పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట (సం. 3-15-1)
వ. ఏను సముద్ర తీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్ధంబు సేసి వాని వధియించుపొంటె నక్కడ మసలితి; నది గారణంబుగా మీకు దుర్వ్యసనావసరంబున నలబ్ధసన్నిధానుండ నయితి’ ననిన ‘నది యె’ ట్లని యుధిష్ఠిరుం డడిగిన, నాతనికి సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగాఁగృష్ణుండిట్లనిచెప్పె; నీ యజ్ఞంబున నర్ఘ్యనిమిత్తంబున నసహిష్ణుండయిన శిశుపాలుండు నాచేత నిహతుం డగుట విని, వాని తమ్ముండు సాల్వుండను వాఁడు తద్వధ ప్రవర్తిత క్రోధుండయి కామగమనంబైన తన సౌంభకం బను నగరంబుతో సన్నద్ధుండయి వచ్చి ద్వారవతీపురంబు నవరోధించి. 150
చ. ‘ప్రతినరపాలకాలు శిశుపాలు బలాధికుఁ జంపి దర్పసం
హితుఁ డగుచున్న వృష్ణిఖలుఁ డెక్కడ? నెక్కడ? నాతనిం జయో
న్నతి వెలయంగఁ జంపెద రణంబున’ నంచు నలంఘ్యవిక్రమో
ర్జితుఁ డయి దానిచుట్టు విడిసెం జతురంగమహాబలంబుతోన్‌.
151
క. మేలగు తత్పురబాహ్యవి | శాలోద్యానముల తాల సాల సరళ హిం
తాల తమాలావలి ని | ర్మూలితముగఁ జేసెఁ దచ్చమూసామజముల్‌.
152
వ. మఱి తృణజలధాన్య సమిత్సమృద్ధంబయి శతఘ్నీప్రముఖానేక యంత్రంబుల నలంఘ్య పరిఖా ప్రాకారంబులను, నపార బల రక్షిత ఘనకవాట చతుర్గోపురంబులను, లబ్ధ ప్రభూత వేతన ప్రహృష్ట పుష్ట ధృష్ట వీర సుభట సంకులంబులను, నపరిమిత గజతురంగ శతాంగంబులను, బ్రదీప్తాలాత శాత శర చక్ర తోమర పరశుపాశాంకుశ కూటంబులను, వీరయోధారూఢ విశాలాట్టాలకంబులను నొప్పి పరుల కసాధ్యంబయిన ద్వారవతి భేదింప నేరక దాని వెలిం బ్రపా చైత్య దేవాయతన వల్మీకంబులు వర్జించి సమతలప్రదేశంబున నిబిడంబుగా శిబిరసన్నివేశంబు సేసి నిత్యంబు నుపద్రవంబు సేయుచున్న సౌంభక విజృంభణంబునకు సహింపక, సమరసంరంభంబున సర్వాయుధ సన్నద్ధులయి. 153
క. ఉద్యద్బలులు గుమారులు | విద్యాధరసములు పురము వెలువడిరి రణై
కోద్యములు చారుదేష్ణుఁడుఁ | బ్రద్యుమ్నుఁడు సాంబుఁడును విపక్షజిఘాంసన్‌.
154
మణిభూషణము. రామవిక్రముఁ డజేయుఁ డరాతి గజావలీ
సామజాహితుఁడు సాంబుఁడు సాల్వచమూపతిన్‌
క్షేమవృద్ధి యనువాని నకృత్రిమ సాహసో
ద్దాముఁ దాఁకె శరధారల ధారుణిఁ గప్పుచున్‌.
155
క. జాంబవతేయు బృహద్విశి | ఖంబులకున్‌ బెదర కెదిరి ఘనుఁ డేసె రణా
గ్రంబున నాతనిపై నవి | లంబితుఁడై క్షేమవృద్ధి లక్షశరంబుల్‌.
156
వ. వాని యేయు శరంబుల నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనదపుంఖంబులయిన విశిఖంబులం దదీయ రథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి యతివేగంబున రణంబు వెలువడ రథం బీడ్చుకొని సారథికి వశంబుగాక పఱచె; నట్లు సాల్వ చమూపతి సమరవిముఖుం డయిన. 157
స్వాగతము వేగవంతుఁ డను వీరుఁడు సాంబున్‌
వేగవంతుఁ డయి వీఁకను దాఁకెన్‌
వేగ బాణపదవీ తతులన్‌ ది
గ్భాగముల్‌ విశిఖపంజరముల్‌ గాన్‌.
158
ఆ. సాంబుఁ బాయు మనుచుఁ జారుదేష్ణుం డల్గి | వేగవంతుఁ దాఁకి వీఁకతోడ
వాని మస్తకంబు వ్రయ్యంగ వడి గదం | బొడిచె రుధిరవారిపూర మొలుక.
159
వ. ఇట్లు చారుదేష్ణు నిష్ఠురగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుండయి నిర్ఘాతపాత భిన్నోన్నతగిరి శిఖరంబునుంబోలె నేలఁ ద్రెళ్ళినం జూచి విచింత్యుం డను వాఁ డవిచింత్యవిక్రముం డయి. 160
తే. చారుదేష్ణుపైఁ గడువాఁడిశరము లేసె; | నతఁడు కార్ముకహస్తుఁడై యాక్షణంబ
వానిపై నభిమంత్రించి వహ్నిబాణ | మేసె నుగ్రస్ఫులింగంబు లెసఁగఁ జదల.
161
క. అనలాస్త్ర మట్లు వక్షముఁ | గొనిన విచింత్యుండు గూలెఁ గుతలం బద్రువన్‌;
ఘను వానిఁ జూచి హా హా | స్వనము లెసఁగ సాల్వుసేన సంక్షోభించెన్‌.
162
వ. సాల్వుండు నిజసేనా సంక్షోభం బుడిచి సర్వాయుధసనాథం బయిన రథం బెక్కి యాదవకుమారవాహిని పయి నెత్తియేయుచు వ్రేయుచుంబొడుచుచుఁ బ్రతిబలంబు నెల్ల నాయుధమయంబుగాఁజేయుచున్న వాని కలిగి. 163
సీ. హంసవర్ణోత్తమహయములఁ బూనిన | రథ మెక్కి కాంచనరమ్యయష్టి
సంభృత మకరధ్వజం బొప్ప బద్ధ గో | ధాంగుళిత్రాణుఁడై యతులశాత
సాయకావళిఁజేసి సాల్వుఁ బిల్చుచు వాని | మీఁదఁ బ్రద్యుమ్నుఁ డమేయబాణ
వర్షంబు గురిసిన, వాఁడును వానిపైఁ | గడువాఁడిశరములఁ గడఁగి యేసె;
 
ఆ. నధికవీరు లైన యయ్యిద్దఱకు నస్త్ర | కోవిదులకుఁ బోరు ఘోరమయ్యెఁ
దద్ద భయము వొంది తద్ద్వారకాపురి(ర) | సౌంభకముల జనులు సంభ్రమింప.
164
క. అనిమొన సాల్వుఁడు ప్రద్యు | మ్ననిశాతశరాలివిద్ధ మర్ముండయి పె
ల్చన మూర్ఛవోయి పడియెం | దన రథముపయిన్‌ ధరిత్రి దల్లడపడఁగన్‌.
165
ఉ. అంతన మూర్ఛదేఱి కలుషానలదీప్తముఖుండు సౌంభకుం
డంతకదండదారుణము లైన శరంబుల రౌక్మిణేయు ది
గ్దంతిబలాఢ్యు నేయుడు, నతండును మూర్ఛితుఁడయ్యె; వాని సం
భ్రాంతిఁ దదీయసారథి యపాస్తరణాంతరుఁ జేసెఁ జెచ్చెరన్‌.
166
వ. ఇట్లు మూర్ఛితుండయిన ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరంబుగా నరదంబు నిలిపికొని దారుక సుతుం డున్నంత, నొక్కింత ప్రొద్దునకు మూర్ఛ్చదేఱి ప్రద్యుమ్నుండు సూతున కిట్లనియె. 167
క. ‘ఘోరాహవరంగమునకు | దూరముగా నన్ను నిట్లు దోడ్కొని తేరన్‌
దారుకసుత! నీ కుచితమె? | వీరారంభంబు సూచి వెఱచితె? చెపుమా!’
168
వ. మఱియు సారథిం జూచి విహ్వలమానసుండయి యిట్లనియె. 169
క. ‘సమర విముఖత్వమును రణ | విముఖులఁ జంపుటయు శరణు వేఁడిన రక్షిం
పమియును యాదవవంశో | త్తములకుఁ గల నయినఁ గలవె దారుకతనయా!
170
క. విక్రమము విడిచి సమరా | పక్రాంతుఁడ నయిన నన్ను బలదేవుఁడునుం
జక్రధరుండు కుమారులు | నక్రూరాదులును నేమి యని నగరె సభన్‌.
171
వ. చెట్టసేసి తింకనయినఁ జెచ్చెర సాంబ చారుదేష్ణు లున్న చోటికి సాల్వాభిముఖంబుగా రథంబు వఱపు ‘మనిన, సారథి యిట్లనియె. 172
క. ‘రథి కిమ్ముగాని యెడ సా | రథి ధృతిమెయిఁ; గావ వలయు, రథియును దత్సా
రథిఁ గావవలయు, రథి సా | రథులు పరస్పర శరీర రక్షకు లగుటన్‌.
173
ఆ. సాల్వబాణవిగతసత్త్వుఁడ వైన ని | న్నిట్లు దెచ్చితిని; సహింప వలయు;
నా రథాశ్వముల ఘనస్యందనము నిదె | చూడు’ మనుచు సూతసూనుఁ డపుడు.
174
వ. సవ్యాపసవ్య విచిత్రమండల గతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా రథంబు వఱపిన, దాని సహింపక సాల్వుండు మూఁడమ్ముల సారథినేసి మఱియు రాక్షసమాయ ననేక శరంబులు ప్రద్నుమ్నుపై నేసిన. 175
క. అమ్మాయాశరములు భ | గ్నమ్నులుగాఁ జేసి తన్ముఖమ్మునఁ దద్వ
క్షమ్మున నొక్కట బ్రహ్మా | స్త్రమ్మును బ్రద్యుమ్నుఁ డేసె దారుణభంగిన్‌.
176
వ. ఇట్లు బ్రహ్మాస్త్రపీడితుండయి సాల్వుండు మూర్ఛవోయి రథంబుపయింబడిన వాని వెండియు నొక్కదివ్యబాణంబున నేయ సమకట్టిన నంతరిక్షంబున హాహారవంబు లెసఁగె,; నంత దేవగణ ప్రేరితులైన నారద మారుతులు ప్రద్యుమ్నుపాలికి వచ్చి యిట్లనిరి. 177
తే. ‘వీఁడు నీచేత వధ్యుండు గాఁడు, మిన్న | కేయ కుండుము.; వీని నారాయణుండు
మొనసి వధియించు’ నని పల్కె వనజగర్భుఁ | డనినఁ బ్రద్యుమ్నుఁ డేయక యనఘుఁ డుండె.
178
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )