పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
విభాండకుఁడు ఋశ్యశృంగుని వెదకుచు వచ్చుట (సం. 3-113-11)
వ. మఱియు గోసహస్రంబు లనేకంబు లిచ్చి గోకులసంకులంబుగా ఘోషంబులు దేశంబుల నెల్ల నిలిపి నిత్య సత్కారంబుల ఋశ్యశృంగునకుఁ బ్రియంబుసేయుచుండె; నంత నట విభాండకుండు దన యాశ్రమంబునఁ గొడుకుం గానక యెల్లదేశంబులు రోయుచు నంగదేశంబునకు వచ్చి గోగణసంకీర్ణబైన యొక్కఘోషంబు నందు గోపసత్కృతుండై యొక్క దివసంబు వసియించి ‘యిది యెవరి ఘోషం?’ బని గోపాలకుల నడిగిన వార లి ట్లనిరి. 116
క. ‘యతినాథ! వినవె యిది నీ | సుతుఘోషం; బిదియ కాదు చూడ ననేకా
యుతఘోషంబులు గల వు | న్నతగుణునకు ఋశ్యశృంగునకు నిద్ధరణిన్‌.
117
వ. అనిన విని విభాండకుండు సంతసిల్లి ఋశ్యశృంగు తొఱ్ఱుపట్ల విశ్రమించుచు రోమపాదుపురంబునకు వచ్చి యందు శాంతా సహితుండైన ఋశ్యశృంగుం జూచి సంతుష్ట హృదయుండై, తన కొడుకుం గోడలిం దోడ్కొని నిజాశ్రమంబున కరిగె; నందు వసిష్ఠున కరుంధతియు, నగస్త్యునకు లోపాముద్రయు, ముద్గలునకు నాలాయనియైన యింద్రసేనయుంబోలెఁ దనకుఁ బరమభక్తియుక్తియై శాంత పరిచర్య సేయుచుండ ఋశ్యశృంగుండు సుఖంబుండె’ నని చెప్పిన నా కౌశికహ్రదంబున నందఱు నభిషిక్తులై యేనూఱు మహానదుల సమాగమస్థానంబైన గంగాసాగర సంగమంబుఁ జూచుచు సముద్రతీరంబునం జని కళింగదేశంబున వైతరణి యను మహానదిం గని; రంత రోమశుండు ధర్మరాజున కిట్లనియె. 118
క. ‘మునిదేవవరులు యజ్ఞము | లొనరించిరి తొల్లి దీని యుత్తరతీరం
బున; నిది పుణ్యాస్పదమై | తనరును యజ్ఞావభృథశతస్నానములన్‌.
119
వ. మఱియు సకలయజ్ఞంబుల యందును బ్రశస్తంబయిన పశుభాగంబు పశుపతికి దేవతలును ఋషులును నిందుఁ గల్పించి; రీ తీర్థం బాడినవారు దేవయానగతు లగుదు’ రనినం గృష్ణాసహితుండై ధర్మతనయుండు దమ్ములుం దానును వైతరణీస్నానంబు సేసి, రోమశుం జూచి ‘మునీంద్రా! నాకు భవత్ప్రసాదంబున నఖిలలోకంబులుం గాననయ్యె, వైఖానసుల వేదాధ్యయన శబ్దంబులు విననయ్యె ‘ననిన విస్మితుండై రోమశుండు ‘వైఖానస నివాసం బిందులకు ముప్పదివేల యోజనంబులు గలదు; వారల యధ్యయన శబ్దంబులు వింటివి గావున నీవు దివ్యుండ’ వంచు నరిగి యనవరత ఫలాలంకృతంబైన యొక్క వనంబుఁ గని ‘యిందుఁ దొల్లి స్వాయంభువుండైన విశ్వకర్మ యజ్ఞంబు సేసి. 120
క. దక్షుఁ డయి యజ్ఞదక్షిణ | దక్షిణభూభాగ మెల్లఁ దా నిచ్చె నశే
ష క్షితిధర వనములతో | నక్షయమతిఁ గశ్యపునకు నార్త్విజ్యమునన్‌.
121
వ. దాని కలిగి భూదేవి గశ్యపునకుం బట్టీక రసాతలంబునకుం బోయినఁ దత్ప్రసాదార్థియై కశ్యపుం డుగ్రతపంబు సేసినం బ్రసన్నయై భూదేవి నీరిలోనుండి వెలువడి వేదిరూపంబునం గశ్యపునకు నిజరూపంబు సూపె; నవ్వేది యిది సుమ్ము! దీని నెక్కినవారు వీర్యవంతు లగుదు; రీమంత్రంబున దీని నెక్కుండు; పెఱనాఁ డిది దా వీక సముద్రంబు సొచ్చు’ నని, ‘యగ్నిర్మిత్రో యోని’ యనునివి యాదిగాఁ గల మంత్రంబు లుపదేశించిన. 122
క. అనుజులు దానును ముని శా | సనమున నవ్వేది యెక్కి సమధికవీర్యం
బున నొప్పె బ్రాహ్మణులదీ | వన లెసఁగఁగ ధర్మసుతుఁడు వాసవలీలన్‌.
123
క. ధరణీసురవర మునిగణ | పరివృతులై యరిగి కనిరి పాండవులు వియ
చ్చర నిర్జర సేవిత సుం | దర కందర మగు మహేంద్రధరణీధరమున్‌.
124
వ. అందుల మహాతపోధనులకు నమస్కార సత్కారంబుల మనఃప్రియంబు సేసి ధర్మరా జిట్లనియె. 125
తే. ‘పరమమునులార! యిగ్గిరిఁ బరశురాము | శుభచరిత్రుని మీ రెప్డు సూతు రట్టె!
యమ్మహాభాగు మీచూచు నవసరంబు | నందు మాకును జూడంగ నమరునొక్కొ?’
126
వ. అనిన నమ్మునిసంఘంబులోన రామానుచరుండైన యకృతవ్రణుం డను ముని ధర్మరాజున కిట్లనియె. 127
తే. ‘ధర్మతనయ! మీరాక ముందఱ యెఱుంగు | జామదగ్న్యుండు నిర్మలజ్ఞానదృష్టి
ననఘ! యెల్లి చతుర్దశి నమ్మహాత్ముఁ | జూతు రిమ్మును; లీవును జూడు మిచట.’
128
వ. అనిన ధర్మతనయుండు మహేంద్రంబున నా రాత్రి వసియించి యకృతవ్రణు నిట్లని యడిగె. 129
క. ‘భువన జన స్తుతుఁ డగు భా | ర్గవు చరితము వినఁగ నాకుఁ గడుఁ గౌతుకగౌ
రవ మైనది; దాని ముని | ప్రవర! యెఱింగింపు కర్ణపథరమ్యముగన్‌.
130
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )