పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
క. శ్రీ రాజరాజ! కులని | స్తార! సుధాహార హీర సన్నిభ కీర్తీ!
శ్రీరమణ! ధనుర్విద్యా | పారగ! కోదండపార్థ! పార్థివ తిలకా!
1
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నరనారాయణ స్థానంబునఁ గొన్ని దినంబు లుండి యొక్కనాఁడు ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె. 2
మధ్యాక్కర ‘ఏనేఁడు లగుదెంచె నర్జునుఁ డేఁగి, యింత కేతెంచుఁ
బూని దివ్యాస్త్రముల్‌ వడసి, యమ్మహాభుజు భూరిసత్త్వు
నానతరిపువర్గుఁ జూడఁ గాంతు మిం’ దంచు బ్రాహ్మణుల
తో నేఁగె నుత్తరమించి ధర్మనిత్యుఁడు ధర్మజుండు.
3
వ. ఇట్లు గంధమాదన పుణ్యతీర్థావలోకనపరు లయి పాండవు లరిగి పదియేడగు దివసంబున వృషపర్వుండను రాజర్షియాశ్రమంబుఁ గని, యం దతిప్రీతి నాతనిచేతఁ బూజితు లయి యేడుదివసంబులు వసియించి బ్రాహ్మణుల నెల్ల నందు నిలువం బనిచి, వృషపర్వోపదిష్ట మార్గంబున ధౌమ్యరోమశప్రభృతి కతిపయ బ్రాహ్మణ వరులతోఁ జని యష్టమదివసంబున. 4
క. విమల స్ఫాటిక హాటక | రమణీయ దరీ నిరంతర శ్వేతనగేం
ద్రము మాల్యవంతమును ను | త్తమచరితులు సూచు చరిగి తద్విపినమునన్‌.
5
క. చలదళి పుంస్కోకిల కుల | కల రవముఖరిత లతాంత కమ్ర ఫలాళీ
లలిత మహీరుహ మాలా | మిళితోద్దేశముల విశ్రమించుచు లీలన్‌.
6
వ. అందు విహరించుచున్న నొక్కనాఁడు శ్వేతకి యను పుణ్యనదివలన మారుతానీతంబు లై తమ ముందటం బడిన పంచవర్ణ సురభి కుసుమంబులం జూచి యందఱు విస్మయం బంది; రంత నేకతంబున నొక్క శశికాంత శిలాతలంబుపయి నున్న భీమసేనునకు ద్రుపదరాజపుత్త్రి యి ట్లనియె. 7
క. ‘ప్రకటముగఁ దొంటి సౌగం | ధిక కనకాబ్జములకంటె దివ్యసుగంధా
ధిక కుసుమము లివి దద్దయు | సుకుమారము; లిట్టివానిఁ జూచి యెఱుంగన్‌.
8
వ. ఇప్పువ్వులు నాకుఁ దెచ్చి యిచ్చి మనఃప్రియంబు సేయు’ మనిన, భీముండు తత్‌క్షణంబ చని చక్రవాళ నగ సమున్నతం బయిన గిరిశృంగం బెక్కియందు వివిధరత్నరచిత రమ్య ప్రాకార పరివృతం బయిన వైశ్రవణు నివాసంబు గని శంఖధ్వానంబు సేసిన. 9
క. దాని విని యక్షరాక్షస | సేనలు పఱతెంచి భీమసేను మహాసే
నానీసన్నిభుఁ దాఁకిరి | నానాయుధధరులు దారుణధ్వను లెసఁగన్‌.
10
క. వాయుసుత ప్రేరిత శిత | సాయకముఖ దళిత రాక్షస ప్రకర బృహ
త్కాయాభ్ర గళిత శోణిత | తోయంబుల నవనిధరనదులు గడు నిండెన్‌.
11
ఉ. ఉక్కఱి యిట్లు మధ్యముమహోగ్రశరంబుల కోర్వనోప కా
రక్కసు లెల్ల నాహవపరాఙ్ముఖు లైనఁ గడంగి భీముఁ దా
నెక్కటి దాఁకె దిక్కరి సహింపక సింహముఁ దాఁకు నట్టులం
దక్కజుఁ డుద్యతాయతగదాయుధుఁడై మణిమంతుఁ డల్కతోన్‌.
12
క. ఆ రాక్షసు నతివీరుఁ గు | బేరసఖుం బవనసుతుఁ డభేద్యుఁడు నిజదు
ర్వారతరశాతసాయక | ధారావర్షమునఁ గప్పె దారుణభంగిన్‌.
13
క. గద ద్రిప్పి భీముమీఁదను | వదలక మణిమంతుఁ డలిగి వైచిన నది వి
ద్యుదుదితప్రభానిభం బై | పదిదిశలు వెలుంగ భీముపైఁ బఱతెంచెన్‌.
14
క. దానిఁ దన నిశితబాణవి | తానంబున జర్జరీకృతముఁ జేసె మరు
త్సూనుఁడు గుహ్యక రాక్షస | సేనల కెల్లను భయంబు సేయుచు నలుకన్‌.
15
క. ఘనుఁ డమ్మణిమంతుఁడు కాం | చనదండోద్భాసి యైన శక్తి మరున్నం
దనుమీఁద వైచె; నది యా | తని భుజపార్శ్వమ్ము దాఁకి ధారుణిఁ బడియెన్‌.
16
చ. గదఁ గొని భీముఁ డంత లయకాలకృతాంతుఁడపోలె నేల గ్ర
క్కదల నదల్చి నిల్చిన, నకంపితుఁడై మణిమంతుఁ డాజి దు
ర్మదుఁడు త్రిశూల మెత్తికొని మధ్యముపై ననలస్ఫులింగముల్‌
సెదరఁగ వైచె; దానిఁ జెఱిచెన్‌ ఘనుఁ డగ్గదచేత భీముఁడున్‌.
17
వ. ఇట్లు తనశక్తిశూలంబు లశక్తి నిహతంబైనఁ బరిత్యక్త మదుండై మణిమంతుం డంతరిక్షంబున కెగసిన. 18
క. ‘పోవకు పోవకు’ మనుచు మ | హావీరుఁడు గద యమర్చి యమ్మణిమంతున్‌
లా వఱఁగ వైచె నగ్గద | తో వాఁడును బడియెఁ బ్రతిహతుం డై నేలన్‌.
19
క. పోర మణిమంతుఁ డిట్లు స | మీరణసుతుచేతఁ బ్రాప్తమృతుఁ డై పడినన్‌
వారక పఱచిరి భయమున | నా రాక్షసు లార్తనాదు లై తూర్పునకున్‌.
20
వ. అట ధర్మరాజు, భీముండు పోయిన వలను ద్రౌపదిచే నెఱింగి యార్ష్టిషేణుం డను మునివరు నాశ్రమంబున ధౌమ్యద్రౌపదీప్రభృతులంబెట్టి, రోమశనకుల సహదేవయుతుండై తద్గిరిశృంగం బెక్కికుబేరసదన సమీపంబున నిజగదాఘాతపాతిత మణిమదాది రాక్షస దారుణ రణమధ్యంబున నున్న మధ్యమునొద్దకుం జనియె; నంత. 21
క. హతశేషు లైన రాక్షసు | లతిరయమునఁ బాఱి చెప్పి రప్పుడ యలకా
పతికి సవిస్తరముగ నిజ | మతిఁ బవనజువిక్రమంబు మణిమద్వధయున్‌.
22
వ. దాని విని కుబేరుండు విస్మితుండై యాత్మగతంబున. 23
క. ‘తలఁకక మును సౌగంధిక | ములు గొని, యిప్పుడును దర్పమున నిందుల పు
వ్వులు గొని మణిమత్ప్రభృతులఁ | బలువుర వధియించె నెట్టి బలియుఁడొ!’ యనుచున్‌.
24
వ. సురగరుడగంధర్వయక్షరాక్షససహితుం డయి యక్షప్రభుం డరుగుదెంచి పాండవులం గని, వారిలోన గదాకృపాణ బాణబాణాసనధరుం డయి రణకాంక్ష నున్న మహావీరు మారుతాత్మజుం జూచి పరమప్రీతచిత్తుం డయిన. 25
ఆ. అక్కుబేరునకు మహామతుల్‌ పాండవుల్‌ | మ్రొక్కి; రంత ధర్మమూర్తి యైన
ధర్మతనయుఁ జూచి తద్దయు దయతోడ | నిట్టు లనియెఁ గిన్నరేశ్వరుండు.
26
వ. ‘అయ్యా! నీయనుజుండు మత్ప్రియసఖుండైన మణిమంతు వధియించి నా కపకారంబు సేసె నని లజ్జింపవలవ; దది యగస్త్యుశాపనిమిత్తంబున నయ్యె’ నని భీమసేను డాయంబిలిచి ‘నీ చేసినసాహసంబు నా కుపకారంబు గావున నిన్ను మెచ్చితి’ ననిన నక్కుబేరునకుం గృతాంజలి యయి ధర్మతనయుం డి ట్లనియె. 27
ఆ. ‘ఇట్టి శాప మమ్మునీంద్రుండు దా నేల | యిచ్చె? దాని నాకు నెఱుఁగఁ జెప్పు’
మనిన విస్తరించి యమరాజసుతునకు | నక్కుబేరుఁ డిట్టు లనుచుఁ జెప్పె.
28
వ. ‘తొల్లికుశావతి యను పుణ్యనదీతీరంబున నమరులెల్ల సత్త్రయాగంబు సేయుచుండి నన్ను రావించిన నేనును బుష్పకవిమానారూఢుండ నై త్రిశతమహాపద్మసంఖ్యల యక్షరాక్షసబలంబుతో గగనగతి నందులకుఁ బోవునెడ నూర్ధ్వబాహుండై యమునా తీరంబున నుగ్రతపంబు సేయుచున్న యగస్త్యమహామునిమీఁద నా ప్రియసఖుం డైన మణిమంతుం డెఱుంగక నిష్ఠీవనంబు సేసిన నలిగి యమ్మునివరుండు నా కిట్లనియె. 29
ఆ. ‘నీవు సూచుచుండ నీ యిష్టుఁ డిమ్మణి | మంతుఁ డిపుడు దనదు మదముపేర్మి
నన్ను నరయ కుమిసె నామీఁద కష్టదు | ర్మదుఁడు పొలియు నొక్క మనుజుచేత.
30
వ. మఱియు నీ యక్ష రాక్షస బలంబులు వానిచేత నిహతు లగుదు; రిద్దురితంబు దద్దర్శనంబునం బాయు ననియెం గావున నిట్టి శాపఫలంబునకు నీ యనుజుండు నిమిత్తం బయ్యె’ నని చెప్పి, వెండియు ని ట్లనియె ‘ధృతియును దాక్ష్యంబును దేశకాలంబులును బరాక్రమంబును మంత్రవిధానంబు నను పంచవిధాంగంబు నెఱింగిన క్షత్రియుండు ధర్మవిదుండై ధరణీచక్రంబు నిర్వక్రమంబుగా రక్షించి పుణ్యలోకంబు పడయుఁ; గర్మవిశేషంబు లెఱుంగక వృథారంభుం డై సాహసంబున వర్తిల్లువానికిం బాతకం బగుట నిశ్చయంబు. 31
క. కావున నిరతమ్ము మరు | ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్‌
భూవల్లభ! శిక్షింపుము | నీ విమలజ్ఞానధర్మనిష్ఠితబుద్ధిన్‌.
32
వ. నిన్నును నీ తమ్ములను ధర్మానిల శక్రాశ్వినులు రక్షించునట్ల యే నెప్పుడు రక్షింతు; నా నియోగంబున మత్పరిచారకులు మీకు నిత్యంబును నన్న పానాదులు దెచ్చియిచ్చుచుండ నార్ష్టిషేణాశ్రమంబున నొక్కపక్షంబు వసియించునది. 33
సీ. ‘మానితయశుఁడు భీమానుజుం డర్జునుం | డమరులచేత దివ్యాస్త్రతతులు
వడసి దేవేశ్వరుకడ నున్నవాఁ; డతం | డుపకారి యయ్యె దేవోత్తమునకు;
సప్తమేధాధ్వరప్రాప్తపుణ్యుఁడు ధర్మ | మతి భవత్పితృపితామహుఁడు ఘనుఁడు
శంతనుఁ డతనిచే సంతర్పితుం డయ్యె; | గుఱుకొని మీదైన కుశల మడిగె;
 
ఆ. నరుగుదెంచు నింత కయ్యర్జునుండు మీ | కభిమతార్థసిద్ధి యగును సిద్ధ’
మని యెఱుంగఁ జెప్పి యలకాధినాథుండు | యక్షగణముతోడ నరిగె నంత.
34
వ. ఇట్లు ధర్మరాజు కుబేరునాదేశంబున నార్‌ష్టిషేణాశ్రమంబున నున్న నాతనికి నొక్కనాఁడు ధౌమ్యుండు నిజాంగుళి నుత్తరదిగ్భాగంబు సూపుచు ని ట్లనియె. 35
క. ‘అది మందరనగ మక్కడ | నది మేరుగిరీంద్ర మమ్మహాశైలము నె
న్మిదిదిక్కుల వసియింతురు | త్రిదశేశ్వరు దొట్టి యష్టదిక్పాలవరుల్‌.
36
చ. కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్కరతారకాగణం
బనవరతంబుఁ ద్రిమ్మరు మహామునిసప్తకమండలంబుతో
ననఘ! తదీయతుంగశిఖరాగ్రమునందుఁ బయోరుహాసన
త్రినయన విష్ణు లుండుదురు దేవగణంబులు గొల్చుచుండఁగన్‌.’
37
వ. అని చెప్పుచుండఁ బాండవు లం దొక్కమాసంబు నివాసంబు సేసి; రంత. 38
ఉ. అంబర మాత్మదీప్తినివహంబున నొప్పఁగ మాతలిప్రయు
క్తం బగు దివ్యకాంచనరథంబు లసచ్చపలాంశుపుంజ ర
మ్యం బగు దాని నెక్కి ధృతిమందరుఁ డింద్రసుతుండు నాకలో
కంబుననుండి వచ్చెఁ బ్రవికాశితతేజుఁ డినప్రకాశుఁ డై.
39
వ. ఇట్లు చనుదెంచి ధనంజయుండు రోమశధౌమ్యధర్మజభీమసేనులపాదంబులకుం బరమభక్తి మ్రొక్కి వినయావనతులయిన కవల నెత్తి కౌఁగిలించుకొని, ద్రౌపదీహృదయనయనాంబుజంబుల కానందంబు సేయుచున్నంత, నందఱు సంతసిల్లి మాతలి నతిప్రీతిఁ బూజించిన, నతండును దివ్యరథంబు గొని దివంబున కరిగె; నట్టి యవసరంబున. 40
క. దిననాథుఁ డస్తగిరిఁ బొం | దినఁ జీఁకటిఁ బాచి యాత్మతేజమున దిగం
గనల విభూషించుచు రజ | నినాథకలహంస గగననిమ్నగ నొప్పెన్‌.
41
వ. ఆరాత్రి యర్జునుం డనుజులనందఱ నొద్దఁబెట్టుకొని యిష్టపూర్వకథలు సెప్పుచు శయనించె; నంతఁబ్రభాతం బగుడు సిద్ధమునిగణంబులయు రోమశధౌమ్యులయుఁ దమ్ములయుఁదోడ ధర్మతనయుండు సుఖోపవిష్టుం డై యున్నంత. 42
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )