| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
ఫేనవదూర్మిచయంబుల | నానావిధ మీన కూర్మ నక్రంబుల శై లానుకృతి నొప్పుచున్న మ | హానీరధిఁ గంటి నేను నమ్మాతలియున్. |
58 |
| వ. | ఆ సముద్రోదరంబున విశాలాట్టాలక ప్రతోళికాలంకృతం బైన పురంబుఁ గని తద్ద్వారంబున శంఖధ్వానంబు సేసిన, నది సకలదిఙ్మహీధరగుహాకుహరంబులయందుఁ బ్రతిశబ్దజనకం బైన, దాని విని యలిగి దానవులు నానావిధాయుధసన్నద్ధు లయి నిజకాయకాళిమతమోభూతభువను లగుచు వచ్చి నారథంబుఁ బరివేష్టించి. | 59 |
| క. |
ఉరుశస్త్రవృష్టి నాపైఁ | గురిసినఁ దత్‌క్షణమె యొక్కొకొనిపయి నేనున్ వరుసం బదేసిబాణము | లరుదుగ నేసితి మహాభయంకరభంగిన్. |
60 |
| క. |
దనుజులు మదీయరథమా | ర్గనిరోధముగాఁ బ్రచండకాండప్రకరం బునఁ గప్పిరి రోదోంతర | మనిమిషులును ఋషులుఁ జూచి యద్భుతమందన్. |
61 |
| క. |
కడుభయమున మాతలి చే | డ్పడి రథచోదనమునం దపాటవుఁ డైనన్ వడి నేన రథము గడుపుచుఁ | దడయక యేసితిఁ గడంగి దానవులపయిన్. |
62 |
| వ. | మాతలి నన్నుం జూచి సంతసిల్లె నంత. | 63 |
| చ. |
అతుల రణాంతరంబున నిరంతర మ త్పటు బాణ దారితో చ్ఛ్రిత దనుజాంగ నిర్గళ దసృగ్జల ధారలు సూడ నొప్పె నా తత గిరి శృంగ సంగ దళిత ప్రచల జ్జల వాహ జాల సం తత గళ దంబుధారల విధంబున నంబర మెల్లఁ గప్పుచున్. |
64 |
| వ. | అంత నయ్యసురులు మాయాయుద్ధంబు సేయ సమకట్టి నామీఁద వర్షాస్త్రంబు లేసిన. | 65 |
| క. |
బలరిపుఁడు నాకు నిచ్చిన | యలఘునిశాతముఖశోషణాస్త్రంబున ని ర్గళదవిరళజలధారా | వలి నెల్లను దత్‌క్షణంబు వట్టఁగఁ జేసెన్. |
66 |
| సీ. |
అద్దానవులు దారుణాశ్మవర్షంబులుఁ | గురిసిన నవి నన్నుఁ దెరలఁ గప్పె; నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్ | నుఱుము గావించితి; నుఱక వెండి యసురులు నామీఁద ననలాస్త్రజాలంబు | లేసిన గాడ్పుతో మ్రోసి యగ్ని కణములు నాపయిం గవిసిన నేనును | సలిలాస్త్రముల వాని బల మడంచి |
|
| ఆ. |
యున్నఁ, దిమిరబాణ ముగ్రంబుగా వార | లేసి; రంత దిక్కు లెల్లఁ గప్పె; నంధకారమగ్నుఁ డై చలియించి మా | తలి ప్రతోద మెడలి ధరణిఁ బడియె. |
67 |
| క. |
తురగములు పఱవ నేరక | వరరథవహనంబునందు వంధ్యము లయ్యెన్; సురసారథి ననుఁ గానక | ‘హరినందన! యెందుఁ బోయి’ తనెఁ గడు భీతిన్. |
68 |
| క. |
‘అమృతనిమిత్తంబున ము | న్నమరాసురయుద్ధ మయ్యె; నది యింతభయ భ్రమజనకము గా; దిది యు | గ్రము దనుజు లవార్యవీర్యగర్వితు లగుటన్. |
69 |
| తే. |
బ్రహ్మచేత నిర్మింపఁగఁబడిన భువన | సంప్లవం బిది’ నావుడు ‘సంగరమున సంచలింపక నాభుజశక్తిఁ జూచు | చుండు’ మనవుడు మాతలి చోద్య మందె. |
70 |
| ఉ. |
వాసరనాయకుం దలఁచి వజ్రివరంబున సూర్యబాణ మే నేసితి నింద్రుఁ దొట్టి సుర లెంతయు సంతస మందఁగా జగ త్త్రాసి తమిస్రరాశి నిహతంబుగ దిక్కులు ద్రెళ్ళఁగా మహో గ్రాసురు లాహవంబున భయంపడ మాతలి మెచ్చి యార్వఁగన్. |
71 |
| క. |
గాండీవముక్తదారుణ | కాండవిఖండీకృతాపఘను లై దనుజుల్ భండనముఖమునఁ జేడ్వడి | గొండలు వడినట్టు వడిరి కుతలం బద్రువన్. |
72 |
| వ. | ఇట్లు నివాతకవచులు మదీయదివ్యాస్త్రనిహతులై మహీతలంబునం బడిన; నట యసురకాంతలయాక్రందన ధ్వను లాకసం బద్రువ నొక్కటఁ బురంబున నెగసె; నంత నద్దానవపురంబుఁ బురందరుపురంబుకంటె నతిసుందరం బైన దానిం జూచి మాతలి కి ట్లంటి. | 73 |
| క. |
‘నిరుపమరత్ననిరంతర | వరగృహముల నొప్పి సుఖనివాసం బగు ని ప్పురి నుండ నొల్ల కొండొక | పురి నుండఁగ నేల వలసెఁ బురుహూతునకున్.’ |
74 |
| వ. | అనిన మాతలి యి ట్లనియె. | 75 |
| సీ. |
‘అసురులవలన భయం బైన యపుడు వే | ల్పులకు సేమంబుగా బలవిరోధి యీప్రోలు జలధిలో నిమ్ముగ నిర్మించె; | దనుజులు పదపడి వనజగర్భు వలనఁ దపోవీర్యవంతు లై యిందుండ | నమరులచేతఁ గయ్యమున నజితు లై యుండఁ బడసిన, నమరేంద్రుఁ డెఱిఁగి త | ద్విజయార్థముగఁ బంచె విజయ! నిన్ను; |
|
| ఆ. |
నమరులకు నసాధ్యు లైనట్టి వీరల | నీవ యోర్చి’ తనుచు నెమ్మితోడ నన్ను సంస్తుతించి నరనాథ! మాతలి | గడఁగి యపుడు రథముఁ గ్రమ్మఱించె. |
76 |
| వ. | ఇట్లు నివాతకవచులం జంపి క్రమ్మఱి వచ్చునెడ నాముందట నొక్క తపోవనంబును నతివిచిత్రం బైన పురంబునుం గని ‘యిది యెవ్వరిపురం?’ బని యడిగిన నాకు మాతలి యి ట్లనియె. | 77 |
| క. |
‘వినవె పులోమయుఁ గాలక | యును ననఁగా నిరువు రసురయువతులు గమలా సను నారాధించిరి తప | మున దివ్యసహస్రవర్షములు గడునిష్ఠన్. |
78 |
| క. |
కనకమయ మైన యీప్రో | లునఁ దమసుతు లాహవంబులో నమరులచే తను వధ్యులు గాకుండను | వనజజుచేఁ బడసి రసురవనితలు వరముల్. |
79 |
| వ. | ఇది హిరణ్యపురం; బిందుఁ బౌలోమకాలకేయు లను నసురు లరువది వేలుండుదురు వా రమరులచేత నవధ్యు’ లనిన ‘నట్లేని దానిపయిం బోదము; రథంబు వఱపు’ మని యేను మాతలిం బంచిన. | 80 |
| చ. |
అతఁడును సప్తమారుతరయంబున దివ్యరథంబుఁ దత్సురా హితపురి భూరి వప్రముపయిం బఱపెన్ సురవైరు లంత ను ద్ధతు లయి ప్రోలు వెల్వడి రథంబులు షష్టిసహస్రకంబుతో శతమఖబుద్ధిఁ జేసి కడు సైఁపక తాఁకిరి నన్ను నల్కతోన్. |
81 |
| వ. | ఏనును వారల యఱువదివేలరథంబులకు గతినిరోధంబుగా వితతవృక్షవికటశిలాప్రభవంబు లయిన దివ్యబాణంబు లేసిన, నసురులు మాయాయుద్ధనిబద్ధబుద్ధులై తమపురంబుతోడన దివంబున కెగసి మదీయమార్గణార్గళనిరుద్ధమార్గు లై నేలంబడిన, వీరల నొండువిధంబున నోర్వరా దని తలంచి. | 82 |
| చ. |
ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్ వృషాంకు శం కరు శశిఖండమండితశిఖండు శివున్ హృదయాంబుజంబునం దిరముగ నిల్పి పాశుపతదివ్యశరం బరివోసి యేసితిన్ సురరిపుకోటిమీఁద సురసూతుఁడు మాతలి చూచి మెచ్చఁగన్. |
83 |
| వ. | ఆ దివ్యాస్త్రప్రభావంబున సింహశరభశార్దూలశుండాలమహిషమహోక్షయక్షరాక్షసపిశాచపన్నగ గంధర్వరూపంబు లుద్భవిల్లి యసురుల నెల్ల విగతాసులం జేసిన. | 84 |
| క. |
వంచనయును మాయయు మా | యించి పరాక్రాంతి నయ్యుమేశాస్త్రమునం గ్రంచఱ నంతకపురి కేఁ | గించితిఁ బౌలోమకాలకేయాసురులన్. |
85 |
| వ. | ఇట్లు హిరణ్యపురనివాసులం గృతాంతపురనివాసులం జేసి వచ్చి వాసవునకు మ్రొక్కిన, వాసవుండును నివాతకవచపౌలోమకాలకేయుల వధప్రకారం బంతయు మాతలివలన విని సంతసిల్లి నా కి ట్లనియె. | 86 |
| చ. |
‘సురలకుఁ బ్రీతి సేసితి; వసుంధర కేఁగుము; నిన్ను నీ సహో దరులు నిరంతరంబును ముదంబునఁ జూడఁగఁ గోరుచున్నవా; రరిమదభేది! నీకు విషమాజిముఖంబుల మార్కొనంగ నో పరు నరు లెవ్వరున్; హరి కిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్? |
87 |
| క. |
ద్రోణద్రోణజ కృపగీ | ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ ద్బాణహతిఁ జేసి సమర | క్షోణిఁ బరిక్షీణబలు లగుదు రవజితులై.’ |
88 |
| క. |
అనిన నమరేంద్రు వీడ్కొని | చనుదెంచితి’ నని కిరీటి శతమఖలోకం బునఁ దన చేసినవిధ మ | త్యనఘుం డేర్పడఁగఁ జెప్పె నందఱు వినఁగన్. |
89 |
| వ. | ధర్మరాజును దమ్ముఁడు సేసిన మహాపరాక్రమంబునకుఁ జతురంభోధిపర్యంతమహీరాజ్యం బప్పుడు తనకు సంప్రాప్తం బైనంతియ సంతసిల్లి. | 90 |
| ఆ. |
‘దివ్యబాణములు తదీయప్రయోగముల్ | మాకుఁ జూపు’ మనిన మఘవసుతుఁడు వేఱువేఱ చూపె వేలుపు లిచ్చిన | యస్త్రశస్త్రములు నిజాగ్రజునకు. |
91 |
| వ. | మఱియును. | 92 |
| చ. |
సురవిశిఖ ప్రయోగములు సూపఁ దొడంగిన నేల దిర్దిరం దిరిగెఁ, బయోనిధుల్ గలఁగె, దిగ్గజముల్ మదమేది కుందె, భా స్కరరుచి మాసెఁ, బావకశిఖాతతి తోన యడంగె గాడ్పు, లం బరమున నిల్చి రీశ్వరుఁడు బ్రహ్మయు నాదిగ వేల్పులందఱున్. |
93 |
| వ. | అంత సురగణచోదితుం డైన నారదుం డర్జునుపాలికి వచ్చి యి ట్లనియె. | 94 |
| తే. |
‘ఎదురు లేక దివ్యాస్త్రంబు లిట్లు నీకుఁ | బాడియే ప్రయోగింపంగఁ బాండుపుత్త్ర! సిద్ధ మివి యధిష్ఠానవర్జితము లయ్యె | నేని మూఁడులోకములు దహించు నొగిని.’ |
95 |
| వ. | అని యర్జును వారించి నారదుం డరిగిన, నమరులు నిజస్థానంబుల కరిగి; రిట్లు పాండవు లందుఁ బదిమాసంబు లుండునంత; నొక్కనాఁ డమరకన్యకలు వచ్చి యర్జునున కి ట్లనిరి. | 96 |
| తే. |
‘వనమునందును బండ్రెండువత్సరములు | నలయ కజ్ఞాతవాస మేకాబ్దకంబు పూని నిర్విఘ్నవృత్తిఁ జల్పుదురు మీరు | పగఱ నిర్జింతు రాహవాభ్యంతరమున. |
97 |
| తే. |
నీ పరాక్రమబలమున నిఖిలధరణి | రాజ్యభారంబు నీ ధర్మరాజు పూను; రఘుకులాధీశ్వరుం డైన రాముకీర్తి | యట్ల నీ కీర్త్తి త్రిజగంబులందుఁ బరఁగు.’ |
98 |
| వ. | అని యాదేశించి దేవకన్యకలు వోయిన, నిట దేవర్షి యైన రోమశుండు ధర్మరాజునకు ధర్మానుశాసనంబు సేసి దివంబున కరిగె; నంతఁ బాండవు లెప్పటియట్ల ఘటోత్కచసేనానీతు లై క్రమ్మఱి వృషపర్వునివాసంబు సూచుచు బదరీవనంబున నొక్కరాత్రి వసియించి, సుబాహుపురంబునకు వచ్చి యందుఁ దమ పరిచారకు లైన యింద్రసేనాదులం గూడి నిజరథారూఢు లై ఘటోత్కచుం బోవం బనిచి హిమవత్పర్వతంబునందు దేవర్షి బ్రహ్మర్షులయజ్ఞప్రదేశంబుల ననేకవిధయూపంబులు సూచుచు నొక్కవర్షం బుండి; రంత నొక్కనాఁడు. | 99 |