పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
ఋశ్యశృంగుఁడు వేశ్యను మునికుమారునిఁగా భావించుట (సం. 3-111-9)
మధ్యాక్కర ‘ఎందుండి వచ్చితి ఋషికుమార! యే నెన్నఁడు నిట్టి
సుందరాకారు మునిసుతు నేఁ దొల్లి చూచి యెఱుంగ
నిందుండు మీ’ వని కృష్ణమృగచర్మకృతకుశాసనము
నం దుండఁగాఁ బనిచె ఋషి యను బుద్ధి నత్తన్విఁ బ్రీతి.
97
వ. మఱియు నర్ఘ్యపాద్యాదివిధులను వన్యస్వాదుఫలదానంబులం దాని కతిథిపూజ సేయ నున్న నది యమ్ముని వరున కిట్లనియె. 98
క. ‘మా యాశ్రమ మిందులకున్‌ | న్యాయనిధీ! మూఁడుయోజనంబులు గల దేఁ
బోయెద; నీవును విజయం | చేయుమ యందులకుఁ; జెలిమి సేయుము నాతోన్‌.
99
వ. అట్లేని నీచేత సత్కారంబుఁగొందు’ ననిన ఋశ్యశృంగుం ‘డట్లు సేయుదు’ నని దాని నాతిథ్య విధానంబునం బూజించి తనకు దాని యిచ్చిన దివ్యగంధమాల్యంబులును సరసభక్ష్యపానంబులును, విచిత్రవస్త్రంబులుం బరిగ్రహించిన నదియును. 100
క. మునిముందటఁ గందుకన | ర్తన మృదుగీతములయందుఁ దనకౌశల మె
ల్లను జూపి విరచితాలిం | గనయై మునిపతికి ముదము గావించె మదిన్‌.
101
వ. ఇట్లు ఋశ్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్త్రి యరిగిన, దాని పోయినవలను సూచుచు ఋశ్యశృంగుఁ డగ్ని హోత్రంబు వేల్వమఱచి విపరీతబుద్ధియై యున్ననంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చివిభాండకుండు గొడుకుం జూచి ‘యి ట్లేల చింతాపరుండవై యగ్నిహోత్రంబు వేల్వక కాలాతిక్రమంబు సేసి?’ తనినఁ దండ్రికి ఋశ్యశృంగుం డిట్లనియె. 102
సీ. ‘కాంచనవర్ణుండు గడు రూపవంతుండు | గమ్మని జడలతో ఘనము లగుచు
ననయంబు వట్రువలగు రెండు పిండంబు | లురమున విలసిల్లుచుండ, నఱుత
వెలుఁగుచు జపమాల వ్రేలంగ, నన్నువ | నడుమును వడఁకంగ, నడచునపుడు
కలహంసకూజితకలనాద మెసఁగ నా | పాలికి నేఁ డొక్క బ్రహ్మచారి
 
ఆ. వచ్చిపోయె; వానివదనంబువలన వె | ల్వడు సుగంధిమధురభాషితంబు
పొలుచు వినఁగ సమదపుంస్కోకిలాలాప | చారు వగుచు హృదయ సమ్మదముగ.
103
క. ఆ ఋషికుమారు కట్టిన | చీరలు నతిమృదులములు విచిత్రములు; మనో
హారము వాని బృహత్కటి | భారము; నం దొక్క కనకపట్టము వెలుఁగున్‌.
104
క. పవనసమీరిత మధుసం | భవ వివిధప్రసవసౌరభముఁ బోలి ముని
ప్రవరుని తనువునయం దు | ద్భవమై రమ్యమయి సౌరభము విలసిల్లున్‌.
105
వ. మఱియు నక్కుమారుం డొక్క యెఱ్ఱనిఫలంబు దన దక్షిణపాణితలంబున నందంద చఱచుచు నది నేలంబడి యెగయం బోయిన వలనికి వ్రాలుచు వాతావధూతంబైన బాలవృక్షంబునుం బోలె నొప్పుచున్న నమ్మునిపుత్త్రు నందు నా హృదయంబు దద్దయుం దగిలినయది. 106
ఉ. నన్నును గౌఁగిలించుకొని నా వదనంబునకున్‌ నిజాస్య మా
సన్నముఁ జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా;
నెన్నఁడు నట్టి శబ్దము మునీశ్వర! మున్‌ విని యే నెఱుంగ; న
య్యన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు సూడఁగన్‌.
107
వ. నా యిచ్చిన వన్యస్వాదుఫలంబు లాదరించి యారగింప కమ్మునికుమారుం డమృతోపమానంబు లైన ఫలంబులు నతిమధురంబులైన పానీయంబులు నాకు నిచ్చిన నుపయోగించితి. 108
క. తన చేతి పుష్పములఁ జ | ల్లిన నంతటఁ జెదరి యవి యళిప్రకరనిషే
వన మొప్ప నున్నయవి; యి | వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్‌.
109
వ. నాకు నమ్మునిపుత్త్రునాశ్రమంబునందు వానితో నొక్కటఁ దపంబు సేయుచుండు నిష్టం’ బనినఁ గొడుకు పలుకులు విని విభాండకుండు విస్మితుండై ‘తపస్వుల తపంబులకు విఘ్నంబులు సేయ ననేక రూపులయి రాక్షసులు వనంబునం గ్రుమ్మరుచుండుదురు; తజ్జనదత్తంబు లయిన పానీయంబు లపేయంబు; లతి సుగంధులయిన కుసుమంబులు మునులకు వర్జనీయంబు’ లని కొడుకుం బ్రబోధించి, యెప్పటియట్ల వన్యఫలంబులు దేర నరిగిన. 110
క. చనుదెంచి తరుణి మునినం | దను చిత్తంబునకు వైకృతముఁ జేసె; విలా
సినుల సహాలాప సహా | సన సహయానములు బంధసమములు గావే!
111
వ. ఇట్లు ఋశ్యశృంగుండు విలాసినీమోహితుండయి, తండ్రి కెఱింగింపక సుచరిత్రంబయిన తన యాశ్రమంబు విడిచి, మనుష్యయోగంబునం దగిలి యక్కోమలి పిఱుందన చని, యంగదేశంబు సొచ్చి, యందు రోమపాదు నాదేశంబున రాజాశ్రయం బను వనంబున నుండునంత. 112
మత్తకోకిల అమ్మునీశునివాసశక్తిఁ దదంగదేశమునందు మే
ఘమ్ము లెల్ల వలంకులం గడుఁ గ్రమ్మి సర్వజనప్రమో
దమ్ముగాఁ బ్రభవద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే
సె మ్మహానదులున్‌ మహాసరసీవరంబులు నిండఁగన్‌.
113
వ. ఇట్లు ఋశ్యశృంగు నాగతంబున నంగవిషయంబున నవగ్రహదోషంబు నిరస్తంబైన సంతసిల్లి రోమపాదుండు తన కూఁతు శాంత యనుదాని నత్యంతకాంతిమతి నమ్మునివరునకు వివాహంబు సేసి. 114
క. అనుభోగయోగ్యములుగా | ధనరాసులు భూషణములు దాసీనివహం
బును గాంచనమయ శయ్యా | సనములు ముని కిచ్చె హృదయసంతోషముగాన్‌.
115
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )