పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
ద్రౌపది శ్రీకృష్ణునితోఁ దన పరిభవంబు సెప్పి దుఃఖించుట (సం. 3-13-42)
వ. అఖిల రాజలోక పరివృతుండయి యున్న నారాయణునొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్త్రి ముకుళిత కరాంబుజ యయి యిట్లనియె; ‘దేవా! నిన్ను నాదిప్రజాసర్గంబునఁ బ్రజాపతివని యసితుం డయిన దేవలుండును, సత్యంబువలన యజ్ఞం బుద్ధరించుటంజేసి నిత్యసత్యమయుండవయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును, నవయవంబుల లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వమయుండ వని నారదుండును. నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి. 133
మధ్యాక్కర అని ననివృత్తులై పుణ్యచరితులై యాత్మప్రబోధ
వినిహితచిత్తులై సర్వధర్మార్థవిదులయి తృప్తిఁ
దనరెడు రాజర్షివరులకును యోగధరులకు సాధు
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య!
134
వ. నీ యంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం బెఱింగించెద. 135
సీ. పార్థివప్రభుఁడైన పాండుమహీపతి | కోడల నయి, యుద్ధకుశలు లయిన
పాండుతనూజుల భార్యనై, పూజ్యుఁడ | వైన నీ యనుజనై, యధికశక్తిఁ
బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు | పట్టిచే సభఁ దలపట్టి యీడ్వఁ
బడి, పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ | బడి, దారుణం బైన పరిభవంబు
 
ఆ. పడితి; నట్టి నన్నుఁ బాండవుల్‌ సూచుచు | నుండి రొరులు వోలె నుక్కు దక్కి;
యాపగాతనూజుఁ డాదిగాఁ గల వృద్ధ | బంధుజనులు సూచి పలుక రయిరి.
136
క. శరణనినవారిఁ గరుణా | కరులయి రక్షించు పురుషకారాన్వితులే
శరణని యఱచిన నాలిం | పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్‌?
137
వ. భ్రాతృ పుత్త్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేని వారయి; రట్టియెడం గర్ణుండు నన్నుం జూచి నగియె. 138
ఆ. కర్ణునగవు లోకగర్హితుండగు దుస్స | సేను చెయిదికంటె శిఖియ పోలె
నడరి నా మనంబు నతిదారుణక్రియ | నేర్చుచున్నయది మహీధరుండ!
139
వ. తొల్లివేదాధ్యయనంబుసేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబునఁబ్రమాణకోటియందు సుప్తుండయిన భీమసేను నంటఁగట్టి గంగమడువునం ద్రోపించియు, విషంబుఁబెట్టియు, విషసర్పంబులంబట్టి గఱపించియు, జననీసహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబుఁ బ్రయోగింపం బంచియు ననేకంబులైన యపకారంబులు సేసి, యిప్పుడు దుర్యోధనుం డధర్మద్యూతంబున రాజ్యంబు నపహరించి, రాజలోక సమక్షంబునం దమ్ము నిరాకృతులం జేసినను బరాక్రమపరాఙ్ముఖులైన పాండవులు నా పడిన పరిభవంబు నెట్లు దలఁగెద?’ రని బాష్పధారా స్నపితపయోధర యయి పాణిపల్లవంబున నయన సమ్మార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసుదేవుం డిట్లనియె. 140
చ. ‘తనుకుచు నున్న నీ హృదయతాప నిమిత్తమునన్‌ సురేంద్రనం
దను పటుబాణపాతహతిఁ దద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసా
దనమున కేఁగుఁ జు; మ్మిదియ తథ్యము; నా వచనంబు దప్ప ది
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్‌.
141
వ. అనిన నర్జునుండు ద్రౌపదిం జూచి యిట్లనియె. 142
వ. ‘ఈ పురుషోత్తముండు మన కిందఱకుం గుశలంబు సేయుచుం
బాపకలంకపంకములఁ బాయఁగఁ జేయుటఁ జేసి దుర్మదో
ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం
తాపము నీకుఁ జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గియుండఁగన్‌.’
143
వ. అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డిట్లనియె. 144
క. ‘వినయవిహీనుల దుర్యో | ధన దుశ్శాసనులఁ బవనతనయుఁడు, రాధా
తనయుని నరుఁ, డేఁ గుంభజు | ననిఁ జంపుదు; మేల వగవ నంబుజనేత్రా!’
145
వ. అని యందఱు ద్రుపదరాజపుత్త్రి నాశ్వాసించి; రంత నచ్యుతుండు ధర్మరాజున కిట్లనియె. 146
తే. ‘ద్వారవతినుండి యే యుయుధానువలన | ధారుణీశ! యింతయు విని తత్‌క్షణంబ
యరుగుదెంచి యాపన్నుఁడ వైన నిన్నుఁ | జూచి దుఃఖోపహతమనస్కుండ నైతి.
147
వ. అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వ్యసనంబు సంభవిల్లెం; గామజంబులైన స్త్రీ ద్యూత మృగయా పానంబు లను నాలుగు దుర్వ్యసనంబులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు; నందును విశేషంబుగా ననర్థమూలంబయిన పాపద్యూతంబుఁబరిహరింపనినాఁడు పాపం బగు నని హేతుదృష్టాంతంబులు సూపి, కృప ద్రోణ విదుర గాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు. 148
క. వలచి హితంబునఁ బథ్యముఁ | బలికినఁ జేకొనని ధర్మబాహ్యుల నవివే
కుల నిగ్రహింతు; మీ కె | గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్‌?
149
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )