| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అని యడిగిన ధర్మరాజునకు నకృతవ్రణుం డిట్లని చెప్పెఁ దొల్లి కన్యాకుబ్జంబున గాధియను రాజు కూఁతు సత్యవతి యనుదాని భృగుపుత్త్రుండగు ఋచీకుండను మహాముని వివాహార్థియై గాధి నడిగిన నమ్మునివరునకు వాఁ డిట్లనియె. | 131 |
| సీ. |
‘ఒక్క కర్ణంబు నీలోత్పలశ్యామమై | తను వెల్ల శశిహంసధవళ మైన యిట్టి గుఱ్ఱములు వే యిక్కన్య కుంకు వి | ట్లీ నోపుదేని మునీంద్ర! దీని నమరంగఁ బెండిలి యగు; మిది మాకుల | ధర్మంబు’ నావుడుఁ దరుణిఁ బెండ్లి యగువేడ్క భార్గవుఁ డప్పుడ వరుణేంద్రు | పాలికిఁ జని వానిఁ బడసి తెచ్చె; |
|
| ఆ. |
నవనినాథ! గంగయందుఁ గన్యాకుబ్జ | పురవరంబునందుఁ బుట్టె నట్టి హయసహస్ర మమలమై; నాఁటఁగోలెను | నశ్వతీర్థ మనఁగ నయ్యె నదియు. |
132 |
| వ. | ఋచీకుండును గాధికి నిచ్ఛాసమంబులైన హయంబుల నిచ్చి వానికూఁతు సత్యవతిం బాణిగ్రహణవిధిం బరిగ్రహించి సుఖంబున్నఁ, గన్యాకుబ్జంబునకు భృగుండు వచ్చి వారలచేతం బూజితుండై కొడుకునుం గోడలినిం జూచి సంతసిల్లి యొక్కనాఁడు కోడలి కిట్లనియె. | 133 |
| క. |
‘లలితాంగి! యేను నీ గుణ | ముల కతిహృష్టుండ నైతి ముద మొనరఁగ ని మ్ముల నిచ్చెద వేడుము నీ | వలచు వరం’ బనిన సత్యవతి యి ట్లనియెన్. |
134 |
| వ. | ‘దేవా! నీప్రసాదంబున నాకొక్క కొడుకును, మజ్జనని కొక్క కొడుకు నుదయింపవలయు’ నని మ్రొక్కినం గరు ణించి భృగుండు ‘నీకోరిన యట్లయగు; శుచిస్నాతలయి నీవు మేడిమ్రానిం గౌఁగిలింపుము; నీజనని నశ్వత్థంబుఁగౌఁగిలింపు మను’ మనిన నయ్యిద్దఱుఁ దదాలింగన విపర్యాసంబు సేసిన నెఱింగి భృగుండు గోడలి కిట్లనియె. | 135 |
| ఉ. |
‘పుత్త్రుఁడు నీకు బ్రహ్మకులపూజ్యుఁడు పుట్టియు వాఁడు దారుణ క్షత్త్రచరిత్రుఁడై పరఁగు గర్వమునన్; మఱి నీ సవిత్రికిన్ క్షత్త్రియుఁ డుద్భవిల్లియు నఘక్షయకారణుఁడున్ మహాతపః పాత్రుఁడు నై ధృతిం బడయు బ్రాహ్మణభావము భూరితేజమున్.’ |
136 |
| వ. | అనిన సత్యవతి గృతాంజలియై క్షత్రియభావంబు తన పుత్త్రునకుంగాక పౌత్త్రున కగునట్లుగా శ్వశురువలన వరంబు వడసి కతిపయకాలంబునకు గర్భిణియై. | 137 |
| క. |
ఆదిమునిచరితుఁ బడసెఁ బ్ర | సాదసమన్వితు సుపుత్త్రు జమదగ్నిఁ జతు ర్వేదంబులయందు ధను | ర్వేదమునందును నతిప్రవీణు మహాత్మున్. |
138 |
| వ. | ఆ జమదగ్ని ప్రసేనజితుండను రాజుకూఁతు రేణుక యనుదాని వివాహంబయి దానియందు రుమణ్వత్సుషేణ వసు విశ్వావసు రాములను వారినైదుగురు కొడుకులం బడసి, వనంబున నుగ్రతపంబు సేయుచు, నొక్కనాఁడు వన్యఫలంబులు దేరం గొడుకులు వోయిన రేణుక వారి పిఱుందన పోయి యొక్క సరోవరంబునందు సభార్యుండయి జలక్రీడలాడు చున్నవాని మార్తికావత పతియగు చిత్ర రథుండను రాజుం జూచి కామమోహితయై వ్యభిచరించిన, దాని దుశ్చరితం బెఱింగి జమదగ్ని కోపోన్మాదపరవశుండై. | 139 |
| క. |
తనయుల నలువురఁ గ్రమమునఁ | బనిచెన్ జమదగ్ని దనదు భార్య వధింపన్; జననీఘాతము పాతక | మని వారలు పలుకకుండి రవ్యవసితులై. |
140 |
| క. |
కడు నలిగి యమ్మునీంద్రుఁడు | గొడుకులకును శాప మిచ్చె ‘ఘోరాటవిలో జడమతి మృగపక్షుల య | ట్లుడుగక యజ్ఞానవృత్తి నుండుం’ డనుచున్. |
141 |
| వ. | మఱియు నిశిత పరశుహస్తు రాముం జూచి ‘దీని వధియింపు’ మని జమదగ్ని పంచిన, వాఁడు గురువచనంబునం దల్లిం దత్‌క్షణంబ వధియించిన. | 142 |
| క. |
శమితనిజక్రోధుండై | జమదగ్ని తనూజు సాహసమునకుఁ దనవా క్యము లంఘింపమికిఁ బ్రస | న్నమనస్కుండై తనూజునకు నిట్లనియెన్. |
143 |
| వ. | ‘నా వచనంబున నతిదుష్కరంబైన కార్యంబు సేసితి; నీ కిష్టంబైన వానినెల్లను వేఁడు మిచ్చెద’ ననిన రాముండు సంతుష్టహృదయుండై ‘మదీయజనని జీవించియుండను, దద్వధదోషనిష్కృతియు, సహోదరులు శాపవిముక్తులయి యెప్పటియట్ల యుండను, సమరంబుల నా కప్రతిహతశక్తియు, దీర్ఘాయువుంగాఁ బ్రసాదింపుం’ డని తండ్రివలనం దన యభిమతంబులు వడసి యుండునంతఁ గొండొక కాలంబున. | 144 |
| చ. |
అమితబలుండు హైహయుఁ డహర్పతితేజుఁ డజేయబాహువి క్రముఁడు సహస్రబాహుఁ డనఁగా విదితుం డగువాఁడు తద్వనాం తమున మృగవ్యఖిన్నుఁ డయి తా జమదగ్ని మహామునీంద్రు నా శ్రమమున కేఁగుదెంచె బహుసైన్యముతో నధికశ్రమార్తుఁడై. |
145 |
| వ. | అందు మునివరుచేతం బూజితుం డయ్యును వాఁడు దనరాజ్యమదంబున మెచ్చక యయ్యాశ్రమవాసుల కవమానంబు సేసి, యందలి వృక్షంబు లెల్ల విఱిచి, జమదగ్ని హోమధేనువును దరుణవత్సంబుతోఁ గట్టికొని పోయిన, నప్పు డవ్వనంబుననుండి సమిత్కుశఫలంబులు గొని వచ్చిన రామునకు జమదగ్ని యిట్లనియె. | 146 |
| క. |
‘వినవయ్య! కార్తవీర్యుఁడు | మన ధేనువుఁ బట్టుకొని సమర్థుం డయి పె ల్చన పోయె; నేమి సేయుద?’ | మనవుడు రాముండు విని మహాక్రోధమునన్. |
147 |
| క. |
గురువచనబోధితుండై | సరభసగతి వాని పిఱుఁదఁ జని, తద్బలమున్ శరవృష్టి ముంచి చంపె న | పరిమిత లయకాలమేఘపటలమపోలెన్. |
148 |
| వ. | మఱియును. | 149 |