| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
కాంచనవర్ణాపఘనుఁడై మహోన్నత | కార్ముకహస్తుఁడై కాలకంఠుఁ డెఱుకురాజయ్యె; నద్రీంద్రతనూజయు | వనచరీభావంబు వఱలఁ దాల్చెఁ; గుఱుచచేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న | తఱటులు మఱి చెంచుఁదలలు నమర దడవిండ్లు చేపట్టి తడయక యెఱుకులై | యార్చుచు భూతమ్ము లాత్మ సతుల |
|
| తే. |
నెఱుకుసతులఁ గావించి యయ్యెఱుకు రాజు | ముందటం బక్కియల నొక్క మొగిన నిలిచి; రంత వేఁటనెపంబున నంధకారి | గదలెఁ దద్వన మెల్లఁ గ్రక్కదలుచుండ. |
300 |
| చ. |
అలబల మంది యందుల మృగావలియున్ విహగంబులున్ భయా కులగతిఁ బొంది మూఁగలును గుంటులుఁ జీఁకులునైన యట్టు లై, యులియక, యున్నచో నడఁగి యుండఁ, గిరాతబలంబుతోడఁ బిం గలనయనుం డుమేశ్వరుఁడు గవ్వడి డాయఁగ వచ్చెఁ జెచ్చెరన్. |
301 |
| వ. | అంత నీశ్వరచోదితుండై మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున బీభత్సు వధియింప సమకట్టి పయిం బఱతెంచిన. | 302 |
| క. |
అనఘుండు దాని దవ్వులఁ | గని ఘనుఁ డయి పాండవుండు గాండీవ గుణ ధ్వని సేయుచు డాసినఁ బె | ల్చన యేయఁ గడంగి నిలిచె సంరంభమునన్. |
303 |
| వ. | అదియు నా క్షణంబ యేసిన యమ్మునుంబోలె నతివేగంబున నాసన్నం బయిన ‘దాని నేయ కేయకు’ మని యెఱుకురాజు వారించినను వాని వచనం బాదరింపక. | 304 |
| చ. |
పటువిశిఖంబునం ద్రిదశపాలతనూజుఁడు పంది నేసె; ము న్నట పరమేశ్వరుండును రయంబున దానిన యేసె; నిట్టు లొ క్కొటఁ బడియెన్ హరార్జునుల ఘోరశరంబులు పందిపైఁ గుభృ త్తటముపయిన్ వడిం బడు నుదగ్రమహాశనులట్ల మ్రోయుచున్. |
305 |
| క. |
హరుశరమును నరుశరమును | సరి నిరుపక్కియలు దాఁకి జవ మఱి శరసం భరమునఁ దిరిగె వరాహము | శరనిధి మథనమునఁ దిరుగు శైలమ పోలెన్. |
306 |
| వ. | ఇట్లిద్దఱచేత శరవిద్ధుండై మూకదైత్యుండు సూకరరూపంబు విడిచి నిజరూపంబుతోడ నదృశ్యుండయ్యె;నంత నర్జునుండు విస్మితుండై ముందట నత్యున్నతచాపధరు మేరుశిఖరాకారు నపార కిరాత పదాతి సమేతు నభినవ యౌవనవనచరీసహస్ర పరివృతు నొక్కపురుషుం గని ‘నీ వెవ్వండవు? మనుష్యగోచరంబు గాని యివ్వనంబునఁ బ్రియవనితానుగతుండ వయి యేల క్రుమ్మరియెదు? మఱి నా యేసిన మృగంబు నేసి మృగయాధర్మవిరోధం బేల చేసితి? నిన్ను నిప్పుడ నా నిశితబాణజాలంబుల పాలు సేసెద’ ననిన నగుచు నాతనికి నయ్యెఱుకురా జిట్లనియె. | 307 |
| ఆ. |
‘ఏను నా మృగంబు నేసితి; నది మదీ | యాస్త్ర నిహతమయ్యె; నవికలముగఁ జనునె నీకు లేని శౌర్యసంపదఁ జెప్పి | కొనఁగ మదము మిగిలి గుజనునట్లు. |
308 |
| క. |
పలుకుల నొప్పదు, బీరము | గలవేని రణంబు సేయఁ గడఁగుము, నీ దో ర్బల మిప్పుడ యుడిపెద’ నని | తలరక యేయుచుఁ బినాకి తాఁకెఁ గిరీటిన్. |
309 |
| వ. | అంత. | 310 |
| చ. |
ప్రతిబలదర్పభంజనుఁడు పార్థుఁడు దారుణబాణవర్ష ము న్నతి నతివీరుఁడై కురిసినం, బరముండు మహాంబువృష్టిఁ బ ర్వతము గ్రహించునట్లు బలవంతుఁడు దాని గ్రహించి పోర న క్షతతనుఁ డయ్యె; వాని నతిగర్వితుఁ బార్థుఁడు సూచి యాత్మలోన్. |
311 |
| చ. |
‘ఇతఁడు సురేంద్రుఁడొండెఁ, బరమేశ్వరుఁడొండె, ధనేశుఁడొండెఁ గా కతులబలప్రభావయుతుఁ డన్యుఁడు గాఁ, డొరుఁడైన మద్భుజా వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్టు ల క్షతుఁడు నమూర్ఛితుండు నయి కంపముఁ బొందక యుండ నేర్చునే. |
312 |
| వ. | నా యేసిన యపార దుర్వార నారాచంబు లవివేకియందుఁ బ్రయుక్తంబు లయిన సుభాషితంబులుంబోలె వీనియందు నిష్ఫలంబు లగుచున్నయవి. | 313 |
| ఆ. |
ఎఱుకు నన్ను నుఱక యేసిన శరములు | నెఱఁకులాడి నాకు నిశితదివ్య విశిఖతతులయట్లు వేదన గావించు | టిది యపూర్వ; మీతఁ డెవ్వఁ డొక్కొ! |
314 |
| వ. | ఇప్పర్వతంబు దైవనివాసంబుగావున నితండు కిరాత రూప ప్రచ్ఛన్నుండైన యెయ్యేని యొక్క దివ్యపురుషుండు గావలయు’ నని యశనికల్పంబులైన దివ్యశరంబు లయ్యెఱుకుపయి నేసి యర్జునుం డక్షయబాణంబు లైన తన తూణీరమ్ములయం దమ్ములు గానక ‘ఖాండవదహనంబునాఁ డగ్నిదేవుఁడు నా కిచ్చిన యక్షయశరధు లిప్పుడు యుగాంతకాల రిక్తంబులైన శరధులుంబోలె నున్నయవి; యిది యేమి యద్భుతంబో’ యనుచు నలిగి గాండీవం బెత్తికొని యెఱుకుపయిం బఱచి. | 315 |
| క. |
అపహృత గాండీవుఁడు నై | యపరిమిత క్రోధహృదయుఁ డన్నరుఁడు పరం తపుఁ డెఱుకుమస్తకంబునఁ | గృపాణపాతంబుఁ జేసెఁ గిట్టి కడంకన్. |
316 |
| క. |
అదియు వృథయైనఁ బార్థుఁడు | వదలక వృక్షముల రాల వైచెను రణదు ర్మదు వనచరు నవి యెల్లం | దదంగముల నడఁగె నద్భుతంబుగ నంతన్. |
317 |
| క. |
హరుఁ బెనఁగి పట్టుకొని భీ | కరబలుఁ డర్జునుఁడు ముష్టిఘాతంబుల సం గర మొనరించెను; వనచర | వరు లాతని శౌర్యగౌరవముఁ బొగడి రెదన్. |
318 |
| క. |
తనదివ్యగాత్రమున న | ర్జును గాత్రనిపీడఁ జేసె శూలధరుం; డం తన మూర్ఛవోయి పీడిత | తనుఁడై పార్థుండు ధరణితలమునఁ బడియెన్. |
319 |
| వ. | అంత. | 320 |
| చ. |
వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున కాతని ధైర్యవృత్తికి న్నరుదుగ మెచ్చి సన్నిహితుఁడయ్యె; జటామకుటేందురేఖయుం గరమున శూలమున్ గరళకాలగళంబు బృహద్గజాజినాం బరముఁ దృతీయలోచనముఁ బన్నగహారము నొప్పుచుండఁగన్. |
321 |
| వ. | ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహితుండై ‘యర్జునా! క్షత్త్రియ లొరు లెవ్వరు నీయట్టి శౌర్య ధైర్యవంతు లెందును లేరు; నీ తపఃక్షాత్త్రగుణంబులకు మెచ్చితి; నీ కోర్కి సఫలంబు సేసెద; దేవాసురమానుషంబైన జగం బంతయు నీవ జయింతు; నా స్వరూపంబు సూడు’ మని దివ్యదృష్టి యిచ్చినం జూచి పార్థుండు కృతార్థుండై దండప్రణామంబు సేసి. | 322 |
| క. |
వరదు సురాసురవందితుఁ | గరుణాకరు హరుఁ బినాకకరుఁ గరిచర్మాం బరు శంకరు గిరిజాసుం | దరు నిట్లని సంస్తుతించెఁ దద్దయు భక్తిన్. |
323 |