| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
శైబ్యసుగ్రీవాదిజవనాశ్వయుక్త మై | యాబద్ధనూత్నరత్నాంశుపటల భాసితం బై చారుపతగ పతాకా వి | భూషితగగన మై పొలుపు మిగులు దివ్యరథంబున దేవకీసుతుఁడు ప్రి | యంబున సత్యభామాన్వితముగఁ దరళసౌదామినీదామసముజ్జ్వల | ధారాధరోత్సంగతలమునందు |
|
| ఆ. |
శచియుఁ దాను వెలుఁగు శతమఖుండును బోలె | నరుగుదెంచె ఘనరథాంగనేమి విపులఘోష తాండవిత బర్హిశబ్ద శ | బ్దాయమాన వనవిభాగుఁ డగుచు. |
151 |
| వ. | ఇట్లు వచ్చి వాసుదేవుండు రథావతరణంబు సేసి, ధర్మనందనున కభివందనం బొనరించి, భీమార్జున నకుల సహదేవులం గౌఁగిలించుకొని, ద్రౌపదిం గారవించి, ధౌమ్యాది మహీసురులచేత నభినందితుం డయ్యె; నంతఁ గౌంతేయాగ్రజుండు గదాధరునకు నర్ఘ్యాదిసత్కారంబులు నిర్వర్తించి, తమ్ములుం దానును విప్రజనంబులు నతనిం బరివేష్టించి యుండి; రప్పుడు కృష్ణుండు ధనంజయుం దన చేరువ నునిచికొని చిరకాల దర్శనోల్లసితంబు లైన యాలోకనంబుల నతని యాకారం బత్యాదరంబున నభినందించి ధర్మరాజున కి ట్లనియె. | 152 |
| సీ. |
‘భాగ్యంబు గాదె యీ పార్థుండు హరుఁ డాది | యైన నిర్జరసమూహంబువలన నెలమిఁ గృతాస్త్రుఁడై యేతెంచు; టరయంగ | ధన్యుండ వైతివి ధర్మతనయ! నీ ధర్మనిష్ఠయు నీ తపంబును జూవె | యింతకుఁ గారణం బిద్ధచరిత! రాజ్యంబుకంటెను రాజేంద్ర! ధర్మంబె | యిష్టమై యుండు నీ కెల్లనాఁడు ; |
|
| తే. |
వేదవేదాంగ విదుఁడవు, వివిధయజ్ఞ | కర్త వైతి, ధనుర్వేదకర్మఠుఁడవు, ధరణి యెల్ల నేలెడి రాజధర్మ మమర | సులభ మయ్యె నీ కిహపరశోభనంబు. |
153 |
| చ. |
దమమును సత్యయుక్తియును ధైర్యనిరూఢియు నిత్యతృప్తియున్ శమమును నీకు నైజములు; సన్మతి నర్థవశంబుఁ గామలో భములును బొంద; వట్లగుటఁ బార్థివకుంజర! ధర్మరాజనా మమునఁ ద్రిలోకపూజ్యమహిమం బొగడొందెద వివ్విధంబునన్.’ |
154 |
| వ. | అని వెండియు. | 155 |
| శా. |
‘ద్యూతవ్యాజమునన్ సభాంగణమునన్ దుర్యోధనుం డట్లు దు ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంపధైర్యోన్నమ చ్చేతస్సారుఁడ వైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ; వి ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు? నిక్కం, బిట్టిరే యెవ్వరున్? |
156 |
| ఉ. |
ఉల్లము సత్యసంయమము నూనినవాఁడవు నీవు విక్రమం బొల్లమిఁ గౌరవాధములయుద్ధతి యమ్మెయిఁ జెల్లెఁగాక; యొం డెల్లను నేల? నీదుమది నించుక కిన్క జనించినన్ మహీ వల్లభ! యప్డ రూపఱదె వారక వైరికులంబు సర్వమున్. |
157 |
| చ. |
వినుత భవన్నియోగ మను వేల యలంఘ్యము గాన యిమ్మెయిన్ ఘనభుజవీచివిభ్రమవికాసముఁ జూపక నిల్చెఁ గాక స జ్జననుత! చూడ నీ యనుజసాగరముల్ దఱితోడ విద్విష జ్జనలయకాలులై కడఁగు సర్వజగంబుల నాక్రమింపఁగన్. |
158 |
| ఉ. |
అంధక వృష్ణి భోజ కుకురాన్వయభూపతు లెల్ల నీదెసన్ బాంధవ సౌహృద ప్రణయ భక్తివిశేషము లొప్ప నీ మనో గ్రంథి యడంగఁజేయ నెసకంబునఁ బూనినవారు లోభ మో హాంధులు ధార్తరాష్ట్రులు జనాధిప! మార్కొనువారె వారలన్? |
159 |
| క. |
చతురంభోధిపరీత | క్షితితల సామ్రాజ్యలక్ష్మికిం బతివి జగ న్నుత! నీవ; నీవు దలఁచిన | నతిదుష్కర మెందు లే దనర్గళమహిమన్.’ |
160 |
| వ. | అనిన సంతసిల్లి కుంతీనందనుండు దేవకీనందనుతోడ ‘దేవా! యెవ్విధంబున నైన నల్పావశిష్టంబైన వనవాసకాలంబును నజ్ఞాతవర్తనంబును దీర్చి, లోకనింద్యంబు గాని విక్రమంబునం బగఱ జయింపఁగోరెదము; దీని నంతయు నిర్వహించు భారంబు నీయదియ; నిన్ను శరణంబు సొచ్చిన మాకుం బరమశోభనంబులును సులభంబు లగుట నిశ్చయంబుగాదె!’ యనియె; నప్పుడు కృష్ణుండు నిజసమీపంబున నున్న పాంచాలిం జూచి యిట్లనియె. | 161 |
| సీ. |
‘నీ పుత్త్రులేవురు నీరజలోచన! | యదుకుమారులుఁ దారు ముదముతోడ ననుపమ స్నేహసమాహితహృదయు లై | కరిహయారోహణపరతఁ దగిలి యాడుచు, వివిధశస్త్రాస్త్ర ప్రయోగముల్ | గఱచుచు నొండెల్ల మఱచి యున్న వారు; ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర | జాతంబు లెల్లను బ్రీతి నొసఁగెఁ; |
|
| ఆ. |
దన్వి యా సుభద్ర తన పుత్త్రుకంటె నీ | తనయులందుఁ గూర్మిఁ దనరఁ జేయు; నూఱడిల్లు మింక; నుజ్జ్వలోన్నతులఁ బెం | పారఁ గాల మనతిదూర మయ్యె’. |
162 |