| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
బలిమి నశేషలోకపరిభావిమహాద్భుతశౌర్యసంపదం బొలుచు సహస్రబాహుకరముల్ గులిశాతినిశాతబాణధా రల నతివీరుఁడై తునిమి రాముఁ డరాతులకున్ భయంబుగాఁ గలహములోన వాని నతిగర్వితుఁ జంపెఁ బరాక్రమోన్నతిన్. |
150 |
| వ. | అంతం గార్తవీర్యుని పుత్త్రులు బద్ధవైరులై రామరహితం బయిన జమదగ్న్యాశ్రమంబునకు వచ్చి, యందు. | 151 |
| మ. |
మునులం దిట్టుచుఁ బుష్పవృక్షతతు లున్మూలించుచుం గ్రూరులై యనవద్యున్ జమదగ్నిఁ బట్టి బలిమిన్ ‘హా రామ! హా రామ!’ యం చును నాక్రోశము సేయుచుండఁగ మునుల్ శోకింప ధర్మాత్ము న మ్మునిముఖ్యున్ వధియించి రాగ్రహమహామోహాంధులై హైహయుల్. |
152 |
| చ. |
వఱలఁగ రాముఁ డంత ననవద్యుఁడు వచ్చి బహుప్రలాపి యై యఱచుచునున్న తల్లిని గృతాంతవశస్థితుఁ డైన తండ్రి ను క్కఱఁ గని తీవ్రశోకపరిఘాతహతుం డయి తత్ప్రకార మం దెఱిఁగి ముహూర్తమేనియు సహింపఁగ నోపక కోపదీప్తుఁడై. |
153 |
| చ. |
‘అనఘుని వీతరాగుఁ గరుణాత్ముఁ బ్రశాంతుని దాంతు నిమ్మహా మునివరుఁ జూచి చూచి యధముల్ వధియించిరి; దీనఁ జేసి దు ర్జను లగుచున్న క్షత్త్రియులఁ జంపుదు’ నంచుఁ బ్రతిజ్ఞ సేసె భూ వినుతుఁడు జామదగ్న్యుఁ డతివీరుఁడు లోకభయంకరాకృతిన్. |
154 |
| వ. | ఇట్లు కృతప్రతిజ్ఞుండై క్షత్రియులనెల్ల వధియించి, దిగ్దంతిదంతార్గళాఘాట మహీచక్రంబు సాధించి, విధివిహిత విధానాధ్వరుండై కశ్యపునకు నార్త్విజ్య దక్షిణగా నఖిలభూవలయంబు నిచ్చి, నిస్సంగుండై మహేంద్ర పర్వతంబునం దపోనిత్యుండై యున్నవాఁ డని పరశురాము చరితంబు సెప్పిన విని, ధర్మజుం డనుజబ్రాహ్మణసహితుండై మునిగణోపదేశంబునం జతుర్దశినాఁడు పరశురాముం జూచి, పరమభక్తిం బూజించి తత్ప్రతిపూజితుండై దక్షిణదిక్కునకుం జని. | 155 |
| క. |
భూవినుతంబై త్రిభువన | పావనమై త్ర్యంబకప్రభవమైన జలౌ ఘావళిఁ బవిత్ర మగు గో | దావరిఁ బుణ్యనదిఁ గనియె దక్షిణగంగన్. |
156 |
| శా. |
గో దేవ క్షితిదేవ భక్తిపరుఁడై గోదావరీస్నాతుఁడై గోదానంబులు హేమదానములుఁ బెక్కుల్ రత్నదానంబులన్ భూదేవోత్తమపూజ సేయుచు జగత్పూజ్యుండు ధర్మాత్మజుం డాదిత్యాభుఁ డనేకతీర్థశతసేవాసక్తపుణ్యాత్ముఁడై. |
157 |
| వ. | ద్రవిడదేశంబున నగస్త్యతీర్థంబాడి, యందుఁ దొల్లి యర్జును చేసిన గోసహస్రదానాది వివిధ దానంబులు విని, వానిం బ్రశంసించుచుం జని శూర్పారకంబను తీర్థంబునం బర్వతోత్సేధంబైన పరశురాము వేదిం గని, సముద్రతీరంబునకుం జని ప్రభాసతీర్థంబునం బండ్రెండుదినంబులు పవనాంబుభక్షుండై పంచాగ్ని మధ్యంబున ధర్మజుండు తపంబు సేసిన. | 158 |
| ఆ. |
దాని నెఱిఁగి రామదామోదరులు వృష్టి | వరులతోడఁ బ్రీతి నరుగుదెంచి కనిరి సకలతీర్థగమనపరిక్లేశ | కృశులఁ బాండుసుతుల విశదయశుల. |
159 |
| క. |
చీరాజినధారుల నవి | కారతపోయుతులఁ జూచి కడు దుఃఖితులై వారిజదళాక్షి ద్రౌపది | నూరార్చి రుదార హిత మృదూక్తుల నొప్పన్. |
160 |
| వ. | వారికి ధర్మతనయుండు తమ వనవాసతీర్థగమనాయాసంబును, నర్జును దివ్యాస్త్రలాభంబును, నింద్రునొద్ద నాతని యునికియుం జెప్పిన విని రాముండు గృష్ణాదులైన వృష్ణివరుల కిట్లనియె. | 161 |
| సీ. |
‘మతిహీనుఁడై తన సుతునిపల్కులు విని | ధృతరాష్ట్రుఁ డీ పాండుసుతులఁ బాప భీరుల నపగతధారుణీరాజ్యులఁ | జేసి యుగ్రారణ్యవాసగతులఁ గావించె; నిది ధర్మువే? విచారవిహీనుఁ | డయ్యె; భీష్మాదులు నెయ్యమున ని వారింపఁగా దీని నేరర; ధృఢసత్య | రతులకు దేవనిర్మితుల కహిత |
|
| ఆ. |
మాచరించుచున్న నీచదుర్యోధనా | దులకు వర్ధనమును నలఘు లైన పాండునందనులకు దండితారుల కవ | ర్ధనము నిట్లు సేయఁ జనునె విధికి. |
162 |
| క. |
ధరణీతలంబు నిర్ధా | ర్త రాష్ట్రముగఁ జేసి యనఘు ధర్మైకధురం ధరు ధర్మతనూజు వసుం | ధర కధిపతిఁ జేయకుండఁ దగునే మనకున్?’ |
163 |
| వ. | అనిన బలదేవునకు సాత్యకి యిట్లనియె. | 164 |
| చ. |
‘అనుపమశౌర్యవంతుల రనంతబలాఢ్యుల రీవు నీ జనా ర్దనుఁడును సాంబసారణులు దర్పకవీరుఁడు నుండఁ బాండునం దనులు సుయోధనాదుల కృతంబున నిట్టు లనాథులట్ల యి వ్వనమున నుండఁగాఁ దగునె వన్యఫలాశనహీనవృత్తితోన్. |
165 |
| తరలము |
అహితచిత్తవిదారణక్రియలందుఁ బ్రౌఢములై జగ త్కుహరమంతయు మ్రోయుచుండఁగ ఘోరయాదవసైన్య స న్నహనదుందుభినాదముల్ గగనంబు దిక్కులు నిండ దు స్సహము లయ్యెడు ధార్తరాష్ట్రుల సైన్యవీరభటాలికిన్. |
166 |
| మ. |
ఘనమై నీ పృథుబాహులాంగలముఖాఘాతంబుతోడన్ జనా ర్దన శార్ఙ్గచ్యుతసాయకావలియుఁ గందర్పేషుజాలంబు నీ యనిరుద్ధోగ్ర శిలీముఖాలియు మదీయాస్త్రౌఘమున్ ధార్తరా ష్ట్రనికాయోత్తమకాయఖండనపటిష్ఠం బయ్యెడుం బోరిలోన్. |
167 |
| వ. | కేకయసృంజయ పాంచాల వృష్ణిభోజాంధకవీరులుం గృష్ణానుమతులయి యుద్ధంబున ధృతరాష్ట్రు పుత్త్రులను భీష్మ ద్రోణ కర్ణాదులను వధియింతురు; ధర్మరాజుతమ్ములుం దానును సమయాబ్దంబులు సలిపి రాజ్యాభిషిక్తుండగు నంతకు నతిరథు నభిమన్యు నఖిలరాజ్య రక్షకుంజేసి యుండుద’ మనిన సాత్యకి పలుకుల కనుకూలుండయి వాసుదేవుండు ధర్మరాజున కిట్లనియె. | 168 |
| ఉ. |
‘ఈతని పల్కినట్ల ధరణీశ్వర! నీరిపులన్ మహాబలో పేతులఁ బోరఁ జంపుదు రభేద్యులు వీరలు; మీకు భూతధా త్రీతలరాజ్య మెల్ల నగుఁ దెల్లము’ నావుడు ధర్మనందనుం డాతతకీర్తి యిట్లనియె నమ్మురవైరికి సీరపాణికిన్. |
169 |
| ఉ. |
‘మీ దయ మాకుఁ గల్గఁగ నమిత్రుల నోర్చుట యేమి పెద్ద? ధ ర్మోదయనిత్యబుద్ధులను నుత్తమకీర్తుల నొప్పు ద్రోణభీ ష్మాదుల సన్నిధానమున నమ్మెయిఁ బల్కిన పల్కు దప్పఁగాఁ గా’ దని ధర్మనందనుఁడు గ్రమ్మఱిచెన్ యదువీరకోపముల్. |
170 |
| వ. | యాదవులు పాండవుల వీడ్కొని పోయి; రిట పాండవులు సోమమిశ్రితతోయ యైన పయోష్ణియందుఁ గృతస్నానులయి యున్న నందు ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. | 171 |
| క. |
‘మనుజేంద్ర! దీని తీరం | బున నృగుఁ డను రాజు యజ్ఞములఁ జేసిన నం దనిమిషపతి తృప్తుండై | దనుజుల నోర్చె నటె ఘోరతరశస్త్రములన్. |
172 |
| వ. | మఱియు నింద తొల్లి యాధూర్తరజసుండైన గయుండు హిరణ్మయంబులయిన చషాలస్థాలీ యూప చమస పాత్రీస్రుక్స్రువంబులును దేవస్థాపితంబులయిన యూపంబులు నొప్ప నేడశ్వమేధంబులు సేసి, యసంఖ్యాతంబు లయిన ధనంబుల ఋత్విజులను సదస్యులనుం బూజించి సువర్ణమయగోదానంబు లనేకంబులు బ్రాహ్మణుల కిచ్చి యక్షయంబులయిన యింద్రలోకసుఖంబుల బడసెఁ; బయోష్ణియందుఁ గృతస్నానులైనవారు దేవసాయుజ్యంబుఁ బడయుదు’ రని చెప్పుచుం జని నర్మదాస్నానంబుఁ జేసి, వైడూర్యపర్వతంబుఁ గని రోమశుండు ధర్మరాజున కిట్లనియె; ‘నిది త్రేతా ద్వాపర సంధి. యీ సరోవరతీరంబు శర్యాతి యజ్ఞప్రదేశంబు; మఱియు నిందు భృగుపుత్త్రుం డయిన చ్యవనుండు శర్యాతి యను రాజుకూఁతు సుకన్య యను దాని వివాహంబయి, వాని యజ్ఞంబున నింద్రు నాదరింపక యాశ్వినుల సోమపీథులం జేసె’ ననిన నది యెట్లని యడిగిన ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సవిస్తరంబుగా రోమశుం డిట్లని చెప్పె. | 173 |