పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుండు స్వయంవరలబ్ధ యయిన దమయంతిం బెండ్లియగుట (సం. 3-54-25)
వ. ఇ ట్లపూర్వ స్వయంవర లబ్ధయైన దమయంతి నత్యంత విలాసంబుతో వివాహంబైన యా నలునకు నింద్రుండు వానియజ్ఞంబులయందు నిజరూపంబుఁజూపను, నగ్నియు వరుణుండును వాని వలచిన చోటన యగ్ని జలంబు లుత్పాదింపను, ధర్ముండు ధర్మువునంద వానిబుద్ధి వర్తిల్లను వరంబు లిచ్చి దేవలోకంబున కరుగువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కలిం గని’ యెందులకుం బోయెద?’ వని యడిగిన నింద్రాదులకుఁ గలి యిట్లనియె. 57
తే. ‘అవనిలో దమయంతీ స్వయంవరంబు | విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ
నేను దమయంతిచే వరియింపఁబడుదు | నని తదర్థినై యరిగెద నాసఁ జేసి.’
58
వ. అనిన నందఱు నగి‘నీ వందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తంబయ్యె; నక్కోమలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె’ ననినం గలి కరం బలిగి, ‘యన్నలునకు దమయంతికి రాజ్య విభవ పరిత్యాగంబును బరస్పర వియోగంబునుం జేసెద’ నని నిశ్చయించి, వాని నక్షరతుంగా నెఱింగి, యక్షంబులం జొచ్చి యుండ ద్వాపరుం బనిచి, నలు సేయుచున్న యశ్వమేధాది కానేక భూరి దక్షిణ మహాక్రతువులయు జపహోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయుఁ గారణంబునం జొర నవసరంబుఁ గానక, యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుండి, యొక్కనాఁ డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం బాదశౌచంబు సేయమఱచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్ధావసరుం డయి కలి నలునందుఁ బ్రవేశించి, పుష్కరుం డను వాని పాలికిం బోయి త న్నెఱింగించి ‘నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొ’ మ్మని చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండై యక్షంబులు గొని పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి ‘నీవు మాతో జూదం బాడు’ మనిన. 59
క. ద్యూతార్థము తత్కితవా | హూతుఁడనై జూద మాడకుండుట ధర్మా
పేతం బని యభిముఖుఁడై | యాతనితో నలుఁడు జూదమాడఁ గడంగెన్‌.
60
క. కలధనము లెల్ల నొడ్డుచు | నలయక జూదమున విజితుఁడగుచుండె ని జా
ప్తులు వారించిన నుడుగక | నలుఁడు కలిప్రేరణంబునను హతమతియై.
61
వ. ఇ ట్లనేక మాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధ వస్తువాహన నివహంబు లొడ్డి పుష్కరున కోటువడం బోయిన నెఱింగి పౌర బ్రాహ్మణ ప్రధాన వరులు దమయంతీ పురస్కృతులయి వచ్చి వారించి, కలి సమావేశపరవశుండైన యన్నలుచేతం బ్రతిహతు లయి వలుక కుండి; రంత దమయంతి చింతాక్రాంత చిత్తయై. 62
ఆ. ‘ఎంత యోటువడిన నంతియ జూదంబు | నందుఁ దగులుఁ, జలము నతిశయిల్లు,
నేమి సేయు దాన ? నిది యెగ్గునకు మూల’ | మని లతాంగి దుఃఖితాత్మ యగుచు.
63
సీ. అక్షముల్‌ పుష్కరునందు వశ్యంబులై | యునికియు, నలునియం దొండువిధము
లగుటయు నెఱిఁగి, నిజాధీశ్వరున కప | జయమ కా లక్షించి, సరసిజాక్షి
భర్తయనుజ్ఞ మున్‌ బడసి వార్‌ష్ణేయుఁడన్‌ | సారథిఁ బిలిచి ‘యీ స్యందనమున
నింద్రసేనుండను నిక్కుమారకు నింద్ర | సేన య న్కూఁతుఁ జెచ్చరను దోడు
 
ఆ. కొని విదర్భ కరిగి గుఱుకొని మద్బంధు | జనులయొద్దఁ బెట్టి చట్ట రమ్మ’
యంచు నెమ్మిఁ బుచ్చె నాప్తపురోహిత | మంత్రిబాంధవాభిమతము గాఁగ.
64
క. నలుఁడును ధరణీరాజ్యము | దలఁగఁగ సర్వంబు నపహృతం బైనఁ గడుం
దలరి దమయంతిఁ దోడ్కొని | వెలువడియె నశేషరాజ్యవిభవచ్యుతుఁడై.
65
తే. పురమువెలి మూఁ డహోరాత్రములు వసించి | యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ
జనవిభుం డైన పుష్కరుశాసనమునఁ | గలికృత ద్యూతవిద్వేష కారణమున.
66
వ. ఇట్లు సర్వజన సత్కారార్హుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్విరివలనను సత్కారంబు గానక జలంబు లాహారంబుగాఁ దత్పురసమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి, బుభుక్షాపీడ సహింప నోపక, ‘హిరణ్యపక్షంబులతోఁ దమముందటఁ దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగు నని యప్పక్షులం బట్టికొన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన, నవి పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు విగతవస్త్రుండైన నలున కి ట్లనియె. 67
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )