వరప్రముఖధర్మకార్యధుర్యులును సముపాసితార్యులును దయా విధేయులు నగు - పాండవేయులు ధృతరాష్ట్రువలన నెవ్విధంబు వారై నడచిరి? హతపుత్రమిత్రామాత్యుండును గతైశ్వర్యుండును నగు నా రాజును యశోమహితయగు గాంధారియు నెట్టిభంగి వర్తించి? రత్తెఱంగు నా కెఱింగింపుము. 002
సీ. అనవుడు నమ్ముని యమ్మహీపతికి ని | ట్లనుఁ, బాండునందను లాంబికేయు
నెడ భక్తివినయంబు లెసఁగంగ వర్తింతు | రతని యోగక్షేమ మరసి యెపుడుఁ
దత్సమీపంబునఁ దగ నిల్చి తమకు నె | య్యది యైన నెఱిఁగించునట్లు గాఁగ
నుందురు విదుర యుయుత్సు సంజయులు దా | రును నిత్యమును వచ్చి వినతిఁ జేసి
 
తే. కొలిచి కూర్చుండి యా నృపు నలఘుకార్య | విధము లేర్పడ నడిగి యవ్విభుని చెప్పి
నట్లు చేయుదు రతఁడును నాదరంబు | గాఢవత్సలత్వంబును గలిగియుండు.
003
ఉ. కౌరవనాథ! కుంతియును గౌరవ మొప్పఁగ వచ్చి కొల్చు గాం
ధారి నతిప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్‌ ముదం
బారఁగ నిత్యముం గొలుతు రక్కురువంశమహత్తరన్‌ మహో
దారము లైన వస్తువు లుదాత్తత నిత్తురు వార లందఱున్‌.
004
క. చిత్రాంగదయు నులూపియు | ధాత్రీశ్వర! వత్తు రెపుడు ద్రౌపదితోడన్‌
గాత్రములు భూరి వినయా | మాత్రములుగ సుబలసుతఁ బ్రమదమునఁ గొలువన్‌.
005
క. ఆ తల్లికిఁ దండ్రికి సం | ప్రీతి యలరఁ గుడువఁ గట్టఁ నుదాత్త
స్ఫీతంబు లైన వస్తు | వ్రాతంబుల నిచ్చు ధర్మరా జనుదినమున్‌.
006
తే. గుళ్ళుఁ జెఱువులుఁ గట్టించుఁ, గోరి యూళ్ళు | లగ్రహారముల్‌ గావించు నాంబికేయుఁ
డధిప! ధర్మతనూజుఁ డత్యంత హర్ష | చిత్తవృత్తి యై యనుమతి సేయుచుండ.
007
క. జనవర! ధర్మజుఁ గొలువం | జనుదెంచిన యట్టి వివిధ జనపతు లెల్లన్‌
మును ధృతరాష్ట్రునిఁ గొలుతురు | విను మా కొడుకు మది పల్లవించున్‌ దానన్‌.
008
క. సూనులు లేమిం గలిగెడు | దీనత్వము దోఁపకుండఁ దేజస్సౌఖ్యా
నూనులుగఁ జేయు ధర్మజుఁ | డా నరపతి నతనిదేవి నతులిత భక్తిన్‌.
009
సీ. వంశవృద్ధులు పుత్త్రవర్గ వియుక్తులై | యున్నవా రేమిట నుమ్మలింతు
రో యను పుయిలోట నా యుధిష్ఠిరుఁడు ద | మ్ములకును దగునమాత్యులకు నిష్ట
భృత్యులకును మీరు ప్రీతియు భక్తియు | నాంబికేయునిదెస నతిశయిల్ల
నారాజు పంచినయట్ల చేసి చరింపుఁ | డతని నారాధించు టస్మదీయ
 
ఆ. చిత్తమునకుఁ బ్రియము సేయుట యతనికి | మనసు గాని యట్టిపని యొనర్చు
టగ్గలంపు దుఃఖ మావహించుట యని | యనుదినంబుఁ జెప్పు మనుజనాథ!
010
క. విను మెల్లవారు నతని వ | చనములు మది నూఁది యట్ల చరియింప మరు
త్తనయుండును నమ్మెయి వ | ర్తనము నడపుచుండు మనసు తద్దయు నెరియన్‌.
011
క. ద్యూతంబున దుర్యోధను | చేతం దమ పడిన పాటు చిత్తంబున క
త్యాతురతఁ జేయుచుండుట | నాతఁడు ధృతరాష్ట్రుఁ జూచి యలుగు మనమునన్‌.
012
తే. శ్రాద్ధ దివసంబులందుఁ బుత్త్రవ్రజమున | కాంబికేయుండు గో కనకాది దాన
కీర్త్యముగఁ బారలౌకిక క్రియలు సేయు | నట్లుగా సంఘటించు ధర్మాత్మజుండు.
013
సీ. అతులభోగంబును నంచితత్యాగంబుఁ | దొల్లింటియట్టుల చెల్లఁజేయు
ధృతరాష్ట్రునకు ధర్మసుతుఁడు గాంధారికిఁ | బూర్వప్రకార సంపూజ్యదాన
నిరతిఁజెల్లించు; నక్కురువృద్ధుఁ డిమ్మెయిఁ | బాండుపుత్త్రులు దన్నుఁ బరమభక్తి
శిష్యవర్తనమున సేవింపఁ దానును | గురునట్ల వాత్సల్యపరత నెపుడు
 
తే. వారలకు శ్రీయు నాయువు వైరిజయము | మానసమున నాశాసించు మానవేంద్ర!
యతని తొంటివర్తనముఁ దత్సుతుని కీడు | నాత్మఁ దలఁపఁ డెన్నండు ధర్మాత్మజుండు!
014
క. విను మతని తెఱఁ గెఱిఁగి పరి | జనములలో నాంబికేయు చరితము దుర్యో
ధను కొఱగామియు నెవ్వా | రును వాక్రువ్వంగ వెఱతురు కురుప్రవరా!
015
సీ. రాజ్యాధిపత్య సంపూజ్యత్వమున ధృత | రాష్ట్ర పాండుసుతాంతరంబు గాన
రొకళులు జానపదోత్కరమునఁ బౌర | వర్గంబునందును వసుమతీశ!
యమ్మెయి నడపెడు నప్పాండవాగ్రజు | వలన నిజాత్మజువలని కంటె
నక్కురురాజు ప్రియం బందు; న ట్లున్న | యక్కాలమునఁ | బవనాత్మజుండు
 
తే. సన్నిహితుఁ డైనయప్పు డజ్జనవిభుండు | తన తనూజులఁ దలఁచి సంతాప మందు;
నతనిఁ గనుఁగొని యబ్భీముఁ డతనిసుతులు | తమ్ముఁ బఱిచిన పాటులు దలఁచి యలుగు.
016
తే. హృదయముల నొండొరులదెస నిట్టివార | లయ్యు నతఁడు నతండు నన్యోన్యభాష
ణములయప్పుడు మృదుల విన్యాస మొప్ప | నాడుదురు చుట్టములు మెచ్చునట్లు గాఁగ.
017
వ. ధృతరాష్ట్రుం డేకతంబ యున్నయెడ వృకోదరుం డతనికి నింత నంత నుండి గాంధారి వినుచుండ. 018
సీ. ‘అంధుని కొడుకులయం దొకరునిఁ దప్పి | పోనీక త్రుంచితి భూరిశక్తి
దర్పితం బైన మద్బాహుపంజరము సొ | చ్చిన రిపురాజన్య సింహములకు
వెడలంగ వచ్చునే? వెంగలు లై వారు | కయ్యంబు సేసిరి గాక నన్ను
నెఱిఁగినఁ దొడరుదు రెట్టులు? దుర్యోధనాదుల ననిఁ దెగటార్చినట్టి
 
తే. నాదు దోర్దండములఁ జందనం బలంది | కుసుమదామముల్‌ సుట్టి మ్రొక్కుదు మహోప
కారు లరయంగ దైవముల్‌ గావె?’ యనుఁ ద | దీయ మర్మంబు లెల్ల భేదిల్ల నధిప!
019
వ. దీని ధర్మనందనుండును ధనంజయుండునుం గుంతియు ద్రౌపదియు నెఱుంగరు; కవ లొక్కొక్క మాఱిమ్మాటలు విని సంతసిల్లుదురు; ధర్మనందను తెఱం గెఱుంగుటంజేసి పుయిలోడి తా రేమియు నాడరు; ధృతరాష్ట్రగాంధారులుం గాలపర్యాయంబు గని డెందంబులు గంద నూరకుండుదు; రట్టిభంగిఁ బంచదశవత్సరంబులు చనియె నంత నొక్కనాఁ డయ్యంధనృపతి బంధుజనంబులం గూర్చి ధర్మనందను రావించి; యతండు వినుచుండ గద్గదకంఠుం డగుచు వారలతోడ. 020
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )