పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుండు దమయంతీసహితుండై యడవికిఁ బోవుట (సం. 3-58-25)
తే. ‘నీ ధనంబును రాజ్యంబు నికృతిఁ గొన్న | యక్షముల మేము; నీ వస్త్ర మపహరింపఁ
బక్షిరూపులమై వచ్చి పార్థివేంద్ర! | యపహరించితి’ మని చెప్పి యరిగెఁ జదల.
68
వ. నలుండును వానిం జూచి విస్మయం బంది ‘యీ యక్షంబుల దోషంబునం గా కేమి? నా కిట్టి దయ్యె’ ననుచు దమయంతి కట్టిన పుట్టంబుచెఱంగు గట్టికొనియె; నట్లిద్దఱు నేకవస్త్రులయి యొండొరుల మొగంబులు సూచి దుఃఖించుచో నలుండు దమయంతి కి ట్లనియె. 69
క. ‘ఇది దక్షిణాపథంబున, | కిదియు విదర్భాపురమున, కిది కోసల, కి
య్యది యుజ్జయినికిఁ దెరువులు; | మది నిన్నిటిలోన నరుగ మన కెద్ది యగున్‌?
70
క. అడవులలో నాతోఁ గడు | నిడుమలు వడనోప; వరుగు మిందుముఖీ! యి
ప్పుడు నీ బంధుజనంబుల | కడ’ కనవుడుఁ దరుణి శోకగద్గద యగుచున్‌.
71
ఆ. అతని కిట్టు లనియె ‘నవనీశ! నీవును | నేనుఁ జని విదర్భ నిష్టలీల
నుండుదము; మృగాకులోగ్రవనంబుల | కరుగ నేల? యిడుమ లంద నేల?’
72
వ. అనిన విని నలుం డవనతాననుండై ‘నీ చెప్పినట్ల విదర్భేశ్వరు రాజ్యంబును మన రాజ్యంబ; యేను దొల్లి యధికైశ్వర్యయుతుండనై యందులకుంబోయి బంధుజనులకు హృదయానందంబు సేసి, యిప్పు డివ్విధంబున సర్వస్వహీనుండనై యెట్లు పోవనేర్తు?’ ననిన దమయంతి యిట్లనియె. 73
తే. ‘అధికదుఃఖరోగార్తున కౌషధంబు | సురుచిరంబుగ భార్యయ చూవె యెందు;
నొనర భార్యాసమేతుఁడై యున్నవాని | కెంతలయ్యును నాపద లెఱుకపడవు.
74
క. అలసి నెడ, డస్సి నెడ, నాఁ | కలి దప్పియు నైన యెడలఁ గడుకొని ధరణీ
తలనాథ! పురుషునకు ని | మ్ముల భార్యయ పాచుఁ జిత్తమున దుఃఖంబుల్‌.
75
వ. కావున నిది మదనుజీవిత యనియు, ననువ్రత యనియు ననుకంపనీయ యనియు, నన్ను విడువక నా యనుగమనంబున కొడంబడు’ మనిన ‘నట్ల చేయుదుఁ, బ్రాణసమాన వైన నిన్నేల విడుతు; నోడకుండు’ మని నలుండు దనదేవి నాశ్వాసించుచు నొక్కటఁ జని విజనంబైన విపినంబున నొక్క సభం గని యందు విశ్రమించి, పరుషధూళిధూసర స్థలంబున శయనించి, మార్గశ్రమ నిమీలిత నయనుండై దుఃఖంబునఁ గన్నులు వొందకున్న లేచి, తనపాదంబుల యంతికంబున నతిక్లేశపరవశయై నిద్రవోయెడు దమయంతిం జూచి. 76
సీ. ‘ధరణిరాజ్యంబుతో ధనమెల్లఁ బరులచే | నపహృతం బగుటయు, నాప్తమిత్త్ర
బంధుజనంబులుఁ బ్రకృతిజనంబులు | విడుచుటయును, మహావిపినభూమిఁ
బత్నితోఁ దన పరిభ్రమియించుటయు నప్డు | దలఁచి శోకించి, యిత్తరుణి దొల్లి
మృదుశయనంబున మెలఁతలు మెలపుతో | నడుగు లొత్తఁగ నిద్ర యనుభవించు
 
ఆ. కోమలాంగి యిపుడు గుఱుకొని పాంసుల | స్థలమునందు నిద్ర దగిలినదియుఁ
బంకజాక్షి నాకు భార్యయై యింత దుః | ఖంబు వొందె దైవఘటనఁ జేసి.
77
వ. ఏను దీని దుఃఖంబుఁ జూడ నోప; నెట యేనియుం బోయెద; నిది నన్నుం గానక తన బంధువుల యొద్దకుం బోయి దుఃఖంబులం బొరయకుండు’ నని విచారించి, పోవ సమకట్టి యక్కోమలి మేలుకొనకుండ మెల్లన దాని వస్త్రంబు నర్ధంబు సించి తనకుం బరిధానంబు సేసికొని వెలువడి కొండొకనేలయరిగి, దమయంతి యందు ఘనంబైన తన నెయ్యం బను తీఁగం ద్రెంపనేరక క్రమ్మఱి వచ్చి. 78
చ. కలి దమయంతిఁ బాప సమకట్టుఁ, బొరింబొరి వాయనోపఁ డా
లలన నుదీర్ణసౌహృదబలంబున; నిట్టులు రెంటఁ జేసి య
న్నలుఁడు విమోహరజ్జులఁ బెనంగి గతాగతకారి యైన యు
య్యెలయును బోలె నూఱడక యెంతయుఁ బ్రొద్దు వినిశ్చితాత్ముఁడై.
79
తే. ‘బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి | నిష్ఠురుండనై యే నెట్లు నేర్తుఁ బోవ’
ననక కలిచేత నాకృష్టుఁడైన నలుఁడు | విగతకరుణుఁడై దమయంతి విడిచి చనియె.
80
వ. అంత దమయంతి మేలుకని పతిం గానక, తన వస్త్రార్ధ నికృంతనంబును జూచి లేచి, నలుగడం బరికించి, భయశోకవ్యాకులచిత్త యయి. 81
సీ. ‘హా! మహారాజ! మహామహీ రక్షణ | దక్ష దక్షిణబాహుదండ! దండి
తారాతి! నిషధరాజాగ్రణి! న న్నిట్లు | వీతదయుండవై విడిచి చనఁగఁ
దగునె? నీ వెన్నఁడు ధర్మువు దప్పని | వాఁడవు, సూనృతవ్రతరతుండ;
వోడకు మని నన్ను నూఱడఁ బలికిన | పలు కిట్లు మఱవంగఁ బాడి యగునె?
 
ఆ. పొదలలోన డాఁగి పొడసూప కిట్లేల | యున్నవాఁడ? విట్టి యుగ్రభావ
మేల నీకు వలసె? నెట వోదు? నిం కెట్లు | గాంతు నిన్ను నుగ్రకాననమున?
82
క. వగవఁగ సాంగోపాంగము | లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ
ల్పుగ నొక సత్యముతో నెన | యగునే? యెవ్వియును బోల వటె సత్యంబున్‌.
83
వ. ప్రాణ సమానవయిన ని న్నవశ్యంబును విడువనని పలికితి; సత్యప్రతిపాలనంబు సేయు’ మని ప్రలాపించుచుం దన యేకాకిత్వంబునకు నబలాభావంబునకుఁ బ్రతిపదన్యాస జాయమాన కంటక మృగ పన్నగభయంబునకు వగవక, నిజనాథు నసహాయత్వంబునకు దుస్సహక్షుత్పిపాసాశ్రమాకులత్వంబునకు వగచుచు. 84
క. అలయుచుఁ, బులుఁగుల యెలుఁగుల | కులుకుచు, నుగ్రాతపమున కోపక వృక్షం
బులనీడల నిలుచుచు, నెలుఁ | గులఁ బులులం జూచి భయముగొని వగ వగచున్‌.
85
క. ఏచిన పొదలఁ బొరల్పడఁ | ద్రోచుచు, ముండ్లకును నల్లఁ దొలఁగుచు, దిక్కుల్‌
సూచుచుఁ, దొడరుచుఁ ద్రెళ్ళుచు | లేచుచు లలితాంగి సంచలించుచు నరిగెన్‌.
86
వ. ఇ ట్లరుగుచున్న దమయంతి నంతిక న్యస్త చరణయైన దాని నాహారార్థియయి యొక్క యజగరంబు వట్టికొనిన నక్కోమలి మెదల నేరక. 87
ఆ. ‘ఇంక నైన నన్ను నేల యాలింపవు? | నాకు శరణ మగుము నాథ!’ యనుచు
నఱచుచున్న దాని యాక్రందనధ్వని | వినుచు నొక్క యెఱుకు వేగ వచ్చి.
88
వ. తన పట్టిన సురియ నప్పెనుఁబాము వదనంబువ్రయ్యం దఱిగిన రాహుముఖవిముక్తయైన చంద్రరేఖయుంబోలె నజగరముఖంబువలన వెలువడిన యా దమయంతి నాశ్వాసించి, తత్సమీప సరోవరస్నాతను వన్యస్వాదు ఫలాహారనుంగాఁ జేసి విగతశ్రమం గావించి, ‘నీ వెవ్వరిదాన విట్లేల యేకతంబ యివ్వనంబునకు వచ్చి?’ తని యడిగి మధురభాషిణి యైన యమ్మగువవలన నంతవృత్తాంతంబు నెఱింగి. 89
కవిరాజ విరాజితము రజనికరాననఁ బీనపయోధర | రాజితరాజసుతన్‌ విలస
ద్గజపతిగామినిఁ జందనగంధిఁ బ్ర | కాశితకాంతిసమన్వితఁ బం
కజదళలోచనఁ జూచి కిరాతుఁడు | కామనిశాతశరాహతుఁడై
నిజహృదయం బెఱిఁగించె లతాంగి క | నింద్యచరిత్రకు వేడుకతోన్‌.
90
ఆ. అగ్నిశిఖయుఁ బోలె నంటను డాయను | జూడ రానియట్టి శుభచరిత్ర
నెఱుక లేని కఱకుటెఱు కపేక్షించెఁ గా | దనక తనకు నాయు వల్పమైన.
91
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )