పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
కృష్ణద్వైపాయనుఁడు ధర్మరాజునొద్దకు వచ్చుట (సం. 3-37-20)
క. వారల పుణ్యోదయమున | వారిజభవనిభుఁడు లోకవంద్యుఁడు వచ్చెం
బారాశర్యుఁడు ధర్మశ | రీరుఁడు గృష్ణాజినోత్తరీయుఁడు ప్రీతిన్‌.
272
వ. ఇట్లు వచ్చి పరమభక్తిపరులైన పాండవులచేతం బూజితుండై కృష్ణద్వైపాయనుండు ధర్మరాజున కిట్లనియె. 273
క. ‘వీరులగు భీష్మకుంభజ | శారద్వత కర్ణు లమితసత్త్వులు వారిం
బోర వధియించు టెంతయు | భారం బనియున్న నీదు భర మెఱిఁగి మదిన్‌.
274
ఆ. దాని నపనయింపఁగా నిప్డు వచ్చితి | నధికయోగలబ్ధ మతిరహస్య
మీ విశేషవిద్య సేవింపఁగాఁ బార్థుఁ | బనుపు; మితఁడు దీనఁ బడయు సిద్ధి.’
275
వ. అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు విధిదృష్ట విధానంబునం బ్రతిస్మృతి యను విద్య నుపదేశించి. ‘దీని శక్తి నర్జునుం డధికతపోవీర్యవిభవుండై యింద్ర యమ వరుణ కుబేరాది దేవతలను నీశ్వరునిఁ బ్రత్యక్షంబు సేసికొని, వారలవలన దివ్యాస్త్రంబులు వడసి శత్రువుల జయించు; మఱి యివ్వనంబు భవచ్చిరనివాసంబునం జేసి విరళ ఫల కుసుమ పాదపంబై మృగకులోపరోధియై యొప్పకున్న యది; యొక్కచోటన పెద్దకాలం బునికి యెవ్వరికిం బ్రీతి జననంబు గాదు; కావున నొండువనంబున కరుగునది’ యని చెప్పి యమ్మునివరుం డరిగినఁ, దద్వాక్య ముదితులై ద్వైతవనంబు వాసి పాండవులు బ్రాహ్మణవరులతోన కామ్యకవనంబున కరిగి, సరస్వతీ తీరంబునందు నివాసంబుసేసి, కొండొకకాలం బుండ నొక్కనాఁ డజాతశత్రుం డర్జునుఁ జూచి యిట్లనియె. 276
క. ‘సాధితశాత్రవులగు భీ | ష్మాదులయం దధిగతాశ్రయం బయ్యెఁ జతుః
పాదం బగుచున్న ధను | ర్వేదము బ్రాహ్మణులయందు వేదమపోలెన్‌.
277
వ. అయ్యది మహనీయంబయి దివ్యమంత్ర కలితంబయి వారలకు సన్నిహితం బగుఁ గావున. 278
క. వారలు దుర్యోధనుచే | నారాధితు లిష్టసత్క్రియల నగుట రణ
ప్రారంభమయిన నెదిరెడు | వార పరాక్రాంతులై యవశ్యము మనతోన్‌.
279
వ. దివ్యాస్త్ర విదులైన వారల నోర్చునట్టి యుపాయంబు గృష్ణద్వైపాయనుండు ప్రసాదించె నీ విద్య నీవు ప్రతిగ్రహించి, కవచకార్ముక ప్రాస ఖడ్గ ధరుండవై యన్యుల కజేయుండవై యుత్తరదిక్కున కరిగి తపోయోగ బలంబున నింద్రుఁ బ్రత్యక్షంబు సేయుము; తొల్లి వృత్రునకు వెఱచి వేల్పులు తమ యాయుధంబులు బలంబులు నింద్రునందు సమర్పించి; రవి యెల్ల నీకుఁ దత్ప్రసాదంబున నగు; మఱి యింద్రునుపదేశంబున నీశ్వరు నారాధించి తదనుగ్రహంబున నిష్టసిద్ధి వడయు; మిది వేదవ్యాసు నుపదేశం’ బని. 280
క. ధృతి నియమవ్రతునకు, దీ | క్షితునకుఁ, బార్థునకు, విగతకిల్బిషునకు ధ
ర్మతనూజుఁడు ప్రీతిఁ బ్రతి | స్మృతి నుపదేశించెఁ దా నమిత్రజిగీషన్‌.
281
వ. అర్జునుండును నయ్యోగవిద్యాగ్రహణప్రభావంబున నధికతేజోమూర్తియై, దివ్యాస్త్రలాభార్థం బగ్రజుచేత ననుజ్ఞాతుండై, విధివిహిత హోమసంతర్పిత వీతిహోత్రుండును బ్రాహ్మణకృత స్వస్త్యయనుండునునై, ధౌమ్యాది మహీసురవరులను భ్రాతృవరులను వీడ్కొని, తపంబున కరుగ సమకట్టిన. 282
సీ. ఆతని గాండీవహస్తు, నక్షయబాణ | తూణీరయుగళు, నుత్తుంగభుజునిఁ
గనకవర్మావృత ఘనతరతనుఁ జూచి | పొంగి యంతర్హితభూతములును
బ్రాహ్మణప్రవరులుఁ ‘బార్థుని మనమునఁ | దలఁచిన యర్థంబు దడయ కిష్ట
సంసిద్ధి యయ్యెడు! సర్వ విఘ్నములును | శాంతిఁ బొందెడు!’ మని సంతసమునఁ
 
ఆ. బలికి; రంతఁ దరుణి పాంచాలి బీభత్సు | కడకు నరుగుదెంచి కమలనేత్ర
యరిజయార్థ మరుగు నాతని యుత్సాహ | మెఱిఁగి యిట్టు లనియె నిందువదన.
283
క. ‘అవమానాసహ మగు నీ | యవమక్షత్త్రియ కులంబునం దిం కిట పు
ట్టువు గాకుండెడుఁ; దత్‌క్షమ | మవు బ్రాహ్మణకులమునంద యయ్యెడు నాకున్‌.
284
చ. అరికృతదుష్పరాభవమహార్ణవమగ్నుల మమ్ము నందఱం
గరుణ సముద్ధరింపుము జగన్నుత! యన్యులు వూనఁగాని యీ
భరము వహింపఁ బూనిన యపారగుణోన్నతు నిన్ను దిక్కులున్‌
దరణియు సోముఁడున్‌ నభము ధాత్రియు గాడ్పును గాచుచుండెడున్‌.’
285
వ. అని దీవించి పాంచాలరాజపుత్త్రి దన స్నేహలాలస విలోలాపాంగ విలోకనంబులం బార్థుఁ బరిగృహీత పాథేయుం జేయుచుఁ దద్వియోగతరళంబైన హృదయం బెట్టకేనియు నొక్కింతసేసికొని యుండె; మఱి పార్థుండునుం బూర్వోత్తర దిశాభిముఖుండై యొక్కరుండ యరిగి యైంద్రయోగశక్తినిఖిల భూతదుర్నిరీక్ష్యుం డగుచు హిమశైల గంధమాదనంబుల నతిక్రమించి. 286
ఉ. వీరుఁడు యోగవిద్యయును విల్లును దోడుగ నింద్రకీలమన్‌
భూరినగంబుపైఁ గడఁగి పోవఁగఁ బోయినఁ ‘బోవకుండు ము
గ్రారివిభేది! నీ ‘వను మహామధురధ్వని వించె వానికిన్‌;
బోరన నంతరిక్షమునఁ బొల్చె నిరంతర పుష్పవృష్టియున్‌.
287
వ. దానికి విస్మయం బంది చనువాఁడు ముందట నొక్కవృక్షమూలంబున నున్న వృద్ధబ్రాహ్మణు బ్రహ్మతేజో - ధికు నవిరత యమ నియమ కృశీభూతశరీరుం గని నమస్కరించి, తత్సమీపంబున విశ్రమించియున్న నప్పార్థుం జూచి బ్రాహ్మణుం డిట్లనియె. 288
క. ‘ఎందుండి వచ్చి తయ్య? య | నిందితతేజుఁడవు ధర్మనియతుండవు నీ
కిం దుండ నేల? సిద్ధిం | బొందితి, చేకొను మభీష్టపుణ్యఫలంబుల్‌.
289
క. ఇది శాంతతపస్వుల కా | స్పద; మిందుఁ గృపాణ కవచ బాణాసన సం
పద దాల్చి యుండ నేటికి? | విదిత క్షత్త్రియకులుండవే నీ వనఘా!
290
వ. వీత హర్ష క్రోధులైన బ్రాహ్మణులుండెడు పుణ్యనివాసంబున నాయుధంబులు ధరియించి యుండవలవదు; వీని విడువు’ మని నిషేధించిన, నవ్విఘ్నవచనంబులకు సంచలింపక యున్న యాతని ధైర్యంబునకు మెచ్చి, సహస్రాక్షుండు నిజరూపంబుఁ జూపి యతని కిట్లనియె. 291
ఆ. ‘ఇష్టమైన వరము లిచ్చెదఁ బ్రీతితో | వేఁడు’ మనిన నమరవిభున కపుడు
గరము భక్తి మ్రొక్కి కరములు మొగిచి యి | ట్లనియెఁ బురుషవృషభుఁ డర్జునుండు.
292
వ. ‘దేవా! నా కిష్టంబైన వరంబు భవత్ప్రసాదంబున దివ్యాస్త్రలాభంబ’ యనిన ‘నది యేమి గహనంబు; దానిన యిచ్చెదఁ; బుణ్యలోకంబులు దేవత్వంబును సర్వకామంబులు వేఁడు’ మనిన నర్జునుం డిట్లనియె. 293
సీ. ‘దివిజాధినాథ! నా కవి యెల్ల నేటికిఁ? | బరమాస్త్రలాభంబ కర మభీష్ట;
మరులు సేసిన మహాపరిభవక్లేశంబు | వాపంగ నోపక యేపుటడవి
నురుదుఃఖితుల సహోదరుల నందఱఁ బెట్టి | చనుదెంచి మిన్నక చనిన నన్నుఁ
దగువారు జగములోఁ దెగడరే?’ నావుడు | సుతునకుఁ బ్రీతుఁడై శతమఖుండు
 
ఆ. గరుణ నిట్టులనియెఁ ‘బరమాస్త్రలాభంబు | నీకు నిష్టమేని లోకవంద్యు
గరళకంఠు నీశుఁ బరముఁ బ్రసన్నుఁగా | వేగఁ జేయు మధికయోగశక్తి.
294
వ. అట్లేని నిఖిల లోకపాల సహితుండై యీశ్వరుండు నీ యభిమతం బొనరించు’ నని సహస్రలోచనుండు లోచనాగోచరుం డైన, నర్జునుండును దద్వచనంబున సమాహితచిత్తుండై హిమశైలశిఖరంబున కరిగి వివిధ కుసుమ ఫల వృక్షంబులను విమల నిర్ఝర జలంబులను గమల కుముద కల్హార కలహంస సంకుల పంకజాకరంబులను రమ్యంబైన తపోవనంబునందుఁ బరమేశ్వరు నుద్దేశించి తపంబు సేయందొడంగిన. 295
క. సురదుందుభి నాదంబులు | సురపాదప సంభవ ప్రసూన సుగంధో
త్కర వాసిత పవనము వి | స్తరిల్లె నాతనికి హృదయసమ్మద మెసఁగన్‌.
296
వ. అందు మనోవాక్కాయ కర్మ నియతుండై పరమేశ్వరుం దనచిత్తంబున నిలిపి, నిరంతర త్రిరాత్రోపవాసంబుల నొక్క మాసంబుఁ జలిపి, ద్విగుణిత త్రిరాత్రోపవాసంబుల రెండవ మాసంబుఁ జలిపి, పక్షోపవాసంబుల మూఁడవ మాసంబు సలిపి, యూర్ధ్వబాహుండై యేకపాదాంగుష్ఠాగ్రంబున నిలిచి, వాయుభోజనంబు సేయుచు నాలవ మాసంబు సలిపి, యిట్లతిఘోరతపంబు సేయుచున్న యర్జునుం జూచి యందలి ఋషులు విస్మయం బంది యీశ్వరుపాలికిం జని యిట్లనిరి. 297
ఉ. ‘భూరిబలుండు పాండవుఁ డపూర్వతపం బొనరించుటం దదీ
యోరుతపఃప్రభావ దహనోత్థిత ధూమచయంబు లంబుదా
కారములై వనాంతరము గప్పె జగత్త్రయనాథ! తత్తపో
భారము సర్వజీవుల కపారభయావహ మద్భుతం బిలన్‌.
298
వ. ఆతని యభిమతంబుఁబ్రసాదించి తత్తపోభారంబు వారింపు’ మనిన, వారల పలుకులు విని పరమేశ్వరుండు దరహసితవదనుం డగుచు, ‘వాని యభిప్రాయం బే నెఱుంగుదు; నిష్టవర ప్రసాదంబున వానికి మనః ప్రియంబుఁ జేసెద; మీరు మీ యాశ్రమంబుల కరిగి సుఖంబుండుం’ డని యప్పుడు. 299
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )