| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అని పలికి కపిలుం బరిభవించిన నమ్మునివరుఁ డలిగి యనలశిఖలు దూల నతిఘోరదృష్టిం జూచిన నప్పుడు సగరసుతులందఱు భస్మంబైన. | 64 |
| క. |
వీరులగు సగరతనయుల | దారుణ దాహంబుఁ జూచి తడయక చని యం భోరుహగర్భతనూజుఁడు | నారదుఁ డంతయును సగరునకు నెఱిఁగించెన్. |
65 |
| క. |
దాని విని సగరుఁ డురు శో | కానలదందహ్యమానుఁ డయ్యును నయ్యీ శానువచనంబు దలఁచి ధ | రానాథుఁడు శోకభరపరావృత్తుండై. |
66 |
| వ. | అసమంజసపుత్త్రు నంశుమంతుం దనమనుమనిం జూచి, ‘యయ్యా! నీయయ్య లఱువదివేవురు నొక్కటఁ గపిలకోపానలకబళితశరీరు లయిరి; భవజ్జనకుం డతిక్రూరహృదయుఁడై పౌరబాలకుల నకారణంబ వధియించి మహానదిలో వైచుచున్న నెఱిఁగి పౌరజనాక్రోశంబునం దనుక్రోశపరుండనై వాని విడిచితి. | 67 |
| క. |
కొడుకులకు వగవ; మును నా | కడఁగిన హయమేధమఖము గడచనమికి నేఁ గడు దుఃఖితుండ నయ్యెదఁ; | దడయక నీ విపుడు దీనిఁ దలఁగుము కడఁకన్.’ |
68 |
| వ. | అనిన నంశుమంతుం డాక్షణంబ చని సగరసుతఖాత ద్వారంబున సముద్రంబు సొచ్చి, యందు సూర్య సహస్రద్యుతియై వెలుంగుచున్న కపిలమహామునికి నమస్కరించి, నిజాగమనప్రయోజనం బెఱింగించినఁగపిలుండును వానికిం గరుణించి యాజ్ఞీయంబైన యశ్వంబు నిచ్చి యిట్లనియె. | 69 |
| క. |
‘ఘనభుజ! నీ కారణమునఁ | జనఁ గాంతురు పుణ్యగతికి సాగరులు; ముదం బున సగరునకును దొరకును | నొనరఁగ సుతవంతులైన యుత్తముల గతుల్. |
70 |
| వ. | మఱియు నీచేతనుపనీతంబైన యీ యశ్వంబున నశ్వమేధంబు సేసి సగరుండు కృతార్థుండగు; నీ పౌత్త్రుండైన భగీరథుచేతఁ దేరం బడియెడు గంగాజలౌఘంబులంజేసి సంసిక్తులై సగరసుతులు స్వర్గగతు లగుదురు; సముద్రంబు సంపూర్ణంబగు’ ననిన నంశుమంతుండు సంతుష్టుండై కపిలప్రసాదంబున నశ్వంబుఁ దెచ్చి సగరున కిచ్చి కపిలువచనంబు నెఱింగించిన, సగరుండును బుత్త్రశోకంబుడిగి యశ్వమేధంబు సేసి, సముద్రుం దనకుఁబుత్త్రుఁగాఁ గల్పించిన నది మొదలు సముద్రంబు సాగరంబు నాఁ బరఁగె; నిట్లు సగరుండు పెద్దకాలంబు రాజ్యంబు సేసి, నిజరాజ్యభారం బంశుమంతునందు సమర్పించి చనిన. | 71 |
| తే. |
తన పితామహునట్టుల ధరణి యేలి | యంశుమంతుండు నిజపుత్త్రుఁ డగు దిలీపు నందు రాజ్యభారముఁ బూన్చి యఖిల లోక | పూజితుండు దపోవనంబునకుఁ జనియె. |
72 |
| వ. | దిలీపుండును దన పితామహులైన సాగరు లధోగతులు గాకుండ గంగావతరణంబునందు యత్నంబుసేసి యశక్తుండై. | 73 |
| చ. |
ప్రథితయశున్ సుతుం బడసె భారసహిష్ణు మహారథున్ భగీ రథుఁడను చక్రవర్తి నపరాజితతేజు నిజాన్వవాయదు ష్పథవినివర్తకున్ సకలపార్థివజైత్రు మదోద్ధతాసుహృ న్మథను సురాపగానయసమర్థ తపోగుణయుక్తు నుత్తమున్. |
74 |
| వ. | ఆ భగీరథు నపారభూభారధురంధరుం జేసి దిలీపుండు తపోవనంబున కరిగిన. | 75 |
| తే. |
కపిలుకోపాగ్నిఁ జేసి సాగరులు గ్రాఁగి | రనియు గతిఁ గానకున్నవా రనియు నెఱిఁగి, వారలకు హిత మొనరింప వగచి గంగఁ | దేరఁ గడఁగె వీరుండు భగీరథుండు. |
76 |
| వ. | ఇట్లు భగీరథుండు గంగావతరణంబునందుఁ గృతనిశ్చయుండై యరిగి బహువిధాకార ధాతుమంతంబులైన యుత్తుంగశృంగంబులను, జలభర వినమ్ర ప్రబల బలాహక వ్యూహ సంఛాదిత శ్యామాయమానంబులైన తుహినస్థలంబులను, సిద్ధ విద్యాధరగంధర్వ గీర్వాణ మిథునసంసేవ్యమానంబులైన నానారత్న కందరంబులను, శుకపిక పారావత శుక్లాపాంగ సారంగ శతపత్ర పుత్ర ప్రియ దాత్యూహ వ్యూహ శబ్ద శబ్దాయమానంబులైన తరువనరేఖలను, సింహ శరభ శార్దూల శుండాల గోలాంగూల కోలాహలాన్వితంబులైన గుహా గహ్వరంబులనుం జేసి రమణీయ భయానకంబైన హిమవత్పర్వతంబున. | 77 |
| చ. |
సతతకృతోపవాసముల శాకఫలోదకమూలపారణ వ్రతముల దేవపూజల నపారజపంబులఁజేసి నిష్ఠతో నతులతపంబు సేసె నమరాపగ నుర్వికిఁ దెచ్చు వేడ్కతో ధృతియుతుఁడై దిలీపకులదీపుఁడు దివ్యసహస్రవర్షముల్. |
78 |
| వ. | ఆ భగీరథు తపంబునకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షంబై ‘నీ యిష్టంబు సెప్పు’ మనినం గృతాంజలియై యిట్లనియె. | 79 |
| సీ. |
‘తపనతేజుండైన కపిలుకోపంబున | గతజీవులై పుణ్యగతులయందు నిహతులై మత్పితామహు లున్నవారు; నీ | దగు పుణ్యజలముల సగరసుతులు సిక్తులై స్వర్గానుభుక్తిఁ బ్రాపింతురు | గావున దేవి! యిద్దేవపథము నందుండి వసుమతి కొందంగఁ జనుదేర | వలయు’ నావుడు ‘మహీవలయమునకు |
|
| ఆ. |
నేను వచ్చునపుడు నా నిరంతర జలౌ | ఘంబు దాల్ప నీలకంఠుఁ డోపుఁ గాని యొరులు దాల్పఁగా నోప; రయ్యుమా | నాథుకరుణఁ బడయు నన్నుఁ దాల్ప.’ |
80 |
| వ. | అనిన గంగాదేవివచనంబునఁ గైలాసంబున కరిగి, భగీరథుండు భగవంతు నంతకాంతకు నీశ్వరుగుఱించి పెద్దకాలంబు తపంబు సేసిన, నీశ్వరుండు వానికి సన్నిహితుండయి ‘నీవు భూలోకంబునకు గంగావతరణంబు సేయు; మేను గంగ ధరియించెద’ ననిన భగీరథుండు వెండియు గంగ నారాధించిన నాతనికిం గరుణించి. | 81 |
| మ. |
ఇలకున్ గంగ తరంగసంగతులతో నేతెంచె నాశాంతరం బులు నాకాశముఁ గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతోఁ జెలువై యుండఁగ దాని నీశ్వరుఁడు దాల్చెన్ సంగతోత్తుంగ పిం గళజూటాగ్రమునందుఁ బద్మదళసంకాశంబుగా లీలతోన్. |
82 |
| సీ. |
సుర ముని సిద్ధ ఖేచరవరుల్ వచ్చి య | చ్చెరువంది చూడంగ హరుశిరంబు నందుండి భువనైకవందిత సురనది| ధరణీతలంబున కరుగుదెంచి కలహంసగతియు నిర్మలఫేనహాసంబు | నాకీర్ణ మీనవిలోకనములు నాలోల పవన వాచాలిత కల్లోల | లసితమృదూక్తులు నెసఁగుచుండఁ |
|
| తే. |
బ్రీతితో భగీరథుఁ డను దూతచేత | నీతయై మహామునిపరిపీత రిక్త మగు సరిత్పతిఁ గూడి, యాసగరజులకు | హితముగా దాని నించె నాతతజలముల. |
83 |
| క. |
సాగరులకు సద్గతిగా | సాగరమున కట్లు సలిలసంపూర్ణముగా భూగతయై భాగీరథి | భాగీరథకీర్తి భువనపంక్తుల నించెన్. |
84 |
| వ. | అని యిట్లు గంగావతరణంబును, భగీరథు మాహాత్మ్యంబును రోమశుండు సెప్పిన విని ధర్మజుం డనుజ సహితుండై యరిగి నందయు నపరనందయును నను మహానదులయందుఁగృతస్నానుండై హేమ కూటంబున నుపలంబులవలన వెలువడు దహనంబున నాహూతంబులై వచ్చు మేఘంబులను జూచి విస్మయంబంది దాని విధం బడిగిన వానికి రోమశుం డిట్లనియె; ‘ఋషభకూటంబున ఋషభుండను ముని యతికోపనుండై యెవ్వరు వలికిన నపుడె యుగ్రానలాకారుండై యుపలంబులవలన వెలువడు మేఘంబులం బిలిచి వారల వారించు; దానంజేసి తపోదాన ధర్మ శమదమరహితులైన జనుల కది దురారోహంబు; దేవతలు దేవదర్శనులైన ఋషులు నమ్మునిం జూడ వత్తు; రిందు దేవఋషులు యజ్ఞంబు సేసిన యజ్ఞభూములందుఁ గుశాకారంబులయిన దూర్వాంకురంబులు యూపాకారంబులైన వృక్షంబులుఁ గానంబడు’ ననిన నా పుణ్యతీర్థంబున స్నానంబు సేసి యరుగుచున్న ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. | 85 |
| క. |
‘ఇది విశ్వామిత్రుని యా | స్పద; మిది కౌశికి యనంగఁ బరఁగినయది; య ల్లది ఋశ్యశృంగుఁ డను ముని | హ్రద’ మనవుడు ధర్మతనయుఁ డమ్ముని కనియెన్. |
86 |