పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము (సం. 3-28-2)
ఆ. ‘వృద్ధు గొడుకుపలుకు విని క్రూరుఁడై పాప | బుద్ధిఁజేసి మిమ్ము భూతలంబు
వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు | డలుక సెడి సుచిత్తుఁ డయ్యె నొక్కొ!
208
ఆ. అద్దురాత్ముహృదయ మది యయఃపాషాణ | నిష్ఠురంబు; ధర్మనిధుల మిమ్ము
నట్లు గొడుకు లెగ్గు లాడంగఁ బోయిన | వలదనండ కలహవాంఛఁ జేసి.
209
సీ. విమలహర్మ్యంబుల విహరించువారలఁ | బ్రియమహార్హాసన శయనరతులఁ
జందనాగురులిప్త చారుసర్వాంగుల | నతనరనాథసేవితుల మిమ్ము
వనమునఁ గ్రుమ్మరువారిఁగాఁ గుశబ్రుసీ | శయనాభిరతులఁగా నియతరూక్ష
భూరేణుధూసరీభూతవిగ్రహులఁగా | ద్రుతవన్యమృగ నిషేవితులఁ గాఁగ
 
ఆ. నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప | శాంతి సేయుదాన? సకల భోగ
విషయవిరతిఁజేసి విధియును ధృతరాష్ట్రు | నట్లు మీకు నహితుఁడయ్యె నొక్కొ!
210
క. భవదాజ్ఞానిగళంబునఁ | దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ
యవరజు లిడుమలఁ బడి కడుఁ | జివికిరి చెఱఁబడిన సింహశిశువుల భంగిన్‌.
211
ఆ. పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి | నరుణ మగు భవత్పదాబ్జయుగము
పరుషధాతుశిలలపై నిప్పు డరుగుట | నరుణ మయ్యెఁ బర్వతాంతరముల.
212
క. అనవరత సౌఖ్యసంపదఁ | బెనుపొందుచు నుండు మీకు భీకర కాంతా
ర నివాసాయాసంబుల | ననఘా! యిబ్భంగి నవయ నలమట వొడమెన్‌.
213
వ. నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు పసిండితళిగల నిష్టాన్నంబులు గుడిచి తృప్తులయినం దద్భుక్తశేషం బుపయోగించుచుండు నీకు వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందుఁ గ్రోధంబు విడిచి యునికి యుచితంబు గాదు. 214
సీ. పదివేల గజముల బలమున విలసిల్లు | ననిలసుతుండు కాఱడవిలోనఁ
గ్రుమ్మరి కాయలుఁ గూరలు దిని పేద | వడినఁ జూచియు, దీర్ఘబాహుయుగళుఁ
డయ్యును బాహుసహస్రంబు కలిగిన | యర్జునుకంటె బలాఢ్యుఁ డగుచు
నేకవేగంబున నేనమ్ము లొక్క య | మ్మేసిన విధమున నేయ నేర్చు
 
ఆ. నర్జునుండు వనమృగావలిఁ గలిసి యి | ట్లున్నఁ జూచియును సుఖోచితాత్ము
లైన కవలు దీనులై యున్నఁ జూచియు | నుపశమంబుఁ దాల్చి యుండఁ దగునె?
215
వ. క్షమయును దేజంబును నయ్యయికాలంబులఁ బ్రయోగింపనేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు లేవను నీ యర్థం బితిహాసంబున వినంబడు; క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పు మని బలీంద్రుండు దొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె. 216
ఆ. ‘క్షమయ తాల్చియుండఁ జన దెల్ల ప్రొద్దుఁ దే | జంబ తాల్చియుండఁ జనదు పతికి;
సంతతక్షముండు సంతతతేజుండు | నగుట దోష మందు రనఘమతులు.
217
వ. అది యెట్లనిన నిత్యక్షమాన్వితుండయిన వానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు; రర్థంబుల యం దధికృతులైన వారలు ధనంబు లపహరించి దర్పంబు సూపుదురు; మఱి నిత్యతేజో -ధికుండైన వాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతంబైన సర్పంబునుం బోలె నెప్పుడు నుద్వేగ కరుం డగుం; గావునఁ గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది. యథాకాల కల్పిత క్షమా తేజుండైన వానికి నుభయలోకసిద్ధి యగు’ నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె. 218
తే. ‘ఆది నపరాధ మొక్కటి యైన నదియు | నల్పమైనను క్షమియించు నదియుఁ గాక
చెనసి యపరాధములు పెక్కు సేయుచున్న | పాపకౌరవ్యులకు సహింపంగ నేల?
219
క. ఇది తేజంబున కవసర; | ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు
ర్మదు లగు సుయోధనాదుల | నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్‌.’
220
వ. అనిన ధర్మరా జిట్లనియె. 221
సీ. ‘క్రోధంబు పాపంబు, గ్రోధంబునన చేసి | యగుఁ జువ్వె ధర్మకామార్థ హాని.
గడుఁగ్రోధి గర్జంబు గానండు, క్రుద్ధుండు | గురునైన నిందించుఁ, గ్రుద్ధుఁడైన
వాఁ డవధ్యులనైన వధియించు, మఱి యాత్మ | ఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ,
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి | క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?
 
ఆ. యెఱుక గల మహాత్ముఁ డెఱుకయ న్జలముల | నార్చుఁ గ్రోధ మను మహానలంబుఁ,
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు | దాల్చు దేశకాలతత్త్వ మెఱిఁగి.
222
క. క్షమ గల వానికిఁ బృథ్వీ | సమునకు నిత్యంబు విజయసంసిద్ధి యగున్‌;
క్షమి యైనవాని భుజవి | క్రమము గడున్‌ వెలయు సర్వకార్యక్షమమై.
223
వ. తేజఃప్రభవంబులైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబులగుఁ; దొల్లి కశ్యపగీతలైనగాథలయందీ యర్థంబు వినంబడు, వినుము; వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగమంతయు క్షమయంద నిలిచినవి; తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదు; రదియునుంగాక, కృష్ణ ద్వైపాయన భీష్మ విదుర కృపద్రోణ సంజయ ప్రభృతులు నా యుపశమంబ కీర్తింతు; రుపశమ హీనుండయిన దుర్యోధను కారణంబున ధార్తరాష్ట్రుల కెల్లం బ్రళయం బగు’ ననిన ద్రౌపది వెండియు నిట్లనియె. 224
మధ్యాక్కర ‘క్షమయంద చిత్తంబు నిల్పి నిర్గతకల్మషబుద్ధిఁ
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్ము నిన్ను
నమర ధర్మంబు రక్షించుఁ బ్రీతితో నని శత్రులందు
సమబుద్ధి సేయంగఁ జనునె నీకు నజాతశత్రుండ!
225
ఆ. ధర్మదూరులైన ధార్తరాష్ట్రులయంద | ధర్ము వేమి సేయు ధరణినాథ!
నికృతిపరులయందు నికృతి సేయనివారు | వారి నికృతిఁజేసి వధ్యు లండ్రు.
226
క. ఆర్యులకు విహీనతయు న | నార్యుల కున్నతియుఁ జేసి యవినీతుఁడ వై
కార్యము దప్పితి; నీకు న | నార్యులు చుట్టములె, యార్యు లరులె విధాతా!’
227
వ. అని, విధాతృని ధర్మువు నాక్షేపించు ద్రౌపదిం జూచి ధర్మ రాజిట్లనియె; ‘నాస్తికులయట్లు ధర్మాభిశంకినివై దైవ దూషణంబు సేసెదు; శిష్టచరితంబైన ధర్మంబు నధిక్షేపించుచున్న దుర్మతికిం బ్రాయశ్చిత్తంబు లేదు; ధర్మువు దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారద ప్రభృతులం బరమయోగధరులం బ్రత్యక్షంబ చూచెదము; వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు; రన్యు లన్యాయంబు సేసి రేనియు నే నేల ధర్మువు దప్పుదు? 228
క. ధీరమతియుక్తిఁ జేసి వి | చారింపఁగ నిక్కువంబు సర్వజన స్వ
ర్గారోహణసోపానం | బారఁగ ధర్మంబ సూవె యతిరమ్యంబై.
229
వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యదాన ధర్మ యజ్ఞంబులను పుణ్యకర్మంబు లఫలంబు లగునేని వీనినేల ఋషిగణంబులు సేవింతురు; నీ జన్మంబును ధృష్టద్యుమ్ను జన్మంబును బుణ్య కర్మ ఫల సద్భావంబునకు నిదర్శనంబులు గావె? మఱి పుణ్యకర్మఫలంబులు గల యట్ల పాపఫలంబులును గలవు; తొల్లి బ్రహ్మ పుత్త్రులకుం గర్మఫల సద్భావంబుసెప్పె; నందుఁగశ్యపుండు ధర్మప్రబోధనంబునం జేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె; విధాతృ నియోగంబునం బుణ్యపాప ఫలంబు సంప్రాప్తం బగు; విధాతృ ననుగ్రహంబునన కాదె పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్త్యు లమర్త్యత్వంబును బొందుదు’ రనిన విని ద్రౌపది యిట్లనియె. 230
ఆ. ‘కర్మఫలము లేదు, కర్మ ఫలాప్తికిఁ | గారణంబు విధియుఁ గా దనంగ
నంత యెఱుకలేనె యార్తనై విధి చెయ్ది | కలసి పలికితిం బ్రియంబు దప్పి,
231
ఆ. వేదశాస్త్రములును విధివిధానములును | నప్రమాణ మను దురాత్మకులకుఁ
బుణ్యగతులు లేమి భూనాథ! యెఱుఁగని | దానఁగాను ధర్మతత్త్వయుక్తి.
232
వ. తొల్లి నీతిమంతులైన బ్రాహ్మణులు మదీయ జనకునకుం జెప్పంగ వింటి; నెఱుక గలవారికిం గర్మంబు గర్తవ్యంబు; గర్మరహితులయి స్థావరంబులయట్లు జనులు జీవింపనేర; రల్పఫలంబునైనను గర్మంబుఁ బ్రవర్తించుచున్నవారిం జూచెదము; దైవమానుషంబులు గర్మఫలప్రాప్తికి నిమిత్తంబులు; పురుషుండు మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందుఁ గృతోత్సాహుండు గావలయు; నట్టివానికి దైవంబు సహాయం బయి కర్మసిద్ధి గావించు. 233
మధ్యాక్కర తిలలందుఁ దైలంబు గాష్ఠములయందుఁ దిరముగా నగ్ని
గలుగు టెఱింగి యుపాయపూర్వము గడఁగి తత్సిద్ధి
యలయక యుత్సాహవంతుఁడు వడయున ట్లనుత్సాహ
మొలసి దైవపరుఁ డిది వడయంగను నోపునె యెందు.
234
మధ్యాక్కర కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్నఁ
దడయక వర్షంబు గురిసి కావించుఁ దత్ఫలసిద్ధి
నడుమఁ బర్జన్యుఁ డనుగ్రహింపనినాఁ డేమి సేయుఁ
గడఁగి చేయంగలవానిఁ జేయును గాక కర్షకుఁడు.
235
వ. కర్మఫలంబులు దైవమానుషసిద్ధం బులయిననుం బురుషోత్సాహ సముపార్జితంబులయిన నవి సుస్థిరంబు లయి సురక్షితంబులయి వర్తిల్లు; ననీహమానుండయి దైవపరుండయిన వాఁడు నీరిలోని యాన పాత్రంబునుంబోలె నవసన్నుండగుం గావునఁ గర్మఫలసిద్ధి నిశ్చయించి యుత్సాహవంతుండవయి నీ యనుజుల పరాక్రమంబునం బరుల జయించి మనయందలి యర్థకృశత్వం బపనయింపు ‘మనిన, యాజ్ఞసేని వచనంబుల కనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 236
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )