పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట (సం. 3-50-1)
వ. అనిన ‘నది యె?’ ట్లని ధర్మనందనుం డడిగిన బృహదశ్వుం డిట్లనియె; నిషధేశ్వరుండయిన వీరసేనుని కొడుకు నలుం డనువాఁ డనేకాక్షౌహిణీపతి యనవరతాక్షప్రియుం డజేయంబైన తన తేజంబున నెల్లరాజుల జయించి బ్రహ్మణ్యుండయి బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాపాలనంబు సేయుచుండ. 7
సీ. అట విదర్భాధిపుఁడైన భీముం డను | వాఁ డనపత్యుఁడై వ్రతము లోలి
సలుపుచు దమనుఁ డ న్సన్మునిఁ బత్నియుఁ | దాను నుపాసించి, తద్వరమున
దమయంతి యను కూఁతు దమ దాంత దమను ల | న్సుతులను బడసె విశ్రుతగుణాఢ్యుఁ;
డందుఁ గన్యారత్న మగు దమయంతి దా | నత్యంతకాంతి రూపాభిజాత్య
 
ఆ. విమల గుణ సమృద్ధి వెలుఁగుచు సురసిద్ధ | సాధ్య కన్యలట్టి సఖులు నూర్వు
రొలసి తన్నుఁ గొలుచుచుండఁగ మహి నొప్పు | చుండె నధికవిభవయుక్తితోడ.
8
వ. అంత. 9
క. నలుగుణములు దమయంతికి | నలునకు దమయంతి గుణగణంబులు జను లి
మ్ములఁ బొగడుట నిరువురకును | వెలసె మనోభవ వికార విభ్రమ మెదలన్‌.
10
వ. ఒక్కనాఁడు నలుఁడు దమయంతీ గుణబద్ధ చేతస్కుండై మదనానలంబు సహింప నోపక ప్రమదవనంబున నుండునంత నంతరిక్షకాంతాహారావళియుంబోలె హంసావళి యవనీతలంబున కవతరించిన. 11
ఆ. వీరసేనసుతుఁడు వీరుండు హంసల | నడ బెడంగుఁ జూచి నగుచు వాని
నెగిచి యెగిచి యందు నెగయకుండఁగ నొక్క | హంసఁ బట్టుకొనియె నతిరయమున.
12
ఆ. దాని విడిచి పోవఁగా నోప కఱచుచు | నంతరిక్షమునను హంసలెల్లఁ
బిండుగట్టి తిరుగుచుండె వాతోద్ధూత | శారదాభ్ర శకల చయముఁ బోలె.
13
వ. అదియును దన కమ్మనుజేశ్వరుఁ డపాయంబు సేయుంగా వగచి మనుష్య వాక్యంబుల నిట్లనియె: ‘నయ్యా! యేను నీకుం బ్రియంబు సేసెద; నీ హృదయేశ్వరియైన దమయంతి పాలికిం బోయి నీ గుణంబులు దానికి వర్ణించి యక్కన్య యన్యుల నపేక్షింపక నీయంద బద్ధానురాగ యగునట్లుగాఁ జేసెద.’ 14
క. అనిన విని హంస పలుకులు | దన హృదయంబునకు నమృతధారాపాతం
బునుబోలె నైన నృపనం | దనుఁ డనురక్తుఁ డయి విడిచెఁ దడయక దానిన్‌.
15
వ. అంచపిండుతో నదియును విదర్భనగరంబునకుం బఱచి, యం దుపవనంబున సఖీజనపరివృతయై యున్న దమయంతి యంతికంబునకు వచ్చి విహరించుచుండె; నంత వానిం జూచి పరమకౌతుకమ్మున. 16
తే. ఒండొరులఁ గడవంగ నయ్యువిద లెల్లఁ | బఱచి యొక్కొక్క కలహంసఁ బట్టికొనఁగఁ
జెలువముగ నందు దమయంతిచేతఁ బట్టు | వడియె నలుచేత విడువంగఁబడిన హంస.
17
క. దమయంతికి నలునకు సం | గమకారణ దూతయైన కలహంస మనో
జ్ఞమనుష్య వాక్యముల న | ద్దమయంతికి హర్ష మెసఁగఁ దా ని ట్లనియెన్‌.
18
వ. ‘నీ హృదయేశ్వరుండైన నలునొద్దనుండి వచ్చితి; నపార పారావార పర్యం తానంత మహీతలంబునందు నా చూడని రాజు లెవ్వరు లేరు; సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుం బోలరు. 19
తే. నీవు నలునకుఁ బేర్మితో దేవివైనఁ | గాక నీ సముజ్జ్వల రూప కాంతి విభవ
నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర | లక్షణావలు లవి సఫలంబు లగునె?
20
వ. నీవు నారీరత్నంబ, వాతండు పురుషరత్నంబు; గావున మీ యిద్దఱ సమాగమం బన్యోన్యశోభాకరంబగు’ ననిన విని సంప్రాప్త హృదయసమ్మదయై దమయంతి దాని కిట్లనియె. 21
మధ్యాక్కర ‘ఆ రాజుగుణములు నా కెఱింగించి నట్టులు నన్ను
నా రాజునకు నెఱింగించి కరుణ నాయందుఁ గావింపు
మారంగ’ ననుడు నిషధవిషయమున కరిగి యా హంస
వీరసేనజునకు దాని గుణరూప విభవముల్‌ సెప్పె.
22
వ. అంత 23
చ. నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవనందనంబులన్‌
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్‌ సలిలధారలఁ జందనచారుచర్చలన్‌.
24
వ. ఇట్లిద్దఱు నన్యోన్యరూపగుణ శ్రవణసంజాతప్రీతులై యుండునంత నంతఃకరణ సంతత మనోజాత సంతాప వివర్ణ వదనయైన యా దమయంతిం జూచి భయసంభ్రమాక్రాంతులై సఖీజను లెల్ల నక్కోమలి వృత్తాంతం బంతయు భీమున కెఱింగించి యిట్లనిరి. 25
సీ. కలహంస పలికిన పలుకులు గుణియించు, | వడి దాని పోయిన వలను చూచుఁ,
బలుకదు సఖులతో లలితాంగి, మిన్నక | యలయుచు నుండుఁ దా ననుదినంబుఁ,
జారువిభూషణాహార విహార శ | య్యాసన భోగంబులందు విముఖి
యయి, రేయుఁ బగలు నిద్రయు నెప్పు డెఱుఁగక | దమయంతి నలుఁ డను ధరణినాథు
 
ఆ. నంద బుద్ధి నిలిపి, కందర్ప బాధిత | యగుచు నున్నయది ధరాధినాథ!
ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన | నొల్ల దెంత విభవయుక్తు లయిన.
26
వ. అనిన విని భీముం ‘డేమి సేయుదు? నెవ్విధంబున నమ్మహీపతి నిట రావింప నగునో!’ యని చింతించుచు సంప్రాప్త యౌవనయైన కూఁతుం జూచి యప్పుడు. 27
క. ఆ వైదర్భుఁడు నిఖిల ధ | రా వలయములోనఁ గలుగు రాజన్యుల నా
నా విషయాధీశ్వరులను | రావించెం దత్స్వయంవర వ్యాజమునన్‌.
28
క. మనుజేశ్వరు లెల్లను బో | రన దమయంతీ స్వయంవరమునకు నొప్పం
జనుదెంచిరి సైన్యస్యం | దన ఘట్టన నవనితలము దల్లడపడఁగన్‌.
29
వ. ఆ సమయంబునఁ బర్వత నారదు లను పురాణమునులు భూలోకం బెల్లం గ్రుమ్మరి యింద్రలోకంబునకుం బోయిన నింద్రుండు వారిం బూజించి, భూలోకంబునం గుశలం బడిగి. ‘యిది యెట్లు ధర్మపరిపాలనపరులై వీరులై రణనిహతు లైన రాజు లక్షయలోకసుఖంబు లనుభవింప నతిథులై యిందులకు నింతకాలంబయ్యు రాని కారణం బేమి?’ యని యడిగిన నారదుం డిట్లనియె. 30
క. ‘నర సిద్ధ సాధ్య విద్యా | ధర సురకన్యకలకంటె దమయంతియ సుం
దరి; దాని సుస్వయంవర | మరుదై వర్తిల్లుచున్నయది యిప్డు మహిన్‌.
31
క. అందులకు ధరణిఁ గల నృప | నందను లెల్లను ముదంబునం బోయెడు వే
డ్కం దమలోఁ గలహంబును | గ్రందును లేకున్నవారు గడు నెయ్యమునన్‌.’
32
వ. అనిన నింద్రుండును, లోకపాలవరులును దదాలోకన కౌతుకంబునం గనక రత్నరమ్య దివ్య విమానారూఢులయి చనువారు ముందట దమయంతీ స్వయంవరంబునకుంబోయెడువాని నాదిత్యులలోన విష్ణుండునుంబోలెఁ దేజోధికుండైన వాని ననన్యసాధారణరూపవిభవంబున రెండవ మన్మథుండు నుంబోనివాని నలుం గని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు వచ్చి వాని కిట్లనిరి. 33
సీ. ‘నిత్యసత్యవ్రత! నిషధేశ! నీవు మా | కమరంగ దూతవై యభిమతంబు
సేయుము’ నావుడుఁ జెచ్చెర ‘నట్టుల | చేయుదు మఱి నాకుఁ జెపుఁడు మీర
లెవ్వార? లేను మీ కిష్టంబుగా దూత | నై యేమి సేయుదు?’ ననిన, నతని
కమరేశ్వరుం డిట్టు లనియె; ‘నే నింద్రుండ; | వీరు దిక్పాలురు విదితయశులు;
 
ఆ. ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయం | వరముఁ జూచు వేడ్క వచ్చియున్న
వార; మీవు మమ్ము వారిజాక్షికి నెఱిం | గింపు నామధేయ కీర్తనముల.
34
వ. అట్లయిన నక్కోమలి మాయందుఁ దనవలచినవాని వరియించు ‘ననిన నింద్రునకుఁ గృతాంజలియై నలుం డిట్లనియె. 35
ఆ. ‘ఎఱిఁగి యెఱిఁగి నన్ను నేకార్థసముపేతుఁ | బాడియయ్య యిట్టి పనికిఁ బనుప?’
ననిన ‘నుత్సుకుండ వై యేల చేసెద | నంటి? చేయకుండ నగునె యింక?
36
ఆ. నిన్ను నిత్యసత్యనిరతుఁగా నెఱిఁగి యి | క్కార్యమునకు వలను గలుగు టెఱిఁగి
పనుప వలసె దూతభావ మపేక్షించి; | దేవహితము, దీనిఁ దీర్పవలయు.
37
వ. ఆయుధీయ సురక్షితం బయిన రాజగృహం బెట్లు సొర నగు నని శంకింప వలవదు; దమయంతీ నివేశంబు ప్రవేశించు నపుడు ని న్నెవ్వరు వారింపనోడుదు’ రనిన శక్రువచనంబుల నశంకితుం డయి నలుం డప్పుడ విదర్భా నగరంబునకుం బోయి యొక్కరుండ దమయంతీగృహంబు సొచ్చిన. 38
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )