పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుఁడు దమయంతియొద్దకు దేవదూతయై పోవుట (సం. 3-52-10)
సీ. హంసచేఁ దన వినినంతకంటెను రూప | విభవాతిశయమున వెలయుదాని,
సురకన్యకలయట్టి సురుచిర శతకన్య | కాళిచేఁ బరివృతయైన దాని,
హృదయేశుఁడైన తన్నెప్పుడు వినుచున్కి | నలయ కాశ్వాసిత యైనదాని,
దమయంతిఁ జూచి కందర్పశరావిద్ధుఁ | డయ్యె నలుం; డంత నతనిఁ జూచి
 
ఆ. ‘యితఁ డపూర్వ మనుజుఁ డెందుండి వచ్చెనో’? | యనుచు నుదరిపడి లతాంగు లెల్ల
నాసనములు డగ్గి యప్పు డభ్యుద్గత | లైరి మనములందు హర్ష మెసఁగ.
39
వ. అంత. 40
క. దమయంతి మనోభవనిభు | నమరేంద్రుప్రతిము దినకరాభు సుధారుక్‌
సము వరుణసదృశు ధనదో | పము నశ్విసమాను నిషధపతిఁ జూచి నలున్‌.
41
క. వారిరుహనేత్ర మదన | ప్రేరితయై లజ్జ యుడిగి భీతిల్లక బృం
దారకమూర్తికి రాజకు | మారున కిట్లనియె మందమందమృదూక్తిన్‌.
42
వ. ‘నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది యత్యుగ్రశాసనుండైన మదీయ జనకుచేత సురక్షితంబగుట నెవ్వరికిఁ జొర నశక్యంబు; దీని నెవ్వరు నెఱుంగకుండ నెవ్విధంబునం జొచ్చితివి? నాకు మనోజ వేదనా వివర్ధనుండవైన నీ తెఱం గెఱింగింపు’ మనిన దానికి నలుం డిట్లనియె. 43
ఆ. ‘ఏను దేవదూత నింతి! నలుం డను | వాఁడ; నింద్రదహన వరుణ యములు
నీ స్వయంవరంబు నెమ్మితోఁ జూడంగ | నరుగుదెంచి నన్ను నబల! మున్న.
44
క. నీ యొద్దకుఁ బుత్తెంచిరి; | మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం
దోయజముఖిఁ బ్రార్థింపుము; | మాయందఱకును బ్రియం బమర్పుము ప్రీతిన్‌.’
45
వ. అని పంచినఁ దత్ప్రసాదంబున నన్యులచేత నలక్షితుండనై వచ్చితి; నింద్రాదులకుఁ బ్రియంబు సేయు’ మనిన నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత నలుని విని వానియందు బద్ధానురాగయై నవయుచున్న యది యపు డతని నలుంగా నెఱింగి తద్వచన శ్రవణ దుఃఖాయమాన మానస యగుచు నిట్లనియె. 46
తరువోజ ‘ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు | నెప్పుడు మ్రొక్కుదు; నేను నీ ధనమ
భూనాథ! నీ గుణంబులు హంసచేతఁ | బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన; భవన్నిమిత్తమున ని ట్లఖిల | ధారుణినాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాతకీర్తి! | కరుణించి పతిబుద్ధిఁ గావింపు మిందు.
47
వ. నీవు దీని కొడంబడనినాఁడు రజ్జు విషాగ్ని జలంబులం బ్రాణ పరిత్యాగంబు సేసికొందు’ ననిన దానిం జూచి నలుం డిట్లనియె. 48
మత్తకోకిల ‘భూరిసత్త్వులు సర్వలోకవిభుల్‌ విభూతిసమృద్ధు లి
ద్ధోరుతేజులు నిన్నుఁ గోరుచు నున్నవా రమరోత్తముల్‌;
వారి పాదరజంబుఁ బోలనివాని నన్ను మనుష్యు సం
సారిఁ గోరఁగఁ జన్నె? నీకుఁ బ్రసన్నులై సుర లుండఁగన్‌.
49
క. దేవతల కప్రియంబులు | గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం;
గావున వారి కభీష్టము | గావింపుము; నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!’
50
వ. అనిన దమయంతి నయనాంతర్గళిత బాష్పధారాకలిత కపోలయుగళ యగుచుం బెద్దయుంబ్రొద్దు చింతించి ‘నీయభిప్రాయంబునకు నిరపాయంబైన యుపాయంబు గంటి; నింద్రాదులు నా స్వయంవరంబునకు వచ్చెదరేని వారి సన్నిధిని నిన్నువరియించెద; నట్లయిన నీకు నిర్దోషంబగు’ ననిన నలుండు లోకపాలురపాలికిం బోయి దమయంతికిం దన పలికిన విధంబును దనకు దమయంతి పలికిన విధంబును జెప్పె; నంతఁ బుణ్యతిథి నక్షత్ర శుభముహూర్తంబున దమయంతీ స్వయంవరంబు ప్రవర్తిల్లిన. 51
ఆ. ‘నలున కాని నలినదళనేత్ర వరియింప | దట్టె చూత’ మనుచు నమరవరులు
నలువురును గడంగి నలరూపమున వచ్చి | రా స్వయంవరమున కతిరయమున.
52
వ. అంత. 53
సీ. దమయంతి సితపుష్ప దామాభిశోభిత | హస్తయై చనుదెంచి యంబుజాక్షి
యమ్మహోత్సవ దర్శనాగత రాజన్య | నివహంబు నీక్షించి నెమ్మితోడ
నలువురు వేల్పులు నలుఁదొట్టి యప్పు డే | కాకారులై యున్న నందు నలుని
నేర్పరింపఁగ నేర ‘కింద్రాదులను నలు | నెఱుఁగు నుపాయ మిం కెద్ది యొక్కొ?’
 
ఆ. యనుచు సంశయాకులాత్మయై ‘సురలార! | నలు నెఱుంగువిధము నాకుఁ జేయుఁ
డాత్మరూపధరుల రగుఁ’ డని పరిదేవ | నంబు సేసెఁ దన మనంబులోన.
54
వ. దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి, యనిమిషలోచనంబులు నస్వేదగాత్రంబులు నొప్ప నవనీ తలంబు ముట్టక యాసన్నులై నిలిచి; రంత లోకపాలురును భూలోకంబునఁ గల రాజలోకంబు నవలోకించు చుండఁ బుణ్యశ్లోకుండయిన నలు ధర్మవిధానంబున వరియించి, దమయంతి తదీయ స్కంధంబున సుగంధి కుసుమ దామకంబు వెట్టిన. 55
క. దేవతల సాధువాదము | తో విప్రాశీరవంబుతో బహు తూర్యా
రావంబులు సెలఁగెను, బా | రావార రవంబుఁబోలె ననివార్యములై.
56
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )