| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని పలికి యమ్మగువదిక్కు మొగం బయి ‘ వారికి సుగతి గల్గునట్లుగా నిప్పుడును గొన్ని పుణ్యక్రియ లజాతశత్రుననుమతితో నాచరించి పోదము గాక!’ యని నిశ్చయించి తనకుఁ దపోవనగమనంబునకై పౌరులయనుజ్ఞ గొనవలయు నని పాండవాగ్రజునకుం జెప్పం బనిచిన నతండు దగుపురజనంబుల నెల్లను బడి చేసి వెలార్చికొనుచు నఖిలబంధుమిత్త్రులునుం దానును వచ్చి ధృతరాష్ట్రు మందిర ద్వారపురోభాగంబున నిలిచె; నయ్యాంబికేయుండు గాంధారియుం దోడ రా వెడలి వారి సన్నిధికిం జని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సంకులం బైయున్న యన్నగర జన ప్రకరంబు నుద్దేశించి. | 084 |
| సీ. |
‘కౌరవ కోటియు మీరుఁ బెద్దయుఁ గాల | మనఁగి పెనంగి యన్యోన్య సంభృ తాధిక స్నేహుల రై ప్రవర్తించితి | రనఘవర్తనులార! వినుఁడు నాదు పలుకు; వృద్ధునకుఁ దపశ్చరణంబున | కై వనంబున కేఁగు టర్హ కర్మ; ముచిత కృత్యంబుల యోజ మీ రెఱిఁగిన - యదియ కా మదిముదమార మీర |
|
| ఆ. |
లెల్ల నా కనుజ్ఞ యిచ్చి కానకుఁ బుచ్చుఁ | డనుడు సర్వజనులు నశ్రు పిహిత దృష్టు లగుచు గద్గదిక నెలుం గెడలఁగ | నార్తి దోఁప నేడ్చి రధిపముఖ్య! |
085 |
| వ. | విని ధృతరాష్ట్రుఁడు వారి కిట్లనియె. | 086 |
| సీ. |
‘ప్రజ ముద మొందంగఁ బాలించెఁ బుడమి శం | తనుఁ; డనంతరము శాంతనవు చేత రక్షితుఁ డగుచు మీరలు ప్రీతిఁ బొదల వి | చిత్రవీర్యుండు నిద్ధాత్రి యేలెఁ | బదపడి పాండు నృపాలుండు మీరు హ | ర్షింపంగ భూమి రక్షించెఁ బిదప ధర్మనందనుని చందము మీ యెఱింగిన | యది; సత్యధర్మాత్ముఁడైన యితని |
|
| తే. |
ననుసరింపక యన్యాయ మాచరించి | దుర్ణయంబున నిల యేలి త్రుంచెఁ గులము నుర్విఁ గల భూపతులను దుర్యోధనుండు; | వాని దుశ్చేష్టలకు మూల మేన కాదె! |
087 |
| వ. | అది మీ మనంబులం బెట్టక. | 088 |
| క. |
మహి లెస్సఁగ రక్షించిన | మహిత గుణుల యన్న కొడుకు మనుమం డని నా కు హితంబు గోరి కరుణా | సహితుల రై యిం డనుజ్ఞ సద్వ్రతమునకున్. |
089 |
| వ. | అని యప్పు డజ్జనంబులమనంబుల లేకున్నను దన కీ ళ్లుగ్గడించి యరణ్యగమనానుజ్ఞాకరణంబునకుఁ బ్రార్థించి యవ్విభుండు వెండియు. | 090 |
| ఆ. |
వృద్ధ కృపణ పుత్త్ర విరహిత గాంధారి | యీ నెలంతఁ జూచి యైన మీర లకట! కాననమున కరుగుట మే లని | మా కనుజ్ఞ యిండు మాన్యులార!’ |
091 |
| వ. | అని పలికి పాండవాగ్రజుం జూపి. | 092 |
| సీ. |
తమ్ముల నడుమ నీతండు దిక్పాలక | మధ్య భాసితుఁ డైన మఘవుఁ బోలి మహనీయ విభవ సమగ్రత వెలిఁగెడు | నేమిట నేమఱ కెపుడు మీర లీతనిఁ బొదివి సంప్రీతిగ వర్తింపుఁ | డయ్య! యిల్లడ యిమ్మహానుభావు నిడితి మీకడ; మిమ్ము నెల్ల భంగులఁ దన | పరిపాలనంబునఁ బరమసుఖులఁ |
|
| ఆ. |
గా నొనర్చువాఁడు గా నప్పగించిన | వాఁడ నేను మీకు వేఁడి దాఁకు నట్లుగాఁ జరింప నస్మత్కులీనుల |కధిక దుఃఖకారి నైతిఁ గాని. |
093 |
| క. |
అరయ నెన్నం డైనను | మీరలు నా కెగ్గు గాఁగ మెలఁగుట లే; దో పౌరవరులార! నన్నున్ | గారవమున ననుపరయ్య కాననమునకున్!’ |
094 |
| వ. | అనినం బౌరజనంబు లేడ్పులు మ్రింగికొని యొండొరులం జూచుచు నూరకున్న నమ్మహీశ్వరుండు మఱియును. | 095 |
| సీ. |
‘సాధుచరిత్రయు శాంతయు నైన యి | గ్గాంధారియును నేను గాఢ వినయ మార మీ తెలి విట్లు గోరుచు నున్నార | మఖిల ధర్మాభిజ్ఞుఁ డగు పరాశ రాత్మజుండును ధార్మికాగ్రణి పాండవా | గ్రజుఁడును నాకు నరణ్య గమన మునకు నిచ్చి రనుజ్ఞ; మోడ్పుఁ గే లౌదలఁ | గదియించి మిమ్ము వేఁడెదఁ గృపాఢ్యు |
|
| తే. |
లార! యనుమతి సేయుఁడు మీరు’ ననుడు | వార లుత్తరీయంబులు వదన వినిహి తములుగాఁ జేసికొని రోదనము రవంబు | లెసఁగఁ జేసిరి విను ధరణీశవర్య! |
096 |
| వ. | అట్లేడ్చి యుడిగి తమయంతవట్టునుం గూడికొని కార్య వచనంబు లార్యచరితుండును జతురాలాప కల్యుం డును నగు శంబు వను విప్రోత్తమునకుం జెప్పి యిత్తెఱంగున ధృతరాష్ట్రునితో నాడుమని నియోగించిన నాతం డారాజు నగ్రభాగంబునఁ జేరి సవినయంబుగా ని ట్లనియె. | 097 |