| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | పురుషకారంబునంజేసి దైవంబు నివర్తింప నెవ్వ రోపుదు? రేను మహాబలుండ నయ్యును భవద్గృహీతుండ నై యిట్టియవస్థం బొందితి; నాత్మత్యాగంబునకు వగవ; నపహృతరాజ్యానుభోగులై మద్భ్రాతృవరులు దుర్గమంబైన యిప్పర్వతకందరంబునం గ్రుమ్మరుచున్నవారు నన్నుఁ గానక యెంత దుఃఖింతురో యని వగచెద’ ననుచున్నంత; నిట ధర్మతనయుండు దీప్తం బైన శివారుతంబు విని యతిశంకితచిత్తుండయి యనంతరంబ తన దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీఁద లగ్గగు నంచు ననుజమధ్యంబున ననిలజుం గానక యర్జునుం గవలను గృష్ణారక్షణార్థంబు నియోగించి ధౌమ్యపురోగమభూసురవరులతో భీము రోయుచుం దదీయపాదతల లలిత హలకులిశ కలశజలజాది లక్షణాలంకృతం బైన పాంసుపథంబునం జని ముందట. | 114 |
| క. |
గిరిశిఖరాభోగబృహ | త్తరభుజగశరీరవేష్టితశరీరుం డై భరమునఁ గదలఁగ నేరక | పరమశ్రమ మడర నున్న పవనజుఁ గనియెన్. |
115 |
| క. |
కని యాత్మగతంబున ‘ని | య్యనిలజుఁ డొకపాముచేత నవిచేష్టితుఁడై తన లావు దఱిఁగి ప్రాకృత | జనుక్రియ నిట్లున్నవాఁ డసామర్థ్యమునన్. |
116 |
| వ. | ఇది యేమి యాశ్చర్యంబొ!’ యనుచు ననిలజుం జూచి దుఃఖితుం డై ధర్మజుం డయ్యజగరంబున కి ట్లనియె; ‘నయ్యా! నీవు సర్పరూపంబుఁ దాల్చిన దైత్యుండవో దేవతవో చెప్పు; మేను యుధిష్ఠిరుండ; ని న్నడిగెద; నిమ్మహాభుజు నాయనుజు నామిషార్థివై పట్టితేని నీకు బుభుక్షానివృత్తి యగునట్లుగాఁ జాలినంత మృగమాంసంబుఁ బెట్టెద; వీని విడువు’ మనిన ధర్మరాజునకు నయ్యజగరం బిట్లనియె. | 117 |
| సీ. |
‘వినవయ్య! నహుషుఁడన్ జనపతి నేను మీ | పూర్వజులకు నట పూర్వజుండ; ననఘ! సుత్రామున కెనయగువాఁడ; నై | శ్వర్యగర్వంబున నార్యవృత్తి విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమ | బ్రాహ్మణధృత మైన బ్రహ్మరథము నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగు నవ | మానంబు సేసినదాన నాకుఁ |
|
| ఆ. |
గలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి | వగు మటంచు శాప మప్పు డిచ్చె; మునివరేణ్యుశాపమునఁ జేసి యిప్పాట | నవయుచున్నవాఁడ నాఁటఁగోలె. |
118 |
| వ. | విధివిలసితంబు పేర్మి నీ కే మని చెప్పుదు? | 119 |
| చ. |
చదివితి నెల్లవేదములు, సత్క్రియఁ జేసితి నూఱుయజ్ఞముల్, విదితముగా సురేంద్రపదవీస్థితిఁ బొందితి, దుర్మదంబునం దుదిఁ బెనుబాము నై యధికదుఃఖుఁడ నైతి సుఖంబు దుఃఖమున్ వదలక చేయుచోట బలవద్విధి కేమి భరంబు సెప్పుమా! |
120 |
| వ. | అయ్యగస్త్యుచేత నిట్లు శాపగ్రస్తుండనై శక్రాసనంబువలనం బాసి యిట వచ్చుచునుండి ‘మునీంద్రా! నాకుఁ బూర్వస్మృతి సెడకుండను, బలవంతంబు లైన సత్త్వంబులు నన్ను ముట్టునప్పుడ బలహీనంబు లై భక్ష్యంబులు గాను, శాపవిమోక్షంబున కుపాయంబును బ్రసాదింపు’ మని కృతాంజలి నై యున్న నాకుం గరుణించి మునివరుండు నా వేడిన వరంబు లిచ్చి వెండియు ని ట్లనియె. | 121 |
| క. |
‘క్రమమున నీ చేసిన ప్ర | శ్నములకుఁ బ్రత్యుత్తరములు సన్మతి నత్యు త్తముఁ డెవ్వఁ డిచ్చు నతనిక | తమునను శాపాంత మగు బుధస్తుత! నీకున్. |
122 |
| వ. | అది దీర్ఘకాలంబునంగాని కా’ దనియె; నేనును దద్వచనం బవలంబించి పెద్దకాలం బియ్యడవి నున్నవాఁడ; నేఁడు నీ తమ్ముఁడు నాకు నష్టప్రాప్తం బైన భక్ష్యం బయ్యె; నోపుదేని నా ప్రశ్నములకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చి వీని విడిపించుకొ’ మ్మనిన ధర్మజుం డి ట్లనియె. | 123 |
| క. |
‘నీ యడిగిన యర్థాభి | ప్రాయములకు నుత్తరంబు పరువడిఁ జెప్పన్ ధీయుత! బ్రాహ్మణులకుఁ గా | కాయతమతు లయ్యు నొరుల కవి విషయములే? |
124 |