పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
రోమశుఁడు ధర్మజునకు ఋశ్యశృంగుచరిత్రము సెప్పుట (సం. 3-110-6)
వ. ‘ఋశ్యశృంగుం డను ముని జన్మంబును దచ్చరితంబును వినవలయు; నది యె?’ ట్లని యడిగిన రోమశుం డిట్లనియెఁ ‘దొల్లి కశ్యపపుత్త్రుండగు విభాండకుండను మునివరుం డఖండితబ్రహ్మచర్యంబునం దపంబు సేయుచు నొక్కనాఁ డొక్క మడువున నీళ్ళాడుచున్న యవసరంబున. 87
క. సురుచిరసురూపగుణసుం | దరి యూర్వశి యను లతాంగి తద్దర్శనగో
చర యగుడు నపుడ రేత | స్ఖ్సలనం బమ్మునికి నయ్యెఁ గామకృతమునన్‌.
88
వ. అయ్యమోఘవీర్యంబుతో మిశ్రం బయిన జలంబు నొక్కదుప్పిపెంటి ద్రావి గర్భంబుఁదాల్చిన నందు ఋశ్యశృంగుం డను కుమారుండు జన్మించి, తండ్రినిం, దదాశ్రమంబునుంగాని యొండెఱుంగక ఘోరతపంబు సేయుచున్నంత. 89
తే. బలియుఁ డంగాధిపతి రోమపాదుఁ డనఁగ | ధరణిఁ బరఁగిన వీరుండు దన పురోహి
తాపరాధకృతమున బ్రాహ్మణులచేత | విడువఁబడినఁ దన్మహి కనావృష్టి యయ్యె.
90
వ. దానికి వెఱచి యాతండు బ్రాహ్మణులఁ బరమభక్తి నుపాసించి ‘యీ యనావృష్టి దోషం బేమి కారణంబున నయ్యె? దీనికిం దగిన ప్రతీకారం బెద్ది?’ యని యడిగిన, వానికిం బ్రసన్నులై బ్రాహ్మణు లిట్లనిరి. 91
క. ‘కడు దర్పితుఁడని నిన్నున్‌ | విడిచిరి బ్రాహ్మణులు; వారు విడుచుడు నమరుల్‌
విడిచిరి; దానన వర్షము | దడసె భవద్దేశమునకు ధరణీనాథా!
92
ఉ. శాంతుఁడు ఋశ్యశృంగుఁడను సన్ముని యున్నయెడన్‌ ధరిత్రికిన్‌
సంతతవర్షణం బగు భృశంబుగ; నట్టివరంబు దొల్లి వృ
త్రాంతకుచే దయం బడసె నమ్ముని; గావున ఋశ్యశృంగు వే
దాంతసువేది రాఁబనుపు మంగమహీశ్వర! నీదు నేర్పునన్‌.’
93
వ. అనిన విని రోమపాదుండు దన చేసిన బ్రాహ్మణావమానంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబుఁ జేసి, బ్రాహ్మణ వచనంబున నపుడ బుద్ధిమంతులతో విచారించి విదగ్ధవేశ్యాంగనలం బిలువంబంచి ‘మీనేర్చువిధంబుల ఋశ్యశృంగుం బ్రబోధించి యిటఁ దోడ్కొనిరం’ డని పంచిన. 94
క. ఆ వేశ్యాజను లధిక ర | సావహభక్ష్యములు విలసదనులేపన మా
ల్యావళులుఁ గొనుచు నరిగిరి | నావాశ్రమమునను నమరనారులలీలన్‌.
95
వ. అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దన పుత్త్రు ఋశ్యశృంగు సమర్పించి, వన్యఫలాహరణార్థంబు వనంబున కరిగిన యవసరంబున నందొక్క జరద్వేశ్య దనకూతు నభినవ యౌవన విలాస విభాసిని నమ్మునిపుత్త్రుపాలికిం బుచ్చిన, దానిం జూచి ఋశ్యశృంగుండు సంభ్రమంబున. 96
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )