పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు ధర్మరాజునకు శత్రురాజుల జయించు తెఱంగు చెప్పుట (సం. 15-12-6)
ఆ. కుడువ నిచ్చు తఱియుఁ గురువర! కక్కించు | నవసరంబు నెఱిఁగి యరినృపాలు
నీవు ధీరవృత్తి నిడుఁ ద్రాటఁ బోనిమ్ము | క్రమ్ము కపిల యనఁగ గ్రమ్మి చెఱపు?
072
సీ. ఉత్సాహ శక్తియు నుర్వీశ మంత్రశ | క్తియుఁ బ్రభుశక్తియుఁ గెలనివాని
కిని నీకు నిట్టివి యని తారతమ్యముల్‌ | వెరవునఁ బరికించి వేర మెత్త |
వలయుట నెఱిగల్గి పలుకక యుండంగఁ | దగుట యూహించు టుత్తమ విధంబు ;
మూలబలంబును మొత్తాలవారును | మిత్త్రబలంబును శత్రుబలముఁ
 
ఆ. గాననంబు బలముఁగై జీతగాండ్రును | నైనయట్టిబలము లాఱు నరసి
యుచితకాల దేశ యుక్తంబులుగఁ బన్ని | కొనఁగ వలయు వాని కొలఁదు లెఱిఁగి.
073
తే. సంపదల నాపదల నొక్క చంద మగుట | వికృతి నొందుట యా బలవితతులందుఁ
గాంచి యెల్లప్పుడును హితకారి యైన | బలము నెక్కుడుగాఁ బ్రోవు భరతముఖ్య!
074
క. పరుల గెలిచి నిర్భయముగ | ధరణిఁ బ్రజం గాచువెరవు ధర్మపథమునం
బరిపాలించిన వెలయుం | గురువర! కృపపెంపు వదలకుము ప్రజలయెడన్‌.
075
క. వినికి గలిగి రక్షించుచు | ననువున దయతోడిపాడి నాయతు లెల్లం
గొనుచుఁ దగ నేలి పొగడొం | దినరాజున కుర్వి కామధేనువ కాదే!
076
సీ. ధర్మమార్గంబున ధరణిఁ బాలించిన | నైహిక సుఖములు నగ్గలంపుఁ
బొగడును బరలోక భూరి సౌఖ్యములును | సిద్ధించు; విపుల దక్షిణలు పెట్టి
యశ్వమేధ ప్రముఖాధ్వరంబులు పెక్కు | లాచరించుట కంటె నధిక మండ్రు
మేదినీ ప్రజల నత్యాదరంబును గరు | ణాతిశయంబు మధ్యస్థతయును
 
తే. గలిగి బిడ్డల నరసిన కరణి గాఢ | రక్షణం బొనరించుట రాజవర్య!
వినుము తమ్ముల నీగి మన్ననల ననుది | నంబుఁ గొనియాడు మానందనంబు గాఁగ.
077
చ. నరవర! రాజనీతుల జనస్తుతుఁడైన నదీ తనూజుఁడున్‌
హరియుఁ బరాశరాత్మజుఁడు నాదిగఁ గల్గిన పెద్ద లెల్ల నీ
కరయఁగఁ బెక్కు సెప్పిరి; మదాత్మయు నీదెసఁ బ్రీతి పెద్దయుం
బొరయుట నేనుఁ గొన్ని యిటు పోలిన భంగి నెఱుంగఁ జెప్పితిన్‌.
078
క. నిత్యవిధి సద్వివేకము | సత్యవ్రతశీల! ధర్మసారజ్ఞ! భవ
న్మత్యాకలితమ యైనను | నిత్యంబును వృద్ధసేవ నిష్ఠఁ జలుపుమీ!’
079
సీ. అన విని ధర్మజుం డంబికా పుత్త్రుతో | ‘నాపగాసుతుఁడు లేఁ’ డబ్జనాభుఁ
డాత్మపురంబున కరిగె; వాత్సల్యత | నీవు దక్కఁగ నాకు హితము సెప్ప
నొడయఁ డెవ్వఁడు? భవదుపదిష్ట పథమున | నిష్ఠమై నడచెద; నెమ్మనమున
నీవు ప్రీతిని బొందు నృపముఖ్య!’ నావుడు | నాతఁడు సంతసమంది యతని
 
ఆ. ‘నధిప! విశ్రమింపు మధికశ్రమంబు నా | తనువునందుఁ జెందె’ నని తగంగఁ
బోవఁ జెప్పి; బాంధవావళి కభిముఖుఁ | డయి నిజాలయముల కరుగఁ బనిచి.
080
వ. తాను నభ్యంతర గృహంబున కరిగి సుఖాసీనుం డైయున్న నమ్మానవనాథుతో గాంధారి ‘దేవా! వనంబున కెపుడు విచ్చేయువాఁడ?’ వని యడిగిన, నా భూవల్లభుం డద్దేవి కిట్లనియె. 081
క. మా తండ్రి పరాశరసుతు | చేతం బడసితి ననుజ్ఞ; శీలపరత్వో
పేతుఁ డగు ధర్మతనయుఁడు | ప్రీతి నొడంబడియె బంధుబృందయుతముగన్‌.
082
ఆ. ఇంకఁ దడయ నేల? యింతి! వే వెడలుద | మట్లు కల్లజూద మాడి పాప
భాగు లైన నీదు పట్టుల సుగతికి | ననుచువాఁడఁ దపము నతిశయమున.
083
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )