పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట (సం. 3-62-28)
వ. ఇట్లు దుఃఖించుచు దమయంతి ప్రభాతంబ హతశేషులైన యచ్చనుపలోని బ్రాహ్మణవరులతో ననవరత ప్రయాణంబులం జేదిపతి పురంబు సొచ్చి, జనసంకులంబైన రాజమార్గంబు దఱియ వచ్చుచున్న దాని దినకర ప్రభాపటల ధూసరిత ప్రభాతచంద్రరేఖయుంబోలె దీప్తివిహీనయై డస్సియు రమ్యాకృతియైన దాని దమయంతిం బ్రాసాదగతయైన రాజమాత దవ్వులం గని తన దాది కిట్లనియె. 115
తే. ‘జీర్ణమై కడు మాసిన చీరగట్టి | ధూళి ధూసరాలకములు దూలుచుండ
నబల యున్మత్తవేషిణి యైన లచ్చి | కరణి నిట వచ్చుచున్నది కంటె దాని.
116
వ. అక్కోమలియందు నా కతిస్నేహంబై యున్నయది; దానిం దోడ్కొని ర’మ్మనిన నదియు దమయంతిం దోడ్కొని రాజమాత యొద్దకుం జనిన, నా రాజమాతయు దానిం జూచి ‘నీవెవ్వరి దాన? వి ట్లేల దుఃఖావేశవివశవై యున్నదానవు చెప్పు’ మనిన దమయంతి యిట్లనియె. 117
మధ్యాక్కర ‘జితవైరి మత్పతి జూదమాడి నిర్జితుఁడయి చనినఁ
బతితోడ నీడయుఁ బోలె నేనును బాయక యరిగి
యతిబుభుక్షాతురుండైన పతిచేత నవ్వ! దైవాను
మతిఁజేసి వంచితనైతి నొక్కచో మఱచి నిద్రించి.
118
వ. అంతనుండియు నమ్మహానుభావు నేకవస్త్రు ననికేతను నన్వేషించుచు, సైరంధ్రీవృత్తంబు సేకొని, వియోగానలంబునం గంది, కందమూల ఫలంబుల యాహారంబుగాఁ, బ్రొద్దు వడినచోట నివాసంబుగా, మృగంబుల సహాయంబుగా, వనంబులం పరిభ్రమించితి’ నని, బాష్పజలంబులం బయోధరస్థలపరాగంబు పంకంబు సేయుచుఁ బలుకనేరకున్న యా దమయంతికి రాజమాత యిట్లనియె. 119
క. ‘నీ వుండుము నాకడ నిం | దీవరదళనేత్ర! నీ పతిని రోయఁగ భూ
దేవోత్తములం బంచెద’ | నావుడు ని ట్లనియె భీమనందన నెమ్మిన్‌.
120
వ. ‘ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్ఛిష్టంబు ముట్టను; బదధావనంబు సేయను; బరపురుషులతోఁ బలుక నోపఁ; బతి నన్వేషించు పొంటె నరిగెడు బ్రాహ్మణులతోఁ బలుకుదు; నట్లయిన నీయొద్ద నుండుదు; నొండు విధంబైన నుండనేర’ ననిన ‘నీకిష్టం బైన విధంబున నాయొద్దన యుండు’ మని దాని నతిగౌరవంబునం జేకొని యుండఁ దనకూఁతు సునంద యనుదాని సమర్పించిన. 121
క. అలయక పుణ్యవ్రతములు | సలుపుచుఁ జేదీశుపురిని సైరంధ్రి యనన్‌
నలుదేవి యుండె నెదఁ బతిఁ | దలఁచుచు దుస్సహవియోగతాపార్దితయై.
122
వ. అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబులో నరుగువాఁడు ముందట. 123
చ. అవిరళ విస్ఫులింగ నివహంబుల నభ్రపథంబు నంటుచున్‌
దవదహనం బుదగ్రతరుదాహము సేయుచు నున్నఁ జూచి మా
నవపతి దాని యంతరమునన్‌ వినియెన్‌ ‘నరనాథ! నన్ను గా
రవమునఁ గావ వేగ యిట ర’ మ్మను నార్తమహానినాదమున్‌.
124
క. విని శంకింపక చెచ్చెర | ననఘుం డత్యుగ్రతర దవానలమధ్యం
బున కుఱికి కనియె దీనా | ననుఁ గుండలితాంగు నొక్క నాగకుమారున్‌.
125
వ. అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై ‘యేను గర్కోటకుం డనువాఁడఁ; గర్మవశంబున నొక్క బ్రహ్మఋషి నుపాలంభించి తచ్ఛాపంబున నెక్కడం గదలనేరకున్నవాఁడ; నియ్యెరగలి చిచ్చు సర్వజీవులకు సంహారకారణంబై పేర్చి నలుదెసలం గలయం బర్వి చనుదెంచుచున్నయది; యీ యపాయంబు దలఁగు నట్లుగా నుద్ధరింపవలయు; నీవు కరుణాత్మకుండవు గావున నిన్ను వేడెద. 126
క. నాలుగుదిశలను దావ | జ్వాలావలి గవిసె; మ్రంది చానోప; మహీ
పాలక! న న్నొక సరసీ | కూలముఁ జేరంగ నెత్తికొని పొమ్ము దయన్‌.
127
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )