| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి, చక్రధరుండు పాండవుల వీడ్కొని, సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాదులైన ద్రౌపదేయులం దోడ్కొని ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధంబులు ధరియించి యింద్రసేనాది మూలభృత్యు లిరువదుండ్రు ముందట రా ననేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె. | 199 |
| మధ్యాక్కర |
‘ఇది మహోగ్రాటవి, సింహశరభోరగేంద్ర శార్దూల మద గజాకీర్ణంబు, దీనిలోన నేమఱకుండ వలయు, నదియునుంగాక పరప్రయోగమాయలు గల, వెఱిఁగి మది నుండునది’ యన్న నన్న కిట్లను మఘవనందనుఁడు. |
200 |
| వ. | ‘బ్రహ్మవిదులును దపోవృద్ధులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబులనపత్రిహతులైన నారదద్వైపాయనాది మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబ కోరుచుండుదురు; భవత్ప్రతాపం బెల్లవారిని రక్షించు నివ్వనంబు సకలకాలకుసుమ ఫలభరిత వనస్పతిశాఖాశిఖారూఢమయూరకీరకోకిలాలాప మధురంబును, బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును, విమలశీతల జల ప్రవాహ నదీశోభితంబును, మహర్షి గణ సేవితంబునునై యొప్పుచున్నయది; యిందుండుదమని లలితలతావితానాది రమణీయంబులయిన వృక్షమూలంబుల నేవురు వేఱువేఱ నివాసంబులు సేసి నియతాత్ములయి యిష్టంబున దేవ పితృ కార్యంబులు సేయుచుందమ్ముఁజూడవచ్చిన మహామునులకు, బ్రాహ్మణులకు మనఃప్రియంబులయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండునంత. | 201 |
| క. |
పాండవులకడకు ధర్మ వి | దుండు తపోదహనదగ్ధదురితౌఘుఁడు మా ర్కండేయుం డను మునినా | థుం డంతేవాసిగణముతోఁ జనుదెంచెన్. |
202 |
| వ. | ఇట్లు వచ్చి వారలచేత నర్చితుండయి వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను ద్రౌపదిం జూచి యమ్మార్కండేయుం డిట్లనియె. | 203 |
| సీ. |
‘పితృనిదేశమ్మునఁ బృథివీశ్వరత్వంబు | విడిచి సానుజుఁడై పవిత్రచరిత జానకిఁ దోడ్కొని చని వనంబున నున్న | రఘుకులనందను రాముఁ దొల్లి చూచితి; నిపుడు భూసురవంశపోషకు | సాధుజనస్తుత్యు సత్యధర్మ నిత్యు ధర్మజు రమణీయకీర్తిప్రియు | శమవంతుఁ జూచితి; సగర భరత |
|
| ఆ. |
నల యయాతి వైన్య నాభాగులాదిగా | నాదిరాజులెల్ల నధిక ధర్మ సత్యయుక్తిఁ జేసి సకలలోకంబులు | వడసి భాగధేయభాగు లయిరి. |
204 |
| వ. | పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాష్ట్రునట్లు ధర్మువు దప్పినవా రెవ్వరును లేరు; మీరు ధర్మనిత్యులగు సత్యవ్రతులరు గావున మీ కిష్టసిద్ధి యగు’ నని మార్కండేయుం డరిగిన, నపరసంధ్యోపాసనాసీనుం డయిన ధర్మరాజును సాయంహోమార్థప్రజ్వలిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్ని హోత్రంబులం జూచి బకదాల్భ్యుండను మహాముని యిట్లనియె. | 205 |
| ఉ. |
‘భూమిసురోత్తముల్ ప్రకృతిపుణ్యవిధాయులు వీరు ఋగ్యజు స్సామపరాయణుల్ పరమసాధుచరిత్రులు మీకు సంతత ప్రేమమునన్ శుభోన్నతులు వెంచుచు నుండుటఁ జేసి సద్గుణో ద్దామ! యరణ్యవాస మిది దద్దయు నొప్పెడు మాకుఁ జూడఁగన్. |
206 |
| వ. | బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లివైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీవిభవులయి సముద్రనేమి భూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయిన యగ్నిదేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణ సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం డయిన రాజునకు నలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు; బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయిన రాజును బ్రజ వలవదు; ప్రజానురాగంబు లేనివానికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు ధర్మనిత్యుల; రెప్పుడును మీ కభ్యుదయం బగు’ నని బకదాల్భ్యుం డరిగినఁ, బాండవులుం దమ యిష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె. | 207 |