పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు ధర్మజునకు రాజనీతి విశేషంబులు చెప్పుట (సం. 15-9-7)
సీ. ‘నీవు నిచ్చలును విద్యావృద్ధజనములఁ | దగ నుపాసింపు, మర్థముల వారిఁ
బ్రీతులఁ జేయుము; నీతులు వా రుప | దేశింప వాని నూఁదినమనంబు
గలిగి నిర్వర్తింపు; కార్యంబు నింద్రియం | బుల రాజ్యతంత్రంబుఁ బోలె నరసి
రక్షింపు; మప్పిండు రక్షితం బైన శు | భంబులం గావించు; భావశుద్ధి
 
ఆ. ధామములును బితృపితామహక్రమసమా | గతులు విశదమతులుఁ గాఁగవలయు
సచివు; లతివిదగ్ధ చారులఁ బనుపుము | పరుల యాప్తజనుల భంగు లరయ.
056
క. పురరక్షణము దృఢంబుగ | నరవర! చేయంగవలయు నమ్మఁగలుగు స
త్పురుషుల నిడఁ దగుఁ గుడుపు ని | దుర మొదలగులోని పనుల తొడరువు లరయన్‌.
057
సీ. ఆప్త వృద్ధులఁ బెట్టు మంగనాజనులసం | రక్షకు నెల్లకార్యముల మంత్రి
జనములతోడ విచారించి చేయంగ | వలయును; గుప్త నివాస మొండె
మాడువు మీఁ దొండె మాటు లేని యరణ్య | తల మొండె మంత్ర విధానమునకు
నర్హముల్‌ గేవల మైనట్టి మంత్రంబు | గోపనం బొందినఁ గురువరేణ్య!
 
ఆ. యఖిల కర్మములు ఫలావాప్తి నొప్పుఁ బం | గ్వంధజడులు బధిరు లైన నీ ర
హస్య భాషణములయప్పుడు చేరువ | నునికి యొప్ప దార్యవినుతచరిత!
058
క. విను మంత్ర భేదనమున వ | చ్చిన కీడున కనఘ! శాంతి సేయు టరిది గా
వున మంత్రులతో మంత్రా | వన నియమం బూఁది చెప్పవలయుం జుమ్మీ!!
059
సీ. వ్యవహారములు శుచు లైన విద్వాంసులఁ | దోడుగఁ గొని తీర్పు; దుష్టజనుల
దండించునెడ వారి తప్పుల కొలఁదులు | మదిఁ దూఁచి చూచి తన్మాత్రదండ
మాచరింపుము; విను మాయవ్యయములు సం | క్షేపరూపంబున రేపకడలు
దానికి మును దేవతాపూజనము భూసు | రార్చనమును జేయు మమలబుద్ధి!
 
తే. ప్రొద్దు సాలంగ నెక్కినప్పుడు సమర్హ | భోజన క్రియ నిర్వహింపుము సుశీల
మాన్య! తదనంతరమ గంధమాల్యభూష | ణాంబరములు నిజేచ్ఛమై ననుభవింపు.
060
క. కొలు విమ్ము మాపుకడ యో | ధుల కెల్లను; సంధ్య వడ్డ దూతలనుం జా
రుల సంభావింపుము; రా | త్రులఁ గాంతాభోగతత్పరుఁడ వగుము నృపా!
061
తే. ఏమి క్రొత్తగఁ బుట్టిన నించు కేని | నలసుఁడవు గాక దాని నీ వరసి తీర్పు;
మిది దెఱంగుగ నే ప్రొద్దు నింతవట్టు | నర్హములు కౌరవక్షితిపాగ్రగణ్య!
062
క. న్యాయంబుతోడ వివిధో | పాయంబుల నర్థముల నుపార్జింపుము భూ
నాయక రాజ్య విఘాతము | సేయు జనుల నెఱిఁగి చంపఁ జెఱుపన వలయున్‌.
063
క. పనులయెడ మేలు గాంచిన | మనుగడ యగ్గలము చేసి మన్నింపుము రా
జనయజ్ఞ! భృత్యకోటిం | గొనియాడుము సేఁతపేరు క్రుచ్చి కొలువునన్‌.
064
క. నీ వలనను భక్తిస్నే | హావేశము గలిగి శూరుఁడై యలజడికిం
దా విసువని సత్కులజుం | గావింపుము సైన్యవిభునిగాఁ గురుముఖ్యా!
065
సీ. ఆత్మరంధ్రము లించు కైనను నొరులకు | నెఱుఁగ రాకుండఁగ మఱువు సేయు
మన్య రంధ్రంబుల నారసి కనుము; శ | త్రుల కడ బుద్ధియు బలుపుఁ గలుగు
వారల నెఱిఁగి భూవర! యొక్కమై నీగి | మన్నన నెఱపి తన్మానసములు
నీ యెడ నార్ద్రంబులై యుండఁ జేయుము | చేరువనృపులకు వైరబంధ
 
ఆ. మెట్లు గలుగు దాని నేమఱకుండుము | వారి యవుల నున్నవారు మిత్రు
లగుదు రెల్ల భంగి నధిప! యుదాసీను | లట సమీపవర్తు లైన విభులు.
066
క. వీరుల సప్తాంగంబులు | నారసికొని యునికి కార్య మవనీశ! సదృ
క్సారబలుఁ డైన నృపుతో | గారవమున సంధి సేయఁగావలయుఁ దగన్‌.
067
తే. దైవమానుష బలములు దఱిఁగి యుండు | నెవ్వనికి నెప్పు డప్పుడ యెసక మెసఁగ
వైర మతనితోఁ బాటింపవలయుఁ జెఱుచు | టప్పనము గొను టర్హత్వ మరసి నడపు.
068
క. నడపునఁ గోల్పుచ్చఁగ నగు | నెడయు విడిసి యుండి చెఱుచు నిక్కయు నీ వే
ర్పడఁ గనుఁగొని యం దర్హము | నడపుము; నిజసైన్య రక్షణము వలయుఁ జుమీ!
069
క. ప్రెగడల మనసులు విరసము | లగుగతి నడచు రిపురాజ్య మరసి విభిన్నం
బుగఁ జేసి కలఁచి పైకొని | జగతీవర! కొనఁగవలయు సౌకర్యమునన్‌.
070
ఆ. బలము లెసఁగ దైవబలమును గలిగి లో | గుట్టు చేటు లేనియట్టి నృపతి
వలన మత్సరంబు వల; దాశ్రయంబు చం | దంబు పొందు వడయఁ దగు నృపాల!
071
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )