| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
జగతీచక్రమునం గల | నగర మహాగ్రామ పట్టణంబులు కలయన్ జగతీదేవోత్తము లి | మ్ముగ రోసిరి నిఖిల దేశముల కరిగి వడిన్. |
141 |
| వ. | అందు సుదేవుం డను బ్రాహ్మణుండు చేదిపతియైన సుబాహుపురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం బోవు బ్రాహ్మణులతో రాజగృహంబు సొచ్చి; యంతఃపురంబున సునందా సహితయై యున్నదాని ధూమజాల నిబద్ధం బైన యగ్నిప్రభయునుం బోలె నీలాభ్రసంవృతం బైన చంద్రరేఖయుంబోలె బహుపంకనిమగ్నం బైన మృణాళియుంబోలె నేర్పడ కున్ననుం దదీయ భ్రూయుగ మధ్యగతంబైన సూక్ష్మలక్షణం బిమ్ముగా నిరీక్షించి, దాని దమయంతిఁగా నెఱింగి, యాత్మగతంబున ‘నిది పతి విముక్తయై శుష్కప్రవాహ యైన నదియునుంబోలె శూన్యకమలయైన నళినియుం బోలె నపేతచూతంబైన వనభూమియుం బోలె నొప్పకుండియుఁ దన పతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది. | 142 |
| తే. |
అనపహార్యంబు తేజోమయంబు సర్వ | గుణములకు నలంకారంబు గురుతరంబు భామలకుఁ బతిభక్తియ పరమ మైన | భూషణం; బిట్టివే పెఱ భూషణములు? |
143 |
| వ. | రోహిణికిఁ జంద్రసమాగమంబునుంబోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డయ్యెడునో? తుల్యశీల వయోరూపాభిజాత్యులైన నలదమయంతు లొక్కట నుండం జూచి విదర్భేశ్వరుం డెన్నఁడు కృతార్థుం డయ్యెడునో?’ యంచు నల్లనల్లన డాయవచ్చి దమయంతి కిట్లనియె. | 144 |
| తే. |
‘అవ్వ! నీ తల్లిదండ్రుల కాత్మజులకు | బంధుజనులకుఁ గుశలంబు; భామ! నీదు కుశల మెఱుఁగునంతకు వంతగూరి వగుచు | చున్నవారు; వారికి వంత యుడుగు నింక. |
145 |
| వ. | దేవీ! యేను భవద్భ్రాతృసఖుండ; సుదేవుండను బ్రాహ్మణుండ; విదర్భేశ్వరుండు నీ యున్నచో టెఱుంగం బెక్కండ్రు బ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్నుం గంటి’ ననిన దమయంతి వాని నెఱింగి తన పుత్త్రులఁ దల్లిదండ్రుల బాంధవులం బ్రత్యేకంబ యడిగి, యశ్రుజలంబు లురల నేడ్చుచున్నం జూచి ‘యేలకో యిప్పుడు సైరంధ్రి యేడ్చుచున్నయది’ యని సునంద తన జననికిం జెప్పి పుచ్చిన. | 146 |
| క. |
చనుదెంచె నంతిపురమున | వనితానివహంబుతోడ వారిజదళలో చన రాజమాత నృపనం | దన యగు దమయంతికడకుఁ దద్దయు వేడ్కన్. |
147 |
| వ. | ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతిం జూచి రాజమాత బ్రాహ్మణున కిట్లనియె; ‘నయ్యా! ఇది యెవ్వని కూఁతు? రెవ్వని భార్య? యేమి కారణంబునం దనభర్తను బాంధవులనుం బాసి పుణ్యవ్రతంబులు సలుపుచున్నయది? నీ వె ట్లెఱింగి? తిక్కోమలి నామం బేమి?’ యని యడిగిన సుదేవుం డిట్లనియె. | 148 |
| మధ్యాక్కర |
‘నలినాక్షి! యిది విదర్భేశుతనయ, పుణ్యశ్లోకుఁ డైన నలుదేవి దమయంతి సుమ్ము; విధి కారణమ్మున రాజ్య చలితుఁడై నిజనాథుఁ డరిగినం దోన చనియె; నవ్వార్త వెలయంగ విని వీరి రోయఁబంచె భూవిభుఁడు బ్రాహ్మణుల. |
149 |
| వ. | ఏ నిందులకు వచ్చి, మీచేత సురక్షితయై యున్న యిక్కోమలిం జూచి, దీని భ్రూమధ్యంబునం బద్మప్రభంబై విభూత్యర్థంబుగా విధాతృనిర్మితం బైన పుణ్యలక్ష్మంబు పాంసుపటలచ్ఛన్నం బై యున్న నుపలక్షించి మారాజు పుత్త్రింగా నెఱింగితి’ ననిన సునంద శుద్ధోదకంబుల దాని భ్రూమధ్యంబు గడిగిన నది విస్పష్టంబగుడు నందఱు నాశ్చర్యం బంది; రంత. | 150 |
| సీ. |
ఆనందభరితాత్మయై రాజమాత య | క్కమలాక్షిఁ బ్రీతితోఁ గౌఁగిలించి కొని, ‘తల్లి! నీవు నా కూతుర; వేను నీ | జననియుఁ బేర్మి దశార్ణరాజ తనయల; మదియు విదర్భేశు సతి యయ్యె; | నే వీరబాహున కింతి నైతి’ ననిన నయ్యవ్వకు నతివినయంబుతో | నలుదేవి మ్రొక్కి, సునంద నెత్తి |
|
| ఆ. |
కొని, కరంబు నెమ్మిఁ గొన్నిదినంబు లం | దుండి యిట్టు లనియె నొక్కనాఁడు ‘దేవి! యిదియు నదియు ధృతి నాకుఁ బుట్టిన | యిండ్లు; కడుసుఖంబ యిందు నందు. |
151 |
| వ. | అయినను దల్లిదండ్రుల ననుజుల నాత్మజులం జూడ వేడుక యైనది; విదర్భకుం బోయెద; నానతి’ మ్మని కృతాంజలి యైన దమయంతి నతిస్నేహంబున సుబాహుజనని సుతప్రేషితబలంబుతో సువర్ణమణిమయ విమానోపమానయానంబున నునిచి పుచ్చిన. | 152 |