పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
అజగరోపాఖ్యానము (సం. 3-176-5)
క. మృగయార్థ మరిగి హిమవ | న్నగ భూములయందుఁ బవననందనుఁ డొక ప
న్నగుచేతఁ బట్టువడి యి | మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుఁ డయ్యెన్‌.
100
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 101
మధ్యాక్కర ‘పదివేల గజముల బలము గలవాఁడు పౌలస్త్యుతోడఁ
గదనంబు సేసి యనేక యక్షరాక్షసుల నిర్జించి
యుదితశౌర్యోన్నతుం డైనవాఁడు వృకోదరుఁ డేల
పదపడి నిగృహీతుఁ డయ్యెఁ దా నొక్కపన్నగుచేత?’
102
వ. అనిన విని వైశంపాయనుం డి ట్లనియె; భీముం డొక్కండ హిమవదుత్తుంగశృంగోపాంతకాంతారంబుల మృగయాభ్రాంతిఁ బరిభ్రమించుచుండి యతిశ్రాంతుం డయి తత్‌ప్రదేశంబున. 103
మ. అశనాశావివృతాస్యగహ్వరుఁ, గృతాంతాకారు, నిశ్వాస ధూ
మశిఖాధూసరితోగ్రదుర్గతరుగుల్మవ్రాతు, హారిద్ర వ
ర్ణశరీరున్‌, భృశరూక్షదర్శను, మహానాగప్రభుం గాంచె న
ర్ధశశాంకద్యుతి హారిదారుణ చతుర్దంష్ట్రున్‌ జగత్త్రాసకున్‌.
104
వ. అమ్మహాజగరం బామిషార్థి యై భీముం బట్టికొని వాని భుజయుగంబుఁ దనముఖంబున నంగంబు నిజాంగంబునఁ జిక్కం బంధించిన నాగాయుతబలుం డయ్యును తదంగసంగంబున దుర్బలుండై మెలంగనేరక భీముం డప్పాము బలవీర్యంబులకు విస్మితుం డయి ‘యిది ప్రకృతిసర్పంబుగా; దెయ్యదియేనియు నొక్కయద్భుతరూపం’ బని విచారించుచు దాని కిట్లనియె. 105
మత్తకోకిల ‘ఏను భీముఁడఁ బాండవేయుఁడ నిద్ధతేజుఁడ ధర్మరా
జానుజుండఁ బిశాచపన్నగయక్షరాక్షసవీరులం
బూని పోరుల నోర్వనోపెడు భూరివీరుఁడ నాగపం
చాననాదులఁ బట్టి వ్రచ్చు ననంతబాహుబలాఢ్యుఁడన్‌.
106
ఆ. ఇట్టి నన్నుఁ బట్టి యిప్పాట బంధించు | నట్టి శక్తి యెట్టు లయ్యె నీకు?
నిది నిసర్గశక్తియే? వరదానసం | సిద్ధి యైన యదియె? చెప్పు’ మనిన.
107
వ. అదియును దిర్యగ్జాతి యయ్యును దనపూర్వస్మృతి సెడకుండ వరంబుఁ గాంచుటంజేసి వాని కి ట్లనియె. 108
క. ‘ఇది నా వరలాభంబున | నుదయించినశక్తి; యెట్టియున్నతబలసం
పదు లైన జీవులును నా | కెదిరిచి బలహీను లగుదు రివ్విపినమునన్‌.
109
ఆ. ఎదురఁ బడినవాని వదలక శార్దూల | శరభసామజాదిసత్త్వతతులఁ
బట్టి తినుచు నున్న యట్టి నా కిప్పుడు | భక్ష్య మైతి వీవు పాండుపుత్త్ర!
110
ఆ. శక్రపదవిఁ బొంది సద్బ్రాహ్మణుల కవ | మాన మేనుఁ జేసి మదము పేర్మి
ననఘ! యిట్టు లైతి నం దొక్క మునివరు | శాపశక్తిఁ దొంటిశక్తి దఱిఁగి.’
111
వ. అని దుఃఖించిన యజగరంబునకు భీముం డి ట్లనియె. 112
క. ‘కడుకొని కడుదుఃఖములై | నెడ నుచితమె? యాత్మనింద యెయ్యెడల మనం
బెడలక యేకాకృతి నె | ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్‌.
113
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )