పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట (సం. 3-61-34)
వ. దమయంతి వాని నలిగి చూచి ‘యేను పతివత్ర నైతినేని యిద్దురాత్ముండైన కిరాతుం డిప్పుడ మృతుం డయ్యెడు’ మని శాపం బిచ్చిన, వాఁ డప్పుడ యగ్నిదగ్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుండై పడియె; నట్లు పరమపతివ్రతాగుణప్రభావంబున. 92
క. బాల హృదయమున నృపశా | ర్దూలు నిజాధీశు నిలిపి దుష్టోరగ శా
ర్దూ లాభీల మృగావలి | కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్‌.
93
వ. మఱియును. 94
సీ. ‘సహకార! మత్ప్రియసహకారుఁ, బున్నాగ! | పున్నాగఁ, దిలక! భూభువనతిలకుఁ,
జందన! బుధహరిచందనుఁ బుష్పితా | శోక! సుహృజ్జనశోకదమను,
వకుళ! కులైకదీపకు, విభీతక! భయో | పేతార్తిహరు నలుఁ బ్రీతితోడఁ
గానరే కానలలోన లోకోత్తరు?’ | నని మ్రాని మ్రానికి నరిగి యరిగి
 
ఆ. యడుగు, నడుగు లెండఁ బొడ వొడఁ బొక్కిన | నిర్ఝరాంతరముల నిలుచుఁ బిలుచు,
గిరుల దరుల యెడల నురుగుహాగృహములఁ | దొంగి తొంగి చూచుఁ దోయజాక్షి.
95
వ. ఇట్లు దమయంతి నిజనాథు నన్వేషించుచు భీషణారణ్యంబునం ద్రిమ్మరునది ముందట. 96
మత్తకోకిల వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ
వారభక్షులు వృక్షమూల నివాసయుక్తులునై తపం
బారఁజేయు మహామునీంద్రుల యాశ్రమం బెడఁ గాంచె నం
భోరుహాక్షి పురాసమార్జితపుణ్యకర్మఫలంబునన్‌.
97
వ. ఇట్లు మృగవ్యాళ తస్కర కిరాత నిరంతరం బయిన కాంతారంబునం బుణ్యనదీతీరంబున నొక్కముని పల్లియం గని యందు వసిష్ఠ వామదేవ వాలఖిల్య భృగు నారద సదృశులైన మహామునులం గని నమస్కరించియున్న నమ్మునులు దమయంతిం జూచి యచ్చెరువడి ‘యవ్వా! నీ వెవ్వరిదాన? వివ్వనదేవతవొ! దేవభామినివొ! దివ్యంబైన తేజంబుతో నేకతంబ యేల క్రుమ్మరియెద?’ వనిన వారలకు దమయంతి యిట్లనియె. 98
క. ‘వినుఁ డేఁ బుణ్యశ్లోకుం | డనఁగ సదా యజ్ఞనిరతుఁ డనఁగ ధరిత్రిం
దనరిన నలు భార్యను, స | జ్జననుత దమయంతి యన నెసంగినదానన్‌.
99
వ. విధివశంబున నన్నుం బాసి నా హృదయేశ్వరుం డెట యేనియుం బోయినఁ దదన్వేషణాసక్తచిత్తనై విపిన పరిభ్రమణంబు సేసెద; మీతపోవనంబునకు వచ్చి నలుండు భవత్పాదాభివందన కృతార్థుండై యెక్కడికింబోయె? నతని పోయిన వల నెఱుంగుదురేని నానతిండు; కొన్ని దినంబులలోనఁ దద్దర్శనంబు సంభవిల్లనినాఁడు దేహంబు విడుతు’ నని యేడ్చుచున్న దానిం జూచి కరుణించి మును లిట్లనిరి. 100
క. ‘వనజాయతాక్షి! కతిపయ | దినములఁ జూడంగఁ గాంతు తివిరి నలుని భూ
జననుతు నెప్పటియట్టుల | తన పురమున రాజ్యలీలఁ దనరెడివానిన్‌.
101
వ. ఏము తపోదృష్టిం జూచితిమి, దుఃఖింపకుండు’ మని తాపసులు దమ యగ్నిహోత్రంబులయు నపారఫల పుష్పతరు నదీ రమ్య తపోవనంబులయుఁదోడ నదృశ్యులైనం జూచి దమయంతి ‘యిది కలయో నిక్కువంబో’ యని విస్మయం బందుచుం జని, ముందట నొక్క చనుపం గని దానిం జొచ్చునపు డందలి జనంబులు. 102
సీ. పాంసుజాలములు పైఁబ్రాఁకినఁ గరము రూ | క్షములగు నూర్ధ్వాలకముల దాని
నతిమలినంబైన యర్ధవస్త్రంబుచే | నావృతం బగు దేహయష్టి దాని,
నాఁకలి తృష నిద్ర యను వీని నెఱుఁగక | యున్మాదినియుఁ బోలె నున్న దాని,
దమయంతిఁ జూచి కొందఱు పిశాచం బని | పఱచిరి, కొందఱు భయము వొంది.
 
ఆ. రందుఁ గొంద ఱధిక హాస్యంబు సేసిరి, | ‘యడవి నేమి రోసె’ దనిరి కొంద,
‘ఱవ్వ! నీవు వేల్పవగు’ దని కొందఱు | మొగిన కేలు మొగిచి మ్రొక్కి రంత.
103
వ. దమయంతియు సార్థవాహుంజూచి’ యిమ్మహాగహనంబున నిట్టి జనసంకులం బైన సార్థంబు గానంబడియెడు నెట్టి పుణ్యంబో’ యని పల్కి, మఱియు నిట్లనియె. 104
క. ‘ఏను నలు భార్యఁ బుణ్యవి | హీనతఁ బతిఁ బాసి నవసి యేకాంతమ యీ
కానలఁ బరిభ్రమించెదఁ | గానరె ? మీ రమృతసదృశుఁ గరుణాత్ము నలున్‌?’
105
వ. అనిన దానికి సార్థవాహుండు శుచి యను వాఁ డిట్లనియె. 106
క. ‘నలుఁ గాన మివ్వనంబునఁ | గల వెప్పుడుఁ గాంతు ముగ్రకరులను సింహం
బుల ఋక్షంబుల; నిది మ | ర్త్యుల కవిషయ; మాతపంబు దూఱదు దీనన్‌.’
107
వ. అనిన ‘నిచ్చనుప యెట వోయెడు?’ నని యడిగినఁ ‘జేదిపతియైన సుబాహుపురంబునకుం బోయెడు’ నని చెప్పిన ‘నట్లేని మీతోడ వచ్చెద’ నని యప్పరమపతివ్రత పతిదర్శన లాలసయై మునుల పలుకులు తలఁచుచు సార్థంబుతో నరిగిన. 108
క. కడునెండ యెక్కు నంతకు | నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో
విడిసె బహుశీతజలముల | బెడఁ గగు నొక చెఱువునొద్దఁ బెద్దయు డప్పిన్‌.
109
వ. అంత. 110
సీ. అర్ధరాత్రమునప్పు డందుల కేతెంచె | గజయూథములు జలకాంక్షఁ జేసి
యంబుధి విమలతోయంబు లాస్వాదింపఁ | జనుదెంచు జలధరసమితియట్ల
యచ్చన్పలోన నిద్రాసక్తులైన వా | రున్నత ద్విపముల యుగ్ర పాద
హతిఁ జేసి మర్దితు లైరి కొందఱు, దంత | హతిఁ జేసి భిన్నాంగు లైరి కొంద,
 
ఆ. ఱఱచి ప్రాణభీతిఁ బఱచి మహీజంబు | లెక్కి రందుఁ గొంద ఱుక్కడంగి;
చనుప యిట్టిపాటఁ బెనుపఱి యవినీతు | సిరియుఁబోలె నడఁగి విరిసి చనియె.
111
వ. అట్టి సంక్షోభంబున మరణంబునకుఁ దప్పి దమయంతి యాత్మగతంబున. 112
ఆ. ‘జీవితార్థు లైన జీవుల సుఖసుప్తు | లైన వారిఁ జంపె నఱవ నఱవ;
మరణకాంక్ష నున్న మగువఁ జంపక నను | మఱచె; విధి కరంబు మందబుద్ధి.
113
సీ. ఇచ్చన్పతోఁ జని యివ్వనక్లేశంబు | దలుఁగుదు నని బుద్ధిఁ దలఁచి యున్న
నురుతర సార్థ పయోరాశి హస్తియూ | థాగస్త్యుచేఁ బీత మయ్యె; నదియుఁ
దొలుమేనఁ జేసిన దుష్కృత శక్తియో, | వగవక నా స్వయంవరమునాఁడు
సురవరు లర్థులై చూచుచు నుండఁగ | నలు వరియించిన నాఁటి యెగ్గు
 
ఆ. దలఁచి యిట్టి యాపదలు సేసిరో వేల్పు, | లమరకోపమునన యయ్యె నాకు
నివ్వియోగదుఃఖ; మింకేమి సేయుదు?’ | ననుచు వగచుచుండె నంబుజాక్షి.
114
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )