పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
ఎఱ్ఱాప్రెగ్గడప్రణీత భారత ప్రారంభము
చ. స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్‌ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్‌.
142
శా. దానాంభఃపటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ
ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్‌ డిగ్గె నాఁ
గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్‌ వనాంతంబునన్‌.
143
క. కలనీలకంఠకోలా| హలలీలలు సెలఁగె, రాజహంసకులంబుల్‌
విలసించె, సప్తపర్ణా | వలి విగళిత కుసుమ కుటజ వాటిక లడరెన్‌.
144
మ. అతిగాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో
షితపాథోధిపయస్కుఁ డైన ముని దోఁచెం బుణ్యతేజోమయా
కృతి నయ్యామ్యదిగంతవీథిఁ బ్రకటక్రీడాకళాగర్వ గ
ర్జితమండూకకళంకితాంబుశుచితాసిద్ధిప్రదాచార్యుఁ డై.
145
తే. విశదశారదాంబుద పరివేష్టనమునఁ | బొలుచు గగనంబు ప్రతిబింబములొ యనంగ
వికచకాశవనీ పరివేష్టనమున | నతిశయిల్లె నిర్మలకమలాకరములు.
146
వ. అట్టి శారదాగమంబున నుత్ఫుల్లకమలకల్హారకేసరకరాళకలితకల్లోలమాలినియు, ననేకమునిలోకసతత సంసేవ్యమాన విపుల పులినోత్సంగయు, నిరంతర తీర వానీర వనమండలీవిలసితయు, నాకాశసంకాశవిశద సలిలయు నైన సరస్వతీమహానది ననుదినస్నానపానాదివిశేషంబులం బరితోషంబు నొందుచుఁ బాండునందనులు మరుభూమిం గొన్నిదినంబులు వసియించి, తదనంతరంబ ధౌమ్యాదిభూసురులు నింద్రసేనాదిభృత్యులు దోడ నరుగుదేరఁ గామ్యకవనంబునకు వచ్చి, యచ్చటిమునులచేత నభినందితులై, యందు సముచితవర్తనంబుల నున్నంత; నొక్కనాఁడు. 147
క. వాసవనందనసఖుఁ డగు | భూసురుఁ డొకఁ డరుగుదెంచి భూవినుతగుణో
ద్భాసితు ధర్మజు విప్రస | భాసీనుం గాంచి యిట్టు లనియెం బ్రీతిన్‌.
148
చ. ‘జనవర! నీవుఁ దమ్ములును సమ్మద మొప్పఁగ నివ్వనంబునం
దునికి ధ్రువంబుగా విని మహోజ్జ్వలతేజుఁడు దేవకీసుతుం
డనఘుఁడు మిమ్ముఁ జూచుటకునై యిదె వచ్చుచునున్నవాఁడు మీ
కును ననిశంబుఁ దా హితమ కోరుచునుండు నతండు నెయ్యుఁడై.
149
వ. మఱియు ననేకయుగసహస్రజీవియు నప్రమేయతపఃప్రభాసియు వినుతవిధేయుఁడును నైన మార్కండేయుండును భవదీయదర్శనార్థం బీక్షణంబ చనుదెంచు’ నని చెప్పిన యనంతర ముహూర్తంబున. 150
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )