| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘ఆంబికేయుఁడు చెప్పినట్టుల చేయుము | వృద్ధుఁడు నాత్మజ విరహితుండు నైన యీతఁడు తప మాచరింపఁగఁ గోర | కున్నె? గాంధారి శోకోపశమము తాలిమి నొదవి యిందాఁకఁ బ్రవర్తించె; | నింక నియ్యమకును నిదియ తలఁపుఁ గావున నీకు నీ కార్యంబు చెప్పంగ | వచ్చితి; వీరిఁ బోనిచ్చు టొప్పు |
|
| తే. |
ననఘ! పూర్వ రాజన్యులు చనినయట్టి | సౌమ్యపథమున నీ రాజు చనుట మేలు గాన నీతని కానన గమనమునకు | ని మ్మనుజ్ఞ విచారంబు లెల్లఁ దక్కి. |
045 |
| క. |
నీ వినయము భక్తియు, సం | భావనమును వీరి వగలఁ బాపఁగ శుశ్రూ షావశవర్తిత నడచితి | భూవర! చిరకాల మింకఁ బోనిమ్ము తగన్. |
046 |
| చ. |
అన విని యాకురుప్రవరుఁ డమ్మునివల్లభుమోముఁ జూచి యి ట్లను - మహితాత్మ! మాకు గురుఁ డన్నను ధర్మవిధోపదేష్ట య న్నను బరదైవ మన్నను మనః ప్రియకార్యకలాపకర్త య న్నను విను నీవ; నీదువచనంబున కడ్డము పల్కువాఁడనే?’ |
047 |
| ఆ. |
అనిన నమ్మహాత్ముఁ డను ‘రాజులకు రణ | మరణ మొండె దృఢ సమాధిఁ దనువు విడుచు టొండెఁ గాక వృద్ధులై రోగ త | ల్పమునఁ జావు మేలె భరతముఖ్య!’ |
048 |
| వ. | అనిన విని ధర్మతనయుం డొండు పలుక వెఱచి యిట్లనియె. | 049 |
| క. |
అనఘా! యిక్కురుముఖ్యున | కనుజ్ఞ యే నిచ్చితిని మహత్తర మగు మీ యనుమతియుఁ బడసెఁ జనుఁ గా | క నిజేచ్ఛను నాకు విఘ్నకరణముఁ దగునే?’ |
050 |
| సీ. |
అనుటయుఁ బ్రియ మంది యమ్మహాముని యమ్మ | హీశ్వరుతోఁ ‘బాండుఁ డీ నృపాలు గద్దియ నిడికొని క్రతువులు సేయించి | యవిరళభోగానుభవము నడపి యీతని వారలఁ బ్రీతి నీక్షించి తా | శిష్యుండ పోలె సంసేవనంబు భక్తిమై నొనరించెఁ; బదపడి నీవును | దిగ్విజయాదులఁ దేజమితని |
|
| తే. |
నొందునట్లుగఁ జేసితి వొకటఁ; బిదప | దాన పదుమూఁడు వర్షముల్ ధరణి యేలె; నీవు శుశ్రూష యిత్తఱి నియతి నడపి | తితని మది లేదు కలఁక యొక్కింత యేని. |
051 |
| క. |
కేవలతపః క్రియా సం సేవన తాత్పర్య మిపుడు చిత్తంబునయం దావేశించినయది యీ | భూవరునకు నితని ననిచిపుచ్చు మడవికిన్ |’ |
052 |
| ఆ. |
అనిన ధర్మ తనయుఁ ‘డట్టుల కా కని’ | పలికెఁ దత్‌క్షణంబ పరమయోగి వంద్యుఁ డయిన సత్యవతి కొడు కాత్మత | పోవనమున కరిగె భూపవర్య! |
053 |
| సీ. |
తదనంతరమ ధర్మతనయుండు ధృతరాష్ట్రు | తోడ నీ కెట్టుల సూడఁ బోలె విదురుండుఁ గృపుఁడు నెయ్యది కృత మని విని | శ్చయ మొనరించిరి సంజయుని యు యుత్సుని మనముల నొలసిన కర్తవ్య | మెద్ది దానిన చేయు టెంత యేని నాకుఁ బ్రియంబు భూనాథ యానతుఁడ నై | వేఁడెద నొకటి నీ విశదబుద్ధి |
|
| ఆ. |
నేమి సేయఁదలఁచి తేని నీ వక్కట | యారగించి చేయు మయ్య!’ యనుడు నరిగె నా నృపాలుఁ డభ్యంతరావాస | మునకుఁ దోన సుబలతనయ సనఁగ |
054 |
| వ. | ఇట్లు కురువృద్ధుండు వృద్ధసామజంబు చందంబునం జనునప్పుడు విదురుండును, యుయుత్సుండును గృపాచార్యుండును, సంజయుండును వెనుకన చని; రజ్జనపతి దివసకృత్యంబు లాచరించి భూమిసురులం బూజించి యాహారతంత్రంబు నిర్వర్తించె; గాంధారియుఁ గుంతీ ప్రముఖ భరత భార్య లనునయింప భోజనవిధి యొనర్చెం; దదనంతరంబ విదురాదులుం బాండవేయులును వనితా జనంబులుం గృతాహారులయి యా వైచిత్ర్యవీర్యుం బరివేష్టించియుండఁ, బాండవాగ్రజు నిప్పాండునృపాగ్రజుం డేకాంతస్థానంబునకుం దోడ్కొనిపోయి యతని తోడ ‘సప్తాంగం బయిన రాజ్యంబు పూజ్యం బగుధర్మంబుతో నెనయ నడపుట దుష్కరంబు గావున నా యెఱిఁగినంత బోధించెద నాకర్ణింపు’ మని పలికి యిట్లనియె. | 055 |