| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
భామ విదర్భ కేఁగి తన బంధుజనంబులయొద్ద నుండియుం గోమలి దేహసౌఖ్యములకున్ వెలియై మలినార్ధవస్త్రమున్ భూమిరజంబు నంగమునఁ బొల్పగుచుండఁగ నుండె జీవిత స్వామి నిజేశుఁ జూచు దివసంబులఁ గోరుచు సువ్రతంబుతోన్. |
153 |
| వ. | ఇట్లు భర్తృవియోగాతురయై దమయంతి ప్రాణంబు భరియింపనోపక యొక్కనాఁ డేకాంతంబునఁ దన జనని కిట్లనియె. | 154 |
| క. |
‘శోకాపనోదిఁ బుణ్య | శ్లోకుని నలు రోయఁ బనుపు శుభచరితుఁ దదా లోకనవిహీననై పర | లోకకృతావాస నగుదు లోకం బెఱుఁగన్’. |
155 |
| వ. | అనిన నదియును గూఁతు నభిప్రాయంబు భీమున కెఱింగించిన, నాతండు నలుమార్గణంబున ఋజుమార్గులయిన బ్రాహ్మణుల నియోగించినం, దన పతి నన్వేషింప నరుగు బ్రాహ్మణులకు దమయంతి యిట్లనియె. | 156 |
| ఆ. |
‘నైషధేశ్వరుండు నలుఁ డిప్పు డసమర్థుఁ | డగుటఁ జేసి తన్ను నన్యు లెఱుఁగ కుండ నుండుఁ; గాన నురుసభాంతరముల | కరిగి యరిగి యిట్టు లనుడు మీరు. |
157 |
| సీ. |
‘నిత్యసత్యుండవు; నీ సతి వంచించి | దాని వస్త్రార్ధంబు దఱిగి నీకుఁ బరిధానముగఁ జేసి పాడియే పోవంగ? | భార్య భర్తవ్యనాఁ బరఁగు ధర్మ మది మిథ్య యయ్యె నీయందు; నీ కిట్టి ని | ర్దయబుద్ధిఁ జేకొనఁ దగునె? యట్టి సాధ్వికిఁ గరుణఁ బ్రసన్నుండ వగు’ మని | యెల్లచోఁ బలికిన నెవ్వఁడేనిఁ |
|
| ఆ. |
బలుకు వడఁగ నోడి ప్రతివచనం బిచ్చు | నతఁడు నలుఁడుగాఁ బ్రియంబుతోడ నెఱిఁగి నన్ను నతని కెఱిఁగించి తోడ్కొని | రండు; రానినాఁడు రం డెఱింగి.’ |
158 |
| వ. | అని పంచినం, బనిపూని బ్రాహ్మణులు దమయంతి కఱపిన పలుకు లెల్ల సభలం బలికి యెందునుం గానక వచ్చి; రందుఁ బర్ణాదుం డను బ్రాహ్మణుండు దమయంతి కిట్లనియె; ‘నే నయోధ్య కరిగి నీ కఱపిన పలుకు లెల్ల ఋతుపర్ణుసభం బలికిన నొక్క పురుషుండు కుఱుచ చేతులవాఁడు ఋతుపర్ణునొద్ద నూఱుగద్యాణంబుల జీవితంబువాఁడు శీఘ్రయానకుశలుండు సూదక్రియానిపుణుండు విరూపాంగుండు బాహుకుం డను నశ్వ శిక్షకుండు విని, నన్ను నేకతంబ కనుంగొని వెలవెల నగుచు దీర్ఘనిశ్వాసపురస్సరుండై యిట్లనియె. | 159 |
| ఆ. |
‘పురుషునందు దోషపుంజంబు గలిగిన | నెఱిఁగి యెద సహించునేని భార్య పురుషునం దభీష్టభోగంబు, దేహాంత | రంబునందు ధర్మరతియుఁ బడయు.’ |
160 |
| వ. | అని యొండెద్దియుం బలుకక తన నివాసంబునకుం బోయె’ నని చెప్పిన విని, దమయంతి పెద్దయుం బ్రొద్దు చింతించి ‘నలుండు గానివాఁడు ప్రతివచనం బేల యిచ్చు? నింకను వలను గల వారలం బంచి యాతని నిమ్ముగా నెఱుంగవలయు’ నని నిజజనని యనుమతంబున సుదేవు రావించి వాని కిట్లనియె. | 161 |
| క. |
‘న న్నెఱిఁగి తెచ్చినట్లు జ | గన్నుతు నలు నెఱిఁగి తెమ్ము కౌశలమున వి ద్వన్నుత! సర్వసుగుణసం | పన్నుండవు నీవ బుద్ధిఁ బరికింపంగన్. |
162 |
| క. |
అరుగు మయోధ్యకు దేశాం | తర విప్రుఁడవై; రవిప్రతాపోన్నతు ను త్తరకోసలేంద్రు నుర్వీ | శ్వరుఁ గనఁ జను మనఘు నమరసము ఋతుపర్ణున్. |
163 |
| వ. | ‘మఱి విదర్భావిభుం డగు భీముండు నలు రోయం బంచి, యెందునుం గానక యింకను దమయంతికిఁ బునఃస్వయంవరంబు రచియింపంబోయిన, నందులకు భూవలయంబునం గల రాజులెల్లను బోయెద‘రని యతిత్వరితంబుగా ఋతుపర్ణునకుం జెప్పు’ మని పంచిన సుదేవుం డయోధ్యానగరంబునకుం బోయి ఋతుపర్ణుం గాంచి ‘విదర్భాపురంబున దమయంతీ ద్వితీయ స్వయంవరం బెల్లియె యయ్యెడు’ నని చెప్పిన విని ఋతుపర్ణుండు బాహుకుం జూచి ‘నాకు దమయంతీ స్వయంవరంబుఁ జూడ నొక్క నాఁటన విదర్భకుం బోవలయు నీ యశ్వశిక్షానైపుణ్యంబుఁ బ్రకాశింపు’ మనవుడు ‘నట్ల చేయుదు’ నని నలుండు దన మనంబున దుఃఖించి. | 164 |
| ఆ. |
‘అడవిఁ దన్నుఁ బాసి యరిగిన నలిగి కా | కున్నె యిట్లు సేయ నువిద గడఁగె; నెట్లయేనిఁ గూర్తు రింతులు మా కని | విశ్వసించువారు వెడఁగు లెందు. |
165 |
| ఆ. |
సాధ్వి నాకుఁ గూర్చు సంతతి గలయది | చెలువ యిట్టు లేల చేయు? నైన నెఱుఁగవలయు దీని నే ఋతుపర్ణుతోఁ | బోదు’ నని నలుండు బుద్ధిఁ దలఁచి. |
166 |
| వ. | తొల్లి వార్‌ష్ణేయుండు దెచ్చిన తన రథంబునందు నిజహయంబుల నాలక్ష్యమాణ శుభలక్షణంబులు మనోవాయు వేగంబులు నైన వానిం బూన్చి కొని వచ్చిన, ఋతుపర్ణుం డా రథంబెక్కునప్పుడు హయంబులు మ్రొగ్గినం జూచి ‘యప్పేదగుఱ్ఱంబు లతిదూరం బెట్లు పోవనోపు? నొండు గుఱ్ఱంబులం బూన్పు’ మనిన బాహుకుం డిట్లనియె. | 167 |
| క. |
‘అవనీశ! యీ హయంబులు | పవనగతిం బఱచుఁ బ్రొద్దువడకుండఁగ నేఁ డ విదర్భకు’ ననవుడు విని | కువలయపతి మెచ్చి బాహుకున కి ట్లనియెన్. |
168 |
| వ. | ‘అట్లయిన నీ హయతత్త్వకౌశలం బెఱింగి నీకు నభిమతం బొనరింతు’ నని రథం బెక్కి బాహుక వార్‌ష్ణేయ సహితుం డయి యరుగువాఁడు. | 169 |
| మధ్యాక్కర |
ఎదురను దవ్వులఁ జూచిన పొడవు లెల్లఁ దత్‌క్షణమ కదియఁగా, నవ్వి యెంతయును దవ్వయి కనఁబడఁ బిఱుఁద ‘నిది దినేశ్వరు రథమో! యనూరుఁడో! యితఁ’ డంచు నపుడు హృదయమునను గడు విస్మయం బందె నిక్ష్వాకుకులుఁడు. |
170 |
| వ. | వార్‌ష్ణేయుండును బాహుకురథంబు గడపునేర్పున కచ్చెరువడి యాత్మగతంబున. | 171 |
| క. |
‘ఈతండు శాలిహోత్రుఁడొ! | మాతలియో! నలుఁడొ యొరులు మానవులు జవో పేతముగ నిట్లు రథహయ | నీతి యెఱుంగుదురె? ధారుణీవలయమునన్. |
172 |
| వ. | వయోవిద్యావైభవంబుల నితండు నలుంబోలియు వికృతరూపధరుం డయిన కారణం బేమియొ? మహాపురుషులు దైవనియుక్తులై ప్రచ్ఛన్నవృత్తి నుండుదురు; వారి నెఱుంగంబోలునె?’ యనుచుఁ జనునప్పుడు ఋతుపర్ణుండు దన యుత్తరీయంబు జారి భూతలంబుపయిం బడిన మలంగి చూచి ‘బాహుకా! వార్‌ష్ణేయుండు వోయి యుత్తరీయంబు దెచ్చునంతకు రథగమనం బించుక మందంబు సేయు’ మనిన బాహుకుండును ‘నయ్యా! నీ యుత్తరీయంబు వడినయెడ యిచ్చోటికి నొక్క యోజనంబు గలదు; దాని వార్‌ష్ణేయుం డెట్లు దే నేర్చు?’ నని రథగమనవేగమాహాత్మ్యంబు సెప్పుచు ననేకదేశంబులు గడచి చని యొక్క యెడ నగణ్యపర్ణఫలశాఖాలంకృతంబైన విభీతకవృక్షంబు గని; రంత ఋతుపర్ణుండు బాహుకున కిట్లనియె. | 173 |
| ఆ. |
‘ఎల్లవారు నెఱుఁగ రెల్లవానిని; భిన్న | విషయు లెల్లవారు విద్యలందుఁ; దొలఁగ కే నెఱుంగుదును దృష్టిమాత్రన | సకల మైన వస్తుచయముసంఖ్య. |
174 |
| వ. | ఇవ్విభీతకంబున ఫల పర్ణ సముదాయ సంఖ్యఁ జెప్పెద విను; మీ రెండు శాఖలం గల పర్ణ ఫలంబులు పదివేలు నొక్కండు; దక్కిన శాఖలం గల యవి రెండువేలుం దొంబదే; ననిన బాహుకుండు విని ‘వీని నెన్నికాని నిశ్చయింప నేర’ నని తన రథంబు నిలిపి యా వృక్షం బాక్షణంబ యురలం ద్రోచి యయ్యై శాఖలం గల యాకులు పండులు నెన్నిన ఋతుపర్ణుండు సెప్పినయన్ని యయిన నచ్చెరువడి, ‘యివ్విద్య నాకు నుపదేశింపవలయు’ నని యడిగిన ఋతుపర్ణుం డిట్లనియె. | 175 |
| క. |
‘ఇది యక్షహృదయ మనఁగా | విదితం బగు విద్య; దీని విధ్యుక్తముగా మది నెఱుఁగు నరుఁడు సంఖ్యా | విదుఁ డగు దుష్కృతకళంకవిషముక్తుఁ డగున్. |
176 |
| చ. |
సకలగుణప్రసిద్ధుఁ డగు సర్వహితుం డగుఁ జూవె!’ యంచు బా హుకునకుఁ బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న త్యకుటిలబుద్ధి నక్షహృదయంబుఁ గరంబు రయంబుతో విద ర్భకుఁ జను వేడ్కఁజేసి ఋతుపర్ణుఁడు పూర్ణమనఃప్రసన్నుఁడై. |
177 |
| వ. | ఇట్లు నలుండు ఋతుపర్ణువలన నక్షహృదయంబు వడసి సంతుష్టుండై ‘నీకు నశ్వహృదయం బిచ్చెదఁ బరిగ్రహింపు’ మనిన ఋతుపర్ణుం ‘డట్ల చేయుదు, నది యంతకు నీయంద యుండనిమ్ము; నా వలసినప్పుడు గొందు’ ననియె; నంత నయ్యక్షహృదయ సామర్థ్యంబున నప్పుడు. | 178 |