పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుఁడు కర్కోటకునిచేత దష్టుం డగుట (సం. 3-63-7)
వ. నన్ను రక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు’ ననిన వాని నెత్తికొని పోవం జులుక నై యంగుష్ఠ ప్రమాణ దేహుండైయున్న నెత్తికొని, నలుం డతిత్వరితగతి నరిగి తాపవర్జితంబైన యొక్క సరోవర సమీపంబున విడువం బోయిన ‘నింకను బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తిఁ జేసెద ననిన నడుగు లెన్నికొనుచు నరిగి పదియగు నడుగునప్పు డప్పాముచేత దష్టుండై తనరూపంబు విడిచి వికృతరూపంబుతో నున్న నన్నలునకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యిట్లనియె ‘నయ్యా! నీవు నా చేత విషపీడితుండ నైతి నని దుఃఖింపవలదు; ని న్నొరు లెఱింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీ శరీరంబున నా విషం బుండు నంతకాలంబును నీకు విషోరగ రాక్షస పిశాచ శత్రునివహంబువలని భయంబు లేదు; సర్వ సంగ్రామజయంబును భార్యాసంగమంబును నెప్పటిరాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టం బయ్యె నప్పుడ నన్నుం దలంపు; మీ వస్త్రంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప ప్రాప్తి యగు’ నని వరం బిచ్చి వెండియు నిట్లనియె. 128
మధ్యాక్కర ‘ఇలఁ బ్రసిద్ధుఁడు ఋతుపర్ణుఁ డనెడు మహీశుఁ డిక్ష్వాకు
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిఁ గొలిచి యం దుండు;
నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి,
వెలయ నతనిచేత నక్షహృదయ మ న్విద్యఁ జేకొనుము.
129
వ. మఱియు బాహుకుం డను నామంబుతో సూతవృత్తి నుండు’ మని హితోపదేశంబు సేసి కర్కోటకుం డదృశ్యుం డైనఁ, దద్వచనంబున నలుం డయోధ్యాపురంబునకుం జని ఋతుపర్ణుం గని ‘యేను బాహుకుం డనువాఁడ నశ్వశిక్షయందుఁగుశలుండ; నన్నసంస్కారంబులు శిల్పంబులుఁబెక్కువిధంబులరచియింప నేర్తు; భవత్సేవార్థినై వచ్చితి’ ననిన ఋతుపర్ణుం డిట్లనియె. 130
క. ‘నాయొద్ద నుండుదేని మ | దీయ రథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగాఁ
జేయుము’ నావుడు ‘నట్టుల | చేయుదు’ నని నలుఁడు వాని సేవించెఁ దగన్‌.
131
వ. ఇట్లు ఋతుపర్ణునొద్దనశ్వాధ్యక్షుండయి దుష్టాశ్వంబుల వశంబుఁజేయుచు, నశ్వారోహకుల నారోహణంబుల శిక్షించుచు, రసవంతంబుగ నన్నసంస్కారంబు సేయుచు, ఋతుపర్ణుచేత నియుక్తు లయిన వార్‌ష్ణేయ జీవలులు దనకు సహాయులుగాఁ బ్రచ్ఛన్నుండై యుండి యొక్కనాఁడు. 132
సీ. ‘ఇభరాజగమన! నీ వెందుల కరిగి? త | త్యురుకుచభార! యెందున్నదాన?
వబల! యెవ్వరిచేత నడవులలోఁ బట్టు | వడి? తశనాపేక్షఁ బఱచుచున్న
యుగ్రమృగంబుల యుదరంబులో నున్న | దానవే? నీ తల్లిదండ్రులొద్ద
ధృతి నున్న దానవే? దేశాంతరంబుల | నున్న దానవె?’ యంచు నుదితమదన
 
ఆ. హతి విమోహితాత్ముఁడై హృదయేశ్వరిఁ | దలఁచి రాత్రు లెల్లఁ దాపమునను
నిద్రలేక వంది నిట్టూర్పు లూర్చుచు | నుండె నలుఁడు శోక ముత్కటముగ.
133
వ. అతని ప్రలాపంబు విని యొక్కనాఁడు జీవలుం డాత్మగతంబున. 134
క. ‘అఱపొఱడు కుఱుచ చేతులు, | నొఱవ శరీరంబుఁ గలిగి యొరులకుఁ జూడం
గొఱగా కుండియు, మన్మథు | నొఱపులఁ బడియెడు నితండు యువతీప్రియుఁడై.
135
వ. వీనిచేతఁదలంపంబడియెడు వనిత వీనికంటె లెస్స కాకున్నె!’ యనుచు బాహుకునొద్దకు వచ్చి ‘నీ తలంచుచున్న భార్యకు, నీకు నేల వియోగం బయ్యె?’ నని యడిగిన వానికి బాహుకుం డిట్లనియె. 136
ఆ. ‘నన్నుఁ జూచి నగరె? నలినాక్షి నా కేల? | విప్రయోగ మేల? వినవె తొల్లి
యేలయో యెఱుంగ నేను, మందప్రజ్ఞుఁ | డను భటుండు దన లతాంగిఁ బాసి.
137
వ. దాని నన్వేషించి యెందునుం గానక దుఃఖితుండై ప్రలాపించినం దత్ప్రలాపం బేను ననుకరించితి’ నని చెప్పి యి ట్లయోధ్యాపురంబునఁ బ్రచ్ఛన్నుండై బాహుక నామంబుతో నలుం డుండె; నంత నిట విదర్భేశ్వరుండు నలురాజ్యభ్రంశంబు విని కూఁతురు నల్లుండు నెట వోయిరో? యెందున్నవారో? యని శోకించి. 138
క. వారల రోయఁగఁ బంచె న | పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల సదా
చారుల విద్వాంసుల స | త్కారంబులఁ దనిపి వారిఁ గడు నెయ్యమునన్‌.
139
వ. మఱియు నలదమయంతు లున్నచో టెఱింగి వచ్చిన వారికి వెయ్యేసి గద్యాణంబు లిత్తు ననియు, వారలం దోడ్కొని వచ్చినవారికి గోసహస్రంబులు నగ్రహారంబులు నిత్తు ననియుఁ బలికి పంచిన. 140
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )