పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దన మనోరథంబుఁ దెలుపుట (సం. 15-5-1)
సీ. నాకతంబునఁ జేసి యా కౌరవులకు నా | శంబు వాటిలుట దెల్లంబు మీకు
జడుఁ గ్రూరు నతిలోభి జ్ఞాతి జనద్రోహ | కరు రాజుఁ జేసితిఁ గురుధరిత్రి
కచ్యుతు చెప్పిన యమలవాక్యంబులు | విననేరనైతి నా తనయువలని
ఘనతరస్నేహంబునను మొగమోటను | దగియెడుమాటలఁ దఱిమి యొత్తి
 
తే. యాడకుండితి; భీష్ముండు నస్త్రగురుఁడు | విదురుఁడును సంజయుండును వే విధముల
నాకుఁజెప్పిరి; గాంధారి నన్ను దూఱి | చెప్పె; న మ్మాట లేఁ బెడచెవుల నిడితి.
021
వ. ఇత్తెఱం గంతరంగంబున శల్యం బై యున్నయది, యని చెప్పి వెండియు. 022
క. సుతులు సమరమునఁ దిరుగక | మృతు లై సద్గతికిఁ జనిన మేలిమి యస్మ
న్మతిఁ దలఁచి వరక్షత్త్ర చ| రిత మని యప్పనికి వగవఁ బ్రీతియ కలుగున్‌.
023
వ. అని పలికి పాండవాగ్రజుఁ జేరం బిలిచి, యతనితోడ. 024
సీ. నీ వరయంగ సుఖావాప్తిఁ గొఱఁత లే | కుండితిఁ జనవును నుజ్జ్వలంపుఁ
దేజంబుఁ గలిగి వర్తించితి దానంబు లంచితములుగఁ బె క్కాచరింపఁ
గంటి శ్రాద్ధంబులు గాంధారిసుతులకుఁ | బలుమాఱుఁ జేసితిఁ; బరమధర్మ
శీల పాంచాలికిఁ జెట్ట చేసి రగణ్య | పుణ్యుండ వగు నీదు భూరిలక్ష్మి
 
తే. నపహరించి రద్దుర్యోధనాదు లట్టి; కష్టచరితులఁ బాడిమైఁ గయ్యమునన
నిహతులుగఁ జేసి తక్కురునికర మూర్ధ్వ; భువనగతిఁ గాంచి సుఖ మందె భూపవర్య!
025
క. కావున నేమియుఁ జేయం | గా వలవదు వారికయి యకారణ కరుణా
శ్రీవిలసితుఁ డగునీతో | నా విధముం జెప్పవలసె నరవరముఖ్యా!
026
సీ. ఏ కార్యమైనను నెవ్వఁడేనియుఁ జేయఁ | దొడఁగునప్పుడు విను పుడమిఱేని
చే ననుజ్ఞాతుఁ డై కాని తొడంగఁ గా | దట్లు గావున వార్థకాభిలీఢ
మైన మదీయకాయమునకు సంస్కార | మాచరింపఁగఁ దప మాచరించు
పనికి భూపాల! నీయనుమతి వడయంగ | వలసి చెప్పెద రాజవంశజునకు
 
ఆ. సమరమరణ మొండె, విమలతపమునకుఁ | జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె
వలయు; నస్మదీయకులముఖ్యు లిట్టుల | నడపి రనుపు నన్ను నడవి కనఘ!
027
క. రాజు గురుఁ డెల్లవారికి; | రాజోత్తమ! గురునియాజ్ఞ రంజిల్లఁగఁ బే
రోజం జేసిన కృత్యము | సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్‌.
028
తే. ఏను గాంధారియును దపోమాననీయ | మునుల చేరువ వల్కలములు ధరించి
కందమూల ఫలముల నాఁకలి హరించి | నిన్ను దీవించుచుండెద మన్న నతఁడు.
029
క. ధరణీరాజ్యము నాకును | నరవర! సౌఖ్యంబుఁ జేయునా! నీ విమ్మై
దురపిల్లి దుష్కరం బగు | నరణ్యవాసమున కేఁగినట్టిది యైనన్‌.
030
తే. గూఢబుద్ధి వై నమ్మించి కురువరేణ్య ! | యే నెఱుంగక యుండంగ నిట్లు శోక
వనధిఁ దేలుచు నుండి తివ్వనట గంటి | నింక రాజ్యంబు నా కెట్టు లించుఁ జెపుమ.
031
ఉ. తల్లియుఁ దండ్రియున్‌ గురుఁడు దైవము నా కరయంగ నీవ భూ
వల్లభ! నీవు కానన నివాసము గోరి చనంగ నెట్టు లే
నుల్లము వట్టి హస్తిపురి నుండఁగ నేర్తు? యుయుత్సుఁ బెంపు శో
భిల్లఁగ రాజుఁ జేయు; నినుఁ బ్రీతి యెలర్పఁగఁ గొల్చి వచ్చెదన్‌.
032
క. అతఁ డౌరసుండు నీ కీ | క్షితి కొడయుఁడు దుర్యశంబుచేఁ గుందుట భూ
పతివర! కని కని మీరి | ట్లతి మాత్రము చేయఁదగునె యక్కట నాకున్‌?
033
సీ. నీవు రాజవు గాక నీ కేను రాజనే? | గురుని మహారాజుఁ గురువరేణ్యు
నిటు చేయు మని పంప నే నొడయండనే? | దుర్యోధనాదుల దుష్కృతములు
నా మదిలో నిల్ప, నేమును వారును | విధిమోహమున నైన విరస భావ
మావహిల్లినఁ బుట్టె నంతలు పనులు; గాం | ధారియు గొంతియు గారవమున
 
ఆ. నాకు నొక్కరూప; మీకుఁ గాననవాస | మెల్ల భంగిఁ గలుగు నేని యేనుఁ
దగిలి తోన వత్తుఁ దగుమాటగా నాటఁ గాదు నాదుహృదయగతియు నిట్ల.
034
క. పలికెద నే సత్యము నా | కిల ప్రీతిం జేయ దధిప! యీ వి ట్లయినం
గులము కలఁక దైవకృతం | బలఘుమతీ! విడువు శోక మరయుము నన్నున్‌.
035
తే. నీకు శుశ్రూష యొనరించి నృపవరేణ్య! చిత్తతాపంబు మానంగఁ జేసికొందు
నని తలంచు నన్‌ విడువంగ నగునె? యవన | తుండ నై నిన్ను వేఁడెదఁ దొఱఁగు వగలు.
036
క. అనుచు నతని చరణంబులు | తన ఫాలతలంబు చేర్చె ధర్మతనయుఁడా
తని గ్రుచ్చి యెత్తి కౌఁగిట | నెనయంగాఁ జేర్చి యాతఁ డిట్లను నధిపా!
037
తే. నీవు శుశ్రూష చిరకాలనియతిఁ జేసి | తేను వృద్ధుండ నైతి; నా కింకఁ దపము
వలవదయ్య? రాజును బాలివాఁడ యెవ్వ | రేమి చేసిన ఫలములయెడ నృపాల!’
038
వ. అని పలికి విదుర కృప సంజయుల నుద్దేశించి తనకు ముఖశోషయుం దనుగ్లానియుం గలిమి నుగ్గడించి, నాలుక తొట్రుపడ వారలతో మీర లనునయవచనంబుల నజాతశత్రుం దెలి వొందం జేయుం’ డని చెప్పి డప్పి యెక్కుడు గదిరిన గాంధారి తనువున మేను సేర్చి మూర్ఛిల్లుటయు నార్తి నొంది యక్కుంతీనంద నాగ్రజుం డిట్లని పలవించె. 039
క. కరి దశసహస్ర బలవి | స్ఫురితుఁ డగు విచిత్రవీర్యపుత్త్రుఁ డొక తలో
దరి నూఁత గొనియె; విధి యె | వ్వరి హీనులఁ జేయఁ డకట వక్రుం డైనన్‌!
040
చ. ‘అనిలజు మేని చంద మగు నాయసరూపము చూర్ణితంబు చే
సిన బలమాననీయుఁ డొక చేడియ నక్కట; యాశ్రయించె; నే
మనఁగల దవ్విధాతృ’ నని యాతని కీడును మానసంబునం
జొనుపమి లావు పేరుకొని శోకము ధర్మజుఁ డొందె భూవరా!
041
సీ. అప్పుడు గాంధారి యల్లన ధర్మజు | తోడ ‘మీతండ్రి యతుల తపంబు
తోడి సంతతచింతఁ గూడు దొఱంగి తా | నుండుటఁ గూర్చుండ నోప కునికి
నిట్లయ్యె’ ననవుడు నెవ్వని కతమున | నిమ్మహాత్మున కిట్టి యెడరు పుట్టె
నట్టి నా మనువు నే మనఁ గల?’ దంచు నా| తఁడు శీతజలము హస్తమునఁ బుచ్చి
 
ఆ. కొని యతని మోమునందు నక్కున విదిర్చు | సమయమున విదురుండును సంజయుండు
నఖిలభరతభార్యలు నేడ్చి రవ్విభుండు | నివిరెఁ జలికేల నా నృపు నవయవములు.
042
క. నివురంగఁ దెలిసి యతనిం | గవుఁగిటిలోఁ జేర్చి మస్తకము మూర్కొను కౌ
రవవృద్ధు నతఁడు నా శ్లే | ష విశేషంబున నొనర్చె సంప్రీతునిఁగన్‌.
043
వ. అట్లు తెలివొంది ధృతరాష్ట్రుండు ధర్మరాజుతో ‘నా కెట్లునుం దపంబునకయి కాననంబునకుం బోవ వలయు’ ననిన నజ్జనపతి, ‘నీ వారగింపు; మప్పని మఱి చెప్పెద’ నని త్రోపు మాటగాఁ బలికిన నయ్యాంబికేయుండు ‘పెక్కుమాట లాడ శక్తి లేదు; న న్నింక నలజడిఁ బెట్టకుము; తపశ్చరణంబునకు నీ యాజ్ఞ వడసి కాని కుడువ’ ననియె; నయ్యవసరంబున సాత్యవతేయుండు కృపావిధేయుండై యచటికి వచ్చి సకలజనంబుల వినతులు గైకొని దీవన లిచ్చి యా ధర్మతనయు నాననం బాలోకించి. 044
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )