| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
బోరన సురదుందుభుల నినాదంబులు | గిన్నరగంధర్వగీతరవము లెసఁగ సహస్రసూర్యేందుమండలములు | వోలె విమానముల్ పొలిచి వెలుఁగఁ బాండవాలోకనపరుఁడై సహస్రాక్షుఁ | డమరగణంబుతో నమ్మహాద్రి కేతెంచెఁ; బ్రీతి నయ్యింద్రున కందఱు | నంత నభ్యుద్గతు లైరి; పాండ |
|
| ఆ. |
వాగ్రజుండు దాను ననుజులు నింద్రుపా | దాంబుజముల కెరఁగి యధికభక్తి శాస్త్రదృష్టవివిధసత్కారవిధులఁ బూ | జించె నమరఖచరసిద్ధపూజ్యు. |
43 |
| వ. | ఇంద్రుండును వారల నందఱ నతిమధురవచనంబుల నభినందించుచుఁ దదంతికస్థితు నధికతపోయుక్తు ధనంజయుం జూపి ధర్మజున కి ట్లనియె. | 44 |
| క. |
‘ఘనుఁ డీపార్థుఁడు నా వల | నన దివ్యాస్త్రప్రయోగ నయనిపుణుం డై దనుజుల నివాతకవచుల | ననిఁ జంపి సురావలికిఁ బ్రియం బొనరించెన్. |
45 |
| క. |
ఈతఁడు పరాక్రమమున న | రాతుల వధియించి యిద్ధరారాజ్యము వి ఖ్యాతముగ నిచ్చు నీకు మ | హాతేజుఁ డజేయవీర్యుఁ డని నెవ్వరికిన్. |
46 |
| క. |
అని చెప్పి యనిమిషప్రభుఁ | డనిమిషనివహంబుతోడ నమరావతికిం జనియె నిజాలోకనమున | కనఘులు పాండవులు హర్షమందుచు నుండన్. |
47 |
| మధ్యాక్కర |
ఘనముగ ధనదేంద్రపాండుసుతసమాగమ మొక్కయేఁడు దనరంగ బ్రహ్మచర్యవ్రతస్థు లై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములును జదివినవారు విభుత నూఱేండ్లు నొనర జీవింతు రత్యంత మగు కాంతియుక్తు లై ధరణి. |
48 |
| వ. | ఇట్లు సురేంద్రుం డరిగిన ధర్మతనయుం డర్జునుం జూచి పరమానందభరితహృదయుం డై యిట్లనియె. | 49 |
| ఆ. |
నగ్రజన్మపూజ్యు లగు ధౌమ్య రోమశ | భ్రాతృవరులయొద్దఁ బాండవేయుఁ డసదృశప్రభావుఁ డతివీరుఁ డర్జునుఁ | డాత్మచరిత మిట్టు లనుచుఁ జెప్పె. |
50 |
| వ. | ‘ఏను భవదాదిష్టవిద్యాప్రకారంబున తపోనియుక్తుండ నై హిమవంతంబునకుం జని, యందు నా ముందట వృద్ధబ్రాహ్మణుం డై యున్న వృద్ధశ్రవుం గని, తదుపదేశంబున నీశ్వరుగుఱించి యుగ్రతపంబు సేసిన, నీశ్వరుండు గిరాతరూపధరుండై నాతోడ నతిఘోరయుద్ధంబుసేసి, నాకుఁబ్రసన్నుఁడై నిజరూపంబుఁ జూపి, పాశుపతాస్త్రంబుఁ బ్రసాదించె; ననంతరంబ నింద్రాది దేవతలవలన నైంద్రాగ్నేయయామ్యరాక్షసవారుణ వాయవ్యకౌబేరగాంధర్వ పైశాచబ్రాహ్మ్యంబు లనంబరఁగు దివ్యాస్త్రంబులు వడసి, మహేంద్రానుగృహీతుండ నై మాతలి ప్రయుక్తం బైన దివ్యరథం బెక్కి యీ శరీరంబుతోడన యమరావతి కరిగి, యం దమరేంద్రునాచార్యుఁగా వరించి తత్ప్రసాదంబున దివ్యాస్త్రంబులు వడసి తత్ప్రయోగంబులును నుపసంహారంబులును నివర్తనంబులును బ్రాయశ్చిత్తంబులును బ్రతిఘాతంబులును నేర్చిన నాకు సంతసిల్లి సురేంద్రుం డిట్లనియె. | 51 |
| క. |
‘నీ వఖిలాస్త్రవిదుండవు | గావున నిన్నాజి నోర్వఁగా నోప రొరుల్; దేవతలకు బ్రాహ్మణులకుఁ | గావింపు హితంబు; దీనఁ గడు సిద్ధి యగున్. |
52 |
| క. |
నాకు గురుదక్షిణార్థము | నాకహితార్థంబుగా జనస్తుతబుద్ధిం జేకొని నా పనిచినపనిఁ | బ్రాకటముగఁ జేయు మహితభంజనశక్తిన్. |
53 |
| తే. |
జలధికుక్షిలోనుండి వీరులు నివాత | కవచు లను మూఁడుకోట్ల దానవులు బలిమిఁ ద్రిదశులకు బాధసేయుచుండుదురు; వారు | నిహతు లగుదురు నీచేత మహితకీర్తి!’ |
54 |
| వ. |
అని తన తొడిగిన దివ్యభూషణంబుల మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి, స్పర్శరూపం బైన యభేద్య కవచంబు నిచ్చి, యజగరసన్నిభం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దాన యోజించి, పదివేల హంసమయూరవర్ణమాననీయహయంబులం బూనిన రథంబు మాతలిప్రయుక్తం బైన దాని నెక్కం బనిచి ‘నివాతకవచవధార్థం బరుగు’ మని నియోగించిన, నింద్రు వీడ్కొని చనుచున్న నాకు దేవత లి ట్లనిరి. |
55 |
| ఉ. |
‘ఈ రథ మెక్కి తొల్లి యమరేంద్రుఁ డనేకసహస్రసంఖ్య దే వారుల వృత్రశంబరబలాదుల నుద్ధతులన్ జయించె; వీ రారివిభేది! నీవును బలాఢ్యుఁడవై వధియింపు ముగ్రమా యారతులన్ నివాతకవచాసురులన్ సమరాంతరంబునన్’. |
56 |
| వ. | అని నాకు దేవదత్తం బను శంఖం బిచ్చిన, నేనును మాతలిసహితంబుగా రథం బెక్కి యతిత్వరితగతి నరిగి. | 57 |