| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అని యాశ్వాసించు సమయంబునం బరమతపోవృద్ధుం డయిన మార్కండేయుండు సనుదెంచినం గృష్ణుండును బాండవులును నతని నెదుర్కొని యథోచితవిధులం బూజించిరి; మునీంద్రుండును బ్రత్యేకంబ వారి కుశలంబు లడిగెఁ; దదనంతరంబ యందఱు నాసీనులై యున్నయెడఁ బాండవహితార్థియై వనజోదరుం డమ్మునివరున కి ట్లనియె. | 163 |
| ఉ. |
‘ఏనును బాండునందనులు నిమ్మునిముఖ్యులు నిప్డు లోకస మ్మానితవాక్య! నీదయిన మంజులవాగమృతప్రవాహమున్ వీనులదోయి నించుచును వేడుకఁ గ్రోలికొనంగ నాత్మలం బూనెద; మస్మదీప్సితము పూర్ణము సేయఁగ నర్హ మెమ్మెయిన్. |
164 |
| వ. | కావున. | 165 |
| క. |
దేవ నరదేవ ధరణీ | దేవ చరిత్రములు భర్తృదేవత లనఁగా భూవినుత లయిన సతుల ప్ర | భావము లెఱిఁగింపు మోలిఁ బ్రస్ఫుటములుగన్.’ |
166 |
| వ. | అని యడుగుచున్నయెడ నారదుం డేఁగుదెంచిన, నందఱు ప్రత్యుద్గతు లయి ప్రణమిల్లి యాతని నుచితసత్కారంబులం బ్రీతునింజేసిన, నమ్మహాముని మార్కండేయునింజూచి ‘కృష్ణపాండవప్రియార్థంబుగాఁ బరమపుణ్య కథాకథనం బొనరింతువుగాక!’ యని పలికి వారల నామంత్రణంబు సేసి నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ ధర్మతనయుండు మార్కండేయున కి ట్లనియె. | 167 |
| సీ. |
‘కడఁగి ధర్మముతోడ నడచుచు నే మిట్లు | దందడి దుఃఖంబుఁ బొందుటయును నేపున నెప్పుడు పాపంబు సేయుచు | ధృతరాష్ట్రజులు సుఖోన్నతు లగుటయుఁ, గని యివ్విపర్యయమునకు నే నూహింతుఁ | బాయక నరుఁ డిప్డు సేయు కర్మ మున ఫల మిందుఁ బొందునొ? పరలోకంబు | నందుఁ బొందునొ? యిందు నందుఁ గనునొ? |
|
| ఆ. |
విశ్వకర్తయైన యీశ్వరుఁ గానని | పురుషుఁ గర్మఫలము పొరయకున్నె ? యొడలితోనఁ గృతము వెడలిపోవునొ? యిది | దెలియవలయు నాకు నలఘుపుణ్య! |
168 |
| వ. | ఇంతయు నెఱింగింప నీవ యర్హుండ’ వనినఁ బరమజ్ఞాననిధి యైన యత్తపోనిధి యతని కి ట్లనియెఁ ‘దొల్లి విధాత ప్రథమకల్పంబున నత్యంతనిర్మలంబులును ధర్మతంత్రంబులును నైన శరీరంబులు సృజియించె; నట్లు పుట్టింపఁబడిన యా మనుష్యులు మహాసత్త్వసంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, స్వచ్ఛందజీవులు నై దేవయానంబుల విహరించుచు ననాయాసంబున నధికఫలసిద్ధింబొందుచు, సర్వ ధర్మజ్ఞులై విగతమత్సరులై బహుసహస్రసంతానులై బహుసహస్ర సంవత్సరాయుష్యులై వర్తిల్లుచుండి; రంతఁ గాలాంతరంబునం గామక్రోధాది గుణంబులు దమ్ముం బొందుటయు మాయా ప్రవర్తనులై దేవతలచేత విడువంబడి యల్పాయువులు, నల్పబలశరీరసత్త్వులును, దరిద్రులును, నిష్ఫలారంభులును, బహురోగ పీడితులును, నాస్తికులును నై యొండొరుల మెచ్చక దురితంబులు సేయుచుఁదిర్యగ్యోనులం బుట్టుచు, నరకాగ్నులం గ్రాఁగుచు, గతాగతభ్రమణంబుల నలయం దొడంగి; రిట్లు దిరుగుచున్న సంసార చక్రంబునందు. | 169 |
| చ. |
మనుజులు పుణ్యపాపములు మానక యి ట్లొనరించుచుం దుదిం దనువు దొఱంగి పోవునెడఁ దప్పదు నీడయవోలెఁ గర్మమున్ వెనుకన యేఁగి భూరిసుఖవిస్మృతియుం బటుదుఃఖదైన్యమున్ దనుకఁగఁ జేయుఁ; గ్రమ్మఱఁగఁ దాన యొనర్చు భవంబు దేహికిన్. |
170 |
| క. |
విను మనుజున కెవ్విధమునఁ | దన చేసిన సుకృత దుష్కృతంబులు నెఱయం దన కనుభవింపఁ బా లివి; | తనువు సెడుం గాని కర్మతతి సెడ దనఘా! |
171 |
| వ. | మఱియు నొక్క నిదర్శనంబు సెప్పెద. | 172 |
| క. |
ఈ లోకమ యగుఁ గొందఱ; | కా లోకమ కొందఱకు; నిహంబును బరమున్ మే లగుఁ గొందఱ కధిపా! | యే లోకము లేదు వినవె యిలఁ గొందఱకున్. |
173 |
| వ. | అది యెట్లంటేని. | 174 |
| చ. |
ధనములు సాలఁ గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్ మనమున నెన్నఁడున్ సుకృతమార్గము పొంతకుఁ బోక లోభమో హనిహతబుద్ధు లై తిరుగునట్టి జనుల్ పరలోకసౌఖ్యముల్ గనుటకు నేర; రిప్పటి సుఖంబులు మేలయి తోఁచు వారికిన్. |
175 |
| మ. |
ఉపవాసవ్రత సంతతాధ్యయన తీర్థోపాసనాది క్రియై క పరత్వంబునఁ జేసి యైహికము దుఃఖప్రాయమై పోవఁగా విపులానందముఁ బొందఁ గల్గుఁ దుది నావిర్భూతభోగైకలో లుపబుద్ధిం జిరపుణ్యశీలురకు నా లోకంబునన్ భూవరా! |
176 |
| ఉ. |
ధర్మమ సల్పుచుం దగిలి ధర్మపథంబునఁ జేసి యర్థముం బేర్మియుఁ గాంచి ధర్మవిధిఁ; బెండిలి యై ప్రజలన్ సృజించి స త్కర్మములం బ్రశస్తములుగాఁ గ్రతువుల్ వొనరించు సజ్జనుల్ ధర్మజ! యిందు నందును ముదంబునఁ గాంతు రభీష్టసౌఖ్యముల్. |
177 |
| ఆ. |
సత్యమును శమంబు శౌచంబు లేక, నా | స్తిక్యమును నిషిద్ధసేవనంబు గలిగి తిరుగు దుష్టకష్టజనశ్రేణి | పొలియు నుభయలోకములకుఁ గాక. |
178 |
| వ. | ఇది మనుష్యుల కర్మగతిప్రకారంబు. | 179 |
| చ. |
జనవర! మీరు దివ్యులరు; సమ్మతి దేవహితార్థ మి మ్మహిన్ జననము నొందినారరు; ప్రశస్తపరాక్రమలీలఁ బేర్చి యిం క నఖిలశత్రునిర్మథనకర్మ మొనర్చి మహీభరంబు దీ ర్చి నియతిఁ బెక్కు జన్నములు సేసి భజింతురు దేవభావమున్.’ |
180 |