పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
సాల్వుఁడు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట (సం. 3-20-26)
వ. అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి యవరోధం బుడిగి తన సౌంభక బెక్కి క్రమ్మఱి చనియె; నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నేనరిగి బల భగ్నీకృత పాదపవనంబుల దాని, ననభిజ్ఞాత ద్వారదేశంబుల దాని, నస్వాధ్యాయ స్వాహాకార మహీసురాగారం బయిన దాని, నపేత భూషణ యోషిజ్జనంబుల దాని ద్వారవతిం జూచి, యాహుకాత్మజువలన నంత వృత్తాంతంబును నెఱింగి, సాల్వుం జంపి కాని యిప్పురంబు సొర నొల్ల నని నిశ్చయించి, దీని నప్రమాదులరై రక్షించుకొని యుండుండని బలదేవాదులం బంచి, యప్పుడ ప్రయాణభేరి సఱవం బంచి, కృత స్వస్తి వచన పురోహిత ప్రముఖ బ్రాహ్మణ వరులకు నమస్కరించి శైబ్యసుగ్రీవంబులను వాహనంబులం బూనిన దివ్యరథం బెక్కి. 179
ఆ. పాంచజన్యరవముఁ బంచమహాశబ్ద | రవముఁ జెలఁగె దిశలు సెవుడు వడఁగ
నొలసి జనుల దీవనలు మించె రమ్యమై | గరుడకేతనంబు గ్రాలెఁ జదల.
180
వ. అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరి వన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావత దేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుండయి సముద్రకుక్షిదేశంబునకుం బోయిన. 181
క. ఏనును వాని పిఱుందన | మానక చని తచ్చమూసమాజముతోడన్‌
భూనాథ! రణము సేసితి | నానానిశితాస్త్రవర్షణవ్యాప్తముగన్‌.
182
క. వీరు లగు సాల్వయోధుల | నారాచావళులు గప్పె నా రథముపయిన్‌
సారథిఁ దురంగముల పయిఁ | జారుధ్వజయష్టిపయి నసంఖ్యాతముగన్‌.
183
వ. వాని నెల్ల నస్మదీయ గోచరంబులు గాకుండ ననేకాయుతశరంబు లేసి సాల్వుసైన్యంబుతో మహాయుద్ధంబు సేసిన. 184
మ. అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్ట శా
ర్ఙ్గ వినిర్ముక్త నిశాతసాయకశతాగ్రచ్ఛిన్నమై దైత్య దా
నవదేహప్రకరంబు వాతవిధుతార్ణఃపూర్ణ సంఘూర్ణితా
ర్ణవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్త శైలాకృతిన్‌.
185
చ. ఘనతర దైత్య దానవ నికాయ కళేబర పాత ఘట్టనం
దనరి యుగాంత్యకాలచలితంబునుబోలెఁ బయోధి మ్రోసె న
వ్వనధి రవంబుకంటె ననివారితమై చెలఁగెన్‌ మదీయ వా
హిని భట సింహనాదహయహేషిత సింధురబృంహితధ్వనుల్‌.
186
వ. అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు వెండియు సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్ధంబు సేయ సమకట్టి. 187
సీ. పరశు పాశాంకుశ కరవాల శూల ము | ద్గరములు నా మీఁదఁ దెరలఁ గురిసె;
నేనును గడఁగి యద్దానవు శస్త్రముల్‌ | వాయంగఁ జేసితి; మాయఁ జేసి
వెఱవక సాల్వుండు వెండియు నామీఁదఁ | బరుషశిలావృష్టిఁ గురిసె; వరుస
నమరఁ దమః ప్రకాశములతో దుర్దిన | సుదిన శీతోష్ణముల్‌ గదియఁ జేసి
 
ఆ. దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర | శతసహస్ర వహ్నితతులు వెలుఁగ
గగనతలము సేసెఁ బగలిది రేయిది | యని యెఱుంగ నయితి మనములోన.
188
క. మనుజేంద్ర! సర్వ మాయా | పనోదనం బయిన యగ్నిబాణంబున న
ద్దనుజ వినిర్మిత మాయా | వినివర్తనఁ జేసితిని సవిస్మయమతినై.
189
వ. అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుక్రప్రేషితుండయి యొక్కరుం డతిత్వరితగతిం బఱతెంచి ‘సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె నీ వెవ్వనితోడం గయ్యంబు సేసెదు? క్రమ్మఱి చని పురంబు రక్షించుకొను’ మనిన విని యదరిపడి ‘మహాబలపరాక్రములైన బలదేవాదులు రక్షించుకొని యుండ వసుదేవుఁ డేల పట్టువడు? నిది పోల’ దని సంశయించుచు విమనస్కుండ నయి యుండునంత. 190
సీ. పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికిఁ | బ్రీతి నేతెంచు యయాతి వోలె
భూషణదీప్తులు వొలియంగ వివృత కే | శాంబరుం డయి సౌంభకంబువలనఁ
బఱతెంచు వసుదేవుఁ బాప నిశాచర | బల పీడ్యమాను దవ్వులను కాంచి
యత్యంత మోహశోకాంధుండ నయిన నా | హస్తంబు వలన విస్రస్త మయ్యె
 
ఆ. శార్ఙ్గ మప్రియావసన్నదేహుండనై | యుడిగి రథముమీఁదఁ బడితి నేను;
దానిఁ జూచి భయము దగిలి మత్సైన్యంబు | దల్లడిల్లి యులిసెఁ బెల్లు రేఁగి.
191
వ. అంత నెంతయుం బ్రొద్దునకుఁ దెలిసి సాల్వు సౌంభకంబున వసుదేవుం గానక దాని మాయగా నెఱింగి, పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి వానిపయి నలిగి యే నేసిన నయ్యసురయు సౌంభకంబు నదృశ్యం బగుటయు. 192
క. అసురుల యాక్రోశధ్వను | లెసఁగెం బదిదిశల నంత నేనును దద్రా
క్షసుల గతాసులఁ జేసితిఁ | బ్రసభంబున శబ్దభేది బాణప్రతతిన్‌.
193
వ. అంత సాల్వుండును దన సౌంభకంబుఁ బ్రాగ్జ్యోతిషంబుఁ జేసి తానును దానవుండయి పర్వతవర్షంబు నా పయిం గురిసిన. 194
ఆ. పరుష విషమ భూరి పాషాణ భీషణ | గిరులు వచ్చి నన్నుఁ దెరలఁ గప్ప
వజ్రబాణ మేసి వాని నన్నింటిని | బాచియున్న నన్నుఁ జూచి యపుడు.
195
క. దారుకుఁ డిట్లనియె ‘మహా | వీరు నుపేక్షింపఁదగునె? వీనిని మాయా
ప్రారంభు నుపేక్షింప ర | పార పరాక్రములు పోరఁ బ్రాకృతు నైనన్‌’.
196
వ. అనిన వాని పలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళంబయి ప్రతికూల రాక్షస యక్షగంధర్వ దైత్యదానవ భస్మసాత్కరణదారుణం బయిన చక్రంబు నభిమంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాల పరివేషభీషణంబయిన రవిమండలంబునుంబోలె గగనంబునం బఱచి సౌంభకమధ్యంబునం బడిన. 197
చ. తడయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపఁగాఁ
బడి పరమేశ్వరోగ్రశరపావకదగ్ధ పురత్రయాభమై
యెడరి ధరిత్రి మీఁదఁ బడియెం జెడి సౌంభక; మంత సాల్వుఁడుం
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండువ్రయ్యలై.’
198
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )