పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
భీమసేన ధర్మరాజుల సంవాదము (సం. 3-34-1)
మ. ‘పితృపైతామహమైన రాజ్య మరినిర్భేద్యంబు, గాండీవిచే
నతిగుప్తంబు, బలారికైనను నహార్యం బిట్టి దానిన్‌ సుదు
ర్మతి నన్యార్థము సేసి నీకుఁ జనునే మర్త్యేశ! యుగ్రాటవిన్‌
వ్రతముల్‌ సల్పుచు ధర్మలేశచరణవ్యాసక్తి నిట్లుండఁగన్‌.
237
క. ఆమిషము సింహములచే | గోమాయువు గొన్నయట్లు కువలయరాజ్య
శ్రీ మనచేఁ గొని కౌరవుఁ | డేమని తలఁచునొకొ బుద్ధి నిష్టులుఁ దానున్‌.
238
క. దుర్మతులను దుర్జనులను | ధర్మస్థితి నోర్వఁదగునె ధరణీశ్వర! దు
ష్కర్ములగు ధార్తరాష్ట్రుల | పేర్మి యడంగింపఁ గడఁగు పృథుభుజశక్తిన్‌.
239
వ. ధర్మకామప్రభవంబయి సర్వార్థసాధనంబయిన యర్థంబు విడిచి మిత్త్రుల కప్రియంబు నమిత్త్రులకు హర్షం బునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్మువనుచు ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్బలునట్లు నిర్వేదింపఁ దగునె? 240
ఆ. బాహుబలము మెఱసి పరుల సంపదలు సే | కొనఁగ లావులేని కుత్సితుండు
నియతదుఃఖవృత్తి నిర్వేద పరుఁడగుఁ | గాక, నీకుఁ దగునె కౌరవేంద్ర!
241
చ. నరనుత! నీ యనుజ్ఞఁగొని నాఁడ విరోధుల నెల్లఁ బోరిలో
సరభసవృత్తి నుక్కడఁగఁ జంపితిమేని మహోగ్రకాననాం
తరముల నుండకుండ నతిదారుణదుర్మృగ సంగమంబునం
బొరయక యుండఁగా మనకుఁ బోలు నమందమనఃప్రియంబుగన్‌.
242
క. సమయాతిక్రమభీతిని | క్షమాయుతులమైన మనలఁ గౌరవులు పరా
క్రమహీనులుగాఁ దలఁతురు | సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్‌.
243
తే. తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతుఁ | డగుట యుక్తమె పురుషున? కట్టి వాని
వెలయ నర్థకామంబులు విడుచుఁ బ్రాణ | విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు.
244
సీ. ధర్మ కామంబులు దఱుగంగ నర్థార్థి | యగువాఁడు పతితుఁ డౌ; నర్థసేవ
నర్థార్థముగఁ జేయు నతఁ డుగ్రవనములో | గోరక్ష సేయు నక్కుమతిఁబోలు;
నర్థ ధర్మములకు హానిగాఁ గామార్థి | యగు నాతఁ డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు | నట్లు కామంబుతో హానిఁ బొందు;
 
ఆ. నర్థ ధర్మములు మహాబ్ధి మేఘము లట్టు | లుభయమును బరస్పరోదయమ్ము;
లిట్లుగాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే | వించువాఁడు సర్వవిత్తముండు.
245
వ. భవదాచరితంబయిన యీ ధర్మం బర్థకామంబులక కాదు, నీకును నీ బాంధవులకును బాధాకరంబు; దాన యజ్ఞసత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు; జగంబులు ధర్మమయంబులు; ధర్మువునకు మిక్కిలి యొండెద్దియు లే; దయినను నర్థార్థంబు గాని ధర్మువు క్షత్త్రియుల కయుక్తంబు. 246
ఉ. శత్త్రుల నాజి నోర్చుటయు, సర్వభయంబులఁ బొందకుండఁగా
ధాత్త్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాచుటయుం, బ్రియంబుతోఁ
బాత్త్రుల కర్థ మీగియును, బ్రాహ్మణపూజయుఁ జువ్వె! యుత్తమ
క్షత్త్రియధర్మముల్‌ సుగతికారణముల్‌ విపులార్థమూలముల్‌.
247
వ. కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు గాదు; నికృతిపరులయందు నికృతియు వలయుఁ; బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతినగాదె నిర్జించిరి; కావున నీవు సమయధర్మరక్షణవ్రతం బుడిగి శత్రువుల జయింప నుద్యోగింపుము. 248
క. జయశీలివైన నీకుం | బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా
శ్రయు లగుదురు సృంజయకే | కయ యదు పాంచాలు రాదిగాఁగల సుహృదుల్‌.
249
తే. మిత్త్రసంపన్నుఁ డైన నమిత్త్రు మిత్త్ర | బలముతోడ భేదించి దోర్బలముఁ జలముఁ
గలిగి దేశబలంబును గాలబలముఁ | గలుగువాని కసాధ్యంబు గలదె యెందు?
250
తే. బలము గలవానిఁ బలువురు బలవిహీను | లొక్కటై కూడి నిర్జింతు రుత్సహించి
మధువుఁ గొన నుత్సహించిన మనుజుఁబట్టి | కుట్టి నిర్జించు మధుకరకులమునట్లు.
251
వ. శ్వదృతియందలి దుగ్ధంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుటఁ బౌర జానపద బ్రాహ్మణ వరులు నీ కనురక్తులయి భవద్రాజ్యంబ వలచి యుండుదురు; దీని నేల యెడ సేసెదు? సర్వాయుధ సనాథంబయిన రథం బెక్కి గజపురంబున కభిముఖుండవై విజయప్రయాణంబు సేయుము. 252
మ. ప్రణుతక్షాత్త్రగుణంబు విక్రమము దర్పం బేర్పడన్‌ విక్రమ
క్షణదానం బొనరింపు మీ క్షణమ; విఖ్యాతంబుగా సంగరాం
గణమధ్యంబునఁ జేయు మర్జునబృహద్గాండీవ నిర్ముక్త మా
ర్గణ ధారావళి ధార్తరాష్ట్ర కదళీకాంతార విచ్ఛేదమున్‌.
253
క. బహు వాహ సుభట హస్తిక | సహితులు బలవంతులని విచారింపకు నీ
యహితులు మద్బాహుగదా | నిహతికి మార్కొనఁగఁ బోర నిలువం గలరే?
254
క. అరివరుల నోర్చి సాగర | పరివృత భూచక్రమెల్లఁ బాలింపు; ప్రజా
పరిపాలనంబు కంటెను | ధరణీశ! విశేష మొండు ధర్మువు గలదే?
255
వ. రాజ్యపదస్థుండైన క్షత్త్రియుండు భూరిదక్షిణంబులైన యజ్ఞంబుల దేవబ్రాహ్మణులం దృప్తులం జేసి బ్రాహ్మణులకు నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి దురితంబులవలనం బాసి తమోవిముక్తుండైన చంద్రుండునుం బోలె వెలుంగు’ ననిన భీమసేనునకు ధర్మరా జిట్లనియె. 256
ఉ. ‘నీ వచనంబు ధర్మ్యము, వినీతము, నీతియుతంబు, నిష్ట సి
ద్ధ్యావహ, మత్యుదార మిదియైనను నిప్డు దలంపఁగా విచా
రావసరాప్తికిన్‌ విషయమైనది; కార్య ఫలంబు లెల్ల స
ద్భావమునన్‌ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్‌.
257
క. వనమునఁ బండ్రెండేండ్లును | జనపదమున నెఱుఁగకుండ సరి నొక వర్షం
బును జలుపఁ బూని సత్యము | దనరఁగఁ జేసితిఁ బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్‌.
258
చ. అలఘుగుణంబులం దధికుఁడైన మహాత్ముఁడు రాగకోపమా
యలఁ బడి, యక్షమావివశుఁ డై, యచిరాంశులతావిలాసచం
చలమగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువుఁ దప్పి సత్సభా
వలిఁ దగువారియొద్దఁ దగువాఁడయి సద్విధి నుండ నేర్చునే?
259
వ. ఏ నెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; శుభోదయకాలంబుఁ బ్రతీక్షించి యుండుము; రాజ్యంబులుఁ బుత్త్రులును ధనంబును యశంబును సత్యంబునకు సమంబులు గా’ వనిన భీమసేనుం డిట్లనియె. 260
ఆ. ‘అంతకుండు జనుల కాసన్నుఁడై యుండ | నిమిషమాత్రమేని నిశ్చయింపఁ
దగని జీవనంబు దద్ద సుస్థిరముగాఁ | జేసి కార్య మెడయుఁ జేయఁదగునె?
261
వ. శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని జన్మంబు నిరర్థకంబు; సకల రాజ సమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరిభవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం బగలును నా హృదయంబు దపించుచుండు; నాకంటె నర్జున నకుల సహదేవులుం గుంతీదేవియు నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు. 262
క. వీరల దుఃఖము దీర్పక | క్రూరనికారులగు రిపులకును ముదముగ ను
గ్రారణ్యములో ధర్మువుఁ | గారుణ్యముఁ దాల్చి యునికి కార్యమె నీకున్‌?
263
వ. ఇది బ్రాహ్మణ ధర్మంబుగాని క్షత్త్రియ ధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజధర్మంబులు నీ యెఱుంగనియవి లేవు; శత్రుసంహారంబు సేయని నాఁ డత్యంతహాని యగు; నట్లుంగాక. 264
తే. వనమునందుఁ బండ్రెండు సంవత్సరంబు | లుండ నేర్చితి మేనియు, నొరు లెఱుంగ
కుండ నజ్ఞాతచర్యయం దొక్క దివస | మైన నుండఁగ నేర; మెట్లనిన వినుము.
265
వ. ఆబాలవృద్ధప్రసిద్ధుండవై పార్థివ సూర్యుండవైన నిన్నును, సింహసంహననులైన నీ తమ్ములను నెఱుఁగని వారు లేరు; మన గూఢభావంబు మేరువు నిగూఢభావంబునుంబోలె నఘటమానం; బిట్లేని నవ్వనవాసక్లేశం బెన్నఁడును మనకుఁబాయనేరదు; మన మిప్పు డివ్వనమునఁ బదుమూఁడు మాసంబులు సలిపితిమి; సంవత్సర ప్రతినిధిగా మాసంబులు సేసికొనుట యెందునుం గల యదియ; దీన ధర్మవిరోధంబు లేదు; విజయారంభంబున కిది యవసరం’ బనిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులిత ముఖుండై, పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జిట్లనియె. 266
క. ‘క్రమమునఁ బాండిత్య పరా | క్రమ దర్పములందుఁ గడుఁ బ్రగల్భుండవు, మ
ధ్యమ! నీ చెప్పిన యది కా | ర్యమ యయినను ధీరబుద్ధివై విను మనఘా!
267
వ. అల్పోపాయం బైన కార్యంబు సాహసారబ్ధం బైనను దోషంబు లే; దిది మహాకార్యంబు; సాహసక్రియా సాధ్యంబు గాదు; సువిచారితంబై సిద్ధింబొందు; విచారపూర్వారబ్ధ కార్యంబునకు దైవంబును ననుకూలం బగుం గావున నిమ్ముగా విచారింపవలయు. 268
సీ. శూరులు ధృతరాష్ట్రుసుతులు దుర్యోధనా | దులు దురాధర్షు లందొఱును మనకు
నాతతాయులు, మఱి యంగభూవిభుఁడును | భూరిశ్రవుఁడు మద్రభూమిపతియు
నాదిగాఁ గల వీరు లవిజేయ విక్రము, | లొలసి తత్సుహృదులై యున్నవారు;
మనచేత జితులైన మనుజేశు లెల్లను | జని సుయోధనుచేత సత్కరింపఁ
 
ఆ. బడి కడంగి వాని ప్రస్తవంబున నాజి | వేచి ప్రాణములను విడువ నున్న
వారు; వారలెల్ల వసుధఁ బ్రసిద్ధులు | వినఁగ నస్త్రశస్త్రవిద్యలందు.
269
క. వినవయ్య! కర్ణుగర్వం | బని నాతఁ డభేద్యకవచుఁ డగుటయు, విలునే
ర్పున నతని బాహువిక్రమ | మును దలఁచిన నాఁడు గన్ను మొగుడదు నాకున్‌.
270
వ. మఱియు భీష్మ ద్రోణ కృపాచార్యులు సములయ్యును వారియొద్దన యున్నవారు; వార లపార దివ్యాస్త్ర విశారదులు, వారల నోర్చికాని దుర్యోధను నిర్జింపంబోల’ దని విచారించు సమయంబున. 271
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )